
విశ్లేషణ
ఒక వ్యక్తి అనుమతి లేకుండా అతని/ఆమె జీవిత వివరాలను మెచ్చుకుంటూ లేదా విమర్శిస్తూ ప్రచురిస్తే తప్పే. ప్రభుత్వం వ్యక్తి గోప్యతను భంగపరిస్తే అది రాజ్యాంగహక్కు ఉల్లంఘనే అని జస్టిస్ జీవన్‌రెడ్డి చరిత్రాత్మక తీర్పు చెప్పారు.
గోప్యత ప్రస్తుతం ప్రాథమిక హక్కు. ఈ ప్రైవసీకి నిర్వచనం ఏమిటి? ఏమైనా పరిమితులు ఉన్నాయా? సమాచార హక్కు ఒకవైపు వెల్లడి చేయాలని ఒత్తిడి చేస్తూ ఉంటే మరొక వైపు గోప్యత వ్యక్తుల ప్రాథమిక హక్కు అని పూర్తిస్థాయి రాజ్యాంగ ధర్మాసనం వివరిం చింది. అనవసరంగా ఇంట్లో జొరబడి ప్రశాంతత చెదరగొట్టకపోవడమే ప్రైవసీ హక్కు. వారంట్ లేకుండా ఇల్లు సోదా చేయడానికి వీల్లేదు. ఇంటిచుట్టూ నిఘా పెట్టడం, అర్ధరాత్రి తలుపు తట్టడం అన్నీ గోప్యత హక్కు ఉల్లం ఘనలే, చట్టపరమైన కారణాలుంటే తప్ప.
ఆటోశంకర్ అనే కరడుగట్టిన నేరస్తుడికి ఆరు హత్యా నేరాల్లో ఉరిశిక్ష పడింది. సుప్రీంకోర్టు మరణశిక్షను తగ్గించలేదు. రాష్ట్రపతి క్షమాభిక్ష ఇవ్వలేదు. ఆ తరువాత ఆటోశంకర్ జైల్లో ఆత్మకథ రాసుకున్నాడు. అందులో తనకు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతస్థాయి పోలీసు అధికారులతో ఉన్న సత్సంబంధాలు వారిచ్చిన ప్రోత్సాహం వంటి వివరాలను పేర్కొన్నాడు. లాయర్ ద్వారా తన ఆత్మకథను నక్కీరన్ మాసపత్రికలో ప్రచురించడానికి పంపించాడు. ఆ పత్రిక సంపాదకుడు ఆర్ రాజగోపాల్ పోలీసు అధికారులతో సంబంధాలున్న నేరగాడు ఆటోశంకర్ ఆత్మకథ త్వరలో ప్రచురణ అని ప్రకటించాడు. పోలీసు అధికారుల వెన్నులో చలి మొదలైంది. ఆటోశంకర్‌ను నానాహింసలు పెట్టి తన ఆత్మకథ ప్రచురించకూడదని ఎడిటర్‌కు ఉత్తరం రాయించారు. ప్రచురిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
రాజగోపాల్‌కు అప్పటికే తమిళ పోలీసులతో చేదు అనుభవం ఉంది. మూడు భాగాలు ప్రచురించిన తరువాత ఆటోశంకర్ ఆత్మకథను నిలిపివేశాడు. తనకు ఐజీపీ జారీ చేసిన హెచ్చరికను సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. కేసు సుప్రీంకోర్టుకు చేరింది. పోలీసువారి తరఫున తమిళనాడు ప్రభుత్వం వాదిస్తూ ఆటోశంకర్ ప్రైవసీని భంగపరిచే విధంగా అతని ఆత్మకథను నక్కీరన్ ప్రచురించడానికి వీల్లేదని, పోలీసు అధికారులకు నేరస్తులతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ప్రచురణ సాగిస్తే పరువునష్టం జరుగుతుందని, కనుక ఈ ప్రచురణను నిరోధించే అధికారం ఉందని వాదించింది. ఆర్టికల్ 19(1)(ఎ) కింద ఆటోశంకర్‌కు కూడా వాక్ స్వాతంత్య్రం ఉందని, ఆ ప్రచురణ జరగకముందే నిరోధిస్తే తమ పత్రికా స్వాతంత్య్రం కూడా దెబ్బతింటుందని రాజగోపాల్ వాదించాడు.
మరణశిక్ష కోసం ఎదురుచూసే ఖైదీకి వాక్ స్వాతంత్య్రం ఉందా, అతనికి గోప్యతా హక్కు ఉంటే దానిగురించి ఎవరు మాట్లాడాలి? అతని ప్రైవసీ పేరుమీద ప్రభుత్వం వారు కోర్టుకెక్కి ఒక పత్రికా ప్రచురణను నిరోధించవచ్చా? అప్పుడు పత్రికా స్వాతంత్య్రం ఉన్నట్టా అనే ప్రశ్నల్ని సుప్రీంకోర్టు పరిశీలించింది. ఒక వ్యక్తి అనుమతి లేకుండా అతని జీవిత వివరాలను మెచ్చుకుంటూ లేదా విమర్శిస్తూ ప్రచురించినా తప్పే అవుతుంది. ప్రభుత్వం వ్యక్తి గోప్యతను, ప్రశాంతతను భంగపర్చడం రాజ్యాంగహక్కు ఉల్లంఘనే అని 1994 లో జస్టిస్ జీవన్‌రెడ్డి చరిత్రాత్మకమైన తీర్పు చెప్పారు.
యూరోపియన్ మానవహక్కుల సమావేశంలో గోప్యతను మానవహక్కుగా పరిగణించారు. ఒమ్ స్టెడ్, టైం ఇంక్ కేసులలో తీర్పులను, వారెన్, బ్రాండీస్ 1890లో రాసిన వ్యాసాన్ని ఉదహరిస్తూ గోప్యత వ్యక్తి స్వాతంత్య్రంలో భాగమని జస్టిస్ జీవన్‌రెడ్డి 23 ఏళ్ల కిందటే నిర్ధారించారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవన స్వేచ్ఛ పరిధిలో వ్యక్తిని తన మానాన తనను వదిలేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ఒక వ్యక్తి సొంత విషయాలు, అంటే కుటుంబం, వివాహం, పిల్లలను కని పెంచడం మాతృత్వం, గర్భధారణ, చదువులు మొదలైనవన్నీ వ్యక్తిగతమైన అంశాలు, ఇంటి గుట్టుకు సంబంధించినవి. వాటిగురించి అనవసరంగా ప్రచురించడం, ఆ వ్యక్తి ప్రశాంతతను దెబ్బతీయడం జీవనహక్కును ఉల్లంఘించడమే. అయితే పబ్లిక్ రికార్డ్‌లో ఉన్న అంశాలను ప్రచురిస్తే గోప్యతా భంగం కిందకు రాదు. దీనికి ఒక మినహాయింపు ఉంది. రేప్ తదితర లైంగిక నేరాలు, దాడులకు గురైన బాధితుల వివరాలు పబ్లిక్ రికార్డులో ఉన్నా ప్రచురించడం మంచిది కానందున సభ్యత ఆధారంగా పత్రికా స్వేచ్ఛపైన ఆ పరిమితి విధించడం రాజ్యాంగ బద్ధమే.
ప్రభుత్వ ఉద్యోగి, ఉన్నతాధికారి, నాయకుడు, రాజకీయ రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, తమ విధులకు సంబంధించి వ్యక్తిగత అంశాలు ప్రచురిస్తే అది గోప్యతా భంగకరం కాదని జస్టిస్ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ప్రచురించబోయే వ్యాసంలో గోప్యతను, పరువును భంగపరిచే వాక్యాలు ఉండబోతాయన్న అనుమానంతో ఆ వ్యాస ప్రచురణను నిరోధిం చాలని ఆదేశించే అధికారం ప్రభుత్వాలకు లేదని జస్టిస్ జీవన్‌రెడ్డి నిర్ధారించారు. ఒకవేళ ఆ ప్రచురణ వల్ల గోప్యత భంగపడినా, పరువునష్టమైనా చట్టపరంగా పరి ష్కారాలు కోరుతూ కోర్టుకు వెళ్లవచ్చుననీ వివరించారు.
వాక్ స్వాతంత్య్రంలో సమాచార హక్కు భాగమే. రాజ్యాంగంలో ప్రైవసీ ఆధారంగా రచనా స్వాతంత్య్రం మీద ఆంక్షలు విధించే అవకాశం లేదు. 1983లో జస్టిస్ పీఏ చౌదరి, 1994లో జస్టిస్ జీవన్‌రెడ్డి ఇచ్చిన తీర్పులు గణనీయమైనవి. గోప్యత జీవనస్వాతంత్య్రంలో భాగమని ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment