జనాయుధానికి జనాందోళనే రక్ష | Dileep Reddy Writes On Proposed RTI Act | Sakshi
Sakshi News home page

జనాయుధానికి జనాందోళనే రక్ష

Published Fri, Jul 20 2018 1:43 AM | Last Updated on Fri, Sep 28 2018 4:15 PM

Dileep Reddy Writes On Proposed RTI Act - Sakshi

సమకాలీనం
విధాన నిర్ణయాలకు ముందు అధికారిక పత్రాల్లో సంబంధిత అధికారులు, పాలకులు రాసే వ్యాఖ్యలు (నోట్‌ఫైల్స్‌) ఎంతో కీలకమైనవి. అవినీతి–బంధు ప్రీతి–అక్రమాల గుట్టుమట్లను అవే బయట పెడతాయి. సమాచార హక్కు చట్టం కింద పౌరులు అవన్నీ పొందవచ్చు. ‘ఔను, మీవి ప్రజాకార్యాలయాలే, ప్రజలకు సమాచారం ఇవ్వండి, చట్టానికి కట్టుబడండి’ అని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా రాజకీయపక్షాలు పెడచెవిన పెడుతున్నాయి. ఈ క్రమంలో... కమిషన్లను నిర్వీర్యపరిచే  తాజా సవరణ ప్రతిపాదన ప్రమాదకరమనే భావన ఉంది. ప్రజాప్రతిఘటనే దీనికి సరైన మందు.

ప్రజలు పోరాడి సాధించు కున్న పౌర సదుపాయం, సమాచార హక్కు చట్టాన్ని పలుచన చేసే ప్రమాదం మూడో మారు ముంచు కొచ్చింది. ఆ ప్రమాదం తెస్తున్నదెవరో కాదు, స్వయానా కేంద్ర ప్రభుత్వమే! ఇదివరకు రెండు మార్లు ప్రయత్నం చేసిందీ కేంద్రమే! కాకపోతే ఇంతకు మున్ను యూపీఏ ప్రభుత్వం చేస్తే, ఇప్పుడు చేస్తున్నది ఎన్డీయే ప్రభుత్వం. లోగడ చేసింది రెక్కలు విరిచే యత్నమైతే ఇప్పుడు చేసేది తలనరకడమే! ఈ ప్రయత్నాన్నీ అడ్డుకోవాల్సింది ప్రజలే! ఇదివరకటి రెండు యత్నాల్నీ దేశ పౌరులే సమర్థంగా అడ్డుకొని చట్ట సవరణ జరగనీకుండా తమ హక్కును కాపాడు కున్నారు. ఇక ముందైనా కాపాడుకోవడం పౌర సమాజం కర్తవ్యంగా మారింది.

క్షేత్రపరంగా ఆర్టీఐ అమలును క్రమంగా గండికొట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు చట్టపరంగానూ దెబ్బకొట్టే ప్రతిపాదనను ముందుకు తోస్తున్నాయి. ఫలితంగా, సమాచారం పొందే పౌర హక్కు విషయమై రాజ్యాంగ స్ఫూర్తికే భంగం వాటిల్లు తోంది. పౌరసంఘాలతో పాటు విపక్ష రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు ముసాయిదాను రాజ్యసభలో ప్రవేశపెట్టే ప్రతిపాదనను గురువారం ఎజెండాలో చేర్చారు. కానీ, జరగలేదు. ఇక పార్లమెంటు లోపలా, బయటా గట్టి వ్యతిరేకత, ప్రజాందోళనలు వస్తే తప్ప ఈ సవరణ ఆగక పోవచ్చు! అదే జరిగితే ఆర్టీఐ చట్టం అమలు మరింత నీరుకారడం ఖాయం.

గుండెకాయనే బలహీనపరిస్తే...
సమాచార హక్కు చట్టం అమలులో అత్యంత కీలక పాత్ర సమాచార కమిషన్లది. 2005లో వచ్చిన ఈ చట్టం, ప్రభుత్వాలతో సహా మరే సంస్థలకూ ఆ బాధ్యతను అప్పగించలేదు. కేంద్ర ప్రభుత్వంలోని పౌర కార్యాలయాల్లో చట్టం అమలు బాధ్యత కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ)ది కాగా రాష్ట్రాల్లో ఆ బాధ్యత రాష్ట్ర కమిషన్లు (ఎస్‌ఐసీ) నిర్వహించాలి.   ఫిర్యాదులు, అప్పీళ్లను కూడా పాక్షిక న్యాయస్థాన హోదాలో కమిషన్లే పరిష్కరించాలి. çపూర్తి స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాలి. ఇప్పుడా కమిషన్లను బల హీనపరిచే ప్రక్రియకు కేంద్రం పూనుకుంది. కమి షన్‌లో ముఖ్యులైన కమిష నర్ల హోదా, పదవీకాలం, జీతభత్యాల విషయంలో మార్పులు ప్రతిపాదిస్తున్నారు. చట్టంలో పొందుపరచినట్టు కాకుండా నిర్ణ యాధికారాన్ని ఏక పక్షంగా కేంద్ర ప్రభుత్వానికి దఖలు పరచడమే తాజా చట్టసవరణలోని ముఖ్యాంశం.

కేంద్ర సమాచార ముఖ్య కమిషనర్‌ (సీఐసీ) స్థాయిని ప్రస్తుత చట్టంలో కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్‌ (సీఈసీ)కు సమాన హోదాగా పేర్కొ న్నారు. తత్సమాన జీత–భత్యాలు ఇస్తున్నారు. కేంద్ర ఇతర సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్ల సమాన హోదాను, జీతభత్యాలనూ కల్పించారు. రాష్ట్రాల్లోని సమాచార ముఖ్య కమిషనర్‌కు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ హోదా, సమాచార ఇతర కమిష నర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) హోదాను చట్టం కల్పిస్తోంది. చట్టం పకడ్బందీ అమ లుకు ఇది అవసరమని అప్పట్లో భావించారు. ప్రభు త్వాలకు లొంగిఉండనవసరం లేకుండా, స్వేచ్ఛగా– స్వతంత్య్రంగా వ్యవహరించేందుకే వాటిని కల్పిం చారు. ఎవరూ మార్చడానికి వీల్లేకుండా ఈ అంశాల్ని చట్టంలో భాగం చేశారు. పార్లమెంటు స్థాయీ సంఘం (పిఎస్సీ) చొరవతోనే అప్పుడీ నిర్ణయం జరిగింది. గత పుష్కర కాలంగా అమలు పరుస్తున్నారు.

ఇది సముచితం కాదని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వీరందరికీ అయిదేళ్ల పదవీ కాలాన్ని చట్టం నిర్దేశిస్తోంది. అలా కాకుండా, ఇకపై హోదా, పదవీకాలం, జీతభత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించి, అమలుపరిచే విధంగా అధి కారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేయనున్నారు. ఎన్నికల ముఖ్య కమిషనర్‌ అన్నది రాజ్యాంగ హోదా అని, సమాచార ముఖ్య కమిషనర్‌ చట్టపరమైన హోదా కనుక సమానంగా ఉండనవసరం లేదనేది తాజా వాదన. కమిషనర్ల పదవీ కాలాన్ని మొదట్లో అయిదేళ్లని పేర్కొన్నారు, అంత అవసరంలేదనే కొత్త వాదనను తెరపైకి తెస్తున్నారు. ఈ మార్పులు ఏ మంచికోసమో ఎక్కడా సరైన వివరణ లేదు.

ముసాయిదాలో సవరణ బిల్లు ఉద్దేశాలు–లక్ష్యాలను వెల్ల డిస్తూ, హోదాలను హేతుబద్దం చేయడానికే అని పేర్కొన్నారు. మరోపక్క ఇది ఖచ్చితంగా చట్టం అమలును నీరు కారుస్తుందని పౌర సమాజం ఆందోళన. ప్రజా సమాచార హక్కు జాతీయ ప్రచార మండలి(ఎన్సీపీఆర్‌ఐ), మజ్దూర్‌ కామ్‌గార్‌ శక్తి సంఘటన్‌ (ఎమ్కేఎస్సెస్‌)వంటి సంఘాలు అప్పుడే నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. కేంద్రం ఇకపై సమాచార కమిషన్లను, తద్వారా వ్యవస్థను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే అన్నది విమర్శ. ప్రజా క్షేత్రంలో ఏ చర్చ జరుపకుండానే ఈ ప్రతి పాదన తెస్తున్నారు. ఈ ‘కత్తిరింపులు’, కేంద్ర గుత్తాధిపత్యం వల్ల అధికార యంత్రాంగం ఇక కమిషనర్లను, స్థూలంగా కమిషన్లను ఖాతరు చేయదనే భయ ముంది. ఫలితంగా అన్ని స్థాయిల్లోనూ సమా చార నిరాకరణ, జాప్యం సర్వసాధారణమయ్యే ప్రమా దాన్నీ ప్రజాసంఘాలు శంకిస్తున్నాయి.

అప్పుడు విచక్షణతో చేసిందే!
రాజ్యాంగపరమైన బాధ్యత నిర్వహించడమంటే రాజ్యాంగంలో ఆ పదవిని విధిగా ప్రస్తావించి ఉండా లనే వాదన సరికాదు. పౌరుల ఓటు హక్కుకు రక్షణ కల్పించం ఎలాంటి బాధ్యతో, పౌరులు సమాచారం తెలుసుకునే హక్కును పరిరక్షిం చడం కూడా అంతే బాధ్యతాయుతమైన కార్యం. ఈ రెండు హక్కుల మూలాలూ... భారత రాజ్యాంగం భద్రత కల్పించిన భావప్రకటన స్వేచ్ఛ హక్కు (అధికరణం 19)లో ఒదిగి ఉన్నాయి. పాలకులుగా ఇష్టమైన వారిని ఎన్ను కోవడం ద్వారా తమ భావ ప్రకటన స్వేచ్ఛను పౌరులు వినియోగించుకున్నట్టే, వివిధ కార్యక్ర మాల్లో పాల్గొని ప్రయోజనం పొందేలా వాటి గురిం చిన సమాచారం తెలుసుకోవడం కూడా వారి ప్రాథ మిక హక్కులో భాగమే! ఈ విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో (స్టేట్‌ ఆఫ్‌ యూపీ వర్సెస్‌ రాజ్‌ నారాయన్‌–1976, ఎస్పీ గుప్తా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా–1982) నొక్కి చెప్పింది.

ప్రభుత్వ వ్యవస్థల నుంచి సమాచారం పొందడం పౌరుల ప్రాథమిక హక్కేనని ఐక్యరాజ్యసమితి మానవహ క్కుల సంఘం కూడా తన 2011 నివేదికలో నిర్ద్వం దంగా వెల్లడించింది. పౌరుల ప్రాథమిక హక్కు రక్షణ విధులు నిర్వర్తించే సమాచార కమిషన్లు, అందులోని కమిషనర్లు రాజ్యాంగ విహిత బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టే లెక్క. వారికి కేంద్రంలో ఎన్నికల కమి షనర్‌ హోదా, రాష్ట్రంలో సీఎస్‌ హోదా కల్పించడం నిర్దిష్ట లక్ష్యంతోనేనని, ఇదే లేకుంటే ఇంతటి వ్యవ స్థను ఏర్పాటు చేయడంలో అర్థమే లేదని పార్లమెం టరీ స్థాయి సంఘం (పీఎస్సీ) కూడా పేర్కొంది. వివిధ స్థాయిల్లో చర్చ కూడా జరిగింది. 2005 చట్టం రూపొందే క్రమంలో చేసిన బిల్లు ముసాయిదాలో ఒక ప్రతిపాదన ఉండింది.

ప్రతి కమిషన్‌లోనూ అదనంగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే డిప్యూటీ కమిషనర్లు ఉండాలన్నది ఆ ప్రతి పాదన. దానివల్ల, కేంద్రం జోక్యంతో కమిషన్ల స్వయం ప్రతి పత్తికి  భంగమని పీఎస్సీనే అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకేనేమో, చట్టంలో సదరు డిప్యూటీ కమిషనర్ల వ్యవస్థకు స్థానం కల్పించలేదు. అటు వంటిది, ఇప్పుడు అందుకు భిన్నంగా కమిష నర్ల హోదా, పదవీకాలం, జీతభత్యాలంతా కేంద్రం ఇష్టా నుసారం జరగాలని చేస్తున్న ప్రతిపాదన కమిషన్ల స్వతంత్ర పనితీరుకు పూర్తి భంగకరమే.

ప్రతిఘటనతోనే ఆగిన కుయుక్తులు!
స్వాతంత్ర భారత చరిత్రలో వచ్చిన అతి కొద్ది మంచి చట్టాల్లో మేలైనది, జనహితమైనదిగా సమాచార హక్కు చట్టానికి పేరుంది. పాలనా వ్యవస్థల్లో ఎంతో కొంత పారదర్శకతకు, తద్వారా అధికార యంత్రాంగం జవాబుదారీతనానికి ఈ చట్టం కారణమౌ తోంది. రాజకీయ వ్యవస్థ దుందుడుకు తనాన్నీ కొంతమేర నియంత్రించగలుగుతోంది. జనాల్లో అవ గాహన పెరిగే క్రమంలోనే ఇది మరిన్ని ఫలాలు అందించి, ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే ఆస్కార ముంది. కానీ, ప్రభుత్వాలు, ముఖ్యంగా పాలనా యంత్రాంగం దీన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు నిరంతరం సాగిస్తూనే ఉన్నాయి. కమిషన్లను రిటైర్డ్‌ ఉద్యోగులతో నింపడమో, అసలు నింపక ఖాళీలతో కొనసాగించడమో చేస్తున్నాయి.

మరోవైపు చట్టాన్ని పలుచన చేసే ఎత్తుగడలకు వెళ్తున్నాయి. చట్టం వచ్చి ఏడాది తిరగక ముందే గండికొట్టే యత్నం జరిగింది. విధాన నిర్ణయాలకు ముందు అధికారిక పత్రాల్లో సంబంధిత అధికా రులు, పాలకులు రాసే వ్యాఖ్యలు (నోట్‌ఫైల్స్‌) ఎంతో కీలకమైనవి. అవినీతి–బంధు ప్రీతి–అక్రమాల గుట్టుమట్లను అవే బయట పెడ తాయి. సమాచార హక్కు చట్టం కింద పౌరులు అవన్నీ పొందవచ్చు. వాటిని ఈ చట్టపరిధి నుంచి తొలగించే యత్నం 2006 జూలైలోనే జరిగింది. ఇందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్టీఐ కార్యకర్తల చొరవతో దేశ వ్యాప్తంగా ఆందోళన జరిగింది. అన్నాహజారే దీక్షకు దిగారు.  ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సమాచారంలో భాగమైన ‘నోట్‌ఫైల్స్‌’ను నేటికీ ఏ పౌరుడైనా పొందవచ్చు. ఈ హక్కును నీరుగార్చే రెండో దాడి 2013 ఆగస్టులో జరిగింది. లోక్‌సభలో బిల్లు ముసాయిదాను కూడా ప్రవేశపెట్టారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం పరిధిలో ఏర్పడ్డ రాజకీయపక్షాలను ఈ చట్టం పరిధి నుంచి తప్పించేందుకు చేసిన యత్నమది. దాని క్కూడా పౌర సంస్థల నుంచి గట్టి వ్యతిరేకత వ్యక్తమైంది. మినహాయింపుకోసం చట్టసవరణకు యత్నించిన వారు, పౌర కార్యాలయాలుగా రాజకీ యపక్షాలన్నీ చట్టం పరిధిలోకే వస్తాయి అంటే మాత్రం ఒప్పుకోరు! ‘ఔను, మీవి ప్రజాకార్యాల యాలే, ప్రజలకు సమాచారం ఇవ్వండి, చట్టానికి కట్టుబడండి’ అని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినా రాజకీయపక్షాలు పెడచెవిన పెడుతున్నాయి. ఈ క్రమంలో... కమిషన్లను నిర్వీర్య పరిచే తాజా సవరణ ప్రతిపాదన ప్రమాదకరమనే భావన ఉంది. ప్రజాప్రతిఘటనే దీనికి సరైన మందు. ప్రజాస్వామ్య పరిపుష్ఠికి ఆయుధమైన ఆర్టీఐ చట్టాన్ని పోరాడైనా కాపాడుకోవడం పౌరసమాజ కర్తవ్యం.

వ్యాసకర్త సమాచార పూర్వ కమిషనర్‌
దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement