ఫ్యామిలీ డాక్టర్‌ విధానం భేష్‌ | Family doctor approach is good | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ డాక్టర్‌ విధానం భేష్‌

Published Sun, Mar 3 2024 3:24 AM | Last Updated on Sun, Mar 3 2024 3:24 AM

Family doctor approach is good - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు గ్రూపు అండ్‌ ఆర్టీఐ ప్రశంస

ఈ విధానం ప్రజలకు ఆరోగ్య భద్రతనిస్తోందంటూ అభినందనలు

సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంకు గ్రూపు అండ్‌ రీసెర్చ్‌ ట్రయాంగిల్‌ ఇనిస్టిట్యూట్‌(ఆర్టీఐ) ప్రశంసించింది. ఈ ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమలవుతున్న తీరు, దాని వల్ల ప్రజలకు కలుగుతున్న ఆరోగ్య ప్రయోజనాలపై ఆ సంస్థ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అధ్యయనం నిర్వహించింది. ఆ అధ్యయనం వివరాలను శనివారం ఢిల్లీ నుంచి వీడియో సమావేశం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌రెడ్డికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వివరించారు.

రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ప్రజల ఆరోగ్య భద్రతకు ఒక భరోసాను ఇవ్వనుందని ప్రపంచ బ్యాంకు గ్రూపు ప్రతినిధి అమిత్, ఆర్టీఐ ప్రతినిధి సత్య చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం అమల్లోకి రాక ముందు అనంతర పరిస్థితులపై ఈ సంస్థ అధ్యయనం చేసి మందుల వినియోగం, రోగ నిర్ధారణ పరీక్షల సేవల పెరుగుదలను పరిశీలించింది. ఈ విధానం వచ్చాక పీహెచ్‌సీ, వీహెచ్‌సీల కంటే ఫ్యామిలీ డాక్టర్‌ వద్ద వ్యాధి నిర్థారణ పరీక్షలు, షుగర్‌ వ్యాధి, హైపర్‌ టెన్షన్‌ పరీక్షలు అధికంగా జరుగుతున్నట్టు తెలిపింది.

ఇంకా ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా నిర్వహించేందుకు ఈ సంస్థ ప్రభుత్వానికి పలు సూచనలిచ్చింది. అనంతరం సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో పాటు, మండలానికి రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామ స్థాయిలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు వంటి అనేక కీలక చర్యలు చేపట్టిందని చెప్పారు. దీనివల్ల రానున్న రోజుల్లో ఆరోగ్య శ్రీ భారం చాలా వరకూ తగ్గనుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. 

మహిళలు, బాలికల్లో పౌష్టికాహార లోప నివారణ, రక్త హీనత నివారణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె.నివాస్, ఆర్టీఐ సంస్థ ప్రతినిధులు డా.జామి, డా.గురురాజ్‌ తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement