the Kharif
-
‘అప్పు’డే తిప్పలు
ఖరీఫ్ ముంచుకొచ్చేసింది... పెట్టుబడులకోసం అన్నదాతలు పరుగులు పెడుతున్నారు... రుణమాఫీ ‘మాయ’లో పడి పాత బకాయిలు తీర్చక డిఫాల్టర్లుగా మారి... కొత్త రుణాలు పొందేందుకు అనర్హులయ్యారు. ఏటా ప్రతికూల పరిస్థితులవల్ల ఆర్థికంగా చితికిపోయిన కర్షకునికి బ్యాంకుల క‘రుణ’ కరువైంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటుగా అప్పులకోసం నానా తిప్పలు పడుతున్నారు. శ్రీకాకుళం రూరల్ : ఏటా తలెత్తిన ప్రతికూల పరిస్థితులతో నష్టాలు చవిచూస్తున్న రైతు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సమాయత్తమవుతున్నాడు. అయినా ఆర్థిక పరిస్థితులు సహకరించడంలేదు. చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీతో పాత బకాయిలు తీర్చకుండా కాలయాపన చేసిన రైతు నెత్తిన బ్యాంకులో పేరుకుపోయిన మొత్తాలు గుదిబండలా మారాయి. కొత్తగా పెట్టుబడులకోసం బ్యాంకుల కెళ్తే వారినుంచి మొండిచెయ్యి ఎదురవుతోంది. మృగశిర కార్తె పోయి ఆరుద్ర కార్తె ప్రవేశించినా పొలం పనులు ఇంకా ముందుకు సాగడంలేదు. ఈ పాటికే వేరుశనగ, గోగు వంటి పంటలకు గొప్పులు కూడా పూర్తి చేయాలి. కానీ ఇటు వర్షాభావం, అటు మదుపులు లేకపోవడంవారిని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యనీయడంలేదు. బకాయిలు బారెడు... మాఫీ బెత్తెడు జిల్లాలో సుమారు 6లక్షల మంది రైతులున్నారు. వీరిలో సుమారు 5 లక్షల మంది రూ. 1985 కోట్లవరకూ పంట రుణాలు తీసుకున్నారు. రెండు విడతల్లో 2,84,000మంది రైతులకు రూ. 367 కోట్లు మాత్రమే రుణ మాఫీ జరిగింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్... ఆధార్ నంబరు... రేషన్‌కార్డు నంబర్... ఒక కుటుంబంలో ఒకరికే... ఇలా సవాలక్ష షరతుల కారణంగా చాలా మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదు. దీంతో అటు రుణం తీర్చుకోలేక.. ఇటు కొత్త రుణం అందక రైతు పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. ఇప్పటికే వరుసగా పంట పాడవడంతో దొరికినకాడికల్లా అప్పులు చేసిన అన్నదాతకు కొత్తగా అప్పు ఇచ్చే నాథుడే కరువయ్యాడు. బంగారం కూడా బ్యాంకుల్లో కుదువపెట్టి మరీ భూమాతను నమ్ముకుని వ్యవసాయంలో పెట్టారు. అటు ప్రకృతి.. ఇటు ప్రభుత్వం రైతును ముంచాయి. దీంతో కోటి ఆశల ఖరీఫ్ కోసం ఎవరు అప్పు ఇస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. రుణాల రీషెడ్యూల్ చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నా అప్పులు తీర్చే పరిస్థితిలో లేని రైతన్న అయోమయంగా చూస్తున్నాడు. పంట రుణాల లక్ష్య రూ. 1994కోట్లు ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 1994 కోట్లుగా నిర్ణయించారు. ఖరీఫ్‌కు రూ. 1396 కోట్లు, రబీకి రూ. 598 కోట్లు ఇవ్వాలని భావించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతోంది. జూలై నెల దగ్గర పడుతోంది. కార్తెలు ముగిసిపోతున్నాయి. అయినా ఇప్పటికి రూ. 100కోట్లు మాత్రమే కొత్త రుణాలు తీసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే రుణ మాఫీ ప్రభావం రైతులపై ఏవిధంగా ఉందో అర్ధమవుతోంది. రుణాలు రీషెడ్యూల్ చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కేవలం రెన్యువల్ మాత్రమే చేస్తామని చెప్పడంతో రుణమాపీ వర్తించిన రైతులు మాత్రమే కొత్త రుణాలు తీసుకుంటున్నారు. అందులోనూ వడ్డీభారం పెరిగిపోయినవారు ఆ అవకాశాన్నీ వినియోగించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం స్పందించి కనీసం రుణాలు రీషెడ్యూల్ చేయాలని కోరుతున్నారు. -
కౌలురైతు కష్టం దేవుడికే ఎరుక
‘కౌలు రైతుల కష్టాలు దేవుడికి ఎరుక’ అన్నట్టు సార్వా సీజన్ ముగుస్తున్నా ఇప్పటికీ కౌలు రైతులను పట్టించుకున్న నాధుడే లేరు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. గుంటూరు జిల్లాలో కౌలు రైతులకు ఈ ఏడాది వందకోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా, కేవలం రూ. 53 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చిలకలూరిపేటరూరల్ : జిల్లా వ్యాప్తంగా లక్షల్లో ఉన్న కౌలు రైతులను ఈ ఏడాది ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఖరీఫ్‌లో అప్పులపాలయ్యారు. సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడులకు అందినచోటల్లా అప్పులు చేశారు. ఏదో ఒక సమయంలో ప్రభుత్వం పట్టించు కోకపోతుందా అని ఆశించిన కౌలు రైతులకు నిరాశే ఎదురవుతోంది. చివరకు అప్పులే మిగిలేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు పంట రుణాలు అందించడం, వివిధ కారణాలతో పంటలను నష్టపోయిన కౌలుదారులను ఆదుకుని, తిరిగి సాగుకు ప్రోత్సహించే విధంగా 2011లో భూ అధీకృత రైతుల చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కౌలు రైతులను గుర్తించి కార్డులు అందజేయాలి. తద్వారా బ్యాంకు రుణం పొందే అవకాశం కల్పించాలి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. ఏదో మొక్కుబడిగా కౌలు రైతుల గుర్తింపు చేపట్టి చేతులు దులుపుకుంది. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామమాత్ర సంఖ్యలో గుర్తింపు కార్డులు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో కౌలు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో కేవలం 27వేల మంది మాత్రమే కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించి భూ అధీకృత గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. వారిలో 212 మందికి ఒక్కొక్కరికీ రూ. 25వేలు చొప్పున మాత్రమే వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించటం, రుణాల మంజూ రుకు బ్యాంకర్లు విముఖత వ్యక్తం చేయడంతో కౌలు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి పెట్టుబడులకు అప్పులు చేశారు. ఖరీఫ్ ఆరంభంలో వాతావరణం అనుకూలించకపోవటం, వర్షా లు సక్రమంగా లేకపోవడం, పెరిగిన ఎరువుల ధరలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సాగు పెట్టుబడులతోపాటే అప్పులూ పెరిగాయి. వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని సాగు చేపట్టారు. ఇప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ఖరీఫ్ దిగుబడులతో అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక కౌలు రైతులు తలలు పట్టుకుంటున్నారు. కౌలు రైతులకు రుణ పంపిణీ జరిగిన తీరు .... సంవత్సరం కౌలు దారుల సంఖ్య రుణాల లక్ష్యం పంపిణీ చేసింది 2011-12 40,470 రూ 100 కోట్లు రూ 26 కోట్లు 2012-13 16,664 రూ 100కోట్లు రూ 20కోట్లు 2013-14 21,413 రూ 100కోట్లు రూ 12.31కోట్లు 2014-15 27,000 రూ 100 కోట్లు రూ 53 లక్షలు -
అదిగో.. ఇదిగో..!
అనంతపురం అగ్రికల్చర్ : ఇన్పుట్ సడ్సిడీ విషయంలో జిల్లా మంత్రుల తీరు విమర్శలకు తావిస్తోంది. అదిగో.. ఇదిగో అంటూ కాలయూపన చేస్తున్నారే తప్పా నిర్ధిష్టంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఫలితంగా ‘అనంత’ రైతాంగం ఆందోళన చెందుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా 2013 ఖరీఫ్‌లో జరిగిన పంట నష్టానికి సంబంధించి జిల్లా రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) ఇస్తారా, లేదా అన్నది అనుమానంగా మారింది. దీనిపై పాలకపక్ష నేతలు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. గతేడాది ఖరీఫ్‌లో వేరుశనగతో పాటు మిగతా అన్ని పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 63 మండలాలనూ కరువు ప్రాంతాల జాబితాలో చేర్చింది. 9.54 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రాగా, అందులో 6.55 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్నట్లు గుర్తించారు. అందులోనూ అత్యధికంగా వేరుశనగ 5.84 లక్షల హెక్టార్లలో దెబ్బతినింది. తక్కిన వాటిలో కంది, ఆముదం, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పత్తి, సోయాబీన్స్, జొన్న, ఉలవ, రాగి... ఇలా పది పంటలకు నష్టం వాటిల్లింది. మొత్తం 6,21,528 మంది రైతులకు రూ.643 కోట్ల 37 లక్షల 61 వేల 529 నష్టం జరిగినట్లు అధికారికంగా తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకు ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. జిల్లాకు చెందిన మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి ఒకట్రెండు సార్లు ఇన్పుట్ సబ్సిడీ గురించి ప్రస్తావించినా..నిర్ధిష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదు. పంట రుణాలు, వాతావరణ బీమా అందక కష్టాల్లో ఉన్న ‘అనంత’ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా రాకపోవడంతో మరిన్ని ఇబ్బందుల్లో పడ్డారు. 2012కు సంబంధించి రూ.648 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ గతేడాది మేలోనే ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 30వ తేదీ బ్యాంకుల్లో కూడా వేసింది. ఈ ఏడాది ఇంతవరకు ఎలాంటి హామీ లభించలేదు. ఇంతకీ వస్తుందా, లేదా అనేది కూడా చెప్పడానికి అధికారులు, పాలకపక్ష నేతలు నిరాకరిస్తున్నారు. పంట నష్టం నివేదిక ప్రకారం రూ.643.37 కోట్లు విడుదల చేస్తే... అందులో అత్యధికంగా కళ్యాణదుర్గం మండలానికి రూ.24 కోట్లు, వజ్రకరూరు రూ.22 కోట్లు, కనగానపల్లి రూ.21 కోట్లు, కంబదూరు రూ.20 కోట్లు, గుంతకల్లు రూ.18 కోట్లు, ముదిగుబ్బ రూ.17 కోట్లు, కూడేరు, చెన్నేకొత్తపల్లి మండలాలకు రూ.16 కోట్లు చొప్పున లభిస్తుంది. అలాగే రాప్తాడు, గుత్తి మండలాలకు రూ.15 కోట్ల చొప్పున, ఉరవకొండ, ధర్మవరం, రామగిరి మండలాలకు రూ.14 కోట్ల చొప్పున, మడకశిరకు రూ.13 కోట్లు దక్కుతుంది. తక్కిన అన్ని మండలాల రైతులు అంతో ఇంతో పరిహారం తీసుకునే అవకాశం ఉంటుంది. -
అప్పుల ఊబిలో టమాట రైతు
మూడేళ్లుగా తీవ్రంగా నష్టపోయినా కనికరించని ప్రభుత్వం నాలుగేళ్లలో జిల్లాలో 1,55,275 ఎకరాల్లో పంటసాగు రుణమాఫీలో చోటు దక్కక దిగాలు జిల్లాలో రూ.1,500 కోట్ల అప్పుల్లో రైతాంగం బి.కొత్తకోట: టమాట రైతులు గడచిన నాలుగేళ్లలో 1,55,275 ఎకరాల్లో పంట సాగుచేశారు. 2010-11లో 15,320 హెక్టార్లు.. 2011-12లో 17,581 హెక్టార్లు.. 2012-13లో 16,224 హెక్టార్లు.. 2013-14లో 12,985 హెక్టార్లలో సాగుచేశారు. ఇందులో అత్యధికంగా తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో తర్వాత పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో సాగైంది. మిగతా ప్రాంతాల్లో నామమాత్రంగా సాగుచేశారు. ఖరీఫ్, రబీతోపాటు వ్యవసాయ బోర్ల కింద పంట సాగైంది. ఈ సంవత్సరాల్లో రైతులు అత్యధిక ధరలను పొందిందిలేదు. అప్పుడప్పుడు మంచి ధర పలికినా నిలకడగా లేవు. చాలాకాలం తర్వాత ఈ ఏడాదిలో రెండు నెలలు మాత్రమే అత్యధిక ధర పలికింది. రుణాలు వందల కోట్లలో.. చెరుకు రైతులకు మాత్రమే బ్యాంకులు ఎకరాకు రూ.40 నుంచి రూ.50వేల రుణం ఇస్తాయి. ఆ తర్వా త టమాట రైతుకు రూ.25 వేల నుంచి రూ.30వేలు ఇస్తాయి. వేరుశెనగకు తక్కువ రుణం వస్తుంది. దీంతో టమాట సాగుచేసిన రైతులు టమాటపైనే రుణం తీసుకున్నారు. 2009-10లో టమాట సాగుకు ఎకరాకు రూ.20వేలు, 2009-10లో రూ.25వేలు, 2012-13లో రూ.30వేలు, 2013-14లో రూ.30వేల రుణంగా బ్యాంకులు నిర్ణయించి ఆమేరకు పాసుపుస్తకాలు, బంగారం తాకట్టుపై అప్పులిచ్చాయి. ఇలా అప్పులు తీసుకొన్న రైతులు జిల్లాలో వేలసంఖ్యలో ఉన్నారు. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే 2008-09నుంచి 2013 డిసెంబరు నాటికీ 37,251 మంది రైతులు రూ.162.9కోట్ల రుణం తీసుకున్నా రు. వీరుకాక జిల్లాలో మొత్తం రూ.1,500కోట్ల మేర కు అప్పులను టమాట రైతులు చెల్లించాల్సి ఉన్నట్టు అంచనా. బ్యాంకులిచ్చే రూ.30వేల రుణంతో కనీసం సగం మంది రైతులు ఈ నాలుగేళ్లలో రూ.2,500కోట్ల దాకా అప్పులు పొందడం, తిరిగి చెల్లిస్తూ, కొత్త రుణాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అప్పులు చెల్లించలేక నిస్సహాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ప్రభుత్వం ఊరట కలిగిస్తుందని ఆశించినా ఫలితం లేకుండాపోతోంది. మాఫీకి సాకులు రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం కుంటిసాకులు వెదుకుతోంది. టమాట పంట ఉద్యానవనశాఖ పరిధిలో ఉందన్న సాకుతో రైతులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వేరుశెనగకు ప్రయత్యామ్నాయంగా సాగుచేస్తున్న టమాటకు సరైన ప్రోత్సాహం ఇవ్వని ప్రభుత్వం కనీసం రుణ మాఫీనైనా వర్తింపజేయకపోవడంపై నిరాశ వ్యక్తమవుతోంది. కోట్ల పెట్టుబడిని కళ్లముందునే నష్టపోతున్న టమాట రైతులను ఆదుకునేందుకు రుణమాఫీని వర్తింపజేయాలని రైతాంగం కోరుతోంది. రుణం మాఫీ కాదు.. కొత్త అప్పులు పుట్టవు మూడేళ్ల క్రితం సొసైటీ బ్యాంకులో రూ.50 వేల పంట రుణం తీసుకున్నా. రెండు ఎకరాల్లో టమాట పంట సాగు చేశా. రూ.90 వేలు ఖర్చు అయింది. బ్యాంకులో తెచ్చిన రుణం చాలక ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి పంటపై ధారపోశా. 30 వేల నష్టం వచ్చింది. ఈ ఏడాది బంగారు నగలను తాకట్టు పెట్టి స్టేట్ బ్యాంకులో రూ.50 వేల రుణం తీసుకున్నా. ఇటీవల రెండు ఎకరాల్లో టమాటా సాగు చేశా. పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోయాయి. బ్యాంకులో చూస్తే తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి చూస్తే రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు మాఫీ చేయక పూటకో మాట మాట్లాడుతావుండాడు. బ్యాంకోళ్ళు కొత్తగా పంట రుణాలు ఇవ్వలేదు. పాసు బుక్కులు, బంగారు నగలు బ్యాంకులో ఉంటే ఏం జూసి మాకు ప్రైవేటు వ్యక్తులు కూడా అప్పులు ఇస్తారు. -సిద్దారెడ్డి, రైతు, పెద్దతిప్పసముద్రం మండలం ఆవులకు వదిలేశాం రెండెకరాల్లో టమాట సాగు చేశాం. రూ.లక్ష దాకా ఖర్చయ్యింది. ఇప్పటివరకు రూ.20 వేలు మాత్రమే వచ్చింది. తొలి నుంచి రేటు లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశాలు కన్పించ డం లేదు. దీంతో సగం పంటలో ఆవులను తోలేశాం. రేటు ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేటు లేనప్పుడు మాత్రం చేతులెత్తేసింది. రైతుకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా ఆదుకునే వారు లేరు. -బి.కృష్ణారెడ్డి, సర్కారుతోపు, కురబలకోట మండలం బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామానికి చెందిన రైతు బయ్యారెడ్డి ఏళ్ల తరబడి టమాట పండిస్తున్నాడు. 2011లో బి.కొత్తకోట గ్రామీణ బ్యాంకులో రూ.50వేలు, ఇండియన్ బ్యాంకులో 1.5లక్షల అఫ్పు తీసుకున్నాడు. పంటనష్టం వాటిల్లినా రూ.1.5లక్షల రుణం చెల్లించాడు. మళ్లీ పంటకోసం 2012లో ఇండియన్ బ్యాంకులో తీసుకున్న రూ.2లక్షలు రుణాన్ని 2013లో కట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.లక్ష అప్పుచేశాడు. రుణాలపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న బయ్యారెడ్డి రుణ మాఫీపై ఆశపెట్టుకున్నాడు. మాఫీ ఇస్తే చెల్లించిన సొమ్ము తిరిగి దక్కుతుందనుకున్నాడు. అయితే టమాట రైతుకు మాఫీ అయ్యే పరిస్థితులు లేవని తేలిపోవడంతో నిరాశవ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికీ గ్రామీణ బ్యాంకులోని రూ.50వేల రుణం చెల్లించలేదు. అదైనా మాఫీ అవుతుందో లేదోనని ఎదురుచూస్తున్నాడు.