సాక్షి, జహీరాబాద్: ప్రస్తుతం ఎంపీ ఎన్నికల సీజన్ నడుస్తోంది. పార్లమెంట్ మెట్లు ఎక్కేందుకు అభ్యర్థులు మండుటెండలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఎంపీగా గెలిచిన వారికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల వసతులు, సదుపాయాలు కల్పిస్తుంది. ఉచిత వైద్యం, రవాణా, జీతభత్యాలు అందజేస్తుంది. పార్లమెంట్ సభ్యుడికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు, వార్షిక నిధులు కేటాయిస్తుందో ఒకసారి చూద్దాం..
ప్రయాణం
పార్లమెంట్ సభ్యులు ఏడాదికి 34 సార్లు ఉచితంగా విమాన ప్రయాణం చేయవచ్చు. ఎంపీతో పాటు జీవిత భాగస్వామికి లేదా మరొకరికి కూడా అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణం కూడా ఉచితమే. ఫస్ట్ క్లాస్, ఏసీ కోచ్‌ల్లో ప్రయాణాలు సాగించవచ్చు. భార్యకు కూడా ఈ వసతి ఉంటుంది. రహదారుల మీదుగా ప్రయాణిస్తే కిలోమీటర్‌కు రూ. 16 చొప్పున బిల్లు చెల్లిస్తారు. బస్సులలో ఎంపీలకు ప్రత్యేకంగా సీటు కేటాయిస్తారు.
వైద్యం
కేంద్ర పౌర సేవల కింద ప్రభుత్వ ఆరోగ్య పథకం ద్వారా ఉచితంగా వైద్యారోగ్య సేవలను అందిస్తుంది. ఎక్స్‌రే, అల్ట్రాసాండ్ స్కానింగ్, ఈసీజీ, హృద్రోగ, దంత, కంటి, చర్మ తదితర వ్యాధులకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు.
వేతనం
లోక్‌సభ సభ్యులకు నెలకు రూ.లక్ష వేతనం ఇస్తారు. పదవీ కాలం అయిపోయాక నెలకు రూ.25 వేల పింఛన్ లభిస్తుంది. పదవీ కాలంలో వేతనంతో పాటు అలవెన్స్‌ల కింద నెలకు రూ.45 వేలు అందుతుంది.
నిధులు
పార్లమెంట్ సభ్యులకు ఎంపీ నిధుల కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 5 కోట్ల ని«ధులు మంజూరు చేస్తుంది. ఈ నిధులు జిల్లా కలెక్టర్‌కు వస్తాయి. ఎంపీ తన నియోజకవర్గ పరిధిలో గుర్తించిన పనులకు ఈ నిధులు వెచ్చిస్తారు. ఎంపీ సిఫారసు మేరకు జిల్లా అధికారులు ఈ నిధులను మంజూరు చేస్తారు.
కార్యాలయ అలవెన్స్‌లు
పార్లమెంట్ కార్యాలయ అలవెన్స్ కింద ఎంపీలకు నెలకు రూ. 45 వేలను కేంద్రం అందిస్తోంది. స్టేషనరీ కోసం రూ. 15 వేలు, సహాయ సిబ్బంది, ఇతర ఖర్చుల కోసం రూ. 30 వేలు కేటాయిస్తారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటే రోజుకు రూ. 2 వేల చొప్పున అదనంగా అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment