professor madabhushi sridhar
-
పీఎఫ్ సమాచారం ఇవ్వరా?
విశ్లేషణ కార్మిక శాఖ అధికారులు ఆర్టీఐ కింద పీఎఫ్ వివరాలను అడిగితే తిరస్కరించడం, కొత్త దరఖాస్తు వేసుకోమని వేధించడం న్యాయం కాదు. అది తప్పు చేసిన యాజమాన్యాలను పరోక్షంగా సమర్థించడమే. గుజరాత్ అమ్రేలీ జిల్లా చావంద్లోని శ్యాంగోకుల్ టీబీ హాస్పిటల్ వారు భవిష్య నిధి (ప్రావిడెంట్ ఫండ్) కోసం కార్మికుల జీతాలలో ఎంత కోత పెడుతున్నారు, వారి íపీఎఫ్ ఖాతాలలో ఎంత జమ చేస్తున్నారు, ఏ తేదీ నుంచి వడ్డీని కలుపుతున్నారు, ఖాతాలోంచి డబ్బుని తిరిగి పొందే విధానం ఏమిటి మొదలైన అంశాలను తెలియజేయాలని కార్మిక నాయకుడు రాథోడ్ సమాచార హక్కు చట్టం కింద అడిగారు. కొన్ని కాగితాలు ఇచ్చిన అసిస్టెంట్ పీఎఫ్ కమిష నర్, ‘పోనీ మీరే స్వయంగా వచ్చి మొత్తం దస్తావే జులు చూసుకోండి, కావలసిన కాగితాలు ఇస్తాం’ అని పిలిచారు. రాథోడ్ వచ్చి చూసి, అదనపు కాగి తాలు అడిగితే ‘‘ఇవ్వం, ఇంకోసారి ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకోండి’’ అని వారు సెలవిచ్చారు. కార్మికులందరి సమస్య గురించి ఈ ఆర్టీఐ వేశారు. కార్మికుల సంక్షేమం ఇందులో ఇమిడి ఉంది. యాజమాన్యాలు సరిగ్గా కార్మికుల వేతనాల నుంచి వారి పీఎఫ్ వాటా సొమ్మును కత్తిరించుకుని, దానికి తమ వాటాను కలిపి వారి ఖాతాలలో వేస్తు న్నారో, లేదో తెలుసుకోవలసిన బాధ్యత కార్మిక సంఘాలకు ఉంది. వారు ఆర్టీఐ కింద అడగకపో యినా, ఒక ఉత్తరం రాస్తే చాలు ఈ వివరాలన్నీ ఇవ్వడం అవసరం. కాని ఆర్టీఐ వేసిన తరువాత కూడా ఇవ్వకపోవడం, ఇంకో ఆర్టీఐ దరఖాస్తు పెట్టండి అని ఉచిత సలహా ఇవ్వడం సరైంది కాదు. 1991 నుంచి ఆ సంస్థలో ఉద్యోగులు పనిచేస్తుంటే 1994 నుంచి మాత్రమే పీఎఫ్ వాటాలను ఖాతాల్లో జమచేశారు. 7 ఎ కింద ఆ సంస్థపైన దర్యాప్తు చేయ వలసిన బాధ్యత ఉన్నా పట్టించుకోలేదు. పీఎఫ్ తది తర బకాయిలకు సంబంధించి ఇవ్వవలసిన ఫారం 3, 6 ఎ, 12 ఎ ఇచ్చినా సంస్థ తన బాధ్యత నిర్వ హించలేదు. ఇద్దరు ఉద్యోగులు 2008, 2009లో విరమణ చేశారు. 2009లో ఆస్పత్రి మూతబడటం వల్ల 20 మంది ఉద్యోగం కోల్పోయారు. కావాలని ఆలస్యం చేయడం వల్ల పీఎఫ్ కోసం కార్మికులు క్లెయిమ్ దరఖాస్తులు పెట్టుకోలేకపోయారు. కావల సిన వివరాల పత్రాలు ఇవ్వలేదు. మీరు అడిగిన వివరాలు స్పష్టంగా లేవు అని తాత్సారం చేశారు. స్పష్టంగా లేకపోతే కార్మిక నాయకుడిని పిలిచి అడి గితే ఏం పోయింది? రోజ్ కామ్ రిజిస్టర్‌ను, మరి కొన్ని రికార్డులను చూడాలని అడిగితే రమ్మన్నారు కాని, కావలసిన కాగితాలు ఇవ్వలేదు. అప్పీలు వేయమన్నారు. అందులోనూ న్యాయం జరగలేదు. ఫలానా కాగితాలు కావాలని అడిగితే మొదటి అప్పీలును ముగించామని, మళ్లీ కొత్తగా ఆర్టీఐ దర ఖాస్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. వారి దగ్గర సమాచారం ఉన్నా ఇవ్వడం లేదని రాథోడ్ కమి షన్‌కు వివరించారు. 17 మంది కార్మికుల క్లెయిమ్ ఫారాల కాపీలు అడిగారు. ఇతర పత్రాలు కావాల న్నారు. కార్మికుల జీతాల నుంచి పీఎఫ్ వాటా తీసుకుని, జమ చేయకపోవడం, వారి వంతు డబ్బు ఇవ్వకపోవడం చట్ట ఉల్లంఘనలే. అర్థం అయ్యేట్టు ఆర్టీఐ అడగడం పౌరుని బాధ్యతే అయినా, స్పష్టంగా అడిగినా అర్థం కాలేదని వాదించడం బాధ్యతారాహిత్యం. కార్మికుల వేతనాల డబ్బును జమచేయకపోవడం అంటే, వారి డబ్బును యాజ మాన్యం అక్రమంగా వాడుకున్నట్టే. చాలా వివ రంగా దరఖాస్తు ఉన్నప్పడికీ అర్థం కావడం లేదని తిరస్కరించే అధికారం ఈ చట్టం కింద లేదు. కార్మికులకు సక్రమంగా వారి హక్కులు అందేట్లు చూడవలసిన కార్మిక శాఖ అధికారులు ఆ పని చేయకపోగా, దానికి సంబంధించిన వివరా లను ఆర్టీఐ కింద అడిగితే తిరస్కరించడం, కొత్త దరఖాస్తు వేసుకోమని వేధించడం న్యాయం కాదు. ఇందువల్ల తప్పు చేసిన యాజ మాన్యాలను కార్మిక శాఖ పరోక్షంగా సమర్థిస్తూ నష్టపోయిన కార్మికుల న్యాయమైన హక్కులను రక్షించడంలో నిర్లక్ష్యం చేసి నట్టు స్పష్టమవుతున్నది. ఈ కేసులో కమిషన్ కొన్ని ఆర్టీఐ సూత్రాలను నిర్ధారించింది. అవి: 1. సమాచార దరఖాస్తు అర్థం కాకపోతే దర ఖాస్తుదారుని పిలిచి తెలుసుకొనే ప్రయత్నం చేయ డం పీఐఓ బాధ్యత. అర్థం కాలేదని తిరస్కరించడం చట్ట వ్యతిరేకం. 2. పర్యవేక్షణ అధికారం కూడా సమాచార హక్కులో భాగం. దస్తా వేజులు పరిశీలిం చిన తరువాత కొన్ని కాగితాల ప్రతులు అడిగితే, ఇంకో తాజా ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకోవాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదు. పర్యవేక్షణ అధికారంలో కావ లసిన కాగితాలు కోరే హక్కు కూడా ఇమిడి ఉంది. మరోసారి దరఖాస్తు చేయడం వల్ల, మరోసారి వారి శ్రమ, సమయం శక్తి వెచ్చించవలసి వస్తుంది. అది ప్రజావనరుల వృథా అవుతుంది. కోరిన సమాచారం మొత్తం ఇవ్వాలని, ఇటు వంటి అన్యాయాలను కేంద్ర కార్మిక మంత్రి దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. (రాథోడ్ వర్సెస్ ఈపీఎఫ్ఓ, కార్మిక మంత్రిత్వశాఖ CIC/BS/A/ 2015/001969 కేసులో 2017 మార్చి 10న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
నేతాజీ సేనను ఎలా చూడాలి?
విశ్లేషణ నేతాజీ మనమంతా గౌరవించే దేశభక్తుడు. పైకి ఆ విధంగా ప్రకటించకపోయినా భారత ప్రభుత్వం ఆయనను స్వాతంత్య్ర సమర వీరుడిగానే గౌరవిస్తున్నదని అనుకో వచ్చు. నేతాజీ సైనికులు కూడా స్వాతంత్య్ర వీరులుగా గుర్తింపు పొందవలసిందే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే తెలియని వారెవరూ ఉండరు. బ్రిటిష్ పాలన మీద భారత జాతీయ సైన్యాన్ని (ఆజాద్ హింద్ ఫౌజ్–ఐఎన్ఏ) యుద్ధానికి సమాయత్తం చేసిన దళపతి నేతాజీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. గాంధీ అహింసావాదంతో స్వాతంత్య్రం సాధించే అవకాశం లేదని తుపాకిని నమ్మాడు. బ్రిటిష్ ఇండియా సర్కారు కళ్లుకప్పి తప్పించుకునిపోయి, మహా సైన్యాన్ని–ఇండియన్ నేషనల్ ఆర్మీ నిర్మించాడు. బ్రిటిష్ ఇండియా సైనికులుగా కాదు, భారతీయ సైనికులుగా రెండో ప్రపంచయుధ్ధంలో పోరాడమని నాటి పాలకులు పిలుపునిచ్చారు. కానీ ఎందరో సైనికులు వెళ్లి నేతాజీ సేనలో చేరారు. వీరిని బ్రిటిష్ ఇండియా పాలకులు సైన్యం వదిలిన నేరస్తులుగా, దేశద్రోహులుగా నిర్ధారించారు. ఏ దేశంలోనైనా సైన్యాన్ని వీడి రావడం పెద్ద నేరమే. మన పీనల్ కోడ్ ప్రకారం వీరూ ఆ నేరారోపణకే గురైనారు. స్వాతంత్య్రం సాధించిన తరువాత ఈ సైనికుల హోదా ఏమిటి? ఇప్పటికీ వారిని సైన్యం వదిలిన నేరస్తు లుగా భావిస్తారా? లేక స్వాతంత్య్ర సమరయోధులుగా గౌరవిస్తారా? అన్నది కీలక ప్రశ్న. ఆర్కియాలజీ జాతీయ కేంద్రాన్ని ఆర్టీఐ కింద ప్రద్యోత్ ఈ ప్రశ్న అడిగాడు. రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొని శత్రు బలగాల చేజిక్కిన ఇండి యన్ నేషనల్ ఆర్మీ సభ్యులను మీరు ఏమంటారు? దేశ ద్రోహులా లేక సమరవీరులా? బ్రిటిష్ ఇండియా సర్కార్ వలెనే మీరూ వారిని దేశద్రోహులుగా భావిస్తున్నారా అని అడిగారు. ఆర్కియాలజీ కేంద్రంలో దీనికి సంబంధించి ఏమైనా రికార్డులు ఉంటే ఇవ్వాలన్నారు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 4 (1)(బి)(సి) కింద ఇటువంటి అంశాలపై ప్రభుత్వ విధాన నిర్ణయమేమిటో స్వయంగా ప్రకటించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. ఆర్కియాలజీ విభాగం వీరిని సైనికులు కాబోలను కుని ఆర్టీఐ దరఖాస్తును రక్షణమంత్రిత్వ శాఖ పిఐఓకు బదిలీ చేసింది. రక్షణశాఖ వీరిని మాజీ సైనికులనుకుని ఈ పత్రాన్ని మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమశాఖకు పంపిం చారు. ఆ శాఖకు వీరు సైనికులో, మాజీ సైనికులో అర్థం గాక హోం మంత్రిత్వ శాఖకు దరఖాస్తును బదిలీ చేశారు. తెలిసో తెలియకో మాజీ సంక్షేమ శాఖ హోంశాఖకు పంపి సరైన పనిచేసింది. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా దర ఖాస్తుదారుడు ప్రద్యోత్ తమ కార్యాలయానికి వచ్చి మొత్తం ఫైళ్లన్నీ చూసుకోవచ్చని ఉత్తరం రాశారు. ఏ ఫైళ్లు చూడాలి? ఎన్నని పరిశీలించాలి? అయినా వివరాలు దొరు కుతాయా? అసలు ఈ కీలకమైన అంశంపైన ఇన్నేళ్లూ ఏ విధాన నిర్ణయం తీసుకున్నదో ప్రభుత్వం చెప్పవలసి ఉంటుంది. ఒకవేళ ఏ విధానమూ లేకపోతే అదైనా చెప్పక తప్పదు. ప్రభుత్వం నేతాజీ అనుయాయులను వీర స్వాతంత్య్ర సమర సైనికులుగా భావిస్తే వారికి హోంశాఖ ఇచ్చే సన్మానపత్రాలు, పింఛన్లు తదితర సౌకర్యాలు కల్పిం చవలసి ఉంటుంది. కనీసం మాజీ సైనికులుగా భావిస్తే వారికి లభించే సంక్షేమ పథకాలను వర్తింప చేయవలసి ఉంటుంది. నాటి సైన్యాన్ని వదిలి వెళ్లిన నేరస్తులుగా భావిస్తే దొరికిన వారిని దొరికినట్టు ప్రాసిక్యూట్ చేసి జైలు పాలు చేయవలసి వస్తుంది. కనుక వారు దేశద్రోహులా లేక స్వాతంత్య్ర సమరవీరులా? అన్నది విధానపరమైన ప్రశ్న. ఒకవేళ సైన్యాన్ని వదిలేసిన సైనికుల జాబితా ఉంటే, ఆ జాబితాను నేరస్తుల వర్గం నుంచి తొలగించారో లేదో చెప్పవలసి ఉంటుంది. ఆర్కైవ్స్ వారు ఈ విషయమై ఏమీ చెప్పలేరు. వారి అధీనంలో ఉన్న విషయం కాదు కనుక. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించవలసిన విషయం ఇది. స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ వ్యవహారాలను హోంశాఖ నిర్వహిస్తుంది కనుక ఆ శాఖే చొరవతీసు కోవాలి. ఈ సమాచార అభ్యర్థనలో ప్రద్యోత్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి అడగలేదు. ఆయనను స్వాతంత్య్ర∙సమర వీరుడిగా పరిగణిస్తున్నామా లేక బ్రిటిష్ సర్కార్ భావించినట్టు తమకు ద్రోహం చేసిన విప్లవ వాదిగా, తిరుగుబాటుదారుడిగా స్వతంత్ర భారత సర్కారు కూడా పరిగణిస్తున్నదా? నేతాజీ జన్మదినాన భారత ప్రభుత్వం ఆయన చిత్రంతో జోహార్లు అర్పించే ప్రకటన విడుదల చేసి ప్రతి ఏటా పత్రికలకు డబ్బు కూడా ఇస్తుంది. ఆయన పేరు చెబితే చాలు భారతీయుల గుండెలు ఉప్పొంగుతాయి. కటక్‌లో నేతాజీ పుట్టిన ఇంటిని, కోల్‌కత్తాలో పెరిగిన ఇంటిని జాతీయ మ్యూజియంలుగా మార్చారు. తప్పిం చుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన కారును కూడా ప్రదర్శిస్తున్నారు. నిర్ద్వంద్వంగా నేతాజీ మనమంతా గౌర వించే దేశ భక్తుడు, జాతీయ ఉద్యమనాయకుడు, మనకు తొలి సర్వసైన్యాధిపతి కావలసిన వీరుడు. పైకి ఆ విధంగా ప్రకటించకపోయినా భారత ప్రభుత్వం ఆయనను స్వాతంత్య్ర సమర వీరుడిగానే గౌరవిస్తున్నదని అనుకో వచ్చు. కనుక నేతాజీ వెంటనడిచిన సైనికులు కూడా స్వాతంత్య్ర సమర వీరులుగా గుర్తింపు పొందవలసిందే. ఈ విషయం చెప్పవలసిన హోంశాఖ మళ్లీ ఈ దర ఖాస్తును ఆర్కైవ్స్ విభాగానికి పంపింది. ఫైళ్లు ఇతర పత్రాలకోసం పంపితే సమంజసమే కానీ, విధాన నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత హోం మంత్రిత్వ శాఖదే కనుక ఆ విధాన నిర్ణయమేమిటో ప్రకటించాలని కమిషన్ ఆదేశిం చింది. (ప్రద్యోత్ కుమార్ మిత్రా వర్సెస్ నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఇఐఇ/ఇఇ/అ/2015/001837 కేసులో కేంద్ర సమాచార కమిషన్ 13 ఫిబ్రవరిన ఇచ్చిన ఆదేశం ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
తిలక్ సినిమా నిధుల కథ
విశ్లేషణ విచారణలో తేలిన మరో విశేషం–మొత్తం భారత రిపబ్లిక్ స్వర్ణోత్సవాల కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించారని. అందులో రెండున్నర కోట్లు తిలక్ సినిమాకు ఇచ్చారు. ఇంత జరిగితే ఏ చర్య అయినా తీసుకోవాలనే విషయం గుర్తురాలేదు. చాలా సందర్భాలలో ప్రభుత్వ అధికారులు తమ ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తించడం లేదు. నష్టపోయినవారు ఫిర్యాదు చేసినా చెత్తబుట్ట దాఖలే. పైన మహోన్నత రాజ్యాంగాధికార హోదాల్లో ఉన్నవారు కూడా స్పందించడం చాలా అరుదు. జవాబు అడిగే అధికారమే జనా నికి లేదు. ఈ చీకటిలో చిన్న వెలుగు నా వినతిపత్రం గతేమిటి అని అడిగే ఆర్టీఐ హక్కు. ప్రజాధనాన్ని దోచు కోవడానికి తిలక్ పేరును, ఆయన జీవితంపై సినిమా పేరుతోనూ, మన రిపబ్లిక్ పేరును కూడా వాడుకుంటారు. భారత గణతంత్ర స్వర్ణోత్సవాలు నిర్వహించడానికి వందకోట్లతో ఒక సెల్ ఏర్పాటైంది. ఇప్పుడు కోట్లూ లేవు, సినిమా లేదు, సెల్ కూడా లేదు. కమలాపూర్కర్ అనే పౌరుడు ఆర్టీఐ సవాలు విసిరితే కళ్లు తెరుచుకోలేదు కాని, కళ్లు చెదిరిపోయే నిజాలు బయటకు వచ్చాయి. సమాచారం ఇవ్వకుండా పౌరుడిని కోర్టుకు లాగే లిటిగేషన్ పెరుగుతున్నది. గణతంత్ర స్వర్ణోత్సవాలకు వేసిన సెల్ ఉత్సవ కాలం అయిపోగానే అంతరించిందనీ, కానీ బాధ్యతలు నిర్వహించేంత వరకు పనిచేయవలసి ఉంటుందనీ అన్నారు. 2005లో ఉత్సవాలలో భాగంగా బాలగంగాధర్ తిలక్ జీవితగాథను సినిమాగా నిర్మించేం దుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రూ. 2.5 కోట్లు వినయ్ ధుమాల్ అనే వ్యక్తికి రెండు విడతల్లో ఇచ్చేసింది. ఆయన ఆ సినిమా తీయనే లేదు. డబ్బు జాడ లేదు. ఏ విచారణ జరగలేదు. డబ్బు వినియోగంపై ఏదైనా నివేదిక ఎక్కడైనా ఉంటుందేమోనని వెతికారు. లేదు. 2011లో ఆర్టీఐ దర ఖాస్తు వచ్చేదాకా తిలక్ పేరు మీద రెండున్నర కోట్ల రూపా యలు ధారాదత్తం చేసిన విషయం బయటపడలేదు. ప్రస్తుతం సీబీఐ ఈ ప్రజాధనం దుర్వినియోగంపైన విచా రణ జరుపుతున్నదనీ, నివేదిక కోసం ఎదురు చూస్తున్నా మనీ పీఐఓ వివరించారు. పోనీ అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు దస్తా వేజులేమయినా ఉన్నాయా అని కమిషన్ ప్రశ్నిస్తే ఈ సినిమా ప్రాజెక్టుకు సంబంధించిన కాగితాలు గానీ దస్తావే జులు గానీ ఉత్సవ నిర్వహణ సెల్‌కు చెందిన రికార్డు గదిలో లేవని రెండున్నర కోట్ల రూపాయలతో సహా ఫైళ్లు కూడా మాయమైనాయని ప్రజాసంబంధ అధికారి వివరిం చారు. కనీసం ఫైళ్లు అంతర్థానమైన సమాచారమైనా ఈ ఆర్టీఐ ద్వారా తేలిందని తిలక్ అభిమానులంతా సంతో షించాలి. ఆశ్చర్యం ఏమిటంటే మాయమైపోయాయని అంటున్న ఫైళ్లను వెతకడానికి ఏమైనా చేశారా అంటే, వెతికే ప్రయత్నాల వివరాలు చెప్పే ఫైలు కూడా ఏదీ తమ దృష్టికి రాలేదని చాలా వినయంగా జవాబిచ్చారు. ఇంత డబ్బు మాయమైనా కనీసం విషయం చెప్పడానికి, పై అధికారు లకు చెప్పడానికో, కేసు పెట్టడానికో ఎవరూ ప్రయత్నం చేయలేదు. పోలీస్ స్టేషన్లో ప్రథమ సమాచార నివేదికైనా ఇచ్చారా? అనే ప్రశ్నకు కూడా జవాబు లేదు. 2011లో ఆర్టీఐ దరఖాస్తు వచ్చిన తరువాత 2013 నుంచి ఇటీవలి దాకా ఫైళ్ల కోసం తీవ్రంగా రికార్డు రూములలో వెతికారట. కాని ఏ ఫలితమూ లేదట. సమాచార కమిషన్ విచారణలో తేలిన మరో విశేషం– మొత్తం భారత రిపబ్లిక్ స్వర్ణోత్స వాల కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించారని. అందులో రెండున్నర కోట్లు తిలక్ సినిమాకు ఇచ్చారు. ఇంత జరిగితే ఏ చర్యైనా తీసుకోవాలనే బాధ్యత ఎవరికీ గుర్తురాలేదు. మనకెందుకు అనే మనస్తత్వం పాతుకు పోయిందనడానికి ఇదొక ఉదాహరణ. వందకోట్లు మాయ మైనా మనం ఏమీ చేయం. దాని ఫైళ్లు లేకపోతే ‘పోతే పోయాయి మనమేం చేస్తాం’ లేదా ‘ఆర్టీఐ ప్రశ్న వస్తే రెండో అప్పీలు దాకా కాలం గడుపుదాం’ అనే మనస్తత్వం పాతుకుపోయింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటారు. కానీ మన గణతంత్రానికి 50 ఏళ్లు నిండిన సందర్భం గడిచి పోయి 17 ఏళ్లయినా, నాటి వందకోట్ల దుర్వినియోగ ఉదంతం గురించి వీసమెత్తు విషయం కూడా తెలియని ఘనతంత్రం మనది. పోనీ అంతకుముందు ఎవరి దగ్గర, ఏ రికార్డులు ఉండేవో చెబుతారా? లేదా చివరిగా ఎవరి అధీనంలో రికార్డులు ఉన్నాయో తెలిపే రిజిస్టర్ ఉందా అని అడిగితే అదీ తెలియదని అధికారి వివరించారు. ఇప్పటి కైనా ఈ ఉత్సవాల ఫైళ్ల అంతర్థానంపైన దర్యాప్తు జరిపించి అసలు ఏం జరిగిందో వివరించే నివేదికను రెండునెల ల్లోగా సమర్పించాలని కమిషన్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈలోగా రిపబ్లిక్ స్వర్ణోత్సవాల నిర్వహణకు బడ్జెట్ కేటాయింపు, ప్రతిపాదించిన ఉత్సవాల జాబితా, జరిగిన కార్యక్రమాల జాబితాలను 30 రోజులలోగా ఇవ్వాలని కూడా కమిషన్ ఆదేశించింది. సీబీఐ ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయడానికి ఎంతకాలం అవసరమో, చర్యలకు ఎంత కాలం పట్టే అవకాశం ఉందో నెలరోజుల్లో తెలియజేయా లని కూడా కమిషన్ ఆదేశించింది. వేలకోట్ల రూపాయల కుంభకోణాలు ఎన్నో దర్యాప్తు చేస్తున్న íసీబీఐకి ఈ తిలక్ సినిమా కుంభకోణం చాలా చిన్నది కావచ్చు. తీరిక దొర కడం చాలా కష్టం కూడా కావచ్చు. వందకోట్లు మాయం కావడం కూడా మన వ్యవస్థలో మామూలే అనుకున్నా, దానికి సంబంధించి ఏ కాగితమూ లేకపోవడం ఏమీ జరగకపోవడం వ్యవస్థలో తీవ్రలోపాన్ని సూచిస్తున్నది. (వీ.ఆర్. కమలాపూర్కర్ వర్సెస్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కేసు ఇఐఇ/Sఏ/అ/ 2016/000484లో 13 ఫిబ్రవరి 2017న కమిషన్ ఆదేశం ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com -
తప్పుడు డిగ్రీతో ఎన్నికకే ఎసరు
విశ్లేషణ ఎన్నికల ఏజెంట్ ఆదేశంపైన వకీలు ఫారం నింపారని, తను చదవకనే ప్రమాణ పత్రంపైన సంతకం చేశాననే పృథ్వీరాజ్ వాదనను కోర్టు తిరస్కరించింది. డిగ్రీలు ఉన్నాయని అబద్ధాలుచెప్పి ఎన్నికయ్యే రాజకీయులకు గట్టి చెంపదెబ్బ ఇది. నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెరియంబం పృథ్వీరాజ్ పదో మణిపూర్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఇచ్చిన నామినే షన్లో డిగ్రీ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చా డని ప్రత్యర్థి పుఖ్రెం శరత్ చంద్రసింగ్ ఫిర్యాదు చేశారు. ప్రమాణ పత్రంలో పేర్కొన్న డిగ్రీలకు సంబంధించి రుజువులు ఇవ్వాలని రిటర్నింగ్ అధికారి పృథ్వీరాజ్‌కు సూచించారు. కానీ ఏ పత్రాలూ ఇవ్వకపోయినా నామినేషన్‌ను ఆమోదించారు. పృథ్వీ రాజ్ 14,521, శరత్చంద్ర 13,363 ఓట్లు పొందడంతో పృథ్వీరాజ్ (మోయిరంగ్ నియోజకవర్గం) గెలిచినట్టు ప్రకటించారు. ఈ ఎన్నికను సవాలు చేస్తూ గువాహటి హైకోర్టులో శరత్చంద్రపిటిషన్ వేశారు. ప్రత్యర్థి ఎన్ని కల నేరానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించాలనీ, ప్రజాప్రాతినిధ్యచట్టం 1951 సెక్షన్ 125 ఎ, 127 కింద పృథ్వీరాజ్ పైన నేరవిచారణ ఆరంభించా లనీ కోరారు. మైసూర్ విశ్వవిద్యాలయం ఎం.బి.ఎ డిగ్రీ ఉన్నట్టు పృథ్వీరాజ్ ప్రమాణపత్రంలోని, ఫారం 26లో తప్పుడు ప్రకటన చేశారన్నదే ఆరోపణ. తప్పుడు ప్రక టన గణనీయంగా ప్రభావితం చేస్తే ఆ ఎన్నిక చెల్లదన్న సెక్షన్ 100 (1)(డి) ప్రకారం పృథ్వీరాజ్ ఎన్నికైనట్టు ప్రకటించడం సరికాదని వాదించారు. గుమాస్తా కారణంగా దొర్లిన తప్పు ఎన్నికను గణ నీయంగా ప్రభావితం చేసినట్టు రుజువు లేదన్న పృథ్వీ రాజ్ వాదనను నిరాకరిస్తూ గువాహటి హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. పృథ్వీరాజ్ సుప్రీం కోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ఎం.బి.ఎ డిగ్రీ ఉందన్న చిన్న క్లరికల్ తప్పు వల్ల ఎన్నిక కొట్టివేయడం తగదని, ఆ తప్పుడు సమాచారం నమ్మడం వల్లనే ఓటర్లు ఎన్నుకున్నారని రుజువు చేయలేకపోతే ఎన్నిక రద్దు చేయకూడదని వాదించారు. అయితే 2008 ఎన్ని కలలో కూడా పృథ్వీ రాజ్ ఇదేరకం ప్రకటనచేశారని శరత్చంద్ర తరఫు లాయర్ వాదించారు. 2002లో సవరణ ద్వారా చేర్చిన 33 ఎ సెక్షన్ ప్రకారం పోటీచేసే అభ్యర్థి అదనంగా నేరచరిత్ర సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సెక్షన్ 36 ప్రకారం నామినేషన్‌ను పరిశీ లించి తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. 2002లో సవరించిన 1961 ఎన్నికల నిర్వహణ నియమాలు రూల్ 4(ఎ) ప్రకారం సెక్షన్ 33 (1) కింద మొదటి తరగతి మేజిస్ట్రేట్ లేదా నోటరీ ద్వారా ప్రమాణీకరించిన ఫారం 26లో ఒక కాలమ్‌లో విద్యార్హతలను వెల్లడించాలి. సెక్షన్ 100 కింద ఎన్నిక చెల్లదని ప్రకటించడానికి దారితీసే కారణాలు: (ఎ) ఉండవలసిన అర్హత లేకపోయినా, అనర్హు డైనా, (బి) అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజంటు గానీ అతని అంగీ కారంతో ఎవరైనా గానీ అవినీతి పనులకు పాల్పడినా, (సి) ఏ నామినేషన్ పత్రమైనా అక్రమంగా తిర స్కారానికి గురైనా (డి) అభ్యర్థి ఎన్నికపైన (1) అక్ర మంగా నామినేషన్ పత్రాన్ని అంగీకరించడం, లేదా (2) అభ్యర్థి లేదా అతని ఏజెంట్ ప్రయోజనాల కోసం ఎన్ని కల అవినీతి వల్ల, లేదా (3) అక్రమంగా ఏదైనా చెల్లని ఓటును స్వీకరించడం వల్ల తిరస్కరించడంవల్ల ప్రభా వం పడినా, లేదా(4) రాజ్యాంగంలో, ఈ చట్టంలో, ఏ ఇతర చట్టం కిందైనా చేసిన నియమాల ఉల్లంఘన ఎన్నికను గణనీయంగా ప్రభావితం చేసిందని హైకోర్టు భావిస్తే ఎన్నిక చెల్లదని ప్రకటించవచ్చు. ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో అభ్యర్థి తాను గానీ, ప్రతిపాదిం చిన వ్యక్తి ద్వారా గానీ సెక్షన్ 33ఎ(1) కింద నామినే షన్లో, ప్రమాణ పత్రంలో సమాచారం ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారం అని తనకు తెలిసి లేదా తెలి యడానికి తగిన కారణం ఉండి తప్పుడు సమాచారం ఇచ్చినా, సమాచారం దాచినా, ఇతర చట్టాల్లో ఏ నియమం ఉన్నప్పటికి, ఆరునెలలదాకా జైలుశిక్ష విధిం చవచ్చు. పోటీచేసే అభ్యర్థి గురించిన సమాచారం పొందే ప్రాథమిక హక్కు ఓటరుకు ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. క్రిమినల్ కేసులున్నా, విద్యార్హత ఉండడం అవసరమా లేదా, ఆస్తి ఉండాలా లేదా అని ఆలోచించి, ఓటు వేయాలో లేదో నిర్ణయించే స్వేచ్ఛ ఓటరుకు ఉందని కూడా (యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడీఆర్ 2002 కేసులో) ప్రకటించింది. ఈ తీర్పును అనుసరించి సెక్షన్ 33ఎ ను చేర్చి ఓటర్లకు పార్లమెంటు సమాచార హక్కు ఇచ్చింది. ఈ ఆర్డినెన్సును సవాలు చేస్తే పి.యు.సి.ఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఓటరు సమాచార హక్కును సమ ర్థిస్తూ మళ్లీ తీర్పు చెప్పింది. ఈ కేసులో ఓటరుకు ఈ ప్రాథమిక హక్కు ఉందని ఎక్కడా లేదనే వాదాన్ని తోసి పుచ్చింది. తనను పాలించే వారిని ఎన్నుకునేందుకు తెలి విగా ఓటు వేసే బాధ్యతను నెరవేర్చడానికి సమాచారం అవసరం అని సుప్రీంకోర్టు పదేపదే వివరించింది. తను ఇన్ఫోసిస్, ఐబీఎంలో పనిచేసినందున తనకు ఎం.బి.ఎ డిగ్రీ ఉందనుకున్నారని, ఎన్నికల ఏజెంట్ ఆదేశంపైన వకీలు ఫారం నింపారని, తను చదవకుం డానే ప్రమాణపత్రం పైన సంతకం చేశాననే పృథ్వీరాజ్ వాదనను కోర్టు తిరస్కరించింది. డిగ్రీలున్నాయని అబ ద్ధాలుచెప్పి ఎన్నికయ్యే రాజకీయులకు గట్టి చెంపదెబ్బ ఇది. (అక్టోబర్ 28, 2006న న్యాయమూర్తులు అనిల్ దవే, ఎల్. నాగేశ్వరరావు తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ఆ ముగ్గురు హంతకుల మాటేమిటి?
విశ్లేషణ గాంధీ హత్య, దర్యాప్తు, పరిశోధన, నేర విచారణ, అప్పీలు, జైలుశిక్ష, ఉరిశిక్షలు, కపూర్ కమిషన్ సిఫార్సులు, వాటిపై చర్యలు తదితరాలకు సంబంధించిన అన్ని రికార్డులతో సమగ్ర సమాచార నిధిని ప్రజలకు అందుబాటులో ఉంచాలి. గాంధీ హత్యానేరం ఎఫ్ఐఆర్, తుది చార్జిషీట్, నాథూరాం గాడ్సేను ఉరితీయడానికి చివరగా ఇచ్చిన ఉత్తర్వు కాపీ లను హేమంత్ పాండా తన అధ్యయనానికి అవసరమంటూ కోరారు. పురావస్తు శాఖ ప్రజా సమాచార అధికారి నుంచి పాండా కొన్ని దస్తావేజుల ప్రతులను తీసుకున్నారు. కాని తుది చార్జిషీట్, నాథురాం గాడ్సే మరణశిక్ష ఉత్తర్వులు కనిపించలేదని కమిషన్‌కు విన్నవించారు. గాంధీ హంతకుల్లో ముగ్గురు–గంగాధర్ దహావతే, సూర్యదేవ శర్మ, గంగాధర్ యాదవ్ పారిపోయినట్టు రికార్డులు చూపుతు న్నాయని, వారిని పట్టుకున్నారా, లేదా? అందుకు ఏమైనా ప్రయత్నాలు, పరిశోధనలు జరిగాయా, లేదా? వారి సంగతే మయిందో వివరించాలని కూడా పాండా కోరారు. వారిని పట్టుకోవడానికి ఏ ప్రయత్నాలూ జరగ కపోతే అందుకు కారణాలను తెలుపాలని, దర్యాప్తు సాగితే దానికి సంబంధించిన రికార్డులు, డైరీలు చూపాలని ఆయన కోరారు. గాంధీ హత్యలో పాలుపంచు కున్న శంకర్ కిష్టయ్య (తెలుగువాడు), మరొక వ్యక్తి దత్తా త్రేయ పర్చురేలను సాక్ష్యం సరిపోలేదని హైకోర్టు వది లేసిందంటూ ఆ వివరాలు కూడా ఇవ్వాలని కోరారు. గాంధీ హత్య కేసు దర్యాప్తు, నేరవిచారణ, అప్పీ లుకు సంబంధించిన రికార్డులు తమకు అందినంత మేరకు చూపగలమే గాని, లోపాలు కారణాలు, అభిప్రా యాలు చెప్పజాలమని సీపీఐఓ అన్నారు. ఎలా పారిపో యారు, ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు విడిచిపెట్టారు అనే అంశాలను పురావస్తుశాఖ ఎలా చెప్పగలదని ఆయన ప్రశ్నించారు. తమ వద్ద ఉన్న కొన్ని వేల పేజీల దస్తావేజులను ఎవరైనా చదువుకోవచ్చని, హేమంత్ మళ్లీ రావచ్చని వివరించారు. పురావస్తు శాఖ నియ మాల ప్రకారం కూడా తమ పేరు నమోదుచేసుకుని కార్యాలయంలో కూచుని దస్తావేజులు చదువుకునే అవ కాశాన్ని కల్పిస్తామన్నారు. కానీ చట్ట ప్రకారం తమకు వచ్చిన దరఖాస్తును సంబంధిత కార్యాలయాలకు బదిలీ చేయాల్సిన బాధ్యత జాతీయ పురావస్తు కార్యాలయంపైన ఉంది. వారా పని చేయలేదు. గాంధీ హత్య వివరాలున్న దస్తావేజులు చాలా పాతవని, పదే పదే ఫోటో కాపీలు తీయడం వల్ల చెడిపోతాయని, కనుక తాము వాటిని సీడీలుగా చేసి, వాటి నుండి ప్రింట్ కాపీలు ఇస్తున్నా మన్నారు. రికార్డు భద్రత దృష్ట్యా సమాచార కమిషనర్ ఢిల్లీ్లలోని జాతీయ పురావస్తు శాఖ కార్యాలయానికి వెళ్లి అసలు దస్తావేజులను పరిశీలించారు. రికార్డులలో ఒకే చార్జిషీటు ఉంది కాని, ప్రాథమిక, తుది ఆరోపణా పత్రం అని లేవు. తమ వద్ద జైలు రికార్డులు లేవు కనుక నాథూరాం గాడ్సే ఉరిశిక్ష ఉత్తర్వు ఇవ్వలేమన్నారు. హేమంత్ కోరిన సమాచారాన్ని నిరాకరించడానికి ఏ మినహాయింపూ వర్తించే అవకాశం లేదు. నిజానికి ప్రతి పౌరుడికీ జాతిపిత గాంధీ హత్య కేసు వివరా లన్నిటినీ తెలుసుకునే హక్కు ఉంది. పురావస్తు అథారిటీ సమాచార దరఖాస్తును అనేక ఉన్నతాధికార కార్యాల యాలకు పంపాల్సి ఉంది. గాంధీ హత్య, దర్యాప్తు, పరిశోధన, నేరవిచారణ, అప్పీలు, జైలుశిక్ష, ఉరిశిక్షలు, కపూర్ విచారణ కమిషన్ నివేదిక సిఫార్సులు, వాటిపై తీసుకున్న చర్యలు తదితర అంశాలకు సంబంధించిన అన్ని రికార్డులను సేకరించి సమగ్ర సమాచార నిధిని ఏర్పాటుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కనుక దరఖా స్తును ప్రధాన మంత్రి కార్యాలయానికి బదిలీ చేయాలని కమిషన్ ఆదేశించింది. గాంధీ హత్యా నిందితులను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు, వివరాలున్న డైరీలను, ఇతర పత్రాలను ముంబై, పుణె, ఢిల్లీ పోలీసు వర్గాల నుంచీ, నిందితు లను జైలులో బంధించిన వివరాలను పోలీసు శాఖ నుంచీ, నాథూరాం గాడ్సే తదితరుల ఉరిశిక్ష వివరాలను జైలు అధికారుల నుంచీ, మరో ఇద్దరు నిందితులను అప్పీలులో విడుదల చేసి ఉంటే దానికి సంబంధించిన వివరాలను న్యాయస్థానం నుంచీ, బొంబాయి మహా రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ విషయమై జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలనూ సేకరించేందుకు ఈ సమాచార దరఖా స్తును హోం మంత్రిత్వ శాఖకు పంపాలని ఆదేశించడ మైంది. పారిపోయిన ముగ్గురిని పట్టుకోవడానికి సంబం ధించిన వివరాలున్న కేసు డైరీలను, ఇతర రికార్డులను ఇవ్వడానికి గాను ఈ దరఖాస్తును తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్ అధికారికి బదిలీ చేయాలని ఆదేశించారు. గాంధీ హత్య కేసులకు సంబంధించిన తీర్పులు తదితర అన్ని రికార్డులను ఇవ్వడానికి వీలుగా సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కూడా దరఖాస్తును బదిలీ చేయాలని ఆదేశించడమైంది. జస్టిస్ జేఎల్ కపూర్ కమి షన్ గాంధీ హత్య వెనుక కుట్ర వివరాలను సేకరించి, కొన్ని సూచనలను చేసింది. ఆ సూచనల వివరాలను, కమిషన్ విచారణలో లభించిన పత్రాలను, పురావస్తు అథారిటీకి ఇచ్చేందుకు వీలుగా పార్లమెంటు సెక్రటరీ జనరల్‌కు కూడా దరఖాస్తును బదిలీ చేయాలని కమి షన్ ఆదేశించింది. హోంశాఖ, ముఖ్యంగా ఢిల్లీ పోలీ సులు గాంధీ కేసు దస్తావేజులన్నీ సేకరించి పురావస్తు అథారిటీకి ఇవ్వాలని, అవన్నీ సేకరించిన తరువాత మొత్తం గాంధీ హత్య కేసుల ఫైళ్లన్నీ ఒక చోట భద్రపరిచి పౌరులకు అందుబాటులో ఉంచాలని కూడా కమిషన్ ఆదేశించింది. హేమంత్ పాండా వర్సెస్ పీఐఓ (సాంస్కృతిక మంత్రిత్వ శాఖ) CIC/SH/A/2016/001055 కేసులో 16 ఫిబ్రవరి 2017 ఇచ్చిన తీర్పు ఆధారంగా). మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
డిగ్రీల వివరాలు రహస్యమా?
విశ్లేషణ దొంగ డిగ్రీలు ప్రబలుతున్న ఈ దేశంలో, డిగ్రీలు ఉన్నాయని చెప్పుకునేవారు అవి ఉంటేనే ఆ విషయం చెప్పుకోవాలి. నిజంగా ఉంటే వాటి వివరాలు ఇవ్వడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే డిగ్రీ ఉందో లేదో అని అనుమానించడం సహజం. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా, వ్యక్తిగత ప్రయోజనమంటూ నిరాకరిస్తున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. సగం దరఖాస్తుల గతి ఇంతే. ఏది వ్యక్తిగతం, ఏది కాదు? అని విచారించరు. ఎందుకివ్వాలి అనే మనస్తత్వం దీనికి కారణం. అలాగే ఈ వివరాలు వెల్లడైతే ఏమౌతుందోనన్న భయం కూడా వారిలో ఉంటుంది. ఎన్నో విశ్వవిద్యాలయాలూ, విద్యాసంస్థలూ మాజీ విద్యార్థుల డిగ్రీ వివరాలు అడిగితే ఇవ్వడానికి వెనుకాడు తున్నాయి. ఇవ్వకుండా ఆపాలని హైకోర్టులలో రిట్ పిటి షన్లు వేశాయి కూడా. ఉద్యోగార్థులు, పైచదువులు చదివేవారూ తమ విద్యా ర్హతలు వెల్లడించవలసిందే. బీఏ పాసైనామని లేదా ఎంఏలో ఫస్ట్ క్లాస్ అనీ లేదా డాక్టరేట్ చేశామనీ–ఇలా బయోడేటాలో చెప్పుకోవలసిందే. దరఖాస్తుతో జీవిత సంగ్రహం జతచేస్తారు. అం దులో పిల్లల పేర్లు, గుర్తింపు మచ్చలు, చిరునామా, ఫోన్, ఈ మెయిల్, ఐడీ వంటి వివరాలు వ్యక్తిగతం అనుకోవచ్చు. కాని మిగతా వివరా లన్నీ వ్యక్తిగతం కాలేవు. ఒక విశ్వవిద్యాలయంలో 1978లో బీఏ పరీక్ష రాసిన వారి నంబర్లు, పేర్లు, తండ్రి పేరు, మార్కులు, ఫలితాలు తెలియజేయాలని ఆర్టీఐ కింద కోరారు. ఇది వ్యక్తిగత సమాచారమంటూ సెక్షన్ 8(1)(జె) కింద తిరస్కరించారు. విశ్వవిద్యాలయం వారు ప్రవేశ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారిని ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, విద్య నేర్పి, పరీక్షలు నిర్వహించి, వారు రాసిన సమాధానాల మూల్యాంకనం చేసి మార్కులిచ్చి, ఫలితాలను ప్రకటి స్తారు. ప్రవేశాన్నీ, డిగ్రీనీ రిజిస్టర్ చేయడం చట్టపరమైన బాధ్యత. రిజిస్ట్రేషన్ అంటే సమాచారాన్ని అవసరమై నపుడు పరిశీలించడానికి వీలుగా నిక్షిప్తం చేయడం. అదొక గుర్తింపు వంటిది. ఒక్కS యూనివర్సిటీకి మాత్రమే డిగ్రీలు ఇచ్చే అధికారం ఉంటుంది. అదైనా చట్ట ప్రకారం గుర్తింపు లభించిన తరువాతనే. రిజిస్ట్రేషన్ అంటే సమాజానికి ఫలానా వ్యక్తి గ్రాడ్యుయేట్ అని చెప్పడం. వివాహాన్ని రిజిస్టర్ చేస్తారు. ఆ ఇద్దరు భార్యాభర్తలని ప్రకటించడం దాని ఉద్దేశం. రిజి స్ట్రేషన్ ఉంటే వివాహ బంధం ఏర్ప డిందనడానికి మరో రుజువు చూపనవసరం లేదు. అయితే రిజిస్ట్రేషన్‌ను అవసరమైతే చూపాల్సి ఉంటుంది. అదే విధంగా ఆస్తి విక్రయం కూడా. ఫలానా వ్యక్తి, ఫలానా ఆస్తిని, ఫలానా వ్యక్తికి విక్రయించడాన్ని అధికారుల పర్య వేక్షణలో పుస్తకబద్ధం చేస్తారు. అది రిజిస్ట్రేషన్. అది జనానికి నోటీసు, కోర్టుకు రుజువు. అమ్మిన, కొన్న వ్యక్తులు కాదనడానికి వీలుండదు. ఎన్నో వివాహాలు చేసుకుంటూ మోసం చేసేవారు వివాహపు రిజి స్ట్రేషన్ వివరాలు రహస్యంగా ఉంచాలనుకుంటారు. ఫలానా మహిళకు లేదా పురుషుడికి ఇదివరకే వివాహం అయిందో లేదో పరిశీలించే అవకాశం రిజిస్టర్ కల్పిస్తుంది. అందుకే ప్రతి వివాహాన్ని రిజిస్టర్ చేయడం తప్పనిసరి చేశారు. ఫలానా ఆస్తి కొనే ముందు ఆ ఆస్తిని ఇదివరకు ఎవరికైనా విక్రయించారో లేదో తెలుసుకొనే అధికారం అందరికీ ఉంది. వివాహ వివరాలు ఆస్తి రికార్డు వివరాలు వ్యక్తిగత వివరాలంటూ ఆర్టీఐ కింద ఇవ్వడానికి నిరాకరించారు. ప్రస్తుతం యూని వర్సిటీలు కొన్నిసార్లు అదే పనిచేస్తున్నాయి. కొందరి డిగ్రీ వివరాలు ఇవ్వడం లేదు. మామూలు వ్యక్తుల డిగ్రీ వివరాలు అడిగితే చెప్పేస్తున్నారు. ప్రముఖుల వివరాలు అడిగితే భయపడుతు న్నారు. మూడోవ్యక్తి సమాచారం అంటున్నారు. ప్రతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహించి బహిరంగంగా రాష్ట్ర అధినేత (గవర్నర్ /చాన్సలర్) చేత ప్రమాణం చేయించి మరీ డిగ్రీలను ప్రదానం చేస్తారు. ఈ విశ్వవిద్యాలయ సభ్యుడికి గౌరవం తెచ్చే విధంగా జీవిత కాలమంతా వ్యవహరిసా ్తమంటూ చేసే ప్రమాణమది. చదువుకున్న వారిలా వ్యవహరిస్తామనీ, మాట్లాడతామనీ ఆ ప్రమాణానికి అర్థం. ఒకవేళ స్నాతకోత్సవానికి రాకపోతే ఆ ప్రమాణాన్ని లిఖితపూర్వకంగా చేసి, సంతకం చేసిన తరువాతనే డిగ్రీ ఇస్తారు. మెరెంబమ్ పృథ్వీరాజ్ వర్సెస్ పుఖ్రెమ్ శరత్ చంద్ర సింగ్ కేసు (2016)లో ఒక మణిపూర్ ఎమ్మెల్యే తన డిగ్రీ సమాచారం విషయంలో తప్పుడు ప్రకటన చేసినందుకు సుప్రీంకోర్టు అతని ఎన్నిక చెల్లదని ప్రకటిం చింది. అతను నామినేషన్ పత్రంతో పాటు ప్రకటించిన విద్యా వివరాల ప్రమాణపత్రంలో తాను మైసూరు యూనివర్సిటీ నుంచి 2004లో ఎంబీఏ ఉత్తీర్ణుడైనట్టు రాసుకున్నాడు. ఆ నియో జకవర్గం జనం అతను ఉన్నత విద్యావంతుడని చేసిన ప్రమాణాన్ని నవl్మూరు. గెలిపించారు. అభ్యర్థి విద్యార్హతలు తెలుసుకునే హక్కు ప్రతి ఓటరుకు ఉందని సుప్రీంకోర్టు జడ్జిలు ఇద్దరు ఈ కేసులో తీర్పు చెప్పారు. ఎంబీఏ చది వినట్టు అబద్ధం చెప్పారనీ, ఇది గణనీయమైన తప్పనీ, దీని ప్రభావం వల్ల ప్రజలు ఇతను ఎంబీఏ చదివిన వ్యక్తి అని నమ్మారని, ఇప్పుడు అతనికి ఆ డిగ్రీ లేదనడంతో వారు మోసపోయారని, కనుక ఆ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని తీర్పులో వివరించారు. చదువుకున్న వ్యక్తి తన విద్యార్హత లను చాటుకుంటాడే గానీ దాచుకోజాలడని సుప్రీంకోర్టు వివరించింది. దొంగ డిగ్రీలు ప్రబలుతున్న ఈ దేశంలో, డిగ్రీలు ఉన్నాయని చెప్పుకునేవారు అవి ఉంటేనే చెప్పుకోవాలి. ఉంటే వివరాలు ఇవ్వడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే డిగ్రీ ఉందో లేదో అని అనుమానించడం సహజం. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్, professorsridhar@gmail.com -
సొసైటీలకు దాపరికమెందుకు?
విశ్లేషణ సొసైటీ అనేది జనంతో ముడిపడి ఉన్న సంఘం. రిజిస్టర్ చేసుకున్న తరు వాత తమ ప్రజాసంబంధాలను పారదర్శకతను వారు చాటుకున్నట్టే. మా చిరునామాలు, మా విషయాలు చెప్పబోమని అనడానికి వీల్లేదు. పెద్ద పెద్ద వాగ్దానాలుచేసి ప్రజారంగ వ్యవహారాలు చేసే వారు పారదర్శకంగా ఉండాలి. దాచుకునే రహ స్యాలున్నాయని, దాచు కునే హక్కు తమకు ఉందని వాదించడానికి వీల్లేదు. కౌన్సిల్ ఆఫ్ ఇండి యన్ స్కూల్ సర్టిఫికెట్ సొసైటీ తనకు చెందిన సమాచారం ఇవ్వడం న్యాయమా, ఇవ్వకపోవడం వారి హక్కా అనే సమస్య ఇటీవలే సమాచార కమిషన్ ముందుకు వచ్చింది. సమాచార హక్కు చట్టం ప్రకారం పబ్లిక్ అథారిటీ సంస్థలు పీఆర్వోని నియమించి జనం అడిగిన సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. ప్రమా ణాలతో పరీక్షలు నిర్వహించి పాఠశాలలకు ధృవ పత్రాలను ఇచ్చే ఈ కౌన్సిల్‌పై.. తను నిర్ధారిం చుకున్న లక్ష్యాలకు, తానే ప్రకటించిన ఉద్దేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నట్టు తామే వివరించు కోవలసిన నైతిక బాధ్యత ఉంది. కానీ అనేక సంద ర్భాలలో తను పబ్లిక్ అథారిటీ కాదని, ఎవరికీ జవా బుదారీ కాబోమని కౌన్సిల్ వాదించింది. అలహాబాద్ హైకోర్టు ఎ. పవిత్ర కేసు (2014)లో ఈ సంస్థ పబ్లిక్ అథారిటీ కాదని తీర్పు చెప్పింది. కేంద్ర సమాచార కమిషనర్ ఓపీ కేజరీ వాల్ కూడా.. ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష పరోక్ష ఆర్థిక సాయం తీసుకోని ఈ కౌన్సిల్ పబ్లిక్ అథారిటీ కాదన్నారు. అయినా పార దర్శకంగా ఉండాలని అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని కమిషన్ ఆదే శించింది. కానీ ఆ మాట వినలేదు. దాంతో దర ఖాస్తుదారు మళ్లీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దరఖాస్తుదారుడికి ప్రయాణ వసతి ఖర్చులకింద వేరుు రూపాయలు ఇవ్వాలని కమిషన్ ఆదే శించింది. ఈ ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు సమర్థ్థించింది. దానిపైన ఇద్దరు సభ్యుల ధర్మాసనం అప్పీలు స్వీకరించి కౌన్సిల్ పబ్లిక్ అథారిటీ కాదని తీర్మానించింది. ఈ సంస్థను సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం 1860 కింద రిజిస్టర్ చేసారు. ఈ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ఎవరైనా సరే రిజిస్ట్రార్ దగ్గర ఉంచిన ఈ సొసైటీ పత్రాలను చూడవచ్చు. ఆ విధంగా తీసు కున్న సమాచారాన్ని చట్టపరమైన వివాదాలలో ప్రాథమికంగానే సాక్ష్యంగా పరిగణిస్తారు. 156 ఏళ్ల కిందట ఆంగ్ల పాలకులు ప్రతి వ్యక్తికీ ఇచ్చిన సమా చార హక్కు ఇది. సొసైటీలు రిజిస్టర్ చేసేవారు, ఆ సొసైటీల ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలు నడిపే వారు సమాచారం ఇచ్చి తీరాలని, ఆ సమాచారం సాక్ష్యం అవుతుందని ఆనాడే నిర్ణయించారు. సొసైటీని రిజిస్టర్ ఎందుకు చేస్తారు? తమకు ఒక సంస్థ ఉందని అది ప్రజాప్రయోజనాలకోసం పనిచేస్తుందని తెలియజేయడానికి రిజిస్టర్ చేస్తారు. రిజిస్టర్లో ఉన్న ఆ సొసైటీ వివరాలు ఎవరైనా చూడవచ్చుననే నోటీసు రిజిస్ట్రేషన్‌లో ఉంటుంది. సెక్షన్ 2 ప్రకారం ప్రపంచానికి ఈ సొసైటీ సభ్యుల పేర్లు వారి అడ్రసులు, తదితర వివరాలు, చేయదల చుకున్న కార్యక్రమాలను, అనుసరించే నీతి నియ మావళులను, డెరైక్టర్లు, కమిటీలు పాలకసంఘం సభ్యులు, యాజమాన్యం వివరాలు అన్నీ ఇవ్వ వలసి ఉంటుంది. పబ్లిక్ అథారిటీ కాకపోయినా సొసైటీ అనేది జన సంస్థ. జనంతో ముడిపడి ఉన్న సంఘం. రిజిస్టర్ చేసుకున్న తరువాత తమ ప్రజా సంబంధాలను పారదర్శకతను వారు చాటుకు న్నట్టే. మా చిరునామాలు ఇవ్వబోమని, మా విష యాలు చెప్పబోమని అనడానికి వీల్లేదు. ఈ సొసైటీ ప్రత్యేకంగా భారత్ అనే పేరును వాడుకుంటున్నది. భారత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభు త్వాలలో అనేక విద్యా సంస్థలలో కూడా దీనికి ప్రాధాన్యం, ప్రాతినిధ్యం ఉంది. ఈ సంస్థ ప్రత్యేకావసరాలు ఉన్న పిల్లలకు సహాయం చేస్తున్నది. తనకు అనుబంధమైన పాఠశాలల సమాచారాన్ని దాచడం ఈ సొసైటీ లక్ష్యాలకు విరుద్ధం. ఒక ఉద్యోగి తన జీతం గురించి డీఏ అర్హత గురించి అడగవలసి రావడమే అన్యాయం. అడిగితే ఆర్టీఐ కింద చెప్పననడం మరొక అన్యాయం. సెక్షన్ 2(ఎఫ్) సమాచార హక్కు చట్టంలో ప్రైవేట్ సంస్థ సమాచారాన్ని కూడా కోరవచ్చునని నిర్ధారించింది. ఏ చట్టం అయినా సమాచారాన్ని తెలుసు కోవచ్చని వీలు కల్పిస్తే ఆ సమాచారం ఆర్టీఐ చట్టం కింద సమాచారం అన్న నిర్వచనం కిందికి వస్తుందని ఈ సెక్షన్ వివరిస్తున్నది. కనుక ఈ సమాచారాన్ని ఇవ్వవలసిన బాధ్యత సొసైటీ పైన ఉంది. తెలుసుకునే హక్కు ఎవరికై నా ఉంది. సెక్షన్ 19, సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం, సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్)తో కలిపి చదివితే సమాచారం ఇవ్వవలసిన బాధ్యత సొసైటీ పైన ఉందని, వీరికి సమాచారం ఇప్పించే బాధ్యత రిజి స్ట్రార్ పైన ఉందని, అడిగే హక్కు ఉందని అర్థం చేసుకోవలసి ఉంది. (బాల్కిషన్ వర్సెస్ పీఐఓ కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్, కేసులో సీఐసీ 1.11.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com