mp lads
-
ఎంపీ ల్యాడ్స్ నిధులను పునరుద్ధరించిన కేబినెట్
-
ఎంపీ లాడ్స్‌ను వెంటనే పునరుద్ధరించండి
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు తమ పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల కోసం ఏటా కేటాయించే ఎంపీ లాడ్స్ నిధులను వెంటనే పునరుద్ధరించాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో శుక్రవారం మంత్రులు, ఎంపీల జీతభత్యాల కోతకు సంబంధించిన బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తమతోపాటు సభలోని అన్ని పార్టీల సభ్యులు ఎంపీ లాడ్స్ పునరుద్ధరణను కోరుతున్నందున కేంద్ర ప్రభుత్వం తమ విజ్ఞప్తిని సానుకూల దృక్పథంతో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో మంత్రులు, ఎంపీల జీతభత్యాలపై కోత విధించడం ఆమోదయోగ్యమేనన్నారు. ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్న ఈ పరిస్థితుల్లో నాయకులుగా ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు ఇదో మంచి ప్రయత్నం కాగలదన్నారు. వివిధ దేశాల్లోనూ ప్రభుత్వాధినేతలు, ప్రజాప్రతినిధులు తమ జీతభత్యాలను తగ్గించుకున్నారన్నారు. కరోనా నేపథ్యంలో తమ జీతభత్యాల్లో భారీగా కోతకు సిద్ధపడ్డ ప్రైవేట్ కంపెనీల ఉన్నతస్థాయి అధికారులను కూడా ఆయన అభినందించారు. దీనివల్ల ఆయా కంపెనీల్లోని మధ్య, దిగువ స్థాయి సిబ్బంది పూర్తి వేతనం పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఆయన ప్రభుత్వానికి ఓ సూచన చేస్తూ.. బలమైన కారణం లేకుండా చీటికి మాటికి సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించే సభ్యుల జీతాల్లో సైతం కోత పెట్టాలని ప్రతిపాదించారు. అలాంటి వారికి అవసరమైతే జరిమానా కూడా విధించాలన్నారు. విశాఖలో ఆయుష్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలో ఆయుష్ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ పరిధిలో ఎన్ని హెల్త్, వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. నేషనల్ ఆయుష్ మిషన్ కింద విశాఖలో ప్రతిపాదిత 50 పడకల ఆస్పత్రి పరిస్థితి ఏంటని అడిగారు. -
‘టిమ్స్’కు రూ.50 లక్షల ఎంపీ ల్యాడ్స్: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) కు తన ఎంపీ ల్యాడ్స్ నుంచి రూ.50 లక్షలు ఇస్తున్నట్టు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. ‘టిమ్స్’లో ప్రభుత్వం సీవరేజ్ ప్లాంటు ఏర్పాటు చేయలేదని, దీంతో మురుగునీరు పక్కనే ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలోకి వెళుతున్న విషయాన్ని విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకు వచ్చారని, ఈ ప్లాంటు నిర్మాణం కోసం నిధులు ఇస్తునట్టు ఆయన కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి. చదవండి: ఖైదీ నంబర్ 3077 : కేటీఆర్ -
ఎంపీ వేతనం రూ. లక్ష..!
సాక్షి, జహీరాబాద్: ప్రస్తుతం ఎంపీ ఎన్నికల సీజన్ నడుస్తోంది. పార్లమెంట్ మెట్లు ఎక్కేందుకు అభ్యర్థులు మండుటెండలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల వసతులు, సదుపాయాలు కల్పిస్తుంది. ఉచిత వైద్యం, రవాణా, జీతభత్యాలు అందజేస్తుంది. పార్లమెంట్ సభ్యుడికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు, వార్షిక నిధులు కేటాయిస్తుందో ఒకసారి చూద్దాం.. ప్రయాణం పార్లమెంట్ సభ్యులు ఏడాదికి 34 సార్లు ఉచితంగా విమాన ప్రయాణం చేయవచ్చు. ఎంపీతో పాటు జీవిత భాగస్వామికి లేదా మరొకరికి కూడా అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం కూడా ఉచితమే. ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్‌ల్లో ప్రయాణాలు సాగించవచ్చు. భార్యకు కూడా ఈ వసతి ఉంటుంది. రహదారుల మీదుగా ప్రయాణిస్తే కిలోమీటర్‌కు రూ. 16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. బస్సులలో ఎంపీలకు ప్రత్యేకంగా సీటు కేటాయిస్తారు. వైద్యం కేంద్ర పౌర సేవల కింద ప్రభుత్వ ఆరోగ్య పథకం ద్వారా ఉచితంగా వైద్యారోగ్య సేవలను అందిస్తుంది. ఎక్స్‌రే, అల్ట్రాసాండ్ స్కానింగ్, ఈసీజీ, హృద్రోగ, దంత, కంటి, చర్మ తదితర వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. వేతనం లోక్‌సభ సభ్యులకు నెలకు రూ.లక్ష వేతనం ఇస్తారు. పదవీ కాలం అయిపోయాక నెలకు రూ.25 వేల పింఛన్ లభిస్తుంది. పదవీ కాలంలో వేతనంతో పాటు అలవెన్స్‌ల కింద నెలకు రూ.45 వేలు అందుతుంది. నిధులు పార్లమెంట్ సభ్యులకు ఎంపీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 5 కోట్ల ని«ధులు మంజూరు చేస్తుంది. ఈ నిధులు జిల్లా కలెక్టర్‌కు వస్తాయి. ఎంపీ తన నియోజకవర్గ పరిధిలో గుర్తించిన పనులకు ఈ నిధులు వెచ్చిస్తారు. ఎంపీ సిఫారసు మేరకు జిల్లా అధికారులు ఈ నిధులను మంజూరు చేస్తారు. కార్యాలయ అలవెన్స్‌లు పార్లమెంట్ కార్యాలయ అలవెన్స్ కింద ఎంపీలకు నెలకు రూ. 45 వేలను కేంద్రం అందిస్తోంది. స్టేషనరీ కోసం రూ. 15 వేలు, సహాయ సిబ్బంది, ఇతర ఖర్చుల కోసం రూ. 30 వేలు కేటాయిస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ. 2 వేల చొప్పున అదనంగా అందజేస్తారు. -
‘ఎంపీల్యాడ్స్’పై పారదర్శకత
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు తమ ఎంపీల్యాడ్స్ (స్థానికప్రాంత అభివృద్ధి పథకం) నిధులను ఖర్చుచేసే విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు చట్టబద్ధ నిబంధనావళిని రూపొందించాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కార్యాలయాలను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. నిధుల ఖర్చులో పారదర్శకతతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు తదితర అంశాలను ఇందులో చేర్చాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చెరో 10 మంది ఎంపీలు తమ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతీ ఎంపీకి ఏటా రూ.5 కోట్ల చొప్పున నియోజకవర్గం అభివృద్ధికి కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కేంద్రం కేటాయిస్తున్న నిధుల్లో ప్రతిఏటా రూ.12,000 కోట్లు వినియోగం కావ ట్లేదు.ఈ నేపథ్యంలో ఎంపీల్యాడ్స్ నిధుల నుం చి తమ పార్లమెంటు సభ్యులు ఎంత ఖర్చు చేశారన్న సమాచారం లభ్యం కాకపోవడంపై ఇద్దరు వ్యక్తులు సీఐసీని ఆశ్రయించారు. సమాచారం ఎందుకు లేదు? ఈ పిటిషన్లను విచారించిన సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు.. ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంపై తమవద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ చెప్పడాన్ని తప్పుపట్టారు. ఎంపీలకు నిధులు కేటాయిస్తున్నప్పుడు.. వారి ఖర్చుల వివరాలను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంపీలు ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేశారన్న సమాచారం జిల్లా యంత్రాంగాల వద్దే ఉంటుందన్న కేంద్రం వాదనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలందరూ నియోజకవర్గాల వారీగా ఏయే పనులు చేపట్టారు? వాటికి ఎంత ఖర్చు చేశారు? దీని కారణంగా ఎవరికి లబ్ధి చేకూరింది? పనులు పూర్తి కాకపోవడానికి గల కారణం ఏంటి? ఏయే దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారు? తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఏటా దాదాపు రూ.12,000 కోట్లు నిరుపయోగం అవుతున్నాయన్న ప్రభుత్వ నివేదికపై స్పందిస్తూ.. ఈ నిధులను పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంతో వినియోగించేలా చట్టబద్ధమైన నిబంధనావళిని రూపొందించాలని ఉభయ సభాధిపతుల కార్యాలయాలకు సూచించారు. గతేడాది 298 మంది ఎంపీలు తమ ఎంపీల్యాడ్స్ నిధులను వాడుకోకపోవడం, వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి చెరో 10 మంది ఎంపీలు ఉండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకుండా, సొంత పనులకు వాడుకోకుండా, పనులకు ప్రైవేటు ట్రస్టులకు, అనర్హులైన, సామర్థ్యంలేని సంస్థలకు కట్టబెట్టే చర్యలను నియంత్రించేలా నిబంధనలు రూపొందించాలని శ్రీధర్ చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే విధించే శిక్ష, జరిమానాలపై కూడా నిబంధనావళిలో స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ మేరకు 54 పేజీల ఉత్తర్వులను జారీచేశారు. తెలియజేయడం ఎంపీల బాధ్యత తన పదవీకాలం పూర్తయ్యాక ప్రతీ ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంపై ఉభయసభల అధిపతులకు సమగ్ర నివేదికను సమర్పించేలా చూడాలన్నారు. సమాచారహక్కు చట్టం కింద ఈ వివరాలను తమ నియోజకవర్గాల ప్రజలకు తెలియజేయడం ఎంపీల బాధ్యతని శ్రీధర్ ఆచార్యులు వ్యాఖ్యానించారు. పారదర్శకతను సాధించేందుకు పార్లమెంటు కార్యాలయ సిబ్బంది, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సిస్టమ్స్ సాయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీల్యాడ్స్ నిధుల ఖర్చు వివరాలను రాజకీయ పార్టీలు, ఎంపీలు తమ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయాలనీ, సోషల్‌మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. దీనివల్ల నిధుల దుర్వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాలవారీగా పార్లమెంటు సభ్యులు ఏయే పనులను, ఎం తెంత వ్యయంతో చేపట్టారు? వాటి పురోగతి ఏంటి? తదితర వివరాలను జిల్లా యంత్రాంగాలు తమ వెబ్సైట్లలో అప్డేట్ చేస్తూ ఉండాలని శ్రీధర్ ఆచార్యులు ఆదేశించారు. -
ఎంపీ కూడా పీఐవోనే: సీఐసీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుడి స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల(ఎంపీల్యాడ్స్) పథకం అమలు స్థితి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, సంబంధిత సమాచారం ఇవ్వడంలో సదరు పార్లమెంటు సభ్యుడిని కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి(పీఐవో)గా పరిగణించాల్సి ఉంటుందని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రశాంత్ జైన్ అనే వ్యక్తి తన నియోజకవర్గంలో 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగం, ఏయే పథకాలకు వెచ్చించారు, ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు, పనుల స్థితి వివరాలను కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సమాధానం ఇస్తూ ఎంపీ ల్యాడ్స్ వెబ్సైట్లో సంబంధిత వివరాలు ఉంటాయని, జిల్లా యంత్రాంగం ఎంపీల్యాడ్స్ ద్వారా వెచ్చించిన నిధులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ఇందులో నిర్ధిష్ట సమాచారం లేదు. దీంతో దరఖాస్తుదారు దీనిని ప్రథమ అప్పిలేట్ అధికారి(ఎఫ్ఏఏ) వద్ద సవాలు చేయగా అక్కడా అదే సమాధానం ఎదురైంది. దీంతో దరఖాస్తుదారు కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పలు కీలక అంశాలపై ఉత్తర్వులు జారీచేశారు. ఈ పథకం కింద పనుల వారీగా, పథకాల వారీగా, కాంట్రాక్టర్ల పేర్లు, పర్యవేక్షకుల పేర్లతో సహా పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే ఎంపీల్యాడ్స్ కోసం వచ్చిన ప్రతిపాదనలు, తిరస్కరించిన ప్రతిపాదనలు, కారణాలను కూడా వెబ్సైట్లో ఉంచాలన్నారు. ఇలాంటి వివరాలు మంత్రిత్వ శాఖ వద్ద లేనప్పుడు సదరు ఎంపీ ఐదేళ్ల తన పదవీ కాలంలో ఆయా నిధులను ఖర్చు చేయని, పనులు పూర్తవని సందర్భం ఉంటే వాటిని పర్యవేక్షించడం సాధ్యం కాదని సమాచార కమిషనర్ తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. ఎంపీల్యాడ్స్ వివరాలు నియోజకవర్గ ప్రజలు తెలుసుకోగోరినప్పుడు సంబంధిత పార్లమెంటు సభ్యుడినే పీఐవోగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు -
ఎంపీ ల్యాడ్స్ కమిటీలో సంతోష్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్) పథకం అమలును పర్యవేక్షించే రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ కమిటీలో టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు చోటు దక్కింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఎంపీ ల్యాడ్స్ కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 12 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీలో ఏపీ నుంచి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా ఉన్నారు. ఎంపీ ల్యాడ్ పథకం కింద అభివృద్ధి పనులు వేగంగా సాగేం దుకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది. -
సచిన్‌కు సీఎం కృతజ్ఞతలు
జమ్మూకశ్మీర్ : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కృతజ్ఞతలు తెలియజేశారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.40 లక్షలను కుప్వారా జిల్లాలోని ఓ పాఠశాలకు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆమె ట్విటర్ ద్వారా తన సందేశం వెల్లడించారు. క్రికెట్ నుంచి రిటైరయ్యాక కూడా మన అందరికీ సచిన్ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆమె అన్నారు. ద్రుగ్‌ముల్లా గ్రామంలో 2007లో స్థాపించిన ఇంపీరియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ ఒక్కటే పదో తరగతి వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న పాఠశాల. ఈ పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సచిన్ కేటాయించిన నిథులతో తరగతి గదులు, లాబొరేటరీ, మూత్రశాలలు, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లను నిర్మించనున్నారు. కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలోని సూళ్లకు ఇప్పటికే సుమారు 7.5 కోట్ల రూపాయలను సచిన్ కేటాయించాడు. -
ఎంపీల్యాడ్స్ కాలపరిమితి పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్)ను 14వ ఆర్థిక సంఘం కాల పరిమితి ముగిసే తేదీ అయిన 2020, మార్చి 31 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఈ మేరకు అంగీకరించింది. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ. 11,850 కోట్లు వెచ్చించనున్నారు. ప్రారంభించిన కార్యక్రమాల పర్యవేక్షణ, సామర్థ్య పెంపు, స్థానిక అధికారుల శిక్షణ తదితరాలకు అదనంగా ఏటా రూ.5 కోట్లు వ్యయం చేయనున్నారు. స్థానికంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, రహదారులు తదితరాల అభివృద్ధికి ఏడాదికి రూ. 5 కోట్లు ఖర్చు చేసేందుకు పార్లమెంటు సభ్యులు సిఫారసు చేయొచ్చు. 1993–94లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి గత ఆగస్టు వరకు పలు అభివృద్ధి పనులకు రూ.44,929.17 కోట్లు మంజూరు చేశారు. దివ్యాంగుల చట్ట సవరణకు ఆమోదం దివ్యాంగుల సంక్షేమ జాతీయ ట్రస్టు చైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని మూడేళ్లుగా నిర్ధారిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ పర్సన్స్ విత్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, అండ్ మల్టిపుల్ డిజేబిలిటీస్ చట్టం–1999ను సవరించాలంది. సీఐఎస్ఎఫ్ కేడర్ సమీక్షకు ఓకే.. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) కేడర్ సమీక్ష ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా అసిస్టెంట్ కమాండంట్ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్ వరకు వివిధ స్థాయుల్లో 25 కొత్త పోస్టులు ఏర్పాటుకానున్నాయి. -
'స్వచ్ఛ భారత్‌కు ఎంపీల్యాడ్ వద్దు'
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి(ఎంపీల్యాడ్) నిధుల వాడాలన్న యోచనను బుధవారం లోక్‌సభలో విపక్షాలు వ్యతిరేకించాయి. స్వచ్ఛ భారత్‌కు ఈ నిధులను వాడే అంశంపై సభ చర్చించాలని పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు సూచించగా జ్యోతిరాదిత్య, కేసీ వేణుగోపాల్(కాంగ్రెస్)తోపాటు పలు విపక్షాల సభ్యులు నిరసన తెలిపారు. ఇలాంటి యత్నానికి అంగీకరించబోమన్నారు. -
నిబంధనలు ఏమిటో!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులకు ఇచ్చే అభివృద్ధి నిధుల మార్గదర్శకాలు మారనున్నాయా? లేక పాత పద్ధతిలోనే 50 : 50 శాతంలో కేటాయిస్తారా? నిధులను ఏరూపంలో ఇవ్వనున్నారు? ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులను ఎలా ఖర్చు చేయాలి. వాటిని ఎలా కేటాయిస్తారు. కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ అంశాలు చర్చనీయాంశంగా మారాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులు విడుదల చేస్తూ వస్తున్నాయి. ఆ నిధులకు ఒక్కో ప్రభుత్వం ఒక్కో పేరు పెట్టి విడుదల చేసింది. జిల్లాలో రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) పేరుతో నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ)గా పేరు మార్చి నిధులను మంజూ రు చేసింది. గతంలో ఒక్కో ఎమ్మెల్యేలకు ఏటా రూ.50 లక్షలు కేటాయించగా, ఆ తర్వాత రూ. కోటికి పెంచారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఐదేళ్లలో ఏటా రూ. కోటి చొప్పున రూ. ఐదు కోట్లు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించే అవకాశం ఉంటుంది. ఇందులో సగం నిధులను జిల్లా ఇన్చార్జి మంత్రి సమన్వయంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎంపీ లాడ్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఎంపీకీ ఏటా రూ. ఐదు కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.25 కోట్లు కేటాయిస్తుంది. ఈ నిధులను ఎంపీలై నా, ఎమ్మెల్యేలైనా ప్రజల నుంచి డిమాండున్న అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తుండగా, వారి గెలుపు కోసం కష్టపడే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆ పను లను చేసి తృణమో, ఫణమో దక్కించుకునేవారు. ఈసారి ఈ నిధుల విడుదలలో మార్గదర్శకాలపై ఆయా వర్గాలకు ఉత్కంఠగా మారింది. జిల్లాకు రూ.95 కోట్లు శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ), ఎంపీ లాడ్స్ కింద జిల్లాకు ఐదేళ్లలో రూ.95 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్, జహీ రాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్‌కు ఒక్కొక్కరి ఏటా రూ. ఐదు కోట్ల చొప్పున కేంద్రం ఇవ్వనుంది. ఐదేళ్లలో ఈ ఇద్దరు ఎంపీలకు రూ.50 కోట్లు రానున్నా యి. అలాగే, జిల్లాలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఏటా రూ. కోటి చొప్పున ఐదేళ్లలో రూ.45 కోట్ల ఏసీడీపీ నిధులను రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేయనుంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి నుంచి తిరిగి గెలిచిన ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజవర్గాలలో ఇది వరకే పనులు నడుస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్త, మహ్మద్ షకీ ల్ పనులను ప్రతిపాదించాల్సి ఉంది. ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ప్రతియేటా విడుదలయ్యే నిధుల్లో అత్యధికంగా తాగునీరు, మౌళిక సదుపా యాల కల్పనకు ఖర్చు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. కొద్ది రోజుల్లో ఈ నిధులు విడుదల కానుండగా, కొత్తగా అధికారంలోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధులకు వే రు పేర్లు పెడతాయా? ఎంపీ ల్యాడ్, ఏసీడీపీ నిధులతో చేపట్టే పనులు ఏమిటి? మార్గదర్శకాలను సవరిస్తారా? లేక పాత పద్ధతినే కొనసాగిస్తారా? అన్న స్పష్టత లేక నేతలు, అనుచరులు తర్జన భర్జనల్లో పడ్డారు. -
రాములమ్మ ఝలక్
సాక్షి, సంగారెడ్డి: రాములమ్మ గులాబీ దండుకు ఝలక్ ఇచ్చారు. టీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగించిన రూ.1.36 కోట్ల విలువైన ఎంపీ లాడ్స్ పనులను ఆ పార్టీ బహిష్కృత నేత, మెదక్ ఎంపీ విజయశాంతి వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆమె కలెక్టర్‌కు ఇటీవల లేఖ రాశారు. పనులు అప్పగించి ఆరు నెలలు దాటినా పూర్తిచేయలేదనే కారణంతోనే రద్దు చేయాలని ప్రతిపాదించినట్లు విజయశాంతి పేర్కొంటున్నా.. టీఆర్ఎస్ పార్టీపై ఉన్న కోపంతోనే విజయశాంతి ఈ నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతోంది. నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎంపీ లాడ్స్ కింద ఏటా రూ.5 కోట్ల నిధులను ప్రతి ఎంపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిధుల కింద విజయశాంతి కమ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు తదితర రకాల పనులు చేపట్టారు. స్థానిక టీఆర్ఎస్ నాయకులు కోరిన వెంటనే అప్పట్లో పనులు అప్పగించారు. విజయశాంతి టీఆర్ఎస్ నుంచి సస్పెండైన తర్వాత పార్టీ కార్యకర్తలు మొహం చాటేశారు. ఈ నేపథ్యంలో దగ్గరకు రాని ఆ పార్టీ కార్యకర్తల నుంచి పనులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆమె సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రూ.1.36 కోట్ల మేర మంజూరు చేసిన పలు రకాల పనులను రద్దుచేయాలని కలెక్టర్‌కు లేఖ రాశారు. రద్దు చేసిన పనుల స్థానంలో కొత్త పనుల జాబితాను సైతం జత చేసినట్టు సమాచారం. విజయశాంతి కోరిక మేరకు పనుల రద్దుకు సాధ్యాసాధ్యాలను అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ విభాగాల పర్యవేక్షణలో గల ఈ పనులు ఒక వేళ ఇప్పటికే ప్రారంభమైతే రద్దుకు ఆస్కారం వుండదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దశలో రద్దుకు ప్రతిపాదించిన పనుల స్థితిగతులపై సంబంధిత విభాగాల పర్యవేక్షక ఇంజనీర్ల(ఈఈ) నుంచి ప్రణాళిక శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఇంకా ప్రారంభం కాని పనులను ఎంపీ కోరిక మేరకు కలెక్టర్ రద్దు చేసే అవకాశాలున్నాయి.