పిచ్చి పుల్లయ్యలా తయారయ్యారు!
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరుకు తగ్గట్లే పిచ్చిపుల్లయ్యలా తయారయ్యారని వైఎస్ఆర్‌సీపీ నాయకుడు గౌతం రెడ్డి మండిపడ్డారు. ఆయన తీరు పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టుకున్నట్లుందని ఎద్దేవా చేశారు. తాను అగ్రిగోల్డ్ సంస్థకు లీగల్ అడ్వైజర్‌నని ఆయన చెప్పారని, దమ్ముంటే దాన్ని నిరూపించాలని చాలెంజ్ చేశారు. ఈ విషయమై ఆయన శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు ఒక విషయంపై విచారణ పూర్తికాగా, దానిపై ఆయన విచారణకు ఆదేశిస్తామంటున్నారని, ఇదెక్కడి వ్యవహారమని ప్రశ్నించారు. చంద్రబాబు మాట్లాడమంటే ఈయనేదో మాట్లాడేస్తారని విమర్శించారు. రెండు ఎకరాల భూమి కొన్న వ్యక్తి తన భూమికి దారి లేదని, దారి చూపించాలని అడిగితే.. దానిపై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీసీఐడీ విచారణ జరిగిందని ఆయన తెలిపారు.
ఈ భూములతో తనకు గానీ, తన కుమారుడికి గానీ సంబంధం లేదని పోలీసులు తమ నివేదికలో తెలిపారని, అలాగే అగ్రిగోల్డ్‌తో కూడా సంబంధం లేదని చెప్పారని.. స్వయంగా డీజీపీయే దీనిపై డిక్లరేషన్ ఇచ్చారని అన్నారు. మీ పోలీసులు ఇచ్చిన నివేదికలను మీరు నమ్మరా అని ప్రత్తిపాటి పుల్లారావును గౌతం రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే విచారణ అయిపోయిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు విచారణకు ఆదేశిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. అగ్రిగోల్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి కొన్నట్లు ఆయనే చెప్పారని.. తాను మాత్రం రైతుల నుంచి తన కుమారుడి పేరు మీద కొన్నానని చెప్పారు. తాను కూడా అగ్రిగోల్డ్ బాధితుల్లో ఒకడినని, తనకు రావాల్సింది అడగలేని పరిస్థితుల్లో ఉన్నానని తెలిపారు. రాష్ట్రంలో 18 లక్షల మందికి పైగా ఉన్నబాధితుల గోడును వినిపించుకోవడం లేదని, ప్రత్తిపాటి పుల్లారావు మీద పరువునష్టం దావా వేస్తానని ఆయన స్పష్టం చేశారు.