N.Yuvaraju
-
పాస్‌పుస్తకాల సీడింగ్‌లో వెనుకబడ్డాం
కలెక్టర్ యువరాజ్ విశాఖ రూరల్: పట్టాదార్ పాస్‌పుస్తకాల ఆధార్ సీడింగ్‌లో జిల్లా రాష్ట్రంలో తొమ్మిదో స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహశీల్దార్లు ప్రత్యేక చొరవ చూపుతూ వారి పరిధిలోని భూముల వివరాలు వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవో, తహశీల్దార్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 4,75,076 పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఉన్నాయని, వీటిలో 2,80,865 పట్టాదార్ల వివరాలు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లాలో 1,67,261 మంది పట్టాదారుల వివరాలు నోషనల్ ఖాతాలో ఉండగా, వాటిలో కేవలం 3,638 మంది పట్టాదార్ల వివరాలు ఆధార్‌తో అనుసంధానమయ్యాయన్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఇప్పటి వరకు కేవలం 59 శాతం పట్టాదార్ల వివరాలు మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేస్తూ నమోదు చేయడం జరిగిందని వివరించారు. ఈ సీడింగ్ కార్యక్రమంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ అనుసంధానం కాని భూముల రిజిస్ట్రేషన్లు, క్రయ, విక్రయాలు భవిష్యత్తులో నిలుపుదల చేస్తారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రేషన్‌కార్డుల ఆధార్ సీడింగ్ 95 శాతం పూర్తయినందున,ఆ డేటాను సేకరించి పట్టాదార్ల సీడింగ్‌కు వినియోగించాలని చెప్పారు. ఈసమావేశంలో పాడేరు సబ్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఏజేసీ వై.నరసింహారావు, ఎస్డీసీలు భవానిదాస్, వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు వెంకటమురళి, వసంతరాయుడు, సూర్యారావు, డి.సెక్షన్ సూపరింటెండెంట్ రత్నం పాల్గొన్నారు. -
‘మాఫీ’డేటా అప్డేట్ కావాలి
15లోగా పూర్తి చేయండి బ్యాంకర్లకు కలెక్టర్ సూచన విశాఖ రూరల్: రుణమాఫీకి అర్హులైన వారి వివరాలను ఈ నెల 15లోపు నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) వెబ్సైట్లో అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ బ్యాంకర్లను కోరారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, బ్రాంచ్ మేనేజర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ అంశంపై ఈ నెల 3వ తేదీన రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వాటికి అనుగుణంగా రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లు అందజేసిన సీబీఎస్(కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్) ఫార్మాట్లోని డేటా శనివారం సాయంత్రం నుంచి ఎన్ఐసీ వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుందని వె ల్లడించారు. ఈ వెబ్సైట్లో 31 కాలమ్స్‌తో కూడిన ఫార్మాట్‌ను ఉంచామన్నారు. సీబీఎస్ ఫార్మాట్లో డేటాకు అదనంగా ఆధార్‌నెంబర్, రేషన్‌కార్డు నెంబర్, ఆర్ఓఆర్, 1-బి ఖాతా నెంబర్, సర్వే నెంబర్, భూ విస్తీర్ణం తదితర వివరాలను బ్యాంకు బ్రాంచ్‌ల వారీగా అప్డేట్ చేయాల్సి ఉందని వివరించారు. జిల్లాలో మండలాల వారీగా రేషన్‌కార్డులకు అనుసంధానం చేసిన ఆధార్‌కార్డు నెంబర్ల వివరాలతో పాటు ఇతర వివరాలు ఎన్ఐసీ అధికారుల వద్ద డీవీడీల రూపంలో ఉన్నాయని, ఆ డేటాను వినియోగించుకుంటూ బ్రాంచ్ మేనేజర్లు వెబ్‌సైట్‌లోని 31 కాలమ్‌లను అప్డేట్ చేయాలని సూచించారు. ఈ కాలమ్‌లలో ఆధార్ సంఖ్య, రేషన్‌కార్డు వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాల్సి ఉందన్నారు. జిల్లాలో 43 బ్యాంకులకు చెందిన 612 బ్రాంచ్‌లు ఉన్నాయని, ఒక్కొక్క బ్రాంచ్‌లో రుణమాఫీకి సంబంధించి సుమారు వెయ్యి ఖాతాలకు మించి ఉండవన్నారు. బ్రాంచ్ మేనేజర్లు ప్రత్యేక చొరవ తీసుకొని పంట రుణాలు పొందిన రైతుల డేటాను నిర్ణీత కాలవ్యవధిలో వెబ్సైట్లో అప్డేట్ చేయాలని చెప్పారు. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ) మహిళలు బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని బ్యాంకర్లను కోరారు. ఈ సమావేశంలో ఏజేసీ వై.నరసింహారావు, ఎల్డీఎం జయబాబు, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయిశ్రీనివాస్, డీసీఓ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. -
వినతులపై తక్షణ చర్యలు
సీఎంకు అందిన విజ్ఞాపనలను పరిష్కరించండి గ్రీవెన్స్ వినతులపై జాప్యం తగదు అధికారులకు కలెక్టర్ యువరాజ్ ఆదేశం విశాఖ రూరల్ : జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిన విజ్ఞాపనలపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో వివిధ అంశాలపై చర్చిం చారు. ఈ నెల 8, 9 తేదీల్లో సీఎం పర్యటనలో 351 విజ్ఞాపనలు అందాయని, వాటన్నింటిపై చర్యలు చేపట్టి యాక్షన్ టేకెన్ రిపోర్టును వెంటనే తమకు నివేదించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాల్లో గత ఏడా ది కాలంలో సుమారు 5,572 పిటిషన్లు అందాయని, వాటిపై సంబంధిత శాఖాధికారులు ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. అతి తక్కువ శాతం మాత్రమే పరిష్కరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత వెబ్సైట్లో అప్డేట్ చేయాలన్నారు. మండల స్థాయిలో నిర్వహించే గ్రీవె న్స్ డేలో అందే పిటిషన్లను కూడా వెబ్సైట్లో అప్డేట్ చేసేలా ఆర్డీఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఆధార్‌కార్డులతో అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, ఉపకార వేతనాలు, గృహాలు, ఎన్ఆర్ఈజీఎస్ జాబ్‌కార్డులు, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసే ప్రక్రియను ఆయా శాఖాధికారులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీనివాసన్, డూమా పీడీ శ్రీరాములు నాయుడు, గృహ నిర్మాణ సంస్థ పీడీ ప్రసాద్, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్యామల పాల్గొన్నారు. -
‘డయల్ యువర్ కలెక్టర్’కు 17 ఫోన్‌కాల్స్
విశాఖ రూరల్: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 17 ఫోన్‌కాల్స్ వచ్చాయి. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ వై.నరసింహారావు ఫోన్‌కాల్స్‌కు సమాధానమిచ్చారు. చింతపల్లి మండ లం తాజంగి గ్రామంలో వ్యవసాయశాఖకు చెందిన భూమి అన్యాక్రాంతమైందని, కొంతమంది వ్యక్తులు అక్రమంగా అనుభవిస్తున