రైతులకు పంట రుణాలు అందని ద్రాక్షగానే మారాయి. మొదట్లో ఊరిస్తూ చివరకు ఉసూరుమనిపిస్తున్నారు బ్యాంకర్లు. ఏటా ఇదే పరిస్థితి. పంట రుణాల లక్ష్యం భారీగానే ఉంటున్నా మంజూరులో మాత్రం పూర్తి స్థాయిలో వెనుకబడిపోతున్నారు. అవసరానికి డబ్బులు అందక రైతులు ప్రైవేట్ అప్పులు చేస్తున్నారు. ఆపై వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. ఈసారి బ్యాంకర్లు రెండో విడత రుణ మాఫీని సాకుగా చూపి రుణాల మంజూరులో జాప్యం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం డబ్బులు అందుతాయో లేదోనని రైతన్న ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
గత ఏడాది ఖరీఫ్‌లో బ్యాంకర్ల లక్ష్యం.... మంజూరు చేసిన రుణాలు ఇలా...
బ్యాంకు = లక్ష్యం= మంజూరు చేసింది
ఎస్‌బీహెచ్= రూ.156 కోట్లు= రూ.96.46 కోట్లు
ఎస్‌బీఐ= రూ.165 కోట్లు= రూ.109 కోట్లు
ఆంధ్రాబ్యాంకు = రూ.139 కోట్లు= రూ.49.15 కోట్లు
డీసీసీబీ= రూ.148 కోట్లు= రూ.45.21 కోట్లు
గ్రామీణ వికాస్ బ్యాంకు= రూ.357 కోట్లు= రూ.151 కోట్లు
పంట రుణాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఏటా రుణాలిచ్చే విషయంలో లక్ష్యాలు నిర్దేశించుకునే బ్యాంకర్లు అమలులో మాత్రం విఫలమవుతున్నారు. ఖరీఫ్, రబీలో లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లోనూ లక్ష్యం మేరకు రైతులకు రుణాలు అందుతాయా? అన్న సంశయం నెలకొంది. సీజన్ ప్రారంభమైనా బ్యాంకర్లు రుణాలివ్వటం ప్రారంభించలేక పోయారు. ఇదిలావుంటే రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో రైతులకు డబ్బులు అత్యవసరం. సాగుకు పొలాలను సిద్ధం చేసుకోవటం, విత్తనాలు, యూరియా కొనుగోలు తదితర అవసరాలకు రైతులకు డబ్బులు అవసరం. దీంతో రైతులు బ్యాంకుల వైపు చూస్తున్నారు. బ్యాంకర్లు ఇంకా రుణాలు మంజూరు చేయకపోవటంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
రుణమాఫీపై స్పష్టత ఏదీ?
రుణమాఫీ కింద నాలుగు విడతల్లో డబ్బులు చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు మొదటి విడతగా 25 శాతం డబ్బులు చెల్లించింది. రెండో విడతగా 25 శాతం మొత్తాన్ని చెల్లింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. జిల్లాలో రుణమాఫీ పథకం కింద 4.06 లక్షల మంది రైతులకు సంబంధించి సుమారు రూ.2,012 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం మొదటి విడతగా రూ.503 కోట్లు విడుదల చేసింది. వీటిలో జిల్లా యంత్రాంగం రూ.483 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. వివిధ కారణాలతో మిగితా రూ.20 కోట్లను ప్రభుత్వానికి తిరిగి జమచేయడం జరిగింది. రెండో విడత రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రుణాల మంజూరు విషయంలో తాత్సారం చేస్తున్నట్టు సమాచారం.
వందశాతం రుణాలు మంజూరు చేసేనా?
పంట రుణాల మంజూరులో బ్యాంకర్లు చిత్తశుద్ధిని కనబరచడం లేదు. ఏటా ఖరీఫ్, రబీలో రుణాలకు సంబంధించి లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నా ఆ మేరకు రుణాలు ఇవ్వడం లేదు. గత ఏడాది ఖరీఫ్‌లో రైతులకు రూ.1,184 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నా, కేవలం రూ.525 కోట్లు మాత్రమే అందజేశారు. కేవలం యాభై శాతం రుణాలు మాత్రం మంజూరు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.1248.28 కోట్లు పంట రుణాలివ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈసారైనా వందశాతం రుణాలిస్తారో లేదో వేచి చూడాలి.
పెట్టుబడి ఎట్లా?
Published Wed, Jun 17 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement
Advertisement