ఎన్నో సందేశాలు–కొన్ని సందేహాలు | Dileep Reddy Article On CJI Office Under RTI Act | Sakshi
Sakshi News home page

ఎన్నో సందేశాలు–కొన్ని సందేహాలు

Published Fri, Nov 15 2019 12:59 AM | Last Updated on Fri, Nov 15 2019 12:59 AM

Dileep Reddy Article On CJI Office Under RTI Act - Sakshi

న్యాయ పాలనలో పారదర్శకత న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగకరమేమి కాదని రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్య కీలకం. పలువురు భావిస్తున్నట్టు ఈ తీర్పు ద్వారా భారత ప్రధానన్యాయమూర్తి/కార్యాలయాన్ని సమాచార హక్కు చట్ట పరిధిలోకి కొత్తగా తీసుకురాలేదు. ఆర్టీఐ–2005 చట్టంలో ఉన్న విషయాన్నే సందేహాలకు అతీతంగా ధర్మాసనం ఇప్పుడు ధ్రువీకరించింది. ఈ దేశంలో గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలు, తాము సమాచార హక్కు చట్ట పరిధిలోకి రామని భీష్మించుకొని వివాదం సృష్టించాయి. ఇన్నాళ్లూ సుప్రీం సీజే కార్యాలయం చేసినట్టే!  తాము ప్రజాసంస్థలు (పీఏ) కామని, అందుకే ఆర్టీఐ పరిధిలోకి రాబోమని కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ(ఎం)లు బదు లిచ్చాయి. బీజేపీ, బహుజన సమాజ్‌ పార్టీలు మొదట స్పందించనే లేదు. తమ సిద్థాంత వైరుధ్యాలకతీతంగా అన్ని పార్టీలూ ఒక్కటయ్యాయి.

ఒక తీర్పు.... అనేక సందేశాలు. కొండొకచో సందేహాలు! తనకే సంబంధించి దాదాపు పదేళ్లుగా నలుగుతున్న ఓ వివాదాన్ని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తేల్చింది. పారదర్శకత–న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తి పరస్పర విరుద్ధాంశాలు కావని, రెండూ చెయ్యిచెయ్యి జోడించి సాగాల్సిందేనని తేటతెల్లం చేసింది. న్యాయ పాలనలో పారదర్శకత న్యాయ వ్యవస్థ స్వయంప్రతిపత్తికి భంగకర మేమి కాదని రాజ్యాంగ ధర్మాసనం చేసిన వ్యాఖ్య కీలకం. పలువురు భావిస్తున్నట్టు ఈ తీర్పు ద్వారా భారత ప్రధానన్యాయమూర్తి/కార్యా లయాన్ని సమాచార హక్కు చట్ట పరిధిలోకి కొత్తగా తీసుకురాలేదు. ఆర్టీఐ–2005 చట్టంలో ఉన్న విషయాన్నే సందేహాలకతీతంగా ధర్మా సనం ఇప్పుడు ధ్రువీకరించింది. ఈ వివాదంపై కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ), ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, అదే కోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం లోగడ వెలువరించిన తీర్పులను సమర్థిస్తూ, దాన్ని విభేదించిన సుప్రీంకోర్టు కార్యాలయ వాదనను తోసిపుచ్చింది.

