
ఆర్‌టీఐ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ : సమాచార హక్కు (ఆర్‌టీఐ) సవరణ బిల్లు తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ ఆమోదం పొందింది. ఆర్‌టీఐని నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం సవరణ బిల్లును ప్రతిపాదించిందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఈ బిల్లును ఆర్‌టీఐ నిర్మూలన బిల్లుగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ఈ బిల్లును తదుపరి పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి నివేదించాలని డిమాండ్ చేశాయి. ఈ బిల్లును ప్రభుత్వానికి తగినంత సంఖ్యా బలం లేని రాజ్యసభలో అడ్డుకునే అవకాశం ఉంటుందని విపక్షాలు ఆశిస్తున్నాయి.
రాష్ట్ర, కేంద్రస్ధాయిలో సమాచార కమిషనర్ల వేతనాలు, కాలపరిమితికి సంబంధించిన సవరణలకు బిల్లులో చోటుకల్పించారు. ఎన్నికల కమిషన్ అధికారుల స్ధాయిలో వారికి వేతనాలు ఇవ్వచూపడం, కాలపరిమితి వంటి అంశాలను ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేలా సవరణ బిల్లులో పొందుపరిచారు. ఆర్‌టీఐ చట్టంలో ప్రస్తుతం వీటికి సంబంధించిన నిబంధనల ప్రస్తావన లేదు. కాగా ఆర్‌టీఐ కమిషనర్ల విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునేలా సవరణలు చేశారని విపక్షం ఆరోపించింది. ఆర్‌టీఐ చట్టాన్ని నీరుగార్చేలా ఈ నిబంధనలు ఉన్నాయని కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు.