సాక్షి, సంగారెడ్డి: రాములమ్మ గులాబీ దండుకు ఝలక్ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులకు అప్పగించిన రూ.1.36 కోట్ల విలువైన ఎంపీ లాడ్స్ పనులను ఆ పార్టీ బహిష్కృత నేత, మెదక్ ఎంపీ విజయశాంతి వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆమె కలెక్టర్‌కు ఇటీవల లేఖ రాశారు. పనులు అప్పగించి ఆరు నెలలు దాటినా పూర్తిచేయలేదనే కారణంతోనే రద్దు చేయాలని ప్రతిపాదించినట్లు విజయశాంతి పేర్కొంటున్నా.. టీఆర్‌ఎస్ పార్టీపై ఉన్న కోపంతోనే విజయశాంతి ఈ నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతోంది.
నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టడానికి ఎంపీ లాడ్స్ కింద ఏటా రూ.5 కోట్ల నిధులను ప్రతి ఎంపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నిధుల కింద విజయశాంతి కమ్యూనిటీ భవనాలు, సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు తదితర రకాల పనులు చేపట్టారు. స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు కోరిన వెంటనే అప్పట్లో పనులు అప్పగించారు. విజయశాంతి టీఆర్‌ఎస్ నుంచి సస్పెండైన తర్వాత పార్టీ కార్యకర్తలు మొహం చాటేశారు.
ఈ నేపథ్యంలో దగ్గరకు రాని ఆ పార్టీ కార్యకర్తల నుంచి పనులను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆమె సంగారెడ్డి, మెదక్, నర్సాపూర్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రూ.1.36 కోట్ల మేర మంజూరు చేసిన పలు రకాల పనులను రద్దుచేయాలని కలెక్టర్‌కు లేఖ రాశారు. రద్దు చేసిన పనుల స్థానంలో కొత్త పనుల జాబితాను సైతం జత చేసినట్టు సమాచారం. విజయశాంతి కోరిక మేరకు పనుల రద్దుకు సాధ్యాసాధ్యాలను అధికార యంత్రాంగం పరిశీలిస్తోంది.
పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ విభాగాల పర్యవేక్షణలో గల ఈ పనులు ఒక వేళ ఇప్పటికే ప్రారంభమైతే రద్దుకు ఆస్కారం వుండదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ దశలో రద్దుకు ప్రతిపాదించిన పనుల స్థితిగతులపై సంబంధిత విభాగాల పర్యవేక్షక ఇంజనీర్ల(ఈఈ) నుంచి ప్రణాళిక శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ఇంకా ప్రారంభం కాని పనులను ఎంపీ కోరిక మేరకు కలెక్టర్ రద్దు చేసే అవకాశాలున్నాయి.
రాములమ్మ ఝలక్
Published Thu, Jan 23 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:53 AM
Advertisement
Advertisement