అనంతపురం అగ్రికల్చర్ : ఇన్‌పుట్ సడ్సిడీ విషయంలో జిల్లా మంత్రుల తీరు విమర్శలకు తావిస్తోంది. అదిగో.. ఇదిగో అంటూ కాలయూపన చేస్తున్నారే తప్పా నిర్ధిష్టంగా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఫలితంగా ‘అనంత’ రైతాంగం ఆందోళన చెందుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా 2013 ఖరీఫ్‌లో జరిగిన పంట నష్టానికి సంబంధించి జిల్లా రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) ఇస్తారా, లేదా అన్నది అనుమానంగా మారింది. దీనిపై పాలకపక్ష నేతలు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది.
గతేడాది ఖరీఫ్‌లో వేరుశనగతో పాటు మిగతా అన్ని పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 63 మండలాలనూ కరువు ప్రాంతాల జాబితాలో చేర్చింది. 9.54 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రాగా, అందులో 6.55 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్నట్లు గుర్తించారు. అందులోనూ అత్యధికంగా వేరుశనగ 5.84 లక్షల హెక్టార్లలో దెబ్బతినింది. తక్కిన వాటిలో కంది, ఆముదం, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పత్తి, సోయాబీన్స్, జొన్న, ఉలవ, రాగి... ఇలా పది పంటలకు నష్టం వాటిల్లింది.
మొత్తం 6,21,528 మంది రైతులకు రూ.643 కోట్ల 37 లక్షల 61 వేల 529 నష్టం జరిగినట్లు అధికారికంగా తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఇంతవరకు ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరుకు సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. జిల్లాకు చెందిన మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి ఒకట్రెండు సార్లు ఇన్‌పుట్ సబ్సిడీ గురించి ప్రస్తావించినా..నిర్ధిష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదు.
పంట రుణాలు, వాతావరణ బీమా అందక కష్టాల్లో ఉన్న ‘అనంత’ రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా రాకపోవడంతో మరిన్ని ఇబ్బందుల్లో పడ్డారు. 2012కు సంబంధించి రూ.648 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ గతేడాది మేలోనే ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 30వ తేదీ బ్యాంకుల్లో కూడా వేసింది. ఈ ఏడాది ఇంతవరకు ఎలాంటి హామీ లభించలేదు. ఇంతకీ వస్తుందా, లేదా అనేది కూడా చెప్పడానికి అధికారులు, పాలకపక్ష నేతలు నిరాకరిస్తున్నారు.
పంట నష్టం నివేదిక ప్రకారం రూ.643.37 కోట్లు విడుదల చేస్తే... అందులో అత్యధికంగా కళ్యాణదుర్గం మండలానికి రూ.24 కోట్లు, వజ్రకరూరు రూ.22 కోట్లు, కనగానపల్లి రూ.21 కోట్లు, కంబదూరు రూ.20 కోట్లు, గుంతకల్లు రూ.18 కోట్లు, ముదిగుబ్బ రూ.17 కోట్లు, కూడేరు, చెన్నేకొత్తపల్లి మండలాలకు రూ.16 కోట్లు చొప్పున లభిస్తుంది. అలాగే రాప్తాడు, గుత్తి మండలాలకు రూ.15 కోట్ల చొప్పున, ఉరవకొండ, ధర్మవరం, రామగిరి మండలాలకు రూ.14 కోట్ల చొప్పున, మడకశిరకు రూ.13 కోట్లు దక్కుతుంది. తక్కిన అన్ని మండలాల రైతులు అంతో ఇంతో పరిహారం తీసుకునే అవకాశం ఉంటుంది.
అదిగో.. ఇదిగో..!
Published Sun, Nov 2 2014 1:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement