సెటిల్‌మెంట్ కింద 6.19 ఎకరాలు హస్తగతం
ఆ భూముల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వ నిర్ణయం
సీఐడీకి అనుమతినిచ్చిన హోమ్ శాఖ
సాక్షి, అమరావతి: సామాన్య డిపాజిటర్లను నిండా ముంచేసిన అగ్రిగోల్డ్ కుంభకోణం మాటున టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన భూములపై ప్రభుత్వం కొరఢా ఝళిపించింది. అందులో మొదటి అడుగుగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అగ్రిగోల్డ్ నుంచి కొల్లగొట్టిన భూములను అటాచ్ చేయాలని నిర్ణయించింది. పుల్లారావు కుటుంబానికి చెందిన 6.19 ఎకరాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ నేతలు ఆ సంస్థకు చెందిన భూములను కొల్లగొట్టారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం కూడా ఆ భూ దోపిడీలో అడ్డగోలుగా లబ్ధి పొందింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం (అప్పటి ప్రకాశం జిల్లా) గురిజేపల్లిలోని సర్వే నంబర్లు 104/1, 104/3, 104/4, 104/5, 104/6, 103/2లో ఉన్న 6.19 ఎకరాలను హస్తగతం చేసుకుంది. అప్పటికే అగ్రిగోల్డ్ కంపెనీపై కేసు నమోదైంది.
ఆ కేసు పేరుతో భయపెట్టి సెటిల్‌మెంట్ కింద ఆ భూమి తమ పరం చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కనుకొల్లు ఉదయ్ దినకర్ పేరిట ఉన్న ఆ 6.19 ఎకరాలను పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ పేరిట బదిలీ చేశారు.
ఈమేరకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2015లో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఆ భూములను కామేపల్లి లక్ష్మీ ప్రసాద్, చెరుకూరి కోటేశ్వరరావు, కామేపల్లి గ్రానైట్స్ పేరిట బదిలీ చేసేశారు. ఈ విధంగా అగ్రిగోల్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు.
అటాచ్‌మెంట్‌కు అనుమతి
ఈ కేసు దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. డిపాజిటర్ల నిధులతో అగ్రిగోల్డ్ కంపెనీ కొనుగోలు చేసిన భూములను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం దక్కించుకుందని గుర్తించారు. దాంతో ఆ భూములను అటాచ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఐడీ పంపిన ప్రతిపాదనలను హోమ్ శాఖ ఆమోదించి అటాచ్‌మెంట్‌కు అనుమతి జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment