కౌలురైతు కష్టం దేవుడికే ఎరుక | God alone can be difficult to relate kauluraitu | Sakshi
Sakshi News home page

కౌలురైతు కష్టం దేవుడికే ఎరుక

Published Sat, Nov 29 2014 1:15 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

కౌలురైతు కష్టం దేవుడికే ఎరుక

కౌలురైతు కష్టం దేవుడికే ఎరుక

‘కౌలు రైతుల కష్టాలు దేవుడికి ఎరుక’ అన్నట్టు సార్వా సీజన్ ముగుస్తున్నా ఇప్పటికీ కౌలు రైతులను పట్టించుకున్న నాధుడే లేరు. సాక్షాత్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు. గుంటూరు జిల్లాలో కౌలు రైతులకు ఈ ఏడాది వందకోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా, కేవలం రూ. 53 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు.
 
చిలకలూరిపేటరూరల్ : జిల్లా వ్యాప్తంగా లక్షల్లో ఉన్న కౌలు రైతులను ఈ ఏడాది ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఖరీఫ్‌లో అప్పులపాలయ్యారు. సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెట్టుబడులకు అందినచోటల్లా అప్పులు చేశారు. ఏదో ఒక సమయంలో ప్రభుత్వం పట్టించు కోకపోతుందా అని ఆశించిన కౌలు రైతులకు నిరాశే ఎదురవుతోంది. చివరకు అప్పులే మిగిలేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వ లక్ష్యాల మేరకు పంట రుణాలు అందించడం, వివిధ కారణాలతో పంటలను నష్టపోయిన కౌలుదారులను ఆదుకుని, తిరిగి సాగుకు ప్రోత్సహించే విధంగా 2011లో భూ అధీకృత రైతుల చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కౌలు రైతులను గుర్తించి కార్డులు అందజేయాలి. తద్వారా బ్యాంకు రుణం పొందే అవకాశం కల్పించాలి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. ఏదో మొక్కుబడిగా కౌలు రైతుల గుర్తింపు చేపట్టి చేతులు దులుపుకుంది.
 
 ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నామమాత్ర సంఖ్యలో గుర్తింపు కార్డులు ఇచ్చి చేతులు దులుపుకోవడంతో కౌలు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు.
 
 జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో కేవలం 27వేల మంది మాత్రమే కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించి భూ అధీకృత గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. వారిలో 212 మందికి ఒక్కొక్కరికీ రూ. 25వేలు చొప్పున మాత్రమే వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి.
 
 అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించటం, రుణాల మంజూ రుకు బ్యాంకర్లు విముఖత వ్యక్తం చేయడంతో కౌలు రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి పెట్టుబడులకు అప్పులు చేశారు.
 
 ఖరీఫ్ ఆరంభంలో వాతావరణం అనుకూలించకపోవటం, వర్షా లు సక్రమంగా లేకపోవడం, పెరిగిన ఎరువుల ధరలతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సాగు పెట్టుబడులతోపాటే అప్పులూ పెరిగాయి. వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకుని సాగు చేపట్టారు.
 
 ఇప్పటికీ బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో ఖరీఫ్ దిగుబడులతో అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక కౌలు రైతులు తలలు పట్టుకుంటున్నారు.
 
 కౌలు రైతులకు రుణ పంపిణీ జరిగిన తీరు ....
 సంవత్సరం         కౌలు దారుల సంఖ్య       రుణాల లక్ష్యం             పంపిణీ చేసింది
 2011-12                    40,470                రూ 100 కోట్లు                 రూ 26 కోట్లు
 2012-13                    16,664                 రూ 100కోట్లు                రూ 20కోట్లు
 2013-14                    21,413                 రూ 100కోట్లు                రూ 12.31కోట్లు
 2014-15                    27,000                 రూ 100 కోట్లు               రూ 53 లక్షలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement