సాక్షి, అమరావతి: టమాటా రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు కనీస మద్దతు ధర కంటే అదనపు లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 20 టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. వీటిలో నాలుగు యూనిట్లు ఈ నెలాఖరులో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతుండగా, ఇందులో అత్యధికంగా రాయలసీమ జిల్లాల పరిధిలోనే 56,633 హెక్టార్లు ఉన్నాయి.
ఏటా 22.16 లక్షల టన్నుల దిగుబడుల్లో 20.36 లక్షల టన్నులు ఆ జిల్లాల నుంచే వస్తోంది. మూడున్నరేళ్లుగా టమాటా రైతుకు మద్దతు ధర లభించేలా కృషి చేస్తున్న ప్రభుత్వం.. ధరలు తగ్గిన ప్రతిసారి మార్కెట్‌లో జోక్యం చేసుకొని, వ్యాపారులతో పోటీపడి ధర పెరిగేలా చేస్తోంది. దీంతో పాటు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘ఆపరేషన్ గ్రీన్స్’ ప్రాజెక్టు కింద రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో 20 ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
మొదటి దశలో 4 యూనిట్ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన యూనిట్లను మార్చి కల్లా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఒక్కో యూనిట్‌ను ఎకరం విస్తీర్ణంలో రూ.3 కోట్ల అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో గంటకు 1.5 టన్నుల చొప్పున నెలకు 300 టన్నులు, ఏడాదికి 3,600 టన్నుల చొప్పున ప్రాసెస్ చేయనున్నారు.
సార్టింగ్, గ్రేడింగ్, వాషింగ్..
ఒక్కో యూనిట్ పరిధిలో కనీసం 250 టన్నులు నిల్వ చేసేందుకు వీలుగా శీతల గిడ్డంగులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పండ్లు, కూరగాయలను సార్టింగ్, గ్రేడింగ్, వాషింగ్ చేసి.. అధిక ధరలకు విక్రయించే అవకాశం కలుగనుంది. ఈ రంగంలోని బడా కంపెనీలతో రైతు ఉత్పత్తి దారుల సంఘాలను (ఎఫ్‌పీవో – ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) అనుసంధానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే లీఫ్ అనే కంపెనీతో ఒప్పందం జరిగింది.
సాధారణంగా రైతులు తాము పండించిన టమాటాలను మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మగా వచ్చే ఆదాయంలో రవాణా, కమీషన్ చార్జీల రూపంలో 10–20 శాతం కోల్పోతుంటారు. ఈ యూనిట్ల ఏర్పాటు వల్ల రైతులు ఈ నష్టాన్ని పూడ్చుకోగలుగుతారు. వీటన్నింటి వల్ల మార్కెట్ ధర కంటే 30 శాతం అదనంగా వస్తుంది. దళారుల చేతిలో నష్టపోకుండా అధిక లాభాలను ఆర్జించగలుగుతారు. వీటి నిర్వహణా బాధ్యతలను రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు అప్పగిస్తున్నారు.
వచ్చే లాభాలను ఆయా సంఘాల పరిధిలోని రైతులే పంచుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టమాటా వాల్యూ చైన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.
క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర పనులను ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ.. మార్కెటింగ్ బాధ్యతలను లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ నిర్వహించనున్నాయి.
ట్రయల్ రన్ విజయవంతం
ఒక్కో యూనిట్‌ను ఒక్కో ఎఫ్‌పీవోకు అప్పగించనుండగా, మొత్తంగా 20 వేల మంది టమాటా రైతులు లబ్ధి పొందనున్నారు. తొలి దశలో చిత్తూరు జిల్లా అటుకురాళ్లపల్లి, చప్పిడిపల్లె, కమిరెడ్డివారిపల్లితో పాటు అన్నమయ్య జిల్లా తుమ్మనంగుంటలలో 4 యూనిట్లు ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా 3,300 మంది రైతులు లబ్ధి పొందనున్నారు.
ఇటీవలే ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. రెండో దశలో అన్నమయ్య జిల్లా చెంబకూర్, పోతపొల్లు, చిన్నమండెం, తలవం, ములకల చెరువు, కంభంవారిపల్లె, బి.కొత్తకోట, కలికిరి, చింతపర్తి, వాల్మీకిపురం, నిమ్మనపల్లె, చిత్తూరు జిల్లా వీ.కోట, పలమనేరు, పుంగనూరు, రాజ్‌పేట, చెల్దిగనిపల్లి యూనిట్లు మార్చిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దళారుల నుంచి ఉపశమనం
ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా దళారుల చేతిలో నష్టపోకుండా టమాటా రైతులు అధిక లాభాలు ఆర్జించే వీలు కలుగుతుంది. రవాణా, కమిషన్ నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా, తమకు గిట్టుబాటైన ధరకు నచ్చిన వారికి అమ్ముకోగలుగుతారు.
పైగా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వీటి నిర్వహణా బాధ్యతను కూడా రైతు సంఘాలకే ఇస్తున్నాం. వచ్చే లాభాలు సంఘాలే పొందనున్నాయి.
– ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈఒ, ఏపీ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ
Comments
Please login to add a commentAdd a comment