సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులు తమ పరిధిలో చేపట్టే వివిధ అభివృద్ధి పనుల కోసం ఏటా కేటాయించే ఎంపీ లాడ్స్ నిధులను వెంటనే పునరుద్ధరించాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో శుక్రవారం మంత్రులు, ఎంపీల జీతభత్యాల కోతకు సంబంధించిన బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తమతోపాటు సభలోని అన్ని పార్టీల సభ్యులు ఎంపీ లాడ్స్ పునరుద్ధరణను కోరుతున్నందున కేంద్ర ప్రభుత్వం తమ విజ్ఞప్తిని సానుకూల దృక్పథంతో పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
కరోనా నేపథ్యంలో మంత్రులు, ఎంపీల జీతభత్యాలపై కోత విధించడం ఆమోదయోగ్యమేనన్నారు. ఆర్థిక సంక్షోభం వెంటాడుతున్న ఈ పరిస్థితుల్లో నాయకులుగా ప్రజలకు ఆదర్శంగా నిలిచేందుకు ఇదో మంచి ప్రయత్నం కాగలదన్నారు. వివిధ దేశాల్లోనూ ప్రభుత్వాధినేతలు, ప్రజాప్రతినిధులు తమ జీతభత్యాలను తగ్గించుకున్నారన్నారు. కరోనా నేపథ్యంలో తమ జీతభత్యాల్లో భారీగా కోతకు సిద్ధపడ్డ ప్రైవేట్ కంపెనీల ఉన్నతస్థాయి అధికారులను కూడా ఆయన అభినందించారు. దీనివల్ల ఆయా కంపెనీల్లోని మధ్య, దిగువ స్థాయి సిబ్బంది పూర్తి వేతనం పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఆయన ప్రభుత్వానికి ఓ సూచన చేస్తూ.. బలమైన కారణం లేకుండా చీటికి మాటికి సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించే సభ్యుల జీతాల్లో సైతం కోత పెట్టాలని ప్రతిపాదించారు. అలాంటి వారికి అవసరమైతే జరిమానా కూడా విధించాలన్నారు.
విశాఖలో ఆయుష్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలి
విశాఖపట్నంలో ఆయుష్ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ పరిధిలో ఎన్ని హెల్త్, వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. నేషనల్ ఆయుష్ మిషన్ కింద విశాఖలో ప్రతిపాదిత 50 పడకల ఆస్పత్రి పరిస్థితి ఏంటని అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment