
తప్పుడు డిగ్రీతో ఎన్నికకే ఎసరు
విశ్లేషణ
ఎన్నికల ఏజెంట్ ఆదేశంపైన వకీలు ఫారం నింపారని, తను చదవకనే ప్రమాణ పత్రంపైన సంతకం చేశాననే పృథ్వీరాజ్ వాదనను కోర్టు తిరస్కరించింది. డిగ్రీలు ఉన్నాయని అబద్ధాలుచెప్పి ఎన్నికయ్యే రాజకీయులకు గట్టి చెంపదెబ్బ ఇది.
నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మెరియంబం పృథ్వీరాజ్ పదో మణిపూర్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు ఇచ్చిన నామినే షన్లో డిగ్రీ విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చా డని ప్రత్యర్థి పుఖ్రెం శరత్ చంద్రసింగ్ ఫిర్యాదు చేశారు. ప్రమాణ పత్రంలో పేర్కొన్న డిగ్రీలకు సంబంధించి రుజువులు ఇవ్వాలని రిటర్నింగ్ అధికారి పృథ్వీరాజ్‌కు సూచించారు. కానీ ఏ పత్రాలూ ఇవ్వకపోయినా నామినేషన్‌ను ఆమోదించారు. పృథ్వీ రాజ్ 14,521, శరత్‌చంద్ర 13,363 ఓట్లు పొందడంతో పృథ్వీరాజ్ (మోయిరంగ్ నియోజకవర్గం) గెలిచినట్టు ప్రకటించారు. ఈ ఎన్నికను సవాలు చేస్తూ గువాహటి హైకోర్టులో శరత్‌చంద్రపిటిషన్ వేశారు. ప్రత్యర్థి ఎన్ని కల నేరానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, ఆ ఎన్నిక చెల్లదని ప్రకటించాలనీ, ప్రజాప్రాతినిధ్యచట్టం 1951 సెక్షన్ 125 ఎ, 127 కింద పృథ్వీరాజ్ పైన నేరవిచారణ ఆరంభించా లనీ కోరారు. మైసూర్ విశ్వవిద్యాలయం ఎం.బి.ఎ డిగ్రీ ఉన్నట్టు పృథ్వీరాజ్ ప్రమాణపత్రంలోని, ఫారం 26లో తప్పుడు ప్రకటన చేశారన్నదే ఆరోపణ. తప్పుడు ప్రక టన గణనీయంగా ప్రభావితం చేస్తే ఆ ఎన్నిక చెల్లదన్న సెక్షన్ 100 (1)(డి) ప్రకారం పృథ్వీరాజ్ ఎన్నికైనట్టు ప్రకటించడం సరికాదని వాదించారు.
గుమాస్తా కారణంగా దొర్లిన తప్పు ఎన్నికను గణ నీయంగా ప్రభావితం చేసినట్టు రుజువు లేదన్న పృథ్వీ రాజ్ వాదనను నిరాకరిస్తూ గువాహటి హైకోర్టు ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. పృథ్వీరాజ్ సుప్రీం కోర్టులో అప్పీలు దాఖలు చేశారు. ఎం.బి.ఎ డిగ్రీ ఉందన్న చిన్న క్లరికల్ తప్పు వల్ల ఎన్నిక కొట్టివేయడం తగదని, ఆ తప్పుడు సమాచారం నమ్మడం వల్లనే ఓటర్లు ఎన్నుకున్నారని రుజువు చేయలేకపోతే ఎన్నిక రద్దు చేయకూడదని వాదించారు. అయితే 2008 ఎన్ని కలలో కూడా పృథ్వీ రాజ్ ఇదేరకం ప్రకటనచేశారని శరత్‌చంద్ర తరఫు లాయర్ వాదించారు. 2002లో సవరణ ద్వారా చేర్చిన 33 ఎ సెక్షన్ ప్రకారం పోటీచేసే అభ్యర్థి అదనంగా నేరచరిత్ర సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సెక్షన్ 36 ప్రకారం నామినేషన్‌ను పరిశీ లించి తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. 2002లో సవరించిన 1961 ఎన్నికల నిర్వహణ నియమాలు రూల్ 4(ఎ) ప్రకారం సెక్షన్ 33 (1) కింద మొదటి తరగతి మేజిస్ట్రేట్ లేదా నోటరీ ద్వారా ప్రమాణీకరించిన ఫారం 26లో ఒక కాలమ్‌లో విద్యార్హతలను వెల్లడించాలి.
సెక్షన్ 100 కింద ఎన్నిక చెల్లదని ప్రకటించడానికి దారితీసే కారణాలు:
(ఎ) ఉండవలసిన అర్హత లేకపోయినా, అనర్హు డైనా, (బి) అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజంటు గానీ అతని అంగీ కారంతో ఎవరైనా గానీ అవినీతి పనులకు పాల్పడినా, (సి) ఏ నామినేషన్ పత్రమైనా అక్రమంగా తిర స్కారానికి గురైనా (డి) అభ్యర్థి ఎన్నికపైన (1) అక్ర మంగా నామినేషన్ పత్రాన్ని అంగీకరించడం, లేదా (2) అభ్యర్థి లేదా అతని ఏజెంట్ ప్రయోజనాల కోసం ఎన్ని కల అవినీతి వల్ల, లేదా (3) అక్రమంగా ఏదైనా చెల్లని ఓటును స్వీకరించడం వల్ల తిరస్కరించడంవల్ల ప్రభా వం పడినా, లేదా(4) రాజ్యాంగంలో, ఈ చట్టంలో, ఏ ఇతర చట్టం కిందైనా చేసిన నియమాల ఉల్లంఘన ఎన్నికను గణనీయంగా ప్రభావితం చేసిందని హైకోర్టు భావిస్తే ఎన్నిక చెల్లదని ప్రకటించవచ్చు. ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతో అభ్యర్థి తాను గానీ, ప్రతిపాదిం చిన వ్యక్తి ద్వారా గానీ సెక్షన్ 33ఎ(1) కింద నామినే షన్లో, ప్రమాణ పత్రంలో సమాచారం ఇవ్వకపోయినా, తప్పుడు సమాచారం అని తనకు తెలిసి లేదా తెలి యడానికి తగిన కారణం ఉండి తప్పుడు సమాచారం ఇచ్చినా, సమాచారం దాచినా, ఇతర చట్టాల్లో ఏ నియమం ఉన్నప్పటికి, ఆరునెలలదాకా జైలుశిక్ష విధిం చవచ్చు.
పోటీచేసే అభ్యర్థి గురించిన సమాచారం పొందే ప్రాథమిక హక్కు ఓటరుకు ఉందని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. క్రిమినల్ కేసులున్నా, విద్యార్హత ఉండడం అవసరమా లేదా, ఆస్తి ఉండాలా లేదా అని ఆలోచించి, ఓటు వేయాలో లేదో నిర్ణయించే స్వేచ్ఛ ఓటరుకు ఉందని కూడా (యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఏడీఆర్ 2002 కేసులో) ప్రకటించింది. ఈ తీర్పును అనుసరించి సెక్షన్ 33ఎ ను చేర్చి ఓటర్లకు పార్లమెంటు సమాచార హక్కు ఇచ్చింది. ఈ ఆర్డినెన్సును సవాలు చేస్తే పి.యు.సి.ఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఓటరు సమాచార హక్కును సమ ర్థిస్తూ మళ్లీ తీర్పు చెప్పింది. ఈ కేసులో ఓటరుకు ఈ ప్రాథమిక హక్కు ఉందని ఎక్కడా లేదనే వాదాన్ని తోసి పుచ్చింది. తనను పాలించే వారిని ఎన్నుకునేందుకు తెలి విగా ఓటు వేసే బాధ్యతను నెరవేర్చడానికి సమాచారం అవసరం అని సుప్రీంకోర్టు పదేపదే వివరించింది.
తను ఇన్ఫోసిస్, ఐబీఎంలో పనిచేసినందున తనకు ఎం.బి.ఎ డిగ్రీ ఉందనుకున్నారని, ఎన్నికల ఏజెంట్ ఆదేశంపైన వకీలు ఫారం నింపారని, తను చదవకుం డానే ప్రమాణపత్రం పైన సంతకం చేశాననే పృథ్వీరాజ్ వాదనను కోర్టు తిరస్కరించింది. డిగ్రీలున్నాయని అబ ద్ధాలుచెప్పి ఎన్నికయ్యే రాజకీయులకు గట్టి చెంపదెబ్బ ఇది. (అక్టోబర్ 28, 2006న న్యాయమూర్తులు అనిల్ దవే, ఎల్. నాగేశ్వరరావు తీర్పు ఆధారంగా)
మాడభూషి శ్రీధర్, వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com