నిఘా నీరసిస్తే ‘సమాచారం’ సమాధే! | Dileep Reddy Guest Column On RTI Amendment Act | Sakshi
Sakshi News home page

నిఘా నీరసిస్తే ‘సమాచారం’ సమాధే!

Published Fri, Aug 2 2019 12:56 AM | Last Updated on Fri, Aug 2 2019 12:58 AM

Dileep Reddy Guest Column On RTI  Amendment Act - Sakshi

పార్లమెంటు ఆమోదించిన తాజా సవరణ ద్వారా సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చి పారదర్శకతకు సర్కారు పాతరేయ జూస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన ‘పౌరులు తెలుసుకునే’ ప్రాథమిక హక్కుకే ఇది భంగం. సమాచార హక్కు అమలు సాకారానికి లభించిన చట్టభద్రతకి ఇక గండి పడనుంది. డెబ్బయ్యేళ్ల స్వతంత్ర చరిత్రలో, దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పోరు తర్వాత ఆర్టీఐ రూపంలో దేశ ప్రజలకు దక్కిన అరుదైన వ్యవస్థకు తూట్లు మొదలయినట్టే! చట్టం అమల్లోకి వచ్చి దాదాపు 15 సంవత్సరాలవు తున్న తరుణంలో ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. పలువురు సందేహిస్తున్నట్టు ప్రస్తుత సవరణ ఈ చట్టాన్ని బలహీనపరచకూడదు. బలోపేతం చేయాలి.

ప్రభుత్వాలు, పాలకపక్ష పెద్దలిచ్చే సంకే  తాల్ని బట్టే చట్టాలు అమలవుతాయి, అధికార యంత్రాంగం పనిచేస్తుంది. పౌరులాశించిన పరిపాలనా ఫలాలు లభిస్తాయి. సంకేతాలే మాత్రం భిన్నంగా ఉన్నా, ఫలితం సున్నా, ఇక అంతే సంగతులు! యుగాలుగా ఇది నడుస్తున్న చరిత్ర అవటం వల్లే సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం అమలు పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఎన్నో సందేహాలు! పార్లమెంటు ఆమోదించిన తాజా సవరణ ద్వారా ఈ చట్టాన్ని నీరుగార్చి పారదర్శకతకు సర్కారు పాతరేయ జూస్తోందన్న విమర్శ. రాజ్యాంగం ప్రసాదించిన ‘పౌరులు తెలుసుకునే’ ప్రాథమిక హక్కుకే ఇది భంగం. హక్కు అమలు సాకారానికి లభించిన చట్టభద్రతకిక గండి పడనుంది.

డెబ్బయ్యేళ్ల స్వతంత్ర చరిత్రలో, దాదాపు ఒకటిన్నర దశాబ్దాల పోరు తర్వాత ఆర్టీఐ రూపంలో దేశ ప్రజలకు దక్కిన అరుదైన వ్యవస్థకు తూట్లు మొదలయినట్టే! చట్టం అమల్లోకి వచ్చి దాదాపు ఒకటిన్నర దశాబ్దాలవుతున్న తరుణంలో ఈ పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రస్తుత చట్ట సవరణ ఏ కోణంలో చూసినా, సమాచార వెల్లువను పటిష్ట పరచకపోగా ఈ ప్రక్రియను పలుచన చేయడానికే ఆస్కారముంది. చట్టం అమల్లోకి వచ్చిన కొత్తలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్టీఐ అమలుకు అనువైన భూమికను సిద్ధం చేశారు. నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందాకు చెప్పి అధికారులకు, పౌర సంఘాల కార్యకర్తలకు, జర్నలిస్టులకు ప్రత్యేకంగా చట్టంపై శిక్షణ ఇప్పించారు. పౌరుల్లో అవగా హనకు ప్రత్యేక నిధులతో ప్రచార సామాగ్రి రూపొందించి, సదస్సులు పెట్టించారు. జాప్యం లేకుండా కమిషన్‌ ఏర్పరచి అమలు ప్రారంభిం చారు. ఒక సందర్భంలో ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టుపై విపక్ష సభ్యులు రభస చేస్తే, ‘... రాజకీయం చేయకండి, నిజంగా సమాచారం తెలుసు కోవడమే మీ ఉద్దేశమైతే, పది రూపాయలు వెచ్చించి ఆర్టీఐ దరఖాస్తు చేసినా మీకు సమాచారం లభిస్తుంద’ని శాసనసభావేదిక నుంచి భరోసా ఇచ్చారు. మొత్తం అధికార వ్యవస్థకే ఆ మాట ఒక బలమైన సంకేతమైంది.

అడ్డుకున్నా ఆగని తొలి సవరణ
సమాచార హక్కు చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఇటీవలే ఆమో  దించింది. ఉభయసభల్లోనూ ఈ సమావేశాల్లోనే బిల్లుకు ఆమోదం లభించింది. ఇక రాష్ట్రపతి ముద్రపడి, గెజెట్లో ప్రచురితమవడంతో చట్ట సవరణ ప్రక్రియ పూర్తవుతుంది. ప్రధానంగా ఈ చట్ట సవరణ... కేంద్రంలో, రాష్ట్రంలో ఉండే సమాచార కమిషనర్ల హోదా, పదవీకాలం, వేతనాల మార్పులకు సంబంధించింది. అవన్నీ అధికంగా ఉన్నాయని, ప్రస్తుత సవరణ ద్వారా వాటిని హేతుబద్ధం చేసేందుకేనని బిల్లు ముసా యిదా లక్ష్యాలు–ఉద్దేశాల్లో కేంద్రం వెల్లడించింది. కానీ, అది సహేతు కంగా లేదు. ‘తాడిచెట్టెందుకెక్కావు?’ అంటే ‘దూడ గడ్డికోసం’అని తడు ముకుంటూ చెప్పే జవాబంత అసంబద్ధంగా ఉంది.

2005లో ఏర్పడ్డ నాటినుంచి ఆర్టీఐ చట్టానికి ఇదే తొలి సవరణ. ఇంతకు ముందు మూడు, నాలుగు మార్లు వేర్వేరు విషయాల్లో సవరణకు జరిగిన యత్నాలు ఫలించలేదు. పాలనలో కీలకమైన ‘నోట్‌ఫైల్స్‌’ను ఈ చట్టపరిధి నుంచి తప్పించే విఫల యత్నమూ జరిగింది. చట్టాన్ని మార్చ డానికి ఆయా సందర్భాల్లో కేంద్రంలోని ప్రభుత్వాలు చేసిన ప్రయ త్నాలను పౌరసమాజం ఎప్పటికప్పుడు ప్రతిఘటించింది. సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే నిరాహార దీక్షకు దిగి ఇటువంటి ఓ ప్రతి పాదనను లోగడ అడ్డుకున్నారు. ప్రతిసారీ చట్ట సవరణకు చేసిన ప్రతిపాదనలు ఏదో రూపంలో చట్టాన్ని బలహీనపరచి, పారదర్శకతకు భంగం కలిగిస్తాయని పౌర సమాజం కలవరపడింది.

సవరణ వద్దని వివిధ స్థాయిల్లో ఉద్యమించింది. అందువల్ల, కేంద్రం చేసిన ఏ సవరణ ప్రయత్నమూ ఇంతకాలం ఫలించలేదు. ఒకసారైతే, కేంద్ర మంత్రివర్గం ఆమోదించినా జనాగ్రహానికి జడిసి, సవరణ బిల్లు ముసాయిదాను పార్లమెంటుకు తెచ్చే సాహసం చేయలేకపోయింది ప్రభుత్వం. ఈ సారి కూడా చట్టాన్ని సవరించకూడదని, తద్వారా సమాచార కమిషన్లు బలహీనపడి, చట్టం అమలు నీరుగారిపోతుందని ప్రజాసంఘాలు వ్యతిరేకించినా చట్ట సవరణ ప్రక్రియ ఆగలేదు. పార్లమెంటులో విపక్షం వ్యతిరేకించినా ప్రభుత్వ పట్టుదల వల్ల ఉభయసభల ఆమోదంతో ఆర్టీఐ చట్ట సవరణ జరిగిపోయింది.

సమాన హోదాలతో సమస్యేమిటి?
చట్ట ప్రకారం అఖిల భారతస్థాయి కేంద్ర సమాచార కమిషన్‌లోని ముఖ్య సమాచార కమిషనర్‌ హోదాను కేంద్ర ఎన్నికల ముఖ్య కమిషనర్‌ హోదాతో సమానంగా నిర్ణయించి, అమలు చేస్తున్నారు. ఆయా ప్రభు త్వాలు రూపొందించే రూల్స్‌లో కాకుండా ఈ అంశాల్ని మౌలికమైన చట్టంలోనే పొందుపరిచారు. ఇది 2005 నుంచి ఇలాగే ఉంది. మిగతా కేంద్ర సమాచార కమిషనర్ల హోదాను ఇతర ఎన్నికల కమిషనర్లతో సమంగా నిర్ణయించి, వేతనాలు, భత్యాలూ అదే లెక్కన చెల్లిస్తున్నారు. ఇంకొక లెక్క ప్రకారం... కేంద్ర ముఖ్య ఎన్నికల కమిషనర్‌ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానం. దాని వల్ల, ఆర్టీఐ కేంద్ర సమా చార ముఖ్య కమిషనర్‌ హోదా సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాతో సమానమౌతోందని, ఇది సముచితం కాదనేది కేంద్ర ప్రభుత్వ వాదన. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థ కాగా ఆర్టీఐ కమిషన్‌ చట్టబద్ధ సంస్థ మాత్రమే అని కేంద్రం అంటోంది.

అదే విధంగా రాష్ట్రాల్లోని ఆర్టీఐ ముఖ్య సమాచార కమిషనర్లకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమాన మైన, రాష్ట్రాల్లోని ఆర్టీఐ కమిషనర్లకు రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)తో సమానమైన హోదాను, జీత భత్యాలను ఇప్పటి వరకున్న చట్టం కల్పించింది. పైగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అయిదేళ్లు గాని, 65 ఏళ్ల వయసు వచ్చే వరకు గానీ, ఏది ముంద యితే అప్పటివరకు కేంద్ర–రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్లు పదవిలో ఉంటారు. చట్టం వచ్చిన కొత్తలో ఆదరాబాదరాగా ఇటువంటి నిర్ణయం తీసుకున్నా రని, ఇది సరికాదంటూ కేంద్ర ప్రభుత్వం పనిగట్టుకొని ప్రస్తుత సవరణ తెచ్చింది. ఈ సవరణతో ఇప్పుడు... ఆయా కమిషనర్ల హోదాలు, జీత భత్యాలు, పదవీ కాలం వంటివి నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వా నికి దఖలవుతోంది. ఇకపై రాష్ట్రాల సమాచార కమిషనర్లకు సంబంధిం చిన హోదా, పదవీకాలం, జీత భత్యాలు కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్ణ యిస్తుంది.

కమిషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకాలు, వాటి నడక, నిర్వహణ... అంతా కూడా ఇకపై కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లోకి వచ్చి నట్టే! ఇక్కడే వివాదం తలెత్తుతోంది. ప్రస్తుత సవరణల వల్ల చట్టం అమ లుకు, పారదర్శకతకు వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదని, పైగా నష్టం జరుగుతుందనేది చట్ట సవరణ వ్యతిరేకిస్తున్న వారి వాదన. అటు వంటిదేమీ ఉండదని, అనవసర హోదాలు, అస్పష్టతలు తొలగి మరింత పకడ్బందిగా చట్టం అమలుకు ఈ సవరణ పనికొస్తుందనే డొల్ల వాద నను కేంద్ర వర్గాలు వినిపించాయి.

రాజ్యాంగ సంస్థ హోదాలను చట్ట బద్ద సంస్థల్లోని వారికి కల్పించకూడదనే నిషిద్ధం కూడా ఎక్కడా లేదు. ఇప్పటికే కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ (సీవీసీ) వంటి రాజ్యాంగ సంస్థలే కాకుండా జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ), జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ), లోక్‌పాల్‌ వంటి చట్టబద్ధ సంస్థల ఛైర్మన్‌లు, సభ్యులకు కూడా రాజ్యాంగ సంస్థల్లోని వారితో సమాన హోదాలు న్నాయి. ఇలా చట్టబద్ద పదవులకు కూడా రాజ్యాంగ హోదాలతో సమాన స్థాయి కల్పించి, ఏ ఇబ్బందీ లేకుండా దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ఉదా హరణలు కోకొల్లలు. మరి వాటన్నిటినీ ఇప్పుడు మారుస్తారా? ఇక్కడ మాత్రమే ఎందుకీ మార్పు? ఇవి సహజమైన ప్రశ్నలు.

నిఘా, నిర్వహణ ఇక నిర్వీర్యమే!
దేశంలో ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి అంటే, ఈ పద్నాలుగేళ్ల కాలంలో పాలనా వ్యవస్థల్లో పారదర్శకత పెరిగింది. ఆశించిన స్థాయి ఫలితాలు అందకున్నా... ప్రభుత్వంలోని చాలా విభాగాల నుంచి పౌరులు సమాచారం పొందగలుగుతున్నారు. ఇదివరలో సమాచారం లభించడం దుర్లభమైన విభాగాల్లో కూడా నేడు పౌరులు ఆర్టీఐ కింద ఒక దరఖాస్తు పెట్టి కోరిన సమాచారం తెచ్చుకోగలుగుతున్నారు. ఇందుకు, చట్టంలో పొందుపరచిన ప్రజాసానుకూల అంశాలే కారణం. చట్టం అమలు నిఘా–నియంత్రణ సంస్థలుగా కమిషన్లు స్వేచ్చగా–స్వతం త్రంగా వ్యవహరించే వెసలుబాటు మరో బలమైన కారణం. ప్రభుత్వాల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా కమిషనర్ల హోదాలు, పదవీ కాలం, జీతభత్యాలు ఇన్నాళ్లు చట్టం నిర్దేశించినట్టు హూందాగా, నిలకడగా ఉంటూ వచ్చాయి! దాని వల్ల కమిషనర్లు... ప్రభుత్వాలకు, వారి ప్రలో భాలు–ఒత్తిళ్లకు లొంగకుండా, బెదిరింపులకు భయపడకుండా స్వేచ్ఛగా పనిచేయగలిగే వారు. ముఖ్యంగా ఆర్టీఐ కమిషనర్లకు ఎన్నికల కమి షనర్ల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయి హోదాలుండటం వల్ల ఉన్నత స్థాయి ఐఏఎస్‌. ఐపీఎస్‌ అధికారులు కూడా కమిషన్ల ఆదేశాలు పాటించే వారు. ఇక ఇప్పుడు అన్నీ కేంద్ర ప్రభుత్వం అదుపాజ్ఞల్లోకి రావడం, హోదాలు తగ్గడం వల్ల ఆర్టీఐ కమిషన్ల పనితీరు చప్పబడి పోతుంది.

ప్రస్తుత సవరణ పరోక్షంగా కమిషన్ల స్వేచ్ఛను, స్వతంత్రతను దెబ్బతీయడమే అన్న విమర్శ తలెత్తుతోంది. దీనికి పాలక బీజేపీ నుంచి సరైన సమాధానం లేదు. నిజానికి 2005లో ఈ చట్టం తెచ్చినపుడు, కమి షనర్లకు తక్కువ హోదాలతో నాటి యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రతి పాదనల్ని విపక్ష బీజేపీ వ్యతిరేకించింది. కమిషనర్లకు పెద్ద హోదాలతో, బలమైన కమిషన్లు ఉండాలని వాదించింది. నాటి పార్లమెంట్‌ స్థాయి సంఘంలో ఉన్న అయిదారుగురు బీజేపీ ఎంపీల్లో ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూడా ఉన్నారు.

ఇప్పుడు అందుకు పూర్తి భిన్నంగా వాదించింది. ఏ వాదనలెలా ఉన్నా, అంతిమ పరిణామాలను కాలమే నిర్ణయిస్తుంది. పౌరుల తెలుసుకునే హక్కు, పాలనలో పారదర్శకత విషయంలో ఆర్టీఐ ఒక విప్లవాత్మక చట్టం.  మనకున్న మంచి చట్టాల్లో ఒకటైన ఆర్టీఐ పటిష్టంగా అమలుజరగాలనే ఎవరైనా కోరుకుంటారు. పలువురు సందేహిస్తున్నట్టు ప్రస్తుత సవరణ ఈ చట్టాన్ని బలహీనపరచ కూడదు. తాజా సవరణ, తద్వారా రాగల పరిణామాలన్నీ ఆర్టీఐ చట్టాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడాలనే ఎవరమైనా కోరుకుంటాం, కోరుకోవాలి కూడా!


వ్యాసకర్త :దిలీప్‌ రెడ్డి,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు పూర్వ కమిషనర్‌
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement