ఖరీఫ్ ముంచుకొచ్చేసింది... పెట్టుబడులకోసం అన్నదాతలు పరుగులు పెడుతున్నారు... రుణమాఫీ ‘మాయ’లో పడి పాత బకాయిలు తీర్చక డిఫాల్టర్లుగా మారి... కొత్త రుణాలు పొందేందుకు అనర్హులయ్యారు. ఏటా ప్రతికూల పరిస్థితులవల్ల ఆర్థికంగా చితికిపోయిన కర్షకునికి బ్యాంకుల క‘రుణ’ కరువైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుగా అప్పులకోసం నానా తిప్పలు పడుతున్నారు.
శ్రీకాకుళం రూరల్ : ఏటా తలెత్తిన ప్రతికూల పరిస్థితులతో నష్టాలు చవిచూస్తున్న రైతు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమాయత్తమవుతున్నాడు. అయినా ఆర్థిక పరిస్థితులు సహకరించడంలేదు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో పాత బకాయిలు తీర్చకుండా కాలయాపన చేసిన రైతు నెత్తిన బ్యాంకులో పేరుకుపోయిన మొత్తాలు గుదిబండలా మారాయి. కొత్తగా పెట్టుబడులకోసం బ్యాంకుల కెళ్తే వారినుంచి మొండిచెయ్యి ఎదురవుతోంది. మృగశిర కార్తె పోయి ఆరుద్ర కార్తె ప్రవేశించినా పొలం పనులు ఇంకా ముందుకు సాగడంలేదు. ఈ పాటికే వేరుశనగ, గోగు వంటి పంటలకు గొప్పులు కూడా పూర్తి చేయాలి. కానీ ఇటు వర్షాభావం, అటు మదుపులు లేకపోవడంవారిని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనీయడంలేదు.
బకాయిలు బారెడు... మాఫీ బెత్తెడు
జిల్లాలో సుమారు 6లక్షల మంది రైతులున్నారు. వీరిలో సుమారు 5 లక్షల మంది రూ. 1985 కోట్లవరకూ పంట రుణాలు తీసుకున్నారు. రెండు విడతల్లో 2,84,000మంది రైతులకు రూ. 367 కోట్లు మాత్రమే రుణ మాఫీ జరిగింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్... ఆధార్ నంబరు... రేషన్‌కార్డు నంబర్... ఒక కుటుంబంలో ఒకరికే... ఇలా సవాలక్ష షరతుల కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. దీంతో అటు రుణం తీర్చుకోలేక.. ఇటు కొత్త రుణం అందక రైతు పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. ఇప్పటికే వరుసగా పంట పాడవడంతో దొరికినకాడికల్లా అప్పులు చేసిన అన్నదాతకు కొత్తగా అప్పు ఇచ్చే నాథుడే కరువయ్యాడు. బంగారం కూడా బ్యాంకుల్లో కుదువపెట్టి మరీ భూమాతను నమ్ముకుని వ్యవసాయంలో పెట్టారు. అటు ప్రకృతి.. ఇటు ప్రభుత్వం రైతును ముంచాయి. దీంతో కోటి ఆశల ఖరీఫ్ కోసం ఎవరు అప్పు ఇస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. రుణాల రీషెడ్యూల్ చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నా అప్పులు తీర్చే పరిస్థితిలో లేని రైతన్న అయోమయంగా చూస్తున్నాడు.
పంట రుణాల లక్ష్య రూ. 1994కోట్లు
ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 1994 కోట్లుగా నిర్ణయించారు. ఖరీఫ్‌కు రూ. 1396 కోట్లు, రబీకి రూ. 598 కోట్లు ఇవ్వాలని భావించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతోంది. జూలై నెల దగ్గర పడుతోంది. కార్తెలు ముగిసిపోతున్నాయి. అయినా ఇప్పటికి రూ. 100కోట్లు మాత్రమే కొత్త రుణాలు తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే రుణ మాఫీ ప్రభావం రైతులపై ఏవిధంగా ఉందో అర్ధమవుతోంది. రుణాలు రీషెడ్యూల్ చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కేవలం రెన్యువల్ మాత్రమే చేస్తామని చెప్పడంతో రుణమాపీ వర్తించిన రైతులు మాత్రమే కొత్త రుణాలు తీసుకుంటున్నారు. అందులోనూ వడ్డీభారం పెరిగిపోయినవారు ఆ అవకాశాన్నీ వినియోగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం స్పందించి కనీసం రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరుతున్నారు.
‘అప్పు’డే తిప్పలు
Published Thu, Jun 18 2015 12:55 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement