బెల్చి హత్యాకాండ బాధితుల పరామర్శకు వెళుతున్న ఇందిరాగాంధీ , మనోజ్ మిత్తా
‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు... వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు ‘క్యాస్ట్ ప్రైడ్’ రచయిత మనోజ్ మిత్తా. కులహత్యలు జరిగినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు.
కులం గురించి, అది మన వ్యవస్థలలోకి చొరబడిన విద్వేష మార్గం గురించి నాకు మరీ అంతగా తెలియదు. అదృష్టవశాత్తూ మనోజ్ మిత్తా రాసిన ‘క్యాస్ట్ ప్రైడ్: బ్యాటిల్స్ ఫర్ ఈక్వాలిటీ ఇన్ హిందూ ఇండియా’ నా చేతికి అందింది. దట్టమైన పుస్తకం అది. పుస్తకాన్ని చదువుతున్నప్పుడు అడవిని చూడలేనంతగా చెట్ల కింద కూరుకుపోయినట్లుగా ఉంది. అయితే మీరు గొప్ప పట్టుదలను కలిగి ఉంటే కనుక చదవదగిన పుస్తకమే అనిపిస్తుంది.
ఏమైనా, మనోజ్ తనకు తానుగా సత్యాన్ని గుర్తించాడని కనిపెట్టినప్పుడు మొదట నా ముఖంపై చిరునవ్వు వెలసింది. ‘‘1984లో సిక్కుల ఊచకోత, 2002లో ముస్లింలపై జరిగిన మారణకాండల మీద పుస్తకాలు రాశాక, మూడో పుస్తకాన్ని భారతదేశంలోని సామూహిక హింసపై రాయాలన్నది నా అసలు ప్రణాళిక. దళితుల హత్యలపై దృష్టి పెట్టాలన్నది నా ఉద్దేశం’’ అంటాడు మనోజ్.
అయితే ఏడేళ్ల పరిశోధన తర్వాత అతడు తెలుసుకున్నది ఏమిటంటే, ఇంకా చాలా కథే ఉందని! ‘‘దేశంలోని వివిధ వ్యవస్థల దర్యాప్తు అధికారులు, ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులు, కేసు విచారణ న్యాయమూర్తులు, పునర్విచారణ న్యాయ నిర్ణేతలు వీళ్లంతా తమ వాదనలలో, తీర్పులలో పదే పదే స్పష్టమైన కుల దురభిమానాన్ని ప్రదర్శించి కూడా అలాంటిదేమీ లేనట్లు మళ్లీ మళ్లీ ఎలా తప్పించుకోగలరో అర్థం చేసుకోడానికి ప్రత్యక్ష హింసను దాటి చూడాలన్న అవసరాన్ని నేను గ్రహించాను’’ అంటాడు మనోజ్.
అతడి ఈ గ్రహింపు సూటిగా ఉన్నది, సరళమైనది, బాధతో కూడినది. కులహత్యలు జరిగినప్పుడు, కుల మారణ కాండలు సంభవించినప్పుడు వ్యక్తులుగా, వ్యవస్థలుగా కూడా మనం దాదాపు ప్రతిసారీ ఆ హత్యల వెనుక కులపరమైన కారణాలు లేనే లేవని ఖండిస్తాం. మనోజ్ అదే రాస్తూ, ‘‘అత్యంత స్పష్టంగా కనిపించే కుల దౌర్జన్యాల వెనుక ఉన్న కులకోణాన్ని సైతం భారతదేశం దశాబ్దాలుగా తిరస్కరిస్తూనే వస్తోంది’’ అంటాడు.
కుల వివాదాలను, కుల దౌర్జన్యాలను అదుపులోకి తెచ్చేందుకు 1816–2019 మధ్య ఏ విధమైన ప్రయత్నాలు జరిగాయో తెలిపే వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘‘అంటరానితనం నిర్మూలనకు అంటూ 1950లో ఏదైతే ప్రయత్నం జరిగిందో అది... అప్పటికే అంటరానితనం నుంచి విముక్తి పొంది ఉన్నవాళ్లపై మరింతగా దిగ్భ్రాంతి కరమైన హింసాత్మక చర్యలకు ఆధిపత్య కులాలవారిని ప్రేరేపించి, సామూహిక హత్యలు అనే ఒక కొత్త దురాగతాన్ని కనిపెట్టేందుకు వారు పాల్పడేంతగా వ్యతిరేకతకు కారణమైంది’’ అని మనోజ్ రాశారు. 1968లో తమిళనాడులోని కీలవేణ్మణిలో తొలిసారి అటువంటి సామూహిక హత్యలు జరిగాయి.
మనోజ్ పేర్కొన్న దారుణాలలో నేను బాగా గుర్తెరిగినది బెల్చి హత్యాకాండ. అది జరిగినప్పుడు నా వయసు 22. ఆ భయానక ఊచకోతకు లండన్ నుంచి వెలువడే ‘ది స్పెక్టేటర్’ పత్రిక ‘ది హంటింగ్ ఆఫ్ హరిజన్’ అనే శీర్షికను పెట్టడం కన్నా కూడా నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం ఉన్నది... ఇందిరా గాంధీ చూపిన చొరవ. అర్ధరాత్రి సమయంలో రుతుపవనాలు కుండపోతగా కురుస్తున్నప్పుడు మావటి వెనుక ఏనుగుపై కూర్చొని, ఆ చీకట్లో తనను అంతా గుర్తించగలిగేలా టార్చిలైట్ల వెలుగులో బెల్చి చేరుకోవడం. ‘‘ఆ విధంగా చేయడం ద్వారా ఆమె జనాదరణను ఒడిసి పట్టుకున్నట్లయింది’’ అంటాడు మనోజ్.
ఈ పుస్తకం ద్వారా తప్ప... ఇంతవరకు నాకు తెలియందీ, నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందీ, ‘‘కులపరమైన హత్యలు జరిగిన ఘటనా స్థలాన్ని సందర్శించిన మొట్టమొదటి, బహుశా ఏకైక జాతీయ నాయకురాలు ఇందిరాగాంధీ’’ కావడం. మన తాజా రాజకీయాలపై, నిజానికి ఇప్పటి మన ప్రజాస్వామ్యంపై ఎంత కఠోర వ్యాఖ్య! మనల్ని బాధించే విషాదాలపై మన పాలకులు ఎలా çస్పందిస్తున్నారనే దానిపైన కూడా ఇది కచ్చితమైన వ్యాఖ్య.
అయితే మనోజ్ ఉద్దేశం ఇందిరాగాంధీ చొరవ గురించి చెప్పడం కాదు. బెల్చి ఘటనను మన వ్యవస్థ ఒక కులద్వేష దురాగతంగా అంగీకరించడానికి ఎందుకు ఇష్టపడలేదన్న ప్రశ్నను లేవనెత్తడం. నాడు హోమ్ మంత్రిగా ఉన్న చరణ్‌సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ... ‘‘ఈ ఘటనకు కుల, మత, భూ తగాదాలు గానీ, రాజకీయాలు గానీ కారణం కాదు. కొన్ని పత్రికల్లో వచ్చిన విధంగా సమాజంలోని బలహీన వర్గాలపై జరిగిన దౌర్జన్యం కూడా కాదు’’ అని ప్రకటించారు. జనతాపార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌ధన్ చైర్మన్‌గా ఉన్న పార్లమెంటరీ కమిటీ చరణ్ సింగ్‌తో తీవ్రంగా విభేదించింది కానీ, అది కుల దురాగతమేనని ఆయన్ని ఒప్పించలేకపోయింది.
చరణ్ సింగ్ చేసినటువంటి ఖండన ప్రకటనలు దాదాపు ప్రతిసారి కూడా మన ప్రతిస్పందనల్ని వికలపరుస్తాయని మనోజ్ వాదిస్తాడు. అగ్రవర్ణాలవారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను తిరస్కరిస్తారు. అది ప్రతి దశలోనూ జరుగుతుంది. పోలీసులు, దర్యాప్తు అధికారులు సహకరించుకోవడం, బలహీనమైన న్యాయ విచారణ, వాదనలు, తీర్పులు, సుప్రీంకోర్టుకు చేరిన పునర్విచారణల నిర్వహణలో సైతం ఈ అగ్రవర్ణ భావన పని చేస్తుందని మనోజ్ అంటాడు.
ఆఖరికి మనమెంతో గొప్పగా భావించే నాయకుల గురించి కూడా మనోజ్ చేసిన వ్యాఖ్యలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ‘‘ఈ నిర్దిష్ట సందర్భంలో ఎల్లవేళలా మహాత్ముడిలా కనిపించరు’’ అని గాంధీ గురించి, ‘‘కుల సంస్కరణలను ఆయన ప్రతిఘటించలేదు, లేదా పెద్దగా వాటి కోసం ప్రయత్నించనూ లేదు. ఆయనది అతిథి పాత్ర మాత్రమే’’ అని నెహ్రూ గురించి, చివరికి అంబేడ్కర్ గురించి కూడా – నేను ఎక్కువ వివరాలు ఇవ్వను గానీ– ‘‘ఆయన కథేమీ ఆశ్చర్యాలు లేనిదైతే కాదు’’ అని అంటూ... ‘‘స్వాతంత్య్ర సమరయోధులు తప్పనిసరిగా సమానత్వ ఉద్యమశీలురు కావాలనేముంది?’’ అని ముగిస్తాడు మనోజ్. పుస్తకం గురించి నా ఏకైక విమర్శ ఏమిటంటే... చదివేందుకు ఇది కొంచెం తేలికగా ఉండవలసిందనీ, పేజీలు పొంగిపొర్లేలా వివరాలు ఇవ్వడం వల్ల పుస్తకంలో ప్రధాన సందేశాన్ని తరచు అవి మరుగున పడేస్తున్నాయనీ. అయినప్పటికీ అది మనం వినవలసిన, మనం గుర్తుంచుకోవలసిన సందేశమే.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment