కర్నూలు (అగ్రికల్చర్): ధరలు తగ్గుతుండటంతో టమాట రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడటం, ధర తగ్గుతున్నప్పుడు వేలం పాటలో పాల్గొని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల వరకు టమాట ధర చుక్కలనంటింది. ఆ సమయంలో జిల్లాలో టమాట పంట లేదు. ఇప్పుడు రైతులు సాగు చేసిన పంట ఒక్కసారిగా మార్కెట్‌ను ముంచెత్తడంతో ధరలు పడిపోయాయి. దీంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు దిశానిర్దేశం చేసింది. జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాట క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
ఈ నెల 9 నుంచి మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పత్తికొండ మార్కెట్ యార్డులో జరిగే టమాట వేలం పాటలో పాల్గొంటుందని మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఎం) నారాయణమూర్తి తెలిపారు. శుక్రవారం పత్తికొండ మార్కెట్‌లో టమాట ధర కిలోకు కనిష్టంగా రూ.7, గరిష్టంగా రూ.14 పలికింది. మోడల్ ధర రూ.10గా నమోదైంది.
కనిష్ట ధర రూ.7 కంటే తక్కువకు పడిపోతున్నప్పుడు మాత్రమే మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన బృందం వేలంలో పాల్గొంటుంది. మార్కెటింగ్ శాఖ కూడా వేలంలో పాల్గొంటున్నందున వ్యాపారుల మధ్య పోటీ పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసిన టమాటను రైతుబజార్ల ద్వారా నో లాస్, నో ప్రాఫిట్ కింద వినియోగదారులకు విక్రయిస్తామని ఏడీఎం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment