డిగ్రీల వివరాలు రహస్యమా? | degree details from universities is not a secret thing | Sakshi
Sakshi News home page

డిగ్రీల వివరాలు రహస్యమా?

Published Fri, Jan 6 2017 1:06 AM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

డిగ్రీల వివరాలు రహస్యమా?

డిగ్రీల వివరాలు రహస్యమా?

విశ్లేషణ
దొంగ డిగ్రీలు ప్రబలుతున్న ఈ దేశంలో, డిగ్రీలు ఉన్నాయని చెప్పుకునేవారు అవి ఉంటేనే ఆ విషయం చెప్పుకోవాలి. నిజంగా ఉంటే వాటి వివరాలు ఇవ్వడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే డిగ్రీ ఉందో లేదో అని అనుమానించడం సహజం.

సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా, వ్యక్తిగత ప్రయోజనమంటూ నిరాకరిస్తున్న సందర్భాలు ఎదురవుతున్నాయి. సగం దరఖాస్తుల గతి ఇంతే. ఏది వ్యక్తిగతం, ఏది కాదు? అని విచారించరు. ఎందుకివ్వాలి అనే మనస్తత్వం దీనికి కారణం. అలాగే ఈ వివరాలు వెల్లడైతే ఏమౌతుందోనన్న భయం కూడా వారిలో ఉంటుంది. ఎన్నో విశ్వవిద్యాలయాలూ, విద్యాసంస్థలూ మాజీ విద్యార్థుల డిగ్రీ వివరాలు అడిగితే ఇవ్వడానికి వెనుకాడు తున్నాయి. ఇవ్వకుండా ఆపాలని హైకోర్టులలో రిట్‌ పిటి షన్లు వేశాయి కూడా.

ఉద్యోగార్థులు, పైచదువులు చదివేవారూ తమ విద్యా ర్హతలు వెల్లడించవలసిందే. బీఏ పాసైనామని లేదా ఎంఏలో ఫస్ట్‌ క్లాస్‌ అనీ లేదా డాక్టరేట్‌ చేశామనీ–ఇలా బయోడేటాలో చెప్పుకోవలసిందే. దరఖాస్తుతో జీవిత సంగ్రహం జతచేస్తారు. అం దులో పిల్లల పేర్లు, గుర్తింపు మచ్చలు, చిరునామా, ఫోన్, ఈ మెయిల్, ఐడీ వంటి వివరాలు వ్యక్తిగతం అనుకోవచ్చు. కాని మిగతా వివరా లన్నీ వ్యక్తిగతం కాలేవు.
ఒక విశ్వవిద్యాలయంలో 1978లో బీఏ పరీక్ష రాసిన వారి నంబర్లు, పేర్లు, తండ్రి పేరు, మార్కులు, ఫలితాలు తెలియజేయాలని ఆర్టీఐ కింద కోరారు. ఇది వ్యక్తిగత సమాచారమంటూ సెక్షన్‌ 8(1)(జె) కింద తిరస్కరించారు.  విశ్వవిద్యాలయం వారు ప్రవేశ పరీక్షలు నిర్వహించి అర్హులైన వారిని ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి, విద్య నేర్పి, పరీక్షలు నిర్వహించి, వారు రాసిన సమాధానాల మూల్యాంకనం చేసి మార్కులిచ్చి, ఫలితాలను ప్రకటి స్తారు.  

ప్రవేశాన్నీ, డిగ్రీనీ రిజిస్టర్‌ చేయడం చట్టపరమైన బాధ్యత. రిజిస్ట్రేషన్‌ అంటే సమాచారాన్ని అవసరమై నపుడు పరిశీలించడానికి వీలుగా నిక్షిప్తం చేయడం. అదొక గుర్తింపు వంటిది. ఒక్కS యూనివర్సిటీకి మాత్రమే డిగ్రీలు ఇచ్చే  అధికారం ఉంటుంది. అదైనా చట్ట ప్రకారం గుర్తింపు లభించిన తరువాతనే. రిజిస్ట్రేషన్‌ అంటే సమాజానికి ఫలానా వ్యక్తి గ్రాడ్యుయేట్‌ అని చెప్పడం. వివాహాన్ని రిజిస్టర్‌ చేస్తారు. ఆ ఇద్దరు భార్యాభర్తలని ప్రకటించడం దాని ఉద్దేశం. రిజి స్ట్రేషన్‌ ఉంటే వివాహ బంధం ఏర్ప డిందనడానికి మరో రుజువు చూపనవసరం లేదు. అయితే రిజిస్ట్రేషన్‌ను అవసరమైతే చూపాల్సి ఉంటుంది. అదే విధంగా ఆస్తి విక్రయం కూడా. ఫలానా వ్యక్తి, ఫలానా ఆస్తిని, ఫలానా వ్యక్తికి విక్రయించడాన్ని అధికారుల పర్య వేక్షణలో పుస్తకబద్ధం చేస్తారు. అది రిజిస్ట్రేషన్‌. అది జనానికి నోటీసు, కోర్టుకు రుజువు. అమ్మిన, కొన్న వ్యక్తులు కాదనడానికి వీలుండదు. ఎన్నో వివాహాలు చేసుకుంటూ మోసం చేసేవారు వివాహపు రిజి స్ట్రేషన్‌ వివరాలు రహస్యంగా ఉంచాలనుకుంటారు. ఫలానా మహిళకు లేదా పురుషుడికి ఇదివరకే వివాహం అయిందో లేదో పరిశీలించే అవకాశం రిజిస్టర్‌ కల్పిస్తుంది. అందుకే ప్రతి వివాహాన్ని రిజిస్టర్‌ చేయడం తప్పనిసరి చేశారు.  

ఫలానా ఆస్తి కొనే ముందు ఆ ఆస్తిని ఇదివరకు ఎవరికైనా విక్రయించారో లేదో తెలుసుకొనే అధికారం అందరికీ ఉంది. వివాహ వివరాలు ఆస్తి రికార్డు వివరాలు వ్యక్తిగత వివరాలంటూ ఆర్టీఐ కింద ఇవ్వడానికి నిరాకరించారు. ప్రస్తుతం యూని  వర్సిటీలు కొన్నిసార్లు అదే పనిచేస్తున్నాయి. కొందరి డిగ్రీ వివరాలు ఇవ్వడం లేదు. మామూలు వ్యక్తుల డిగ్రీ వివరాలు అడిగితే చెప్పేస్తున్నారు. ప్రముఖుల వివరాలు అడిగితే భయపడుతు న్నారు. మూడోవ్యక్తి సమాచారం అంటున్నారు. ప్రతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం నిర్వహించి బహిరంగంగా రాష్ట్ర అధినేత (గవర్నర్‌ /చాన్సలర్‌) చేత ప్రమాణం చేయించి మరీ డిగ్రీలను ప్రదానం చేస్తారు. ఈ విశ్వవిద్యాలయ సభ్యుడికి గౌరవం తెచ్చే విధంగా జీవిత కాలమంతా వ్యవహరిసా ్తమంటూ చేసే ప్రమాణమది. చదువుకున్న వారిలా వ్యవహరిస్తామనీ, మాట్లాడతామనీ ఆ ప్రమాణానికి అర్థం. ఒకవేళ స్నాతకోత్సవానికి రాకపోతే ఆ ప్రమాణాన్ని లిఖితపూర్వకంగా చేసి, సంతకం చేసిన తరువాతనే డిగ్రీ ఇస్తారు.

మెరెంబమ్‌ పృథ్వీరాజ్‌ వర్సెస్‌ పుఖ్రెమ్‌ శరత్‌ చంద్ర సింగ్‌ కేసు (2016)లో ఒక మణిపూర్‌ ఎమ్మెల్యే తన డిగ్రీ సమాచారం విషయంలో తప్పుడు ప్రకటన చేసినందుకు సుప్రీంకోర్టు అతని ఎన్నిక చెల్లదని ప్రకటిం చింది. అతను నామినేషన్‌ పత్రంతో పాటు ప్రకటించిన విద్యా వివరాల ప్రమాణపత్రంలో తాను మైసూరు యూనివర్సిటీ నుంచి 2004లో ఎంబీఏ ఉత్తీర్ణుడైనట్టు రాసుకున్నాడు. ఆ నియో జకవర్గం జనం అతను ఉన్నత విద్యావంతుడని చేసిన ప్రమాణాన్ని నవl్మూరు. గెలిపించారు. అభ్యర్థి విద్యార్హతలు తెలుసుకునే హక్కు ప్రతి ఓటరుకు ఉందని సుప్రీంకోర్టు జడ్జిలు ఇద్దరు ఈ కేసులో తీర్పు చెప్పారు.

ఎంబీఏ చది వినట్టు అబద్ధం చెప్పారనీ, ఇది గణనీయమైన తప్పనీ, దీని ప్రభావం  వల్ల ప్రజలు ఇతను ఎంబీఏ చదివిన వ్యక్తి అని నమ్మారని, ఇప్పుడు అతనికి ఆ డిగ్రీ లేదనడంతో వారు మోసపోయారని, కనుక ఆ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదని తీర్పులో వివరించారు. చదువుకున్న వ్యక్తి తన విద్యార్హత లను చాటుకుంటాడే గానీ దాచుకోజాలడని సుప్రీంకోర్టు వివరించింది. దొంగ డిగ్రీలు ప్రబలుతున్న ఈ దేశంలో, డిగ్రీలు ఉన్నాయని చెప్పుకునేవారు అవి ఉంటేనే చెప్పుకోవాలి. ఉంటే వివరాలు ఇవ్వడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే డిగ్రీ ఉందో లేదో అని అనుమానించడం సహజం.

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌,
professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement