
ఆర్టీఐకి అన్నీ కష్టాలే
ఎన్నో బాలారిష్టాలను దాటి కొనసాగుతున్న సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఇంకా దినదిన గండంగానే సాగుతోంది.
ఎన్నో బాలారిష్టాలను దాటి కొనసాగుతున్న సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ఇంకా దినదిన గండంగానే సాగుతోంది. అది అమల్లోకొచ్చి పుష్కరకాలం గడు స్తోంది. అయినా దానికి సమస్యలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. పాల నలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని పెంచే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ చట్టం అందుకు పెద్దగా దోహదపడటం లేదు. కేంద్ర సమాచార హక్కు కమిషనర్ దివ్య ప్రకాష్ సిన్హా ఇటీవల వైమానిక దళ రిటైర్డ్ వింగ్ కమాండర్ దాఖలు చేసిన 1,282 అప్పీళ్లను ఒకే ఒక ఆదేశంతో తోసిపుచ్చడం ఆ చట్టం అమలవుతున్న తీరును వెల్లడి చేస్తుంది. వైమానిక దళ వ్యవస్థ ఆచరిస్తున్న కొన్ని విధానాలు అవినీతికి తావిస్తున్నా యన్నది దరఖాస్తుదారు ఆరోపణ.
ఆఫీసర్స్ మెస్ మొదలుకొని వైమానిక దళ కేంద్రాల పరిధిలో ఉన్న చెట్ల నరికివేత, దాన్నుంచి వచ్చిన ఆదాయం వరకూ ఎన్నో అంశాలపై ఆరా తీయడం వీటి సారాంశం. తాను సర్వీసులో ఉండగా వేధించిన వారిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే వీటిని దాఖలు చేశారన్నది వైమానిక దళం జవాబు. ఆయన ఆరా తీయడంలోని సహేతుకతను కేంద్ర సమాచార కమిషన్ అంగీకరించింది. నిధుల దుర్వినియోగం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసు కోవాలని, వీటికి సంబంధించి పౌరులు కోరిన సమాచారాన్ని అందజేయడానికి వీలుగా ప్రజా సమాచార అధికారుల(పీఐఓ) సంఖ్యను పెంచుకోవాలని కూడా వైమానిక దళానికి సూచించింది.
కానీ అదే సమయంలో అవినీతిపై పోరాటం నెపంతో అసాధారణమైన రీతిలో సమాచారాన్ని కోరుతూ దరఖాస్తులు దాఖలు చేయడం సరికాదని, ఇది సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధమైనదని తెలి పింది. ఏ వ్యవస్థకు సంబంధించిన లోటుపాట్లయినా అందులో పనిచేసేవారికి మాత్రమే లోతుగా తెలుస్తాయి. సామాన్యులకు ఆ అవకాశం ఉండదు. ఏదో జరుగు తున్నదని తెలిసినా దాన్ని ఆరా తీయడానికి అవసరమైన ప్రాతిపదికలపై వారికి అవగాహన ఉండకపోవచ్చు. అందువల్ల అడిగినవారు ఒకప్పుడు పనిచేసి వెళ్లారన్న కారణంతో ఉద్దేశాలు అంటగట్టి అప్పీళ్లను తోసిపుచ్చడం వల్ల చట్టం ప్రయోజనం దెబ్బతింటుంది. భవిష్యత్తులో ఇతర వ్యవస్థలు సైతం ఇలాంటి కారణాలే చూపి తప్పించుకోవడానికి ప్రయత్నించే ప్రమాదం ఉంటుంది.
వాస్తవానికి సమాచారం కోరడం ప్రాథమిక హక్కు కిందికే వస్తుందని సమా చార హక్కు చట్టం రావడానికి మూడు దశాబ్దాల పూర్వమే 1975లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే విచారకరమైన విషయమేమంటే ఆ తీర్పు ఉన్నా, అనం తరం ఆర్టీఐ చట్టం అమల్లోకొచ్చినా ఈనాటికీ సమాచారాన్ని రాబట్టడంలో సాధారణ పౌరులకు ఇబ్బందులెదువుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో ఆర్టీఐ వినియో గంలో మన దేశం ముందుంది. ఏటా దాదాపు 60 లక్షల సమాచార దరఖాస్తులు దాఖలవుతాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ చట్టం అమల్లోకి తెచ్చినప్పుడే దేశ భద్రత పేరు చెప్పి 22 సంస్థలను దీని పరిధి నుంచి తప్పించారు. అనంతర కాలంలో ఆ జాబితా మరింత పెరిగింది. మరోపక్క ఆ చట్టాన్ని గౌరవించి పౌరులు అడిగిన సమాచారం ఇవ్వడానికి ఎవరిదాకానో ఎందుకు... న్యాయ వ్యవస్థే ముందు కురావడం లేదు.
గత పదేళ్లలో సమాచారాన్ని కోరుతూ దాఖలు చేసిన పలు దరఖాస్తులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉండిపోయాయని ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో వెల్లడైంది. సుప్రీంకోర్టు ముందుకు అయిదు దరఖాస్తులు వస్తే వాటిలో రెండింటిని స్వీకరించే దశలోనే కొట్టేశారు. మరో మూడు రాజ్యాంగ ధర్మాసనం పరిశీలనకు ఎదురుచూస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీలు తాము ఈ చట్టం పరిధిలోకి రాబోమంటూ మొరాయిస్తుంటే కొన్ని ప్రభుత్వ విభాగాలు తమను దీన్నుంచి తప్పించాలని కోరుతున్నాయి. జవాబు దారీతనానికి, పారదర్శకతకు ఎవరూ సిద్ధపడటం లేదని ఈ ధోరణులు చాటు తున్నాయి.
ఎన్నికల్లో పోటీ చేసే వారి జీవిత భాగస్వాముల ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎన్నికల అఫిడవిట్లలో పొందుపర్చాలన్న నిబంధన వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని చేసిన వాదనను 2003లో సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. పౌర ప్రయోజనాలకూ, వ్యక్తిగత గోప్య తకూ మధ్య పోటీ ఎదురైనప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనమే ప్రాధాన్యత సంత రించుకుంటుందని స్పష్టం చేసింది. కానీ ప్రజా ప్రయోజనానికి సంబంధించిన అనేక అంశాల విషయంలో అన్నిచోట్లా ఇంకా సాచివేత ధోరణులే కని పిస్తున్నాయి.
ఇవన్నీ చాలవన్నట్టు ఆర్టీఐ చట్ట సవరణకు సంబంధించిన ప్రతిపాదనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. 2012లో తీసుకొచ్చిన నిబంధనలే ఆర్టీఐ దర ఖాస్తు ప్రక్రియ సంక్లిష్టంగా మార్చాయనుకుంటే తాజా ప్రతిపాదనలు ఆ చట్టాన్ని సామాన్యుడికి మరింత దూరం చేసేలా ఉన్నాయి. సమాచారం కోసం దరఖాస్తు దాఖలు చేసిన వ్యక్తి దాన్ని ఉపసంహరించుకున్నా లేదా ఆ వ్యక్తి మరణించినా అందుకు సంబంధించిన వ్యవహారక్రమాన్ని నిలిపేయవచ్చునన్న ప్రతిపాదన ప్రమాదకరమైనది. ఇప్పటికే సమాచారం కోరేవారిని బెదిరించడం, కొన్ని సంద ర్భాల్లో వారిపై దాడులు చేయడం, వారిని హతమార్చడం పెరుగుతోంది. ఇంత వరకూ గూండాలు, మాఫియాల చేతుల్లో 57మంది పౌరులు ప్రాణాలు కోల్పో యారు.
ఈ ప్రతిపాదన నిబంధనగా మారితే ఇలాంటి హత్యలు మరింతగా పెరు గుతాయని సమాచార హక్కు ఉద్యమకారులు వ్యక్తం చేస్తున్న ఆందోళన సహేతు కమైనది. నిజాలను బయటపెట్టేవారికి రక్షణ కల్పించే విజిల్‌బ్లోయర్స్ పరిరక్షణ చట్టం పార్లమెంటు ఆమోదం పొంది మూడేళ్లవుతున్నా దాన్ని అమలు చేయ కపోగా ఇలాంటి ప్రతిపాదనలు రూపొందించడం విచారకరం. ఇతర ప్రతిపాద నలు సైతం సమాచార హక్కు చట్టం స్ఫూర్తిని నీరుగార్చేవే. వీటిని యూపీఏ హయాంలో రూపొందించారు తప్ప అందుకు తాము బాధ్యులం కాదని ఎన్‌డీఏ సర్కారు చెబుతోంది. మంచిదే. అయితే పారదర్శకతకూ, జవాబుదారీతనానికీ పాతరేసే ఇలాంటి ప్రతిపాదనలను వెనక్కు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే అందరూ సంతోషిస్తారు.