సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు తమ ఎంపీల్యాడ్స్ (స్థానికప్రాంత అభివృద్ధి పథకం) నిధులను ఖర్చుచేసే విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు చట్టబద్ధ నిబంధనావళిని రూపొందించాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కార్యాలయాలను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. నిధుల ఖర్చులో పారదర్శకతతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు తదితర అంశాలను ఇందులో చేర్చాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చెరో 10 మంది ఎంపీలు తమ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతీ ఎంపీకి ఏటా రూ.5 కోట్ల చొప్పున నియోజకవర్గం అభివృద్ధికి కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కేంద్రం కేటాయిస్తున్న నిధుల్లో ప్రతిఏటా రూ.12,000 కోట్లు వినియోగం కావ ట్లేదు.ఈ నేపథ్యంలో ఎంపీల్యాడ్స్ నిధుల నుం చి తమ పార్లమెంటు సభ్యులు ఎంత ఖర్చు చేశారన్న సమాచారం లభ్యం కాకపోవడంపై ఇద్దరు వ్యక్తులు సీఐసీని ఆశ్రయించారు.
సమాచారం ఎందుకు లేదు?
ఈ పిటిషన్లను విచారించిన సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు.. ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంపై తమవద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ చెప్పడాన్ని తప్పుపట్టారు. ఎంపీలకు నిధులు కేటాయిస్తున్నప్పుడు.. వారి ఖర్చుల వివరాలను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంపీలు ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేశారన్న సమాచారం జిల్లా యంత్రాంగాల వద్దే ఉంటుందన్న కేంద్రం వాదనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎంపీలందరూ నియోజకవర్గాల వారీగా ఏయే పనులు చేపట్టారు? వాటికి ఎంత ఖర్చు చేశారు? దీని కారణంగా ఎవరికి లబ్ధి చేకూరింది? పనులు పూర్తి కాకపోవడానికి గల కారణం ఏంటి? ఏయే దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారు? తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఏటా దాదాపు రూ.12,000 కోట్లు నిరుపయోగం అవుతున్నాయన్న ప్రభుత్వ నివేదికపై స్పందిస్తూ.. ఈ నిధులను పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంతో వినియోగించేలా చట్టబద్ధమైన నిబంధనావళిని రూపొందించాలని ఉభయ సభాధిపతుల కార్యాలయాలకు సూచించారు.
గతేడాది 298 మంది ఎంపీలు తమ ఎంపీల్యాడ్స్ నిధులను వాడుకోకపోవడం, వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి చెరో 10 మంది ఎంపీలు ఉండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకుండా, సొంత పనులకు వాడుకోకుండా, పనులకు ప్రైవేటు ట్రస్టులకు, అనర్హులైన, సామర్థ్యంలేని సంస్థలకు కట్టబెట్టే చర్యలను నియంత్రించేలా నిబంధనలు రూపొందించాలని శ్రీధర్ చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే విధించే శిక్ష, జరిమానాలపై కూడా నిబంధనావళిలో స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ మేరకు 54 పేజీల ఉత్తర్వులను జారీచేశారు.
తెలియజేయడం ఎంపీల బాధ్యత
తన పదవీకాలం పూర్తయ్యాక ప్రతీ ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంపై ఉభయసభల అధిపతులకు సమగ్ర నివేదికను సమర్పించేలా చూడాలన్నారు. సమాచారహక్కు చట్టం కింద ఈ వివరాలను తమ నియోజకవర్గాల ప్రజలకు తెలియజేయడం ఎంపీల బాధ్యతని శ్రీధర్ ఆచార్యులు వ్యాఖ్యానించారు. పారదర్శకతను సాధించేందుకు పార్లమెంటు కార్యాలయ సిబ్బంది, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సిస్టమ్స్ సాయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎంపీల్యాడ్స్ నిధుల ఖర్చు వివరాలను రాజకీయ పార్టీలు, ఎంపీలు తమ అధికారిక వెబ్‌సైట్లో పోస్ట్ చేయాలనీ, సోషల్‌మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. దీనివల్ల నిధుల దుర్వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాలవారీగా పార్లమెంటు సభ్యులు ఏయే పనులను, ఎం తెంత వ్యయంతో చేపట్టారు? వాటి పురోగతి ఏంటి? తదితర వివరాలను జిల్లా యంత్రాంగాలు తమ వెబ్‌సైట్లలో అప్‌డేట్ చేస్తూ ఉండాలని శ్రీధర్ ఆచార్యులు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment