అప్పుల ఊబిలో టమాట రైతు | Tomato farmer debt | Sakshi
Sakshi News home page

అప్పుల ఊబిలో టమాట రైతు

Published Sat, Oct 25 2014 3:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

Tomato farmer debt

  • మూడేళ్లుగా తీవ్రంగా నష్టపోయినా కనికరించని ప్రభుత్వం
  •  నాలుగేళ్లలో జిల్లాలో 1,55,275 ఎకరాల్లో పంటసాగు
  •  రుణమాఫీలో చోటు దక్కక దిగాలు
  •  జిల్లాలో రూ.1,500 కోట్ల అప్పుల్లో రైతాంగం
  • బి.కొత్తకోట: టమాట రైతులు గడచిన నాలుగేళ్లలో 1,55,275 ఎకరాల్లో పంట సాగుచేశారు. 2010-11లో 15,320 హెక్టార్లు.. 2011-12లో 17,581 హెక్టార్లు.. 2012-13లో 16,224 హెక్టార్లు.. 2013-14లో 12,985 హెక్టార్లలో సాగుచేశారు. ఇందులో అత్యధికంగా తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో తర్వాత పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో సాగైంది. మిగతా ప్రాంతాల్లో నామమాత్రంగా సాగుచేశారు. ఖరీఫ్, రబీతోపాటు వ్యవసాయ బోర్ల కింద పంట సాగైంది. ఈ సంవత్సరాల్లో రైతులు అత్యధిక ధరలను పొందిందిలేదు. అప్పుడప్పుడు మంచి ధర పలికినా నిలకడగా లేవు. చాలాకాలం తర్వాత ఈ ఏడాదిలో రెండు నెలలు మాత్రమే అత్యధిక ధర పలికింది.
     
    రుణాలు వందల కోట్లలో..

    చెరుకు రైతులకు మాత్రమే బ్యాంకులు ఎకరాకు రూ.40 నుంచి రూ.50వేల రుణం ఇస్తాయి. ఆ తర్వా త టమాట రైతుకు రూ.25 వేల నుంచి రూ.30వేలు ఇస్తాయి. వేరుశెనగకు తక్కువ రుణం వస్తుంది. దీంతో టమాట సాగుచేసిన రైతులు టమాటపైనే రుణం తీసుకున్నారు. 2009-10లో టమాట సాగుకు ఎకరాకు రూ.20వేలు, 2009-10లో రూ.25వేలు, 2012-13లో రూ.30వేలు, 2013-14లో రూ.30వేల రుణంగా బ్యాంకులు నిర్ణయించి ఆమేరకు పాసుపుస్తకాలు, బంగారం తాకట్టుపై అప్పులిచ్చాయి. ఇలా అప్పులు తీసుకొన్న రైతులు జిల్లాలో వేలసంఖ్యలో ఉన్నారు.

    ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే 2008-09నుంచి 2013 డిసెంబరు నాటికీ 37,251 మంది రైతులు రూ.162.9కోట్ల రుణం తీసుకున్నా రు. వీరుకాక జిల్లాలో మొత్తం రూ.1,500కోట్ల మేర కు అప్పులను టమాట రైతులు చెల్లించాల్సి ఉన్నట్టు అంచనా. బ్యాంకులిచ్చే రూ.30వేల రుణంతో కనీసం సగం మంది రైతులు ఈ నాలుగేళ్లలో రూ.2,500కోట్ల దాకా అప్పులు పొందడం, తిరిగి చెల్లిస్తూ, కొత్త రుణాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అప్పులు చెల్లించలేక నిస్సహాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ప్రభుత్వం ఊరట కలిగిస్తుందని ఆశించినా ఫలితం లేకుండాపోతోంది.
     