కానీ, అదే సమయంలో... ధర్మాసనం తన తీర్పులో అక్కడక్కడ చేసిన కొన్ని వ్యాఖ్యలు సమాచారం ఇచ్చే వెసులుబాటు కన్నా ఇవ్వకూడని ఆంక్షల పరిధిని పెంచినట్టు ధ్వనిస్తున్నాయి. ఇది కొంత ప్రమాదకరం. ఏ కోణంలో చూసినా ఈ తీర్పు పద్నాలుగేళ్ల ఆర్టీఐ ప్రస్తానంలో కీలకమైందే! ఈ తీర్పుతో... పారదర్శకతకు సంబం ధించిన కొన్ని మౌలికాంశాలపై అటు శాసన వ్యవస్థ ఇటు కార్యనిర్వా హక వ్యవస్థకు గట్టి సందేశం పంపినట్టయింది. ఇంతకాలం తన మైదానంలో స్తబ్దుగా ఉన్న బంతిని శాసనవ్యవస్థ మైదానంలోకి సుప్రీంకోర్టు నెట్టినట్టే భావించాలి. ఎందుకంటే, ఈ దేశంలో గుర్తింపు పొందిన ప్రధాన రాజకీయ పార్టీలు, తాము సమాచార హక్కు చట్ట పరిధిలోకి రామని భీష్మించుకొని వివాదం సృష్టించాయి.

ఇన్నాళ్లూ సుప్రీం సీజే కార్యాలయం చేసినట్టే!  ‘కాదు, మీరు ప్రజా సంస్థలే, సమాచారం ఇచ్చి తీరాల్సిందే...’ అని సీఐసీ ఇచ్చిన ఆదేశాల్ని అవి బేఖాతరంటున్నాయి. తాజా తీర్పు దరిమిలా ఈ వివాదం కూడా తేలాల్సిన సమయం ఆసన్నమైంది! సుప్రీం తీర్పు పరోక్షంగా రాజ కీయ వ్యవస్థపై ఒత్తిడి పెండచం ఖాయం. ఈ వివాదమూ ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ పరిధిలోనే ఉంది. అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి (సీఈసీ) నోటీసులు ఇచ్చి ఉంది. రాజకీయ పార్టీలే కాకుండా కొన్ని ప్రయివేటు సంస్థలు, ట్రస్టులు, విద్యాసంస్థలు, పబ్లిక్‌–ప్రయివేట్‌ భాగస్వామ్య సంస్థలు ఇన్నాళ్లుగా ఇదే మొండి వైఖరితో ఉన్నాయి. సమాచారం నిరాకరిస్తున్నాయి.  ఆర్టీఐ–2005 చట్ట నిర్వచనం (సెక్షన్‌ 2 హెచ్‌) ప్రకారం పబ్లిక్‌ అథారిటీస్‌ (పీఏ) అయిన సంస్థలు కూడా తామీ చట్ట పరిధిలోకి రామని తప్పించుకుంటున్నాయి. వాటి విషయంలో బాధి తులైన వారో, ఆర్టీఐ కార్యకర్తలో ఎక్కడికక్కడ న్యాయస్థానాలను సం ప్రదించి, ఈతాజా తీర్పును ఉటంకించడానికి మార్గం సుగమమైంది.

వివాదమే దురదృష్టకరం!
దేశంలోని ఎందరెందరో మేధావులు, సామాజికవేత్తలు, హక్కుల కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నట్టు ‘ఎవరూ చట్టానికి అతీతులు కారు’ అన్న బలమైన సందేశం తాజా తీర్పులో ఉంది. అస్పష్టత లేకపో యినా, సందేహం సృష్టించి వక్రమార్గంలో చట్టాన్ని అన్వ యించడానికి ఇక వీల్లేకుండా పోవాలి. భారత ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు అనే సంస్థలోని అవిభాజ్య అంగమే తప్ప స్వతంత్ర సంస్థ కాదనీ ఈ తీర్పులో పేర్కొన్నారు. అసలు వివాదం అక్కడే మొదలయింది.  సుప్రీం కోర్టు 1997లో చేసిన ఒక తీర్మానపు ప్రతిని సమాచారంగా ఇవ్వాలని హక్కుల కార్యకర్త 2007లో పెట్టుకున్న వినతిని సుప్రీంకోర్టు కార్యాలయం నిరాకరించడమే ఈ వివాదానికి బీజం. ప్రతి న్యాయమూర్తీ తన ఆస్తుల్ని వెల్లడించాలన్నది సదరు తీర్మానం. కొందరు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం –కేంద్ర ప్రభుత్వం మధ్య జరిగిన పరస్పర సంప్ర దింపుల వివరాలనూ ఆ కార్యకర్త విడిగా కోరారు. కొన్ని అవి నీతి ఆరోపణలకు సంబంధించి మద్రాసు హైకోర్టు న్యాయ మూర్తికి–సుప్రీంకోర్టుకి మధ్య జరిగిన సంప్రదింపుల సమాచారాన్నీ మరో దరఖాస్తులో కోరారు. ఈ సమాచారమేదీ ఇవ్వబోమని, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం రాజ్యాంగపరమైన సంస్థ కనుక ఆర్టీఐ చట్ట పరిధిలోకి రాదంటూ దరఖాస్తుల్ని తిరస్కరించారు. దరఖాస్తు దారు సీఐసీని సంప్రదించినపుడు చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయం (సీజేఐ) ఆర్టీఐ చట్ట పరిధిలోకి వస్తుందని, న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన వ్యక్తిగత గోప్య సమాచారమేమీ కానందున సమాచారం ఇవ్వాల్సిం దేనని సీఐసీ రెండు వేర్వేరు కేసుల్లోనూ తన నిర్ణయం ప్రక టించింది. సీజేఐ కార్యాలయం దాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. విచారణ తర్వాత అక్కడ న్యాయమూర్తి (సింగిల్‌ జడ్జి), ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం (2009లో, 2010లో)కూడా సీఐసీ నిర్ణయాన్ని సమర్థించాయి. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు కార్యాలయమే సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఇంతటి సుదీర్ఘ విచారణ, తాజా తీర్పు అని వార్యమైంది. ఈ కేసు సాగతీతలో సుప్రీం కార్యాల యమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది–శిక్షణ విభాగం(డీవోపీటీ) పాత్ర కూడా ఉంది.

రాజకీయ పార్టీలు అతీతమా?
నిత్యం ప్రజలతో మమేకమై, ప్రజల కొరకు ప్రజలనే ఆసరా చేసుకొని ప్రజా వ్యవహారాలు నడిపే రాజకీయ పార్టీలు తాము ప్రజా సంస్థలు (పబ్లిక్‌ అథారిటీ) కామని ప్రకటించుకుంటున్నాయి. పారదర్శకంగా ఉండనవసరం లేదని, పౌరులు కోరిన సమాచారం ఇవ్వబోమని వాదిస్తున్నాయి. పార్లమెంటు ద్వారా తామే తయారుచేసి, అమలు పరుస్తున్న ఓ చట్టాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగారుస్తున్నాయి. పిడివాదంతో, ఆరేళ్ల కింద సీఐసీ ఇచ్చిన ఉత్త ర్వుల్ని ఇంకా వ్యతిరేకిస్తున్నాయి. పోనీ, సీఐసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ న్యాయస్థానానికి వెళ్తున్నారా అంటే, అదీ లేదు. ఇది న్యాయ ధిక్కారమే! ఓ హక్కుల కార్యకర్త, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలను కొంత సమాచారం కోరుతూ పెట్టిన ఆర్టీఐ దరఖాస్తులకు తిరస్కరణ ఎదురవడంతో వారు సీఐసీని సంప్రదించారు. సీఐసీ ఇచ్చిన నోటీ సులకు ముందు సానుకూలంగా స్పందించిన సీపీఐ తర్వాత తన వైఖరి మార్చుకుంది. తాము ప్రజాసంస్థలు (పీఏ) కామని, అందుకే ఆర్టీఐ పరిధిలోకి రాబోమని కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ(ఎం)లు బదులిచ్చాయి. బీజేపీ, బహుజన సమాజ్‌ పార్టీలు మొదట స్పందించనే లేదు. తమ సిద్ధాంత వైరుధ్యాలకతీతంగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ మరోమారు ఒక్కటయ్యాయి. ఎన్నికల సంస్కరణల్లో భాగం గా క్రిమినల్‌ కేసులు–పోటీ అనర్హత విషయమై లోగడ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కూడా రాజకీయ పార్టీలన్నీ ఇలా ఒక్కట య్యాయి. తాము ఆర్టీఐ పరిధిలోకి రాబోమనే వాదనతో ఇప్పుడూ పార్టీలన్నీ ఐక్యంగా ఉన్నాయి. రాజకీయ పక్షాలకు లభించే విరాళాల వివరాలు, పార్టీ అంతర్గత ప్రజాస్వామ్య అవసరాల దృష్ట్యా వారి నిర్ణాయక వ్యవస్థ సమాచారం ప్రజలకు తెలియాలని సామాజిక కార్యకర్తలంటున్నారు. విరాళాల గోప్యత వల్ల ఎన్నికల అనంతరం అధికార వ్యవస్థకు–ఆశ్రిత వర్గాలకు మధ్య పరస్పర ప్రయోజన వైరుధ్యత (కాన్ల్ఫిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌) ఉంటుందనేది వారి వాదన.  ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, ఆర్టీఐ చట్ట నిర్వచనం ప్రకారం రాజకీయ పార్టీలు ప్రజా సంస్థ(పీఏ)లేనని, పౌరులు అడిగిన సమా చారం ఇవ్వాల్సిందేనని 2013 జూన్‌లో సీఐసీ నిర్ణయించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, సెక్షన్‌ 29ఎ కింద గుర్తింపు పొందిన పార్టీలన్నిం టినీ ఆర్టీఐ చట్టప్రకారం పీఏ లుగా ప్రకటించాలని కోరుతూ కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడంతో గత మార్చిలో సుప్రీంకోర్టు సంబంధితులకు నోటీసులిచ్చింది. తుదితీర్పు రావాల్సి ఉంది.

చట్టం పటిష్టతే శ్రీరామరక్ష
సమచార హక్కు చట్టం–2005 గొప్పదనమంతా ఆ చట్టం కూర్పులో ఉంది. నిర్వచనాలైనా, నిబంధనలైనా పాలకుల పక్షంలో కాక నిఖా ర్సుగా ప్రజాహితంలో ఉన్నాయి. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవలే తేల్చినా, సదరు జాగ్రత్తల్ని ఆర్టీఐ చట్టంలో పద్నాలుగేళ్ల కిందటే పొందుపరిచారు. ఏయే సంద ర్భాల్లో సమాచారం ఇవ్వనవసరం లేదో సెక్షన్‌ 8 (మిన హాయింపులు) విస్పష్టంగా చెబుతోంది. పౌరులు కోరిన సమాచారం ఇచ్చేప్పుడు న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని దృష్టిలో ఉంచు కోవాలని తాజా తీర్పులో ధర్మాసనం వ్యాఖ్య చేసింది. దాపరికం వల్ల వ్యక్తిగత గోప్యతకు లభించే రక్షణ కన్నా వెల్లడి ద్వారా విస్తృత ప్రజా ప్రయోజనాలున్నపుడే సమాచారం వెల్లడించాలని వ్యాఖ్య చేసింది. నిజా నికి ఇటువంటి చాలా విషయాల్లో చట్టంలోనే స్పష్టత ఉంది. పలు కీలకాంశాల్లో అస్పష్టతకు తావులేని విధంగా చట్టాన్ని రూపొం దించారు. వాటిని తిరిగి పార్లమెంటు వేదికగా సవరించనంత కాలం అవే చెల్లుబాటవుతాయి. అలా కాక ఇతరేతర ప్రయో జనాలనాశించే వారు తాజా తీర్పులోని వ్యాఖ్యల్ని ఇష్టానుసారం అన్వయించి, చట్టం స్ఫూర్తికి గండికొడితే ప్రమాదం! పెనంలోంచి పోయ్యిలో పడ్డట్టే!


దిలీప్‌ రెడ్డి

ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement