madabhushi sridher
-
ఆ ఎమ్మెల్యేలకు పదవులు గడ్డిపోచలా?
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఉన్న ఎమ్మెల్యేల బలం సరిపోదు. తమ బలం ఫిరాయింపులతో పెరగాలి లేదా ప్రభుత్వ పక్షాన్ని రాజీనామాలతో తగ్గించాలని పథకం వేశారు. ఫిరాయిస్తే కోట్లిస్తాం, మంత్రి పదవిస్తాం అంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్, జనతాదళ్ ఎమ్మెల్యేలతో మాట్లాడిన టెలిఫోన్ రికార్డులు బయటపడినా భయపడకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జనతాదళ్ ఎమ్మెల్యేలు ‘వారంతట వారే’ పదవులను గడ్డిపోచల వలె వదిలించుకునేందుకు పథకం వేశారు. ప్రత్యేక విమానం, లగ్జరీ బస్సుల్లో ‘సొంత’ ఖర్చుతో ముంబై వెళ్లిపోయారు. పాపం శివకుమార్ పరుగెత్తి విమానాశ్రయం చేరుకునేటప్పటికే ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో ఎగిరిపోయారు. బీజేపీ వారి సర్కార్‌లో మంత్రిపదవి అయితే రెండుమూడు సౌకర్యాలు ఉంటాయి. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే సర్కారు ఉంటుంది కనుక చాలా హాయి. మంత్రి పదవి ఉంటే సహజంగానే నాలుగురాళ్లు వెనకేసుకోవాలి కదా. అప్పుడు ఆదాయ పన్నువారు, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్లు íసీవీసీ వారు దాడులు చేయకుండా ఊరుకుంటారా? బీజేపీ మంత్రి పదవితో పోల్చితే సంకీర్ణ మంత్రిపదవిలో ప్రమాదాలు ఎక్కువ. పరువు, పదవీ పోయి జైలు దక్కవచ్చు. మరి ఈ శివకుమార్ మాట్లాడేదేముం టుంది? శివకుమార్, కుమార స్వామి, సిద్దరామయ్యకు ఎటూపాలు పోవడం లేదు. రాజీనామా వ్యూహం అద్భుతమైంది. అందులో వచ్చే సౌకర్యమేమంటే ఎవరూ అన్యాయం.. రాజ్యాంగ వ్యతిరేకం అని అరిచే అవకాశాలు లేవు. ఎవరి అభ్యంతరం లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. సభలో ఉండి ఓటువేసే వారిలో సగానికి ఒకరెక్కువ ఉంటే చాలు అని మన సంవిధానం చెబుతున్నది కదా. కనుక రాజీనామాలు చేయించేస్తే మళ్లీ ఉపఎన్నికలు జరిగేదాకా మన రాజ్యానికి తిరుగులేదనే వ్యూహంతో యడ్యూరప్ప, వారి అనుయాయులు, ఆపైన ఢిల్లీ నాయకులు కర్ణాటక సింహాసనం మీద కూర్చోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఉపఎన్నికలు జరిగే దాకా ఈ అంకెమారదు, అయితే మనవాళ్లను గెలిపించుకోవడం ఎంత సేపు? జనం కమలం మీద ఓట్లు గుద్దడానికి ఉవ్విళ్లూరుతున్నారు కదా. జనతాదళ్, కాంగ్రెస్ కలిసి పోటీచేసినా సీనియర్ నేత మాజీ ప్రధాని దేవెగౌడనే గెలిపించుకోలేని వారు ఉప ఎన్నికల్లో గెలువగలుగుతారా? ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలో పాపం జనతాదళ్‌కు, కాంగ్రెస్‌కు తెలియడం లేదు. శాసనసభలో అసలు బలం 224 అయినా 16 మంది రాజీనామాలు ఆమోదిస్తే అది 208కి పడిపోయి 105 మంది ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని బీజేపీ ఆశ. కాంగ్రెస్, జనతాదళ్ సంకీర్ణ బలం వందకు తగ్గిపోతుంది. తిరుగుబాటు ఎమ్మె ల్యేలను కలుసుకోవడానికి శివకుమార్ ముంబైకి వెళ్లినా ప్రయోజనం లేకపొయింది. 1995లో తెలుగుదేశం వారి ఫిరాయింపు ఇంజినీర్లు చెలరేగిన కాలంలో వైస్రాయ్ హోటల్‌కు తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్‌నే రానీయనట్టు, శివకుమార్‌ను అరెస్టు చేసి పంపించారు. ఆ విధంగా న్యాయం, ధర్మం, రాజ్యాంగం, పోలీసులు, పొరుగు ప్రభుత్వాలు కూడా ఎమ్మెల్యేల రాజీనామా స్వేచ్ఛను కాపాడడానికి కృషి చేస్తున్నారు. కర్ణాటక శాసన సభాపతి ‘వీరు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా? ఇవి నిజమైన రాజీనామా లేనా?’ అని అనుమానిస్తున్నారు. ఆ విధంగా అనుమానించడం స్పీకర్ రాజ్యాంగ బాధ్యత. రాజీనామా ఎందుకు చేస్తున్నారో స్పీకర్‌కు చెప్పాల్సిన పని లేదు. కానీ అది నిజమైన స్వచ్ఛందమైన రాజీనామా అని స్పీకర్‌కు విశ్వాసం కలగాలి. అందుకు ఆయన తనకు తోచిన విధంగా ఎంక్వయిరీ చేసుకోవచ్చు అని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. స్పీకర్ కు కాకపోయినా ఓటర్లకు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఎందుకు బాగోలేదు, వారి తప్పులను ఇదివరకు ఎప్పుడైనా ఎత్తి చూపారా? రాజీనామా చేస్తే తప్ప కర్ణాటక ప్రభుత్వం బాగుపడదని ఎప్పుడు తెలిసింది. ఈ జ్ఞానోదయం ముంబై హోటల్‌కు వెళ్లడానికి ముందు కలగకపోవడం కూడా ఆశ్చర్యమే కదా, అయినా పదిమందికలిసి ఒకే బస్సులో వెళ్తున్నా అది ఒక్కొక్కరు వ్యక్తిగతంగా సొంతంగా ఆలోచించి ఏ కుట్రా లేకుండా ఏదురుద్దేశమూ లేకుండా నిర్ణయించుకు న్నారని ఏ విధంగా అనుకుంటారని స్పీకర్ అనుమానిస్తున్నారు.అయిదేళ్లకోసం ఎన్నుకున్న ప్రజలకు, పార్టీకి ద్రోహం చేస్తూ మధ్యంతరంగా వదిలేయడం ఊరికే జరగదు. బలీయమైన అసలు కారణాలను దాచే శారు. సభ్యత్వాలను గడ్డిపోచగా భావించి వదులు కుంటూంటే ఆపుతారా అని స్పీకర్‌ను కోప్పడాలని ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును అడుగుతున్నారు. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
‘ఎంపీల్యాడ్స్’పై పారదర్శకత
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు తమ ఎంపీల్యాడ్స్ (స్థానికప్రాంత అభివృద్ధి పథకం) నిధులను ఖర్చుచేసే విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు చట్టబద్ధ నిబంధనావళిని రూపొందించాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కార్యాలయాలను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. నిధుల ఖర్చులో పారదర్శకతతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు తదితర అంశాలను ఇందులో చేర్చాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చెరో 10 మంది ఎంపీలు తమ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతీ ఎంపీకి ఏటా రూ.5 కోట్ల చొప్పున నియోజకవర్గం అభివృద్ధికి కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కేంద్రం కేటాయిస్తున్న నిధుల్లో ప్రతిఏటా రూ.12,000 కోట్లు వినియోగం కావ ట్లేదు.ఈ నేపథ్యంలో ఎంపీల్యాడ్స్ నిధుల నుం చి తమ పార్లమెంటు సభ్యులు ఎంత ఖర్చు చేశారన్న సమాచారం లభ్యం కాకపోవడంపై ఇద్దరు వ్యక్తులు సీఐసీని ఆశ్రయించారు. సమాచారం ఎందుకు లేదు? ఈ పిటిషన్లను విచారించిన సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు.. ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంపై తమవద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ చెప్పడాన్ని తప్పుపట్టారు. ఎంపీలకు నిధులు కేటాయిస్తున్నప్పుడు.. వారి ఖర్చుల వివరాలను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంపీలు ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేశారన్న సమాచారం జిల్లా యంత్రాంగాల వద్దే ఉంటుందన్న కేంద్రం వాదనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలందరూ నియోజకవర్గాల వారీగా ఏయే పనులు చేపట్టారు? వాటికి ఎంత ఖర్చు చేశారు? దీని కారణంగా ఎవరికి లబ్ధి చేకూరింది? పనులు పూర్తి కాకపోవడానికి గల కారణం ఏంటి? ఏయే దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారు? తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఏటా దాదాపు రూ.12,000 కోట్లు నిరుపయోగం అవుతున్నాయన్న ప్రభుత్వ నివేదికపై స్పందిస్తూ.. ఈ నిధులను పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంతో వినియోగించేలా చట్టబద్ధమైన నిబంధనావళిని రూపొందించాలని ఉభయ సభాధిపతుల కార్యాలయాలకు సూచించారు. గతేడాది 298 మంది ఎంపీలు తమ ఎంపీల్యాడ్స్ నిధులను వాడుకోకపోవడం, వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి చెరో 10 మంది ఎంపీలు ఉండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకుండా, సొంత పనులకు వాడుకోకుండా, పనులకు ప్రైవేటు ట్రస్టులకు, అనర్హులైన, సామర్థ్యంలేని సంస్థలకు కట్టబెట్టే చర్యలను నియంత్రించేలా నిబంధనలు రూపొందించాలని శ్రీధర్ చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే విధించే శిక్ష, జరిమానాలపై కూడా నిబంధనావళిలో స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ మేరకు 54 పేజీల ఉత్తర్వులను జారీచేశారు. తెలియజేయడం ఎంపీల బాధ్యత తన పదవీకాలం పూర్తయ్యాక ప్రతీ ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంపై ఉభయసభల అధిపతులకు సమగ్ర నివేదికను సమర్పించేలా చూడాలన్నారు. సమాచారహక్కు చట్టం కింద ఈ వివరాలను తమ నియోజకవర్గాల ప్రజలకు తెలియజేయడం ఎంపీల బాధ్యతని శ్రీధర్ ఆచార్యులు వ్యాఖ్యానించారు. పారదర్శకతను సాధించేందుకు పార్లమెంటు కార్యాలయ సిబ్బంది, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సిస్టమ్స్ సాయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీల్యాడ్స్ నిధుల ఖర్చు వివరాలను రాజకీయ పార్టీలు, ఎంపీలు తమ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయాలనీ, సోషల్‌మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. దీనివల్ల నిధుల దుర్వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాలవారీగా పార్లమెంటు సభ్యులు ఏయే పనులను, ఎం తెంత వ్యయంతో చేపట్టారు? వాటి పురోగతి ఏంటి? తదితర వివరాలను జిల్లా యంత్రాంగాలు తమ వెబ్సైట్లలో అప్డేట్ చేస్తూ ఉండాలని శ్రీధర్ ఆచార్యులు ఆదేశించారు. -
మంచి అధికారులకు రక్ష... ఆర్టీఐ
విశ్లేషణ తొమ్మిదిమంది నేరస్తులు తప్పించుకున్నా.. ఒక్క అమాయకుడు కూడా శిక్షకు గురి కారాదనేది నేర న్యాయ సిద్ధాంతం. తొమ్మిదిమంది అవినీతిపరులు తప్పించుకున్నా.. ఒక్క నీతిమంతుడు కూడా బలి కాకూడదన్నది ఆర్టీఐ సూత్రం. అవినీతిపై యుద్ధానికి ఉత్సా హంతో ఉరకలేసే ఒక యువ అధికారి పదవి స్వీకరించగానే, అధికారుల అవినీతిపై చర్యలు ప్రారంభించాడు. డజన్ల కొద్దీ అధికారులు, వారి సిబ్బంది, వారి వెనక ఉన్న నాయకులు దొరికిపోయారు. పలువురు అధికారులు సస్పెండ్ అయ్యారు. వారికి సహకరించే నేతలు కూడా నింది తులుగా నిలబడవలసివచ్చింది. ఈ అధికారి మీద పగతో వారిలో ఐకమత్యం పెరిగింది. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి ఉద్యోగం తొలగించడానికి రంగం సిద్ధం చేశారు. సస్పెండ్ చేశారు. ఐఎఫ్ఎస్ పరీక్షలో రెండో ర్యాంక్ సాధించి, తరు వాత శిక్షణలో రెండు బంగారు పతకాలు గెలిచిన ఆ యువ అధికారి అడవుల విధ్వంసాన్ని, లంచగొండి తనాన్ని వెలికి తీశాడు. సరస్వతి వన్యమృగ కేంద్రంలో నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లు చెట్లు కొట్టి అడవులను నాశనం చేశారని సాక్ష్యాలతో సహా నివేదిక ఇచ్చాడు. వెంటనే ఆయనను ఫతేబాద్ అనే మారుమూల ప్రాంతా నికి బదిలీ చేశారు. హర్బల్ పార్క్ పేరుతో ప్రజల ధనాన్ని వెచ్చించి ఒక రాజకీయ నాయకుడి భూమిలో నిర్మాణం చేయడాన్ని అక్కడ బహిర్గతం చేశాడు. ఆ అధికారిపై బెదిరించాడని, చెట్టు దొంగతనం చేశాడని తప్పుడు కేసులు పెట్టారు. సస్పెండ్ చేశారు. రాష్ట్రపతి జోక్యంతో సస్పెన్షన్ రద్దయింది. అతని క్యాడర్‌కు చెందకపోయినా మేవట్ డీఎఫ్ఓగా బదిలీ చేశారు. క్యాట్ ఆదేశంతో అది ఆగింది. అప్పుడు ఝజర్కు బదిలీ చేశారు. మూడేళ్ల ఆలస్యంగా ఒక ఆరోపణ చేస్తూ క్రమ శిక్షణా చర్యలు ప్రారంభించారు. ప్రమోషన్ నిలిపివేయ డానికి ఈ కుట్ర. దొంగ ప్లాంటేషన్ లెక్కలు చూపి కోట్లాది రూపాయలు ఝజర్‌లో మాయం చేసిన విషయం ఈ అధికారి బయట పెట్టారు. ఆ కుంభ కోణంలో 40 మంది సస్పెండ్ అయ్యారు. వారిలో ఒకరి ఆత్మహత్యకు ఈ అధికారే కారణమని దొంగ కేసు పెట్టారు. తన కుమారుడి మరణానికి ఒక మహిళ కారణమని అతడి తండ్రి ఫిర్యాదు చేసినా, మద్యం మత్తులో ఆత్మహత్యకు పాల్పడ్డాడని నివేదికలు వెల్లడించినా, పగతో ఈ అధికారి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆర్టీఐ కింద సాధించిన ఫైల్ నోటింగ్స్లో తేలినదేమంటే ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని ఝజ్జర్ నుంచి ఆయనను హిసార్‌కు బదిలీ చేసారని. ఆ అధికారి హిసార్‌లో బయట పెట్టిన మరో స్కామ్‌లో ముఖ్యమంత్రి సన్నిహిత అధికారులు ఉన్నారని వెల్లడయింది. ఇంకో ఘటనలో రూ. 22 లక్షల లైసెన్స్ ఫీజు బదులు రూ.26 వేలే వసూలు చేసిన అక్రమాన్ని బయటపెట్టి రెండు పెద్ద ప్లైవుడ్ యూనిట్లు మూసేయించినందుకు మరోసారి బదిలీ చేశారు. ఆ అధికారి రాజ్యాంగ బాధ్యతలను నిర్వహించి నందుకు భ్రష్టాచార పాలక అధికారగణం అతన్ని వేధిస్తోందని పర్యావరణ శాఖ నియమించిన ఇద్దరు ఉన్నతాధికారుల కమిటీ నిర్ధారించింది. ఇవన్నీ వెల్లడించినందుకు పగబట్టి సస్పెండ్ చేశారని దర్యాప్తులో తేలింది. కోట్ల రూపాయల ప్లాంటేషన్ కుంభకోణం బయటపెట్టినందుకు ఆయన్ను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇందులో రాష్ట్ర సీఎం, కొందరు మంత్రులు, అధికారులు, ఉద్యోగులు కూడా భాగస్వాములనీ ఆ కమిటీ తేల్చింది. ఆయన సస్పెన్షన్ ఉపసంహరించి కేసులన్నీ ఎత్తివేయాలని, ఆయన పేర్కొన్న అవినీతి అధికారుల మీద, వారికి సహకరించిన రాజకీయ నేతల మీద సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని సూచించింది. తరువాత ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఈ అంశాలను తమ నిఘా నివేదికలో ధ్రువీకరించింది. రాష్ట్రపతి జోక్యంచేసుకుని ఈ అధికారిని రక్షించవలసి వచ్చింది. ఈ మొత్తం క్రమంలో అడుగడుగునా ఆ అధికారిని ఆర్టీఐ రక్షించింది. దాదాపు డజనుకు పైగా ఆర్టీఐ దరఖాస్తుల ద్వారా తనకు సంబంధించిన దస్తావేజులలోని కీలకపత్రాలను ఆయన సాధించారు. వాటి ఆధారంగా కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో, ఢిల్లీ హైకోర్టులో, çసుప్రీంకోర్టులో, మంత్రులు, ముఖ్యమంత్రి ముందు తన వాదాన్ని వినిపించుకుని రుజువుచేసు కుంటూ పోరాడగల్గుతున్నారు. ఏసీఆర్, ఇంక్రిమెంట్, క్యాడర్ మార్పు, ప్రమోషన్ల కోసం, చివరకు తనకు ఏదైనా ఒక పని ఇవ్వండి అని ఆయన పోరాడుతున్నారు. ఆయన తనపై పగబట్టిన వారి అవినీతిని భ్రష్టా చారాన్ని బయటపెట్టే ఆ ఐబీ నివేదిక ప్రతిని ఇవ్వాలని ఆర్టీఐ కింద పర్యావరణ మంత్రిత్వ శాఖను అడిగారు. ఆ శాఖ సమాచార అధికారి ఐబీ సంస్థ అనుమతి కోరారు. ఐబీ అధికారులు ఇవ్వరాదన్నారు. ఆ ప్రాతిపదికన వీరు ఇవ్వం పొమ్మన్నారు. ఆయన రెండో అప్పీలులో సీఐసీ ముందుకు వచ్చారు. తమ సంస్థకు సెక్షన్ 24 కింద ఆర్టీఐ పరిధినుంచి మినహాయింపు ఉంది కనుక తాము ఇవ్వబోమని పర్యావరణ మంత్రిత్వ శాఖ వాదించింది. అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనకు చెందిన సమాచారం ఆ సంస్థలు కూడా ఇవ్వాల్సిందేననే మినహా యింపు కింద తనకు నిఘా నివేదిక ప్రతిని ఇవ్వాలని ఆ అధికారి కోరారు. అంతిమంగా ఐబీని, పర్యావరణ మంత్రిత్వ శాఖను సదరు నివేదిక ఇచ్చి తీరాలని కమిషన్ ఆదేశించింది. దుర్వినియోగం నుంచి ఆర్టీఐని మనం రక్షించుకుంటే ఆర్టీఐ కూడా మనను రక్షిస్తుంది. (ఎస్.సి. వర్సెస్ పర్యావరణ మంత్రిత్వ శాఖ కేసులో 21.4.2016న కమిషన్ ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ professorsridhar@gmail.com