
నేతాజీ సేనను ఎలా చూడాలి?
విశ్లేషణ
నేతాజీ మనమంతా గౌరవించే దేశభక్తుడు. పైకి ఆ విధంగా ప్రకటించకపోయినా భారత ప్రభుత్వం ఆయనను స్వాతంత్య్ర సమర వీరుడిగానే గౌరవిస్తున్నదని అనుకో వచ్చు. నేతాజీ సైనికులు కూడా స్వాతంత్య్ర వీరులుగా గుర్తింపు పొందవలసిందే.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే తెలియని వారెవరూ ఉండరు. బ్రిటిష్ పాలన మీద భారత జాతీయ సైన్యాన్ని (ఆజాద్ హింద్ ఫౌజ్–ఐఎన్‌ఏ) యుద్ధానికి సమాయత్తం చేసిన దళపతి నేతాజీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. గాంధీ అహింసావాదంతో స్వాతంత్య్రం సాధించే అవకాశం లేదని తుపాకిని నమ్మాడు. బ్రిటిష్ ఇండియా సర్కారు కళ్లుకప్పి తప్పించుకునిపోయి, మహా సైన్యాన్ని–ఇండియన్ నేషనల్ ఆర్మీ నిర్మించాడు. బ్రిటిష్ ఇండియా సైనికులుగా కాదు, భారతీయ సైనికులుగా రెండో ప్రపంచయుధ్ధంలో పోరాడమని నాటి పాలకులు పిలుపునిచ్చారు. కానీ ఎందరో సైనికులు వెళ్లి నేతాజీ సేనలో చేరారు. వీరిని బ్రిటిష్ ఇండియా పాలకులు సైన్యం వదిలిన నేరస్తులుగా, దేశద్రోహులుగా నిర్ధారించారు. ఏ దేశంలోనైనా సైన్యాన్ని వీడి రావడం పెద్ద నేరమే. మన పీనల్ కోడ్ ప్రకారం వీరూ ఆ నేరారోపణకే గురైనారు.
స్వాతంత్య్రం సాధించిన తరువాత ఈ సైనికుల హోదా ఏమిటి? ఇప్పటికీ వారిని సైన్యం వదిలిన నేరస్తు లుగా భావిస్తారా? లేక స్వాతంత్య్ర సమరయోధులుగా గౌరవిస్తారా? అన్నది కీలక ప్రశ్న. ఆర్కియాలజీ జాతీయ కేంద్రాన్ని ఆర్టీఐ కింద ప్రద్యోత్ ఈ ప్రశ్న అడిగాడు. రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొని శత్రు బలగాల చేజిక్కిన ఇండి యన్ నేషనల్ ఆర్మీ సభ్యులను మీరు ఏమంటారు? దేశ ద్రోహులా లేక సమరవీరులా? బ్రిటిష్ ఇండియా సర్కార్ వలెనే మీరూ వారిని దేశద్రోహులుగా భావిస్తున్నారా అని అడిగారు. ఆర్కియాలజీ కేంద్రంలో దీనికి సంబంధించి ఏమైనా రికార్డులు ఉంటే ఇవ్వాలన్నారు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 4 (1)(బి)(సి) కింద ఇటువంటి అంశాలపై ప్రభుత్వ విధాన నిర్ణయమేమిటో స్వయంగా ప్రకటించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు.
ఆర్కియాలజీ విభాగం వీరిని సైనికులు కాబోలను కుని ఆర్టీఐ దరఖాస్తును రక్షణమంత్రిత్వ శాఖ పిఐఓకు బదిలీ చేసింది. రక్షణశాఖ వీరిని మాజీ సైనికులనుకుని ఈ పత్రాన్ని మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమశాఖకు పంపిం చారు. ఆ శాఖకు వీరు సైనికులో, మాజీ సైనికులో అర్థం గాక హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తును బదిలీ చేశారు. తెలిసో తెలియకో మాజీ సంక్షేమ శాఖ హోంశాఖకు పంపి సరైన పనిచేసింది. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా దర ఖాస్తుదారుడు ప్రద్యోత్ తమ కార్యాలయానికి వచ్చి మొత్తం ఫైళ్లన్నీ చూసుకోవచ్చని ఉత్తరం రాశారు. ఏ ఫైళ్లు చూడాలి? ఎన్నని పరిశీలించాలి? అయినా వివరాలు దొరు కుతాయా? అసలు ఈ కీలకమైన అంశంపైన ఇన్నేళ్లూ ఏ విధాన నిర్ణయం తీసుకున్నదో ప్రభుత్వం చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ ఏ విధానమూ లేకపోతే అదైనా చెప్పక తప్పదు. ప్రభుత్వం నేతాజీ అనుయాయులను వీర స్వాతంత్య్ర సమర సైనికులుగా భావిస్తే వారికి హోంశాఖ ఇచ్చే సన్మానపత్రాలు, పింఛన్లు తదితర సౌకర్యాలు కల్పిం చవలసి ఉంటుంది.
కనీసం మాజీ సైనికులుగా భావిస్తే వారికి లభించే సంక్షేమ పథకాలను వర్తింప చేయవలసి ఉంటుంది. నాటి సైన్యాన్ని వదిలి వెళ్లిన నేరస్తులుగా భావిస్తే దొరికిన వారిని దొరికినట్టు ప్రాసిక్యూట్ చేసి జైలు పాలు చేయవలసి వస్తుంది. కనుక వారు దేశద్రోహులా లేక స్వాతంత్య్ర సమరవీరులా? అన్నది విధానపరమైన ప్రశ్న. ఒకవేళ సైన్యాన్ని వదిలేసిన సైనికుల జాబితా ఉంటే, ఆ జాబితాను నేరస్తుల వర్గం నుంచి తొలగించారో లేదో చెప్పవలసి ఉంటుంది. ఆర్కైవ్స్ వారు ఈ విషయమై ఏమీ చెప్పలేరు. వారి అధీనంలో ఉన్న విషయం కాదు కనుక. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించవలసిన విషయం ఇది. స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ వ్యవహారాలను హోంశాఖ నిర్వహిస్తుంది కనుక ఆ శాఖే చొరవతీసు కోవాలి.
ఈ సమాచార అభ్యర్థనలో ప్రద్యోత్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి అడగలేదు. ఆయనను స్వాతంత్య్ర∙సమర వీరుడిగా పరిగణిస్తున్నామా లేక బ్రిటిష్ సర్కార్ భావించినట్టు తమకు ద్రోహం చేసిన విప్లవ వాదిగా, తిరుగుబాటుదారుడిగా స్వతంత్ర భారత సర్కారు కూడా పరిగణిస్తున్నదా? నేతాజీ జన్మదినాన భారత ప్రభుత్వం ఆయన చిత్రంతో జోహార్లు అర్పించే ప్రకటన విడుదల చేసి ప్రతి ఏటా పత్రికలకు డబ్బు కూడా ఇస్తుంది. ఆయన పేరు చెబితే చాలు భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి. కటక్‌లో నేతాజీ పుట్టిన ఇంటిని, కోల్‌కత్తాలో పెరిగిన ఇంటిని జాతీయ మ్యూజియంలుగా మార్చారు. తప్పిం చుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన కారును కూడా ప్రదర్శిస్తున్నారు. నిర్ద్వంద్వంగా నేతాజీ మనమంతా గౌర వించే దేశ భక్తుడు, జాతీయ ఉద్యమనాయకుడు, మనకు తొలి సర్వసైన్యాధిపతి కావలసిన వీరుడు. పైకి ఆ విధంగా ప్రకటించకపోయినా భారత ప్రభుత్వం ఆయనను స్వాతంత్య్ర సమర వీరుడిగానే గౌరవిస్తున్నదని అనుకో వచ్చు. కనుక నేతాజీ వెంటనడిచిన సైనికులు కూడా స్వాతంత్య్ర సమర వీరులుగా గుర్తింపు పొందవలసిందే.
ఈ విషయం చెప్పవలసిన హోంశాఖ మళ్లీ ఈ దర ఖాస్తును ఆర్కైవ్స్ విభాగానికి పంపింది. ఫైళ్లు ఇతర పత్రాలకోసం పంపితే సమంజసమే కానీ, విధాన నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత హోం మంత్రిత్వ శాఖదే కనుక ఆ విధాన నిర్ణయమేమిటో ప్రకటించాలని కమిషన్ ఆదేశిం చింది. (ప్రద్యోత్ కుమార్ మిత్రా వర్సెస్ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఇఐఇ/ఇఇ/అ/2015/001837 కేసులో కేంద్ర సమాచార కమిషన్ 13 ఫిబ్రవరిన ఇచ్చిన ఆదేశం ఆధారంగా)
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com