
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుడి స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల(ఎంపీల్యాడ్స్) పథకం అమలు స్థితి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, సంబంధిత సమాచారం ఇవ్వడంలో సదరు పార్లమెంటు సభ్యుడిని కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి(పీఐవో)గా పరిగణించాల్సి ఉంటుందని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రశాంత్ జైన్ అనే వ్యక్తి తన నియోజకవర్గంలో 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగం, ఏయే పథకాలకు వెచ్చించారు, ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు, పనుల స్థితి వివరాలను కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సమాధానం ఇస్తూ ఎంపీ ల్యాడ్స్ వెబ్‌సైట్‌లో సంబంధిత వివరాలు ఉంటాయని, జిల్లా యంత్రాంగం ఎంపీల్యాడ్స్ ద్వారా వెచ్చించిన నిధులు ఉంటాయని పేర్కొన్నారు.
అయితే, ఇందులో నిర్ధిష్ట సమాచారం లేదు. దీంతో దరఖాస్తుదారు దీనిని ప్రథమ అప్పిలేట్ అధికారి(ఎఫ్‌ఏఏ) వద్ద సవాలు చేయగా అక్కడా అదే సమాధానం ఎదురైంది. దీంతో దరఖాస్తుదారు కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పలు కీలక అంశాలపై ఉత్తర్వులు జారీచేశారు. ఈ పథకం కింద పనుల వారీగా, పథకాల వారీగా, కాంట్రాక్టర్ల పేర్లు, పర్యవేక్షకుల పేర్లతో సహా పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే ఎంపీల్యాడ్స్ కోసం వచ్చిన ప్రతిపాదనలు, తిరస్కరించిన ప్రతిపాదనలు, కారణాలను కూడా వెబ్‌సైట్‌లో ఉంచాలన్నారు. ఇలాంటి వివరాలు మంత్రిత్వ శాఖ వద్ద లేనప్పుడు సదరు ఎంపీ ఐదేళ్ల తన పదవీ కాలంలో ఆయా నిధులను ఖర్చు చేయని, పనులు పూర్తవని సందర్భం ఉంటే వాటిని పర్యవేక్షించడం సాధ్యం కాదని సమాచార కమిషనర్ తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. ఎంపీల్యాడ్స్ వివరాలు నియోజకవర్గ ప్రజలు తెలుసుకోగోరినప్పుడు సంబంధిత పార్లమెంటు సభ్యుడినే పీఐవోగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు
Comments
Please login to add a commentAdd a comment