అక్కడా లైంగిక వేధింపులేనా?
విశ్లేషణ
సమాచార కమిషన్ ఆదేశించినట్లు తెలిసి కూడా ఆ ఫైలును పరిశీలనకు అందుబాటులో ఉంచకపోవడం అడ్డంకులు సృష్టించడమే అవుతుంది. అలా చేయడం సెక్షన్ 20 ఆర్టీఐ చట్టం కింద జరిమానా విధించ తగిన తప్పిదమవుతుంది.
మహిళల మానవ హక్కులకు భంగం కలిగితే వారి పక్షాన నిలిచి, ఆరోపణలపైన విచారణ జరిపించి న్యాయం చేయడమే జాతీయ మహిళా హక్కుల కమిషన్ విధి. జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990, సెక్షన్ 10 ప్రకారం మహిళలకు రాజ్యాం గంలో లభించిన రక్షణలు భంగపడినట్టు ఆరోపణ వస్తే పరిశోధించాలి. ఇతర చట్టాలలో హక్కులను భంగపరిచిన అధికారిక సంస్థలపైన వ్యక్తులపైన ఏం చర్యలు తీసుకున్నారని అడగాలి. తమంత తామే కూడా తమ దృష్టికి వచ్చిన హక్కుల హరణ పైన విచారణ ప్రారంభించాల్సి ఉంటుంది.
డిప్యూటీ సెక్రటరీ రాజు తమపైన లైంగిక వేధింపులు జరిపారని మెంబర్ సెక్రటరీకి ఆ కమిషన్‌లో పరిశోధనాధికారిగా పనిచేసే మహిళలు ఇద్దరు ఫిర్యాదు చేశారు. అయినా ఏమీ జరగలేదనీ, పైగా తన ఉద్యోగం ఊడబీకారని ఒక బాధిత మహిళ కేంద్ర సమాచార కమిషన్‌కు రెండో అప్పీలులో వివరించారు. కనీసం ఆర్టీఐ కింద సమాచారాన్ని కూడా ఇవ్వలేదని, కావలసిన దస్తావేజులు చూపలేదని, మొదటి అప్పీలు విచారణ జరపలేదని విన్నవించారు. లైంగిక ఆరోపణలకు గురైన అధికారి అక్కడ పాలనాధికారిగా, సమాచార మొదటి అప్పెల్లేట్ అధికారిగా ఉన్నందున, సమాచారం ఇవ్వకుండా ఆయనే అడ్డుపడుతున్నారని ఆమె పేర్కొన్నారు. సీఈసీ జూలై 16న మహిళా కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది.
సీఐసీ ఆదేశాల ప్రకారం ఇద్దరు అధికారులు వివరణ సమర్పించారు. అందులో సమాచార నిరాకరణ న్యాయమైందని చెప్పలేకపోయారు. కనుక ఇద్దరూ 25 వేల రూపాయల జరిమానా చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. సమాచార కమిషన్ ఆదేశించిన విషయం తెలిసి కూడా ఆ ఫైలును పరిశీలనకు అందుబాటులో ఉంచకపోవడం అడ్డంకులు సృష్టించడమే అవుతుందని, ఆ విధంగా అడ్డంకులు సృష్టించడం సెక్షన్ 20 ఆర్టీఐ చట్టం కింద జరిమానా విధించతగిన తప్పిదం అవుతుందని సమాచార కమిషన్ గుర్తు చేస్తూ, ఆ విధంగా ఫైలు ఎందుకు ఆపేశారో వివరించాలని మహిళా కమిషన్ అధ్యక్షురాలిని కోరింది.
బాధితురాలి ప్రకారం.. వీవీబీ రాజు డిప్యుటీ సెక్రటరీగా పదవిలోకి వచ్చినప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. సంతకాలు పెట్టడానికి ఇదివరకు ఫైళ్లను పై అధికారికి పంపడం ఆయన సంతకాలు చేయడం మామూలే. కాని ఈ రాజు ఫైళ్లపై సంతకాలకు మహిళా పరిశోధనాధికారి స్వయంగా రావాలని షరతు విధిం చారు. ఫైళ్లతో వెళితే గంటలపాటు ఎదురు చూస్తూ అక్కడే ఉండాలి. పనివేళలు ముగిసిన తరువాత కూడా ఫైళ్లతో రమ్మంటారు. నేను అధ్యక్షురాలికి ఇతర అధికారులకు ఈ విషయాలు వివరించాను. ఫైళ్లు తీసుకొని రాజువద్దకు వెళ్లక తప్పదని వారు సలహా ఇచ్చారు.
నా పనితీరుపైన ఏడేళ్లుగా ఏ ఫిర్యాదులు లేవు. పరిశోధన అధికారి పేరుతో ఉద్యోగం ఇచ్చారు. జీతం కేవలం పది వేల రూపాయలు. సంతకాలకోసం తన దగ్గరకు రావడం లేదని నా ఫైళ్లు పాడుచేసే పని ప్రారంభించారు. నేను రాజుపైన లైంగిక వేధింపుల ఆరోపణ చేసిన తరువాత నా కష్టాలు తీవ్రమైనాయి. నాపైన లేని ఫిర్యాదులు ఉన్నట్టు చూపారు. ఆ ఫిర్యాదుల ఫైల్ చూపమంటే ఇంతవరకు చూపలేదు. నాజీతం తగ్గిం చారు. నాతోపాటు ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగుల టర్మ్‌ను కొనసాగించలేదు. తరువాత కొన్నాళ్లకు ఇద్దరిని ఉద్యోగంలోకి తీసుకున్నారు. కేవలం నన్ను తొలగించడానికే ఈ కుట్ర అన్నది సుస్పష్టం. ఇకపోతే సాక్షులం దరూ కాంట్రాక్టు ఉద్యోగులు. రాజుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే ఉద్యోగం ఊడుతుంది. ఇంక్రిమెంట్లు రావు. అందుకు నా పరిస్థితే ఉదాహరణ. నీకు మద్దతుగా సాక్ష్యం చెబితే మా ఉద్యోగాలు పోతాయి బతకడం చాలా కష్టం అని నా మిత్రులంతా నాకు వివరించారు. ఒక్క రాకేశ్ రాణి మాత్రం ధైర్యంగా సాక్ష్యం చెప్పారు. కానీ ఆమె మాటలకు విలువ ఇవ్వలేదు.
రాజుకి చైర్ పర్సన్ మద్దతు ఉంది. ఆమెతో చెప్పుకున్నా ఏ ప్రయోజనం లేదు. నాతో ఎవరూ మాట్లడవద్దని చైర్ పర్సన్ ఆదేశించారు. నా ఉద్యోగం ఊడబీకే దాకా నాతో ఎవ్వరూ ఆఫీసులో మాట్లాడలేదు. నన్ను చాలా బాధపెట్టారు, వేధించారు. అంతా ఈ రాజు వల్లనే. ఈ వ్యక్తికి ఎందుకు మద్దతు ఇస్తారో తెలియడం లేదు’’ అని ఆమె వివరిస్తూంటే అరగంటదాకా సమాచార కమిషన్ విస్తుబోయింది. రాజుకూడా అక్కడే ఉన్నాడు. అతన్ని చూసిన ఆమె దుఃఖం ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. రాజు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించలేదు, తాను తప్పుచేయలేదని వివరించలేదు. మొత్తం ఫైళ్లు చూపాలని, బాధితురాలికి రూ. 50 వేలు పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. (జాతీయ మహిళా కమిషన్ కేసు CIC/NCFWO/A/2017/135800లో జూలై 26న ఇచ్చిన తీర్పు ఆధారంగా)
- మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com