లాయర్లను నిలదీసిన చట్టం | RTI Questions Lawyers | Sakshi
Sakshi News home page

లాయర్లను నిలదీసిన చట్టం

Published Fri, Jun 17 2016 12:36 AM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM

లాయర్లను నిలదీసిన చట్టం - Sakshi

లాయర్లను నిలదీసిన చట్టం

- విశ్లేషణ

న్యాయార్థులను మోసం చేసిన న్యాయవాదుల మీద బార్ కౌన్సిల్‌కు ఇచ్చిన ఫిర్యాదులు ఏమయ్యాయో తెలుసుకునే అవకాశాన్ని ఈ చట్టం  కల్పించింది. లాయర్లలో జవాబుదారీతనాన్ని తెచ్చిన ఘనత ఆర్టీఐదే.

 

న్యాయవాదులు లేకపోతే న్యాయమూర్తులు లేరు. అసలు న్యాయవ్యవస్థే లేదు. న్యాయవాదులను ఎవరూ నియమించనవసరం లేదు. పూర్తి స్వాతంత్య్రం ఉన్న వృత్తి ఏదైనా ఉన్నదీ అంటే, అది న్యాయవాద వృత్తి ఒక్కటే. ప్రతి తగాదాను దశాబ్దాల తరబడి కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలనే సంస్కృతి మన సొంతం కాదు. పంచాయతీలలో కులపెద్దల సమావేశాలలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడం తెలుసు. పరస్పర వ్యతిరేకవాదాల వ్యాజ్యం ఆంగ్లేయుల విధానం. చట్టాలన్నీ ఆంగ్లంలో ఉంటాయి. ఆంగ్లేయులు వందల ఏళ్ల కిందట పాటించినవీ, పాలించినవీ ప్రస్తుతం మనం పాటిస్తున్నాం. వారు మార్చుకున్నా, మారని పాత బ్రిటిష్ చట్టాలనే పట్టుకుని మనం వేలాడుతున్నాం. మనదేశంలో నిజం చెప్పినవాడు జైల్లో ఉంటాడు. ఒక నటుడు వేగంగా కారు నడిపి మనుషుల్ని కుక్కల్ని చంపినట్టు చంపేశాడని ఫిర్యాదు చేసిన సెక్యూరిటీ పోలీసు ఉద్యోగం కోల్పోయాడు. డబ్బు జబ్బుతో వెలిగిపోతున్న అబద్ధాలకోరులకు విజయాలు కోకొల్లలు.

 బ్రిటిష్ వారు స్వాతంత్య్ర సమరవీరుల మీద ఇష్టం వచ్చినట్టు వాడిపారేసిన రాజద్రోహ చట్టాన్ని వాళ్లు వదిలేసినా మనం ప్రత్యర్థుల మీద వాడుకుంటూనే ఉన్నాం. పరువు నష్టం నేరం సెక్షన్ కూడా మనదేశంలో 1860లో ప్రవేశపెట్టినవారు వదిలేసుకున్నారు. మనం వాడుకుంటున్నాం. కాలం తీరిన బ్రిటిష్ చట్టాలు అని మనం వారిని తిట్టాల్సిన అవసరం ప్రస్తుతం లేదు. మనల్ని మనమే తిట్టుకోవాలి. మన న్యాయశాస్త్రం ఇది.

 న్యాయ విద్యాలయాలలో లాయర్లు తయార వుతారు. ఆ కాలేజీలలో విద్యా ప్రమాణాలను కాపాడే బాధ్యత భారత న్యాయవాదుల మండలికి (బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బీసీఐ)కి అప్పగిం చారు. బీసీఐ కమిటీ కాలేజీలను తనిఖీ చేసి అనుమతిస్తేనే మనుగడ. కొనసాగే అర్హత. విద్యా బోధన విషయాలు వీరే నిర్ణయిస్తారు. మన న్యాయ విద్య ఘోరంగా పతనమైతే ప్రత్యామ్నాయంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలను ఎన్‌ఆర్ మాధవమీనన్ సృష్టించారు. అయితే రాష్ట్రానికొకటి ఉన్న ఈ విశ్వవిద్యాలయాలు ఈ దేశానికి ఏమాత్రం చాలవు. పాత న్యాయ కళాశాలలను కూడా బాగు చేసుకోవలసిందే. అవినీతికి పాల్పడి ప్రమాణాలు లేని సంస్థలకు అనుమతులిస్తే న్యాయవిద్య పతనమై, న్యాయవాదులు, వారిలోంచి వచ్చిన న్యాయమూర్తుల సమర్థత క్షీణించి, స్వతంత్రతను కోల్పోతుంది.

 2010లో న్యాయ కళాశాలలను తనిఖీ చేసిన వివరాలు కావాలని ఆర్టీఐ కింద కేఆర్ చిత్ర అనే న్యాయవాది బీసీఐని అడిగారు. తనిఖీ చేసిన వారి పేర్లు, కళాశాలల పేర్లు, నివేదికల సారాంశం ఇవ్వాలని కోరారు. వేలాది కళాశాలల తనిఖీ సమాచారం చాలా ఎక్కువ కనుక ఇవ్వలేమన్నారు. సీడీ రూపంలో మొత్తం వివరాలు కావాలని చిత్ర పట్టుపట్టారు. కనీసం కొన్ని కళాశాలలకో లేదా కొంత ప్రాంతానికో డిమాండ్‌ను పరిమితం చేయాలన్న సూచనను చిత్ర అంగీకరించలేదు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం ఇటువంటి సమాచారం ఎవరో అడగవలసిన పని లేకుండా తమంత తామే బీసీఐ ఇవ్వవలసి ఉంటుంది. ఎన్‌ఐసీ వారు తమకు సమగ్ర వెబ్‌సైట్ తయారు చేస్తున్నారనీ, అందులో ఈ సమాచారం ఉంచుతామనీ జవాబిచ్చారు. సమాచార హక్కు చట్టం వచ్చి పదేళ్లయినా, ఇంకా సొంతంగా సమగ్ర సమాచారం ఇచ్చేందుకు న్యాయవాదుల మండలే ఏర్పాట్లు చేసుకోకపోవడం ఏమాత్రం న్యాయం కాదని కమిషన్ విమర్శించింది.

 న్యాయార్థులను మోసం చేసిన న్యాయవాదుల మీద బార్ కౌన్సిల్‌కు ఇచ్చిన ఫిర్యాదులు ఏమ య్యాయో తెలుసుకునే అవకాశాన్ని సమాచార హక్కు చట్టం కల్పించింది. న్యాయవాదుల సేవాలోపాన్ని ప్రశ్నించి పరిహారం కోరుకునే అవకాశం వినియోగదారుల చట్టం కింద ఉంది. చెడు ప్రవర్తన ఆరోపణ అందిన తరువాత న్యాయవాదిపైన విచారణ జరిపి అతను వృత్తి కొనసాగించకుండా నిలిపివేసే అధికారం బార్ కౌన్సిల్‌కు ఉంది. దాని గురించి అనేక మంది న్యాయార్థులు ఆర్టీఐ కింద అడగడం ఈ మధ్య తలెత్తిన కొత్త పరిణామం. విచారణ వివరాలు, పత్రాలు, నిర్ణయంలో ఆలస్యాలు, మోసపోయిన వ్యక్తి చెప్పుకునే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. బీసీఐ న్యాయవాదులలో ప్రమాణాలను, న్యాయ కళాశాలల్లో విద్యా ప్రమాణాలను కాపాడే బాధ్యతను నిర్వర్తించవలసిన అవసరం ఉందని ఆర్టీఐ ద్వారా న్యాయార్థులు హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా లాయర్లలో జవాబుదారీతనాన్ని తెచ్చిన ఘనత ఆర్టీఐదే.

 (కేఆర్ చిత్ర వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఐసీ/ఎస్‌ఏ/ ఏ/ 2016/000023 కేసులో 7.4. 2016న సీఐసీ ఇచ్చిన తీర్పు ఆధారంగా)

 - మాడభూషి శ్రీధర్

 వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్  professorsridhar@gmail.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement