మంచి అధికారులకు రక్ష... ఆర్టీఐ
విశ్లేషణ
తొమ్మిదిమంది నేరస్తులు తప్పించుకున్నా.. ఒక్క అమాయకుడు కూడా శిక్షకు గురి కారాదనేది నేర న్యాయ సిద్ధాంతం. తొమ్మిదిమంది అవినీతిపరులు తప్పించుకున్నా.. ఒక్క నీతిమంతుడు కూడా బలి కాకూడదన్నది ఆర్టీఐ సూత్రం.
అవినీతిపై యుద్ధానికి ఉత్సా హంతో ఉరకలేసే ఒక యువ అధికారి పదవి స్వీకరించగానే, అధికారుల అవినీతిపై చర్యలు ప్రారంభించాడు. డజన్ల కొద్దీ అధికారులు, వారి సిబ్బంది, వారి వెనక ఉన్న నాయకులు దొరికిపోయారు. పలువురు అధికారులు సస్పెండ్ అయ్యారు. వారికి సహకరించే నేతలు కూడా నింది తులుగా నిలబడవలసివచ్చింది. ఈ అధికారి మీద పగతో వారిలో ఐకమత్యం పెరిగింది. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి ఉద్యోగం తొలగించడానికి రంగం సిద్ధం చేశారు. సస్పెండ్ చేశారు.
ఐఎఫ్‌ఎస్ పరీక్షలో రెండో ర్యాంక్ సాధించి, తరు వాత శిక్షణలో రెండు బంగారు పతకాలు గెలిచిన ఆ యువ అధికారి అడవుల విధ్వంసాన్ని, లంచగొండి తనాన్ని వెలికి తీశాడు. సరస్వతి వన్యమృగ కేంద్రంలో నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లు చెట్లు కొట్టి అడవులను నాశనం చేశారని సాక్ష్యాలతో సహా నివేదిక ఇచ్చాడు. వెంటనే ఆయనను ఫతేబాద్ అనే మారుమూల ప్రాంతా నికి బదిలీ చేశారు. హర్బల్ పార్క్ పేరుతో ప్రజల ధనాన్ని వెచ్చించి ఒక రాజకీయ నాయకుడి భూమిలో నిర్మాణం చేయడాన్ని అక్కడ బహిర్గతం చేశాడు. ఆ అధికారిపై బెదిరించాడని, చెట్టు దొంగతనం చేశాడని తప్పుడు కేసులు పెట్టారు. సస్పెండ్ చేశారు. రాష్ట్రపతి జోక్యంతో సస్పెన్షన్ రద్దయింది. అతని క్యాడర్‌కు చెందకపోయినా మేవట్ డీఎఫ్‌ఓగా బదిలీ చేశారు. క్యాట్ ఆదేశంతో అది ఆగింది. అప్పుడు ఝజర్‌కు బదిలీ చేశారు.
మూడేళ్ల ఆలస్యంగా ఒక ఆరోపణ చేస్తూ క్రమ శిక్షణా చర్యలు ప్రారంభించారు. ప్రమోషన్ నిలిపివేయ డానికి ఈ కుట్ర. దొంగ ప్లాంటేషన్ లెక్కలు చూపి కోట్లాది రూపాయలు ఝజర్‌లో మాయం చేసిన విషయం ఈ అధికారి బయట పెట్టారు. ఆ కుంభ కోణంలో 40 మంది సస్పెండ్ అయ్యారు. వారిలో ఒకరి ఆత్మహత్యకు ఈ అధికారే కారణమని దొంగ కేసు పెట్టారు. తన కుమారుడి మరణానికి ఒక మహిళ కారణమని అతడి తండ్రి ఫిర్యాదు చేసినా, మద్యం మత్తులో ఆత్మహత్యకు పాల్పడ్డాడని నివేదికలు వెల్లడించినా, పగతో ఈ అధికారి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఆర్టీఐ కింద సాధించిన ఫైల్ నోటింగ్స్‌లో తేలినదేమంటే ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని ఝజ్జర్ నుంచి ఆయనను హిసార్‌కు బదిలీ చేసారని. ఆ అధికారి హిసార్‌లో బయట పెట్టిన మరో స్కామ్‌లో ముఖ్యమంత్రి సన్నిహిత అధికారులు ఉన్నారని వెల్లడయింది. ఇంకో ఘటనలో రూ. 22 లక్షల లైసెన్స్ ఫీజు బదులు రూ.26 వేలే వసూలు చేసిన అక్రమాన్ని బయటపెట్టి రెండు పెద్ద ప్లైవుడ్ యూనిట్లు మూసేయించినందుకు మరోసారి బదిలీ చేశారు.
ఆ అధికారి రాజ్యాంగ బాధ్యతలను నిర్వహించి నందుకు భ్రష్టాచార పాలక అధికారగణం అతన్ని వేధిస్తోందని పర్యావరణ శాఖ నియమించిన ఇద్దరు ఉన్నతాధికారుల కమిటీ నిర్ధారించింది. ఇవన్నీ వెల్లడించినందుకు పగబట్టి సస్పెండ్ చేశారని దర్యాప్తులో తేలింది. కోట్ల రూపాయల ప్లాంటేషన్ కుంభకోణం బయటపెట్టినందుకు ఆయన్ను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇందులో రాష్ట్ర సీఎం, కొందరు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు కూడా భాగస్వాములనీ ఆ కమిటీ తేల్చింది. ఆయన సస్పెన్షన్ ఉపసంహరించి కేసులన్నీ ఎత్తివేయాలని, ఆయన పేర్కొన్న అవినీతి అధికారుల మీద, వారికి సహకరించిన రాజకీయ నేతల మీద సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని సూచించింది. తరువాత ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఈ అంశాలను తమ నిఘా నివేదికలో ధ్రువీకరించింది. రాష్ట్రపతి జోక్యంచేసుకుని ఈ అధికారిని రక్షించవలసి వచ్చింది.
ఈ మొత్తం క్రమంలో అడుగడుగునా ఆ అధికారిని ఆర్టీఐ రక్షించింది. దాదాపు డజనుకు పైగా ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా తనకు సంబంధించిన దస్తావేజులలోని కీలకపత్రాలను ఆయన సాధించారు. వాటి ఆధారంగా కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో, ఢిల్లీ హైకోర్టులో, çసుప్రీంకోర్టులో, మంత్రులు, ముఖ్యమంత్రి ముందు తన వాదాన్ని వినిపించుకుని రుజువుచేసు కుంటూ పోరాడగల్గుతున్నారు. ఏసీఆర్, ఇంక్రిమెంట్, క్యాడర్ మార్పు, ప్రమోషన్‌ల కోసం, చివరకు తనకు ఏదైనా ఒక పని ఇవ్వండి అని ఆయన పోరాడుతున్నారు.
ఆయన తనపై పగబట్టిన వారి అవినీతిని భ్రష్టా చారాన్ని బయటపెట్టే ఆ ఐబీ నివేదిక ప్రతిని ఇవ్వాలని ఆర్టీఐ కింద పర్యావరణ మంత్రిత్వ శాఖను అడిగారు. ఆ శాఖ సమాచార అధికారి ఐబీ సంస్థ అనుమతి కోరారు. ఐబీ అధికారులు ఇవ్వరాదన్నారు. ఆ ప్రాతిపదికన వీరు ఇవ్వం పొమ్మన్నారు. ఆయన రెండో అప్పీలులో సీఐసీ ముందుకు వచ్చారు. తమ సంస్థకు సెక్షన్ 24 కింద ఆర్టీఐ పరిధినుంచి మినహాయింపు ఉంది కనుక తాము ఇవ్వబోమని పర్యావరణ మంత్రిత్వ శాఖ వాదించింది. అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనకు చెందిన సమాచారం ఆ సంస్థలు కూడా ఇవ్వాల్సిందేననే మినహా యింపు కింద తనకు నిఘా నివేదిక ప్రతిని ఇవ్వాలని ఆ అధికారి కోరారు. అంతిమంగా ఐబీని, పర్యావరణ మంత్రిత్వ శాఖను సదరు నివేదిక ఇచ్చి తీరాలని కమిషన్ ఆదేశించింది. దుర్వినియోగం నుంచి ఆర్టీఐని మనం రక్షించుకుంటే ఆర్టీఐ కూడా మనను రక్షిస్తుంది.
(ఎస్.సి. వర్సెస్ పర్యావరణ మంత్రిత్వ శాఖ కేసులో 21.4.2016న కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా)
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్
professorsridhar@gmail.com