సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం(ఎంపీల్యాడ్స్)ను 14వ ఆర్థిక సంఘం కాల పరిమితి ముగిసే తేదీ అయిన 2020, మార్చి 31 వరకు కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం ఈ మేరకు అంగీకరించింది. వచ్చే మూడేళ్ల కాలంలో ఈ పథకం కింద రూ. 11,850 కోట్లు వెచ్చించనున్నారు.
ప్రారంభించిన కార్యక్రమాల పర్యవేక్షణ, సామర్థ్య పెంపు, స్థానిక అధికారుల శిక్షణ తదితరాలకు అదనంగా ఏటా రూ.5 కోట్లు వ్యయం చేయనున్నారు. స్థానికంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, రహదారులు తదితరాల అభివృద్ధికి ఏడాదికి రూ. 5 కోట్లు ఖర్చు చేసేందుకు పార్లమెంటు సభ్యులు సిఫారసు చేయొచ్చు. 1993–94లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి గత ఆగస్టు వరకు పలు అభివృద్ధి పనులకు రూ.44,929.17 కోట్లు మంజూరు చేశారు.
దివ్యాంగుల చట్ట సవరణకు ఆమోదం
దివ్యాంగుల సంక్షేమ జాతీయ ట్రస్టు చైర్మన్, సభ్యుల పదవీకాలాన్ని మూడేళ్లుగా నిర్ధారిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ పర్సన్స్ విత్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, అండ్ మల్టిపుల్ డిజేబిలిటీస్ చట్టం–1999ను సవరించాలంది.
సీఐఎస్‌ఎఫ్ కేడర్ సమీక్షకు ఓకే..
కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్) కేడర్ సమీక్ష ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా అసిస్టెంట్ కమాండంట్ నుంచి అడిషనల్ డైరెక్టర్ జనరల్ వరకు వివిధ స్థాయుల్లో 25 కొత్త పోస్టులు ఏర్పాటుకానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment