‘మాఫీ’డేటా అప్‌డేట్ కావాలి
- 15లోగా పూర్తి చేయండి
- బ్యాంకర్లకు కలెక్టర్ సూచన
విశాఖ రూరల్: రుణమాఫీకి అర్హులైన వారి వివరాలను ఈ నెల 15లోపు నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ బ్యాంకర్లను కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, బ్రాంచ్ మేనేజర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ అంశంపై ఈ నెల 3వ తేదీన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వాటికి అనుగుణంగా రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లు అందజేసిన సీబీఎస్(కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్) ఫార్మాట్‌లోని డేటా శనివారం సాయంత్రం నుంచి ఎన్‌ఐసీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుందని వె ల్లడించారు.
ఈ వెబ్‌సైట్‌లో 31 కాలమ్స్‌తో కూడిన ఫార్మాట్‌ను ఉంచామన్నారు. సీబీఎస్ ఫార్మాట్‌లో డేటాకు అదనంగా ఆధార్‌నెంబర్, రేషన్‌కార్డు నెంబర్, ఆర్‌ఓఆర్, 1-బి ఖాతా నెంబర్, సర్వే నెంబర్, భూ విస్తీర్ణం తదితర వివరాలను బ్యాంకు బ్రాంచ్‌ల వారీగా అప్‌డేట్ చేయాల్సి ఉందని వివరించారు. జిల్లాలో మండలాల వారీగా రేషన్‌కార్డులకు అనుసంధానం చేసిన ఆధార్‌కార్డు నెంబర్ల వివరాలతో పాటు ఇతర వివరాలు ఎన్‌ఐసీ అధికారుల వద్ద డీవీడీల రూపంలో ఉన్నాయని, ఆ డేటాను వినియోగించుకుంటూ బ్రాంచ్ మేనేజర్లు వెబ్‌సైట్‌లోని 31 కాలమ్‌లను అప్‌డేట్ చేయాలని సూచించారు.
ఈ కాలమ్‌లలో ఆధార్ సంఖ్య, రేషన్‌కార్డు వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉందన్నారు. జిల్లాలో 43 బ్యాంకులకు చెందిన 612 బ్రాంచ్‌లు ఉన్నాయని, ఒక్కొక్క బ్రాంచ్‌లో రుణమాఫీకి సంబంధించి సుమారు వెయ్యి ఖాతాలకు మించి ఉండవన్నారు. బ్రాంచ్ మేనేజర్లు ప్రత్యేక చొరవ తీసుకొని పంట రుణాలు పొందిన రైతుల డేటాను నిర్ణీత కాలవ్యవధిలో వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని చెప్పారు.
ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) మహిళలు బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో ఏజేసీ వై.నరసింహారావు, ఎల్‌డీఎం జయబాబు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్, డీసీఓ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.