కర్నూలు జిల్లాలోని ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలో టమాటా విస్తారంగా సాగవుతోంది. ప్రస్తుతం జిల్లా మొత్తం మీద ఆరు వేల హెక్టార్ల వరకు సాగులో ఉంది. టమాటా మార్కెటింగ్‌కు పత్తికొండ కేంద్ర బిందువు. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు.
సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్), పత్తికొండ : టమాటా రైతును ఆర్థికంగా దెబ్బ తీసేందుకు వ్యాపారులు, దళారీలు వేసిన ఎత్తులను వైఎస్ జగన్ సర్కారు రెండో రోజు కూడా చిత్తు చేసింది. ధరల స్ధిరీకరణ నిధితో శనివారం కర్నూలు జిల్లాలో 100 మెట్రిక్ టన్నుల టమాటాను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసిన విషయం విదితమే. దీంతో వ్యాపారులు కిలో టమాటా ధరను రూ.14 నుంచి రూ.19కి పెంచి కొనుగోలు చేశారు.టమాటాకు గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం కూడా ఆ శాఖ అధికారులు కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుపై దృష్టి కేంద్రీకరించారు. దీంతో దిగివచ్చిన వ్యాపారులు రైతుల నుంచి కిలో రూ.20 నుంచి రూ.22 చొప్పున కొనుగోలు చేశారు. మార్కెటింగ్ శాఖ కూడా 8 టన్నుల టమాటా కొనుగోలు చేసింది. ఆ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, కమిషనర్ ప్రద్యుమ్నలు ఆదివారం కర్నూలు జిల్లాలో టమాటా అమ్మకాల గురించి గంటకోసారి ఆరా తీశారు. మార్కెట్ యార్డు బయట కొనుగోళ్లు జరపకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
ధరల స్థిరీకరణ నిధితో రైతులకు భరోసా
సీఎం ఆదేశాలతో శని, ఆదివారాల్లో ధరల స్ధిరీకరణ నిధితో కర్నూలు జిల్లాలో మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోలు చేపట్టింది. రైతుకు న్యాయం జరిగే వరకు అక్కడ మార్కెటింగ్ శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది.
– మంత్రి మోపిదేవి వెంకటరమణ
Comments
Please login to add a commentAdd a comment