
దినకరన్ వద్ద భూములు కొన్నాను: మంత్రి ప్రత్తిపాటి
విజయవాడ: అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలులో తనపై వచ్చిన ఆరోపణలపై విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థల్లో, హాయ్‌ల్యాండ్ ప్రాపర్టీకి కూడా డైరెక్టర్‌గా ఉన్న దినకరన్ వద్ద తాను కొన్న భూములకు, ఆరోపణలు వెల్లువెత్తుతున్న అగ్రిగోల్డ్ భూములకు సంబంధం లేదన్నారు. అగ్రిగోల్డ్ సంస్థలో దినకరన్ ప్రొఫెషనల్ డైరెక్టర్ మాత్రమేనని తెలిపారు.
తాను ముగ్గురు రైతుల వద్ద 14 ఎకరాలు కొన్నట్లు చెప్పారు. అదే విధంగా ఉదయ్ దినకరన్ వద్ద మరో 6 ఎకరాలు కొనుగోలు చేసినట్లు మంత్రి ప్రత్తిపాటి అంగీకరించారు. తనపై వచ్చిన ఆరోపణలను ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ నేతలు రుజువు చేయలేకపోయారని పేర్కొన్నారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు విషయంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై తాను చేసిన ఆరోపణలన్నింటినీ నిరూపిస్తానని, అందుకు తనకు 20 నిమిషాల సమయం ఇవ్వాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరగా సభలో ఆయనకు అవకాశం ఇవ్వలేదన్న విషయం తెలిసిందే.