National Informatics Centre
-
వాట్సాప్ బదులుగా 'సందేశ్'.. లోక సభలో కేంద్రం కీలక ప్రకటన
వాట్సాప్ తరహాలో వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ తదితర ఫీచర్లతో కేంద్ర ప్రభుత్వం సందేశ్ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తేనుంది. నేషనల్ ఇన్ఫోర్మేటిక్స్ సెంటర్ (NIC) తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి ఈ యాప్‌ను డిజైన్ చేస్తున్నాయి. పూర్తిగా స్వదేశీగా ఈ యాప్‌ను అందుబాటులోకి తేవడం ద్వారా విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయం తెచ్చే పనిలో కేంద్రం నిమగ్నమైంది. ఈ మేరకు కేంద్రం పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ నిబంధనల నేపథ్యంలో కేంద్రం స్వదేశీ వాట్సాప్‌ను లాంఛ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యాప్‌కు సంబంధించి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు. నేషనల్ ఇన్ఫోర్మేటిక్స్ సెంటర్ (NIC) తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి డిజైన్ చేసిన స్వదేశీ వాట్సాప్ సందేశ్ అందరికి అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ నిర్వహణ బాధ్యతలన్నీ కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటుందన్న ఆయన.. వాట్సాప్ తరహాలో వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ తో పాటు ప్రభుత్వ అప్లికేషన్ ఈ యాప్ లో ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఇక ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే వాట్సాప్ కేవలం ఫోన్ నెంబర్‌తో మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ సందేశ్ యాప్ మాత్రం ఈమెయిల్ తో ఓపెన్ చేసేలా రూపొందించారు. అయితే సందేశ్ యాప్ ఎంతమేరకు ఆకట్టుకుంటుంది.? సందేశ్ తో వాట్సాప్ వినియోగం ఆగిపోతుందా? లేదా కొనసాగుతుందా? అన్న అంశం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. -
జాతీయ భద్రతకు సంబంధించిన డేటా హ్యాక్..!
న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు సంబంధించిన డేటాను కలిగి ఉన్న కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయి. చైనా సంస్థ జెన్హూవా డేటా ఇన్ఫర్మేషన్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంతి, ఆర్మీ చీఫ్‌తో సహా వేలాదిమంది భారతీయులపై రహస్య నిఘా నిర్వహిస్తోందనే ఆరోపణల మధ్య ఈ ఉల్లంఘన జరిగింది. ఈ విషయాన్ని గుర్తించిన వెంటనే ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ కేసు నమోదు చేసింది. ఇందులో దేశ భద్రతకు సంబంధించిన డేటాతో పాటు, ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. (ఆ బాధ్యత రాష్ట్రాలదే: కేంద్ర హోం శాఖ) ఈ హ్యాకింగ్‌కు సంబంధించిన మెయిల్ ఒకటి బెంగళూరు కేంద్రంగా ఉన్న యునైటెడ్ స్టేట్స్కు చెందిన సంస్థ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎన్ఐసీ ఉద్యోగులకు వచ్చిన ఈ-మెయిల్‌ను ఓపెన్ చేయగానే కంప్యూటర్ వ్యవస్థలు అన్నీ ప్రభావితమై సమాచారం హ్యాక్ అయినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఈ ఆరోపణలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని (నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో) ఏర్పాటు చేసిందని ఎన్ఐసీ వర్గాలు తెలిపాయి. ఈ కమిటీ 30 రోజుల్లోగా నివేదికను సమర్పించనుంది. -
ఇంతకీ ‘ఆరోగ్య సేతు’ యాప్ ఏంటి?
న్యూడిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం ఉదయం నాటికి కరోనా బారిన పడిన వారి సంఖ్య 2 వేలకు పైగా చేరగా.. 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. కరోనాను దరి చేరకుండా అడ్డుకునేందుకు శుక్రవారం ఓ యాప్‌ను రూపొందించింది. ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇది కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహకరిస్తుంది. అంతేకాకుండా కోవిడ్-19 బారిన పడిన వారు మన దగ్గరికి సమీపిస్తే మనల్ని హెచ్చరిస్తుంది. (కరోనాపై పోరుకు బాలయ్య విరాళం ) అయితే ముందుగా ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్‌లో, ఐఫోన్ల కోసం యాప్ స్టోర్‌లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత పేరు, మొబైల్ నంబర్‌తో రిజిస్టార్ చేసుకోవాలి. వీటితోపాటు మన ఆరోగ్య విషయాలను. ఇతర ఆధారాలను నమోదు చేయాలి. ట్రాకింగ్‌ను ప్రారంభించడం కోసం ఫోన్లో జీపీఎస్, బ్లూటూత్ సిస్టమ్‌ను ఆన్‌లో ఉంచాలి. ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్ 11 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో మీ సమాచారమంతా రహస్యంగా ఉంటుంది. ప్రభుత్వానికి తప్ప ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఈ యాప్ పనిచేస్తుంది. (భారత్‌కు ప్రపంచ బ్యాంకు సాయం ఎంతంటే!) యాప్ ప్రయోజనాలు.. ► దేశంలో కరోనా కేసుల అప్డేట్ తెలుసుకోవచ్చు. ► కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది ►కరోనావైరస్ ఉన్న వ్యక్తికి దగ్గరగా వెళ్తే యాప్ మీ లొకేషన్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్రభుత్వానికి చేరవేస్తుంది. ► కోవిడ్ -19 లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నిర్థారించడానికి అనేక ప్రశ్నలను అడిగే ప్రత్యేకమైన చాట్‌బోట్ ఉంటుంది. ►కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే ప్రకటనలు, తీసుకునే చర్యలను తెలియజేస్తుంది. (మరోసారి ‘జనతా’ స్ఫూర్తి కావాలి: ప్రధాని మోదీ) -
‘ఎంపీల్యాడ్స్’పై పారదర్శకత
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు తమ ఎంపీల్యాడ్స్ (స్థానికప్రాంత అభివృద్ధి పథకం) నిధులను ఖర్చుచేసే విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు చట్టబద్ధ నిబంధనావళిని రూపొందించాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కార్యాలయాలను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. నిధుల ఖర్చులో పారదర్శకతతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు తదితర అంశాలను ఇందులో చేర్చాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చెరో 10 మంది ఎంపీలు తమ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతీ ఎంపీకి ఏటా రూ.5 కోట్ల చొప్పున నియోజకవర్గం అభివృద్ధికి కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కేంద్రం కేటాయిస్తున్న నిధుల్లో ప్రతిఏటా రూ.12,000 కోట్లు వినియోగం కావ ట్లేదు.ఈ నేపథ్యంలో ఎంపీల్యాడ్స్ నిధుల నుం చి తమ పార్లమెంటు సభ్యులు ఎంత ఖర్చు చేశారన్న సమాచారం లభ్యం కాకపోవడంపై ఇద్దరు వ్యక్తులు సీఐసీని ఆశ్రయించారు. సమాచారం ఎందుకు లేదు? ఈ పిటిషన్లను విచారించిన సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు.. ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంపై తమవద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ చెప్పడాన్ని తప్పుపట్టారు. ఎంపీలకు నిధులు కేటాయిస్తున్నప్పుడు.. వారి ఖర్చుల వివరాలను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంపీలు ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేశారన్న సమాచారం జిల్లా యంత్రాంగాల వద్దే ఉంటుందన్న కేంద్రం వాదనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలందరూ నియోజకవర్గాల వారీగా ఏయే పనులు చేపట్టారు? వాటికి ఎంత ఖర్చు చేశారు? దీని కారణంగా ఎవరికి లబ్ధి చేకూరింది? పనులు పూర్తి కాకపోవడానికి గల కారణం ఏంటి? ఏయే దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారు? తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఏటా దాదాపు రూ.12,000 కోట్లు నిరుపయోగం అవుతున్నాయన్న ప్రభుత్వ నివేదికపై స్పందిస్తూ.. ఈ నిధులను పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంతో వినియోగించేలా చట్టబద్ధమైన నిబంధనావళిని రూపొందించాలని ఉభయ సభాధిపతుల కార్యాలయాలకు సూచించారు. గతేడాది 298 మంది ఎంపీలు తమ ఎంపీల్యాడ్స్ నిధులను వాడుకోకపోవడం, వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి చెరో 10 మంది ఎంపీలు ఉండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకుండా, సొంత పనులకు వాడుకోకుండా, పనులకు ప్రైవేటు ట్రస్టులకు, అనర్హులైన, సామర్థ్యంలేని సంస్థలకు కట్టబెట్టే చర్యలను నియంత్రించేలా నిబంధనలు రూపొందించాలని శ్రీధర్ చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే విధించే శిక్ష, జరిమానాలపై కూడా నిబంధనావళిలో స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ మేరకు 54 పేజీల ఉత్తర్వులను జారీచేశారు. తెలియజేయడం ఎంపీల బాధ్యత తన పదవీకాలం పూర్తయ్యాక ప్రతీ ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంపై ఉభయసభల అధిపతులకు సమగ్ర నివేదికను సమర్పించేలా చూడాలన్నారు. సమాచారహక్కు చట్టం కింద ఈ వివరాలను తమ నియోజకవర్గాల ప్రజలకు తెలియజేయడం ఎంపీల బాధ్యతని శ్రీధర్ ఆచార్యులు వ్యాఖ్యానించారు. పారదర్శకతను సాధించేందుకు పార్లమెంటు కార్యాలయ సిబ్బంది, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సిస్టమ్స్ సాయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీల్యాడ్స్ నిధుల ఖర్చు వివరాలను రాజకీయ పార్టీలు, ఎంపీలు తమ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయాలనీ, సోషల్‌మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. దీనివల్ల నిధుల దుర్వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాలవారీగా పార్లమెంటు సభ్యులు ఏయే పనులను, ఎం తెంత వ్యయంతో చేపట్టారు? వాటి పురోగతి ఏంటి? తదితర వివరాలను జిల్లా యంత్రాంగాలు తమ వెబ్సైట్లలో అప్డేట్ చేస్తూ ఉండాలని శ్రీధర్ ఆచార్యులు ఆదేశించారు. -
కేంద్ర హోంశాఖ వెబ్ సైట్ హ్యాక్.. అంతా బ్లాక్!
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని సంబంధితశాఖ అధికారులు వెల్లడించారు. హోంశాఖ అధికారిక వెబ్ సైట్ హ్యాక్ అయిందన్న విషయాన్ని గుర్తించిన వెంటనే ఆ వెబ్ సైట్ ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ బృందం తాత్కాలికంగా బ్లాక్ చేసింది. సైబర్ నేరగాళ్లు డాటా చోరీకి పాల్పకుండా ఇలా చేసినట్లు సమాచారం. కంప్యూటర్ ఎమర్జెన్సీ టీమ్ హ్యాక్ అయిన సైట్ ను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు రంగంలోకి దిగింది. గత నెలలో పాకిస్తాన్ కు చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ (ఎన్ఎస్జీ) అధికారిక వెబ్ సైట్ హ్యాక్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, భారత్ కు వ్యతిరేకంగా సమాచారాన్ని పోస్ట్ చేయడం అప్పట్లో కలకలం రేపింది. గత నాలుగేళ్ల వ్యవధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 700కు పైగా వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ కేసుల్లో 8,348 మంది వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నట్లు గతవారం ఓ నివేదికలో వెల్లడైంది. -
రాష్ట్రంలో ‘నిక్’కు ఓకే: రవిశంకర్ ప్రసాద్
* విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో పోస్టల్ హబ్‌లు * అమరావతిలో పోస్టల్ ఎక్స్ఛేంజ్ సాక్షి, విశాఖపట్నం: ‘‘ఏపీలో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్(ఎన్ఐసీ) ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ ఏర్పాటు చేశాం. ఐటీఐఆర్ ఏర్పాటు ప్రతిపాదనను పరిశీలిస్తాం. రాష్ర్టంలోని పోస్టాఫీసులన్నింటినీ కోర్ బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడంతోపాటు డిజిటలైజ్ చేస్తాం. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలలో పోస్టల్ హబ్స్ ఏర్పాటు చేస్తాం. ఈ-కామర్స్ పోస్టల్ పార్సిల్ విభాగాన్ని గుంటూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాజధాని అమరావతిలో కొత్తగా పోస్టల్ ఎక్స్ఛేంజ్ మంజూరు చేస్తున్నాం’’ అని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో రూ.80.02 కోట్లతో ఏర్పాటు చేయనున్న సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్(సమీర్) కేంద్రానికి విశాఖ పోర్టు కళావాణి ఆడిటోరియంలో గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం విశాఖలోని సిరిపురం జంక్షన్ వద్ద ఏర్పాటు చేయనున్న ఇంక్యుబేషన్ సెంటర్ కోసం ఎస్టీపీఐ డెరైక్టర్ సి.వి.డి.రామ్‌ప్రసాద్, వుడా వీసీ బాబూరావునాయుడులు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రుల సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడారు. ఎన్నిసార్లు పర్యటిస్తే అన్ని ప్రాజెక్టులు: తాను ఎన్నిసార్లు ఏపీలో పర్యటిస్తే అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చే లక్ష్యంతో పని చేస్తున్నానని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వర్సిటీలను కొన్ని శక్తులు కలుషితం చేస్తున్నాయని ఆరోపించారు. సీఎం బాబు మాట్లాడుతూ... ఏపీ గ్రోత్ రేట్ 10.5 శాతంగా ఉందన్నారు. బీపీఓ సేవలను విశాఖకు విస్తరించండి బిజినెస్ ప్రొసెసింగ్ ఔట్ సోర్సింగ్(బీపీవో) సేవలను విశాఖకు విస్తరించాలని ఐటీ శాఖ అధికారులను రవిశంకర్ ప్రసాద్ ఆదేశించారు. ఆయన గురువారం విశాఖపట్నంలో తపాలా, బీఎస్ఎన్ఎల్, ఐటీ, ఎన్ఐసీ, ఎలక్ట్రానిక్స్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అమరావతిలో జూన్ నాటికి అధునాతన టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విశాఖపట్నంలో అధునాతన పార్సిల్ హబ్ ఏర్పాటు చేయాలన్నారు. -
స్పెషలిస్టు వైద్యుల భర్తీ
వారంలోగా నోటిఫికేషన్ సాక్షి, హైదరాబాద్: వారంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, వైద్య విధాన పరిషత్‌లోని ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదలకానుంది. 80 శాతం వైద్య కళాశాలల్లో 30 శాతం అధ్యాపకుల కొరత ఉన్నట్టు తేలింది. దీంతో ఎంబీబీఎస్ సీట్ల పునరుద్ధరణ(రెన్యువల్) ప్రక్రియకు ఎంసీఐ అనుమతించలేదు. ఈ నేపథ్యంలో వారంలో పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు వైద్య విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. 340 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. ఈ కళాశాలల్లో 340 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను గుర్తించారు. వివిధ విభాగాల్లో పీజీ పూర్తిచేసిన వారు మాత్రమే అర్హులు. ఒక్కో అభ్యర్థి నుంచీ దరఖాస్తుకు రూ.1000 వసూలు చేస్తారు. వైద్య విధానపరిషత్, డెరైక్టర్ ఆఫ్ హెల్త్ విభాగాల్లో పనిచేస్తూ పీజీ వైద్య విద్య పూర్తిచేసిన 250 మందిని లాటరల్ ఎంట్రీ పేరుతో ఇన్‌సర్వీస్ అభ్యర్థులను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్ ఇస్తున్నది కేవలం కొత్త అభ్యర్థులకు మాత్రమే. ఇప్పటికే రాష్ట్రంలో సుమారు 8 వేల మంది పీజీ చేసి నిరుద్యోగులుగా ఉన్నట్టు అంచనా. 200 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉన్న ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో 200కు పైగా సివిల్ అసిస్టెంట్ సర్జన్(స్పెషలిస్ట్) పోస్టులను నియమించాలని నిర్ణయించారు. తొలిసారి ఆన్లైన్లో భర్తీ గతంలో జరిగిన అక్రమాలను దృష్టిలో ఉంచుకొని ఈ మారు వైద్య విద్యాశాఖ ఆన్లైన్లో పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్) ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. -
అర్హుల గుర్తింపులో సాంకేతిక సమస్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సామాజిక పింఛన్ల పథకం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈనెల 8వతేదీ నుంచి అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తున్నామంటూ హడావుడిగా ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభించిన సర్కారు ప్రస్తుతం నెమ్మదించింది. లబ్ధిదారుల అర్హతలో నెలకొన్న తీవ్ర అయోమయం కారణంగా.. ఒకట్రెండు రోజులు ఉరుకులు, పరుగులు పెట్టిన అధికారులు.. తాజాగా చేతులు ముడుచుకున్నారు. సాంకేతికంగా నెలకొన్న సమస్యను సాకుగా చూపుతున్న ఏకంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియనే నిలిపివేయడం గమనార్హం. దీంతో జిల్లావ్యాప్తంగా మండల కార్యాలయాల వద్ద లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పంచింది 10వేల లోపే..! జిల్లాలో సామాజిక పింఛన్ల కోసం 3,69,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మొత్తంగా 2,37,443 మందిని ఆసరా పథకానికి అర్హులుగా నిర్ధారించారు. ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో వివరాల నమోదుకు ఉపక్రమించి.. ఇప్పటివరకు 2,05,940 మంది వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేశారు. ఎంట్రీ అనంతరం ఈ వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి లాగిన్ ఐడీలోని సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చి.. లబ్ధిదారులకు అర్హత కార్డులను ముద్రించి ఇవ్వాలి. కానీ డాటాఎంట్రీ ప్రక్రియలో తలెత్తిన సమస్యతో వేలాది మంది అర్హుల పేర్లు.. అనర్హులుగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆసరా అర్హులు అంశం మళ్లీ మొదటికొచ్చింది. అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందనే విషయం చిక్కకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈనెల 8, 9 తేదీల్లో మండల కేంద్రాల్లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఒక్కో మండలంలో గరిష్టంగా రెండు వందల మంది చొప్పున.. జిల్లా వ్యాప్తంగా 10వేలలోపు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పూర్తిస్థాయి అర్హుల జాబితా తేలకపోవడం.. సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏకంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియనే నిలిపివేశారు. సమన్వయ లోపంతోనే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమానికి సంబంధించి వివరాల నమోదు ప్రక్రియ అంతా ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్) పర్యవేక్షించింది. తాజాగా సామాజిక పింఛన్లకు సంబంధించి అర్హుల డాటా ఎంట్రీ ప్రక్రియను టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేశారు. అయితే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు, దరఖాస్తులను పరిశీలించి అర్హులుగా తేల్చిన లబ్ధిదారుల వివరాలను సరిపోల్చి కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు సాఫ్ట్వేర్లలో నిక్షిప్తం చేసిన వివరాలు సరిపోలక వేలాది పేర్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో యంత్రాంగంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన సంస్థల మధ్య సమన్వం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని స్పష్టమవుతోంది. కొలిక్కి వచ్చేదెన్నడో.. మరో 10రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. ఈలోపు అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడంలేదు. ముందుగా సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్యను పరిష్కరించిన తర్వాతే అర్హులపై స్పష్టత రానుంది. కానీ ఈ సమస్య ఇప్పట్లో కొలిక్కివచ్చే అవకాశంలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించాలంటే కనిష్టంగా నెలరోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే పింఛన్ల పంపిణీపై స్పష్టత వస్తుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
సమగ్ర సర్వేలో నమోదైన కుటుంబాలు 9.85లక్షలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సుమారు పక్షం రోజుల పాటు సాగిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తి కావడంతో సమాచారం వెలుగు చూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. సర్వేలో సేకరించిన సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ విశ్లేషిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8,69,451 కుటుంబాలుండగా, ప్రస్తుత సర్వేలో 9,85,557 కుటుంబాలున్నట్లు తేలింది. మరోవైపు జిల్లా జనాభా 40,53,028 కాగా, సమగ్ర సర్వేలో 42,14,865 మంది తమ వివరాలు నమోదు చేసుకున్నారు. జిల్లాలో అత్యధికంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, రూరల్ మండలంలో 63,758 కుటుంబాలుండగా, పెద్ద మందడి మండలంలో అత్యల్పంగా 8,866 కుటుంబాలున్నట్లు సర్వేలో తేలింది. పౌర సరఫరాల శాఖ వివిధ కేటగిరీల కింద 11,73,988 రేషన్ కార్డులు జారీ చేయగా, ప్రస్తుతం వీటిలో అదనంగా ఉన్న కార్డులను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. సమగ్ర సర్వే లెక్కల ప్రకారం జిల్లాలో కుటుంబాల సంఖ్యను మించి రేషన్ కార్డులున్నట్లు మరో మారు తేటతెల్లమైంది. సమగ్ర సర్వే సందర్భంగా వివరాల నమోదు సందర్భంగా ఎన్యూమరేటర్లు కొన్నిచోట్ల ఖాళీలను వదలడంతో సమాచారాన్ని పోల్చి చూడడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు సమాచారం. కులాల వారీగా సమాచారం, ఫోన్లు, బ్యాంకు అకౌంట్లున్న వారు, వికలాంగుల వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. మరుగుదొడ్లు, మంచినీరు, విద్యుత్ సౌకర్యమున్న కుటుంబాల సంఖ్య భవిష్యత్ ప్రణాళికల్లో కీలకమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూమి కలిగి ఉన్న కుటుంబాలు, సొంత వాహనాలు, పశు సంపద తదితర వివరాలు ఇతర జిల్లాల్లో కంప్యూటరీకరణ పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం వుంది. రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్‌కు సంబంధించిన సర్వే వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత సమగ్ర సర్వే సమాచారాన్ని అధికారికంగా వెల్లడించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు అందినట్లు చెబుతున్నారు. -
‘మాఫీ’డేటా అప్డేట్ కావాలి
15లోగా పూర్తి చేయండి బ్యాంకర్లకు కలెక్టర్ సూచన విశాఖ రూరల్: రుణమాఫీకి అర్హులైన వారి వివరాలను ఈ నెల 15లోపు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) వెబ్సైట్లో అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ బ్యాంకర్లను కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, బ్రాంచ్ మేనేజర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ అంశంపై ఈ నెల 3వ తేదీన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వాటికి అనుగుణంగా రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లు అందజేసిన సీబీఎస్(కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్) ఫార్మాట్లోని డేటా శనివారం సాయంత్రం నుంచి ఎన్ఐసీ వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుందని వె ల్లడించారు. ఈ వెబ్సైట్లో 31 కాలమ్స్‌తో కూడిన ఫార్మాట్‌ను ఉంచామన్నారు. సీబీఎస్ ఫార్మాట్లో డేటాకు అదనంగా ఆధార్‌నెంబర్, రేషన్‌కార్డు నెంబర్, ఆర్ఓఆర్, 1-బి ఖాతా నెంబర్, సర్వే నెంబర్, భూ విస్తీర్ణం తదితర వివరాలను బ్యాంకు బ్రాంచ్‌ల వారీగా అప్డేట్ చేయాల్సి ఉందని వివరించారు. జిల్లాలో మండలాల వారీగా రేషన్‌కార్డులకు అనుసంధానం చేసిన ఆధార్‌కార్డు నెంబర్ల వివరాలతో పాటు ఇతర వివరాలు ఎన్ఐసీ అధికారుల వద్ద డీవీడీల రూపంలో ఉన్నాయని, ఆ డేటాను వినియోగించుకుంటూ బ్రాంచ్ మేనేజర్లు వెబ్‌సైట్‌లోని 31 కాలమ్‌లను అప్డేట్ చేయాలని సూచించారు. ఈ కాలమ్‌లలో ఆధార్ సంఖ్య, రేషన్‌కార్డు వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉందన్నారు. జిల్లాలో 43 బ్యాంకులకు చెందిన 612 బ్రాంచ్‌లు ఉన్నాయని, ఒక్కొక్క బ్రాంచ్‌లో రుణమాఫీకి సంబంధించి సుమారు వెయ్యి ఖాతాలకు మించి ఉండవన్నారు. బ్రాంచ్ మేనేజర్లు ప్రత్యేక చొరవ తీసుకొని పంట రుణాలు పొందిన రైతుల డేటాను నిర్ణీత కాలవ్యవధిలో వెబ్సైట్లో అప్డేట్ చేయాలని చెప్పారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) మహిళలు బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో ఏజేసీ వై.నరసింహారావు, ఎల్డీఎం జయబాబు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్, డీసీఓ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.