    మాఫీకి సాకులు

    రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం కుంటిసాకులు వెదుకుతోంది. టమాట పంట ఉద్యానవనశాఖ పరిధిలో ఉందన్న సాకుతో రైతులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వేరుశెనగకు ప్రయత్యామ్నాయంగా సాగుచేస్తున్న టమాటకు సరైన ప్రోత్సాహం ఇవ్వని ప్రభుత్వం కనీసం రుణ మాఫీనైనా వర్తింపజేయకపోవడంపై నిరాశ వ్యక్తమవుతోంది. కోట్ల పెట్టుబడిని కళ్లముందునే నష్టపోతున్న టమాట రైతులను ఆదుకునేందుకు రుణమాఫీని వర్తింపజేయాలని రైతాంగం కోరుతోంది.
     
    రుణం మాఫీ కాదు.. కొత్త అప్పులు పుట్టవు
     
    మూడేళ్ల క్రితం సొసైటీ బ్యాంకులో రూ.50 వేల పంట రుణం తీసుకున్నా. రెండు ఎకరాల్లో టమాట పంట సాగు చేశా. రూ.90 వేలు ఖర్చు అయింది. బ్యాంకులో తెచ్చిన రుణం చాలక ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి పంటపై ధారపోశా. 30 వేల నష్టం వచ్చింది. ఈ ఏడాది బంగారు నగలను తాకట్టు పెట్టి స్టేట్ బ్యాంకులో రూ.50 వేల రుణం తీసుకున్నా. ఇటీవల రెండు ఎకరాల్లో టమాటా సాగు చేశా. పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోయాయి. బ్యాంకులో చూస్తే తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి చూస్తే రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు మాఫీ చేయక పూటకో మాట మాట్లాడుతావుండాడు. బ్యాంకోళ్ళు కొత్తగా పంట రుణాలు ఇవ్వలేదు. పాసు బుక్కులు, బంగారు నగలు బ్యాంకులో ఉంటే ఏం జూసి మాకు ప్రైవేటు వ్యక్తులు కూడా అప్పులు ఇస్తారు.     
    -సిద్దారెడ్డి, రైతు, పెద్దతిప్పసముద్రం మండలం
     
     ఆవులకు వదిలేశాం

     రెండెకరాల్లో టమాట సాగు చేశాం.  రూ.లక్ష దాకా ఖర్చయ్యింది. ఇప్పటివరకు రూ.20 వేలు మాత్రమే వచ్చింది. తొలి నుంచి రేటు లేదు.  ఇప్పట్లో వచ్చే అవకాశాలు కన్పించ డం లేదు. దీంతో సగం పంటలో ఆవులను తోలేశాం. రేటు ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేటు లేనప్పుడు మాత్రం చేతులెత్తేసింది. రైతుకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా ఆదుకునే వారు లేరు.
     -బి.కృష్ణారెడ్డి, సర్కారుతోపు, కురబలకోట మండలం
     
     బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామానికి చెందిన రైతు బయ్యారెడ్డి ఏళ్ల తరబడి టమాట పండిస్తున్నాడు. 2011లో బి.కొత్తకోట గ్రామీణ బ్యాంకులో రూ.50వేలు, ఇండియన్ బ్యాంకులో 1.5లక్షల అఫ్పు తీసుకున్నాడు. పంటనష్టం వాటిల్లినా రూ.1.5లక్షల రుణం చెల్లించాడు. మళ్లీ పంటకోసం 2012లో ఇండియన్ బ్యాంకులో తీసుకున్న రూ.2లక్షలు రుణాన్ని 2013లో కట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.లక్ష అప్పుచేశాడు. రుణాలపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న బయ్యారెడ్డి రుణ మాఫీపై ఆశపెట్టుకున్నాడు. మాఫీ ఇస్తే చెల్లించిన సొమ్ము తిరిగి దక్కుతుందనుకున్నాడు. అయితే టమాట రైతుకు మాఫీ అయ్యే పరిస్థితులు లేవని తేలిపోవడంతో నిరాశవ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికీ గ్రామీణ బ్యాంకులోని రూ.50వేల రుణం చెల్లించలేదు. అదైనా మాఫీ అవుతుందో లేదోనని ఎదురుచూస్తున్నాడు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement