సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు శుక్రవారం మంగళగిరిలోని సీబీసీఐడీ అడిషనల్ డీజీ అమిత్‌గర్గ్‌ను కలిసి వినతి పత్రం అందేజేశారు. అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించడంలో సీఐడీ అనుసరిస్తున్న వైఖరిలో అనేక అనుమానాలున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. సీబీసీఐడీ తన నివేదికలో బాధితుల సంఖ్య 19.50 లక్షలు అని చెప్పిందని, ప్రభుత్వ సలహాదారుడు కుటుంబరావు మాత్రం ఈ సంఖ్యను 10 లక్షల లోపే ఉంటుందని ప్రకటించారన్నారు.
కోర్టుకు చూపించని ఆస్తులను ప్రభుత్వం తీసుకొని, బాధితులకు రూ.300 కోట్లు ఇస్తుందని కుటుంబరావు ప్రకటించారని తెలిపారు. సీబీసీఐడీ దర్యాప్తులో కోర్ట్‌కు చూపిన ఆస్తులు ఎన్ని, చూపని ఆస్తులు ఎన్నో బహిర్గతం చేయాలని, అగ్రిగోల్డ్ యాజమాన్యంకు బినామీగా ఉన్న 156 కంపెనీల ఆస్తులపై వివరణ ఇవ్వాలన్నారు. చెక్ పవర్ ఉన్న డైరెక్టర్‌లను కేసుల్లో ఎందుకు పెట్టలేదో స్పష్టం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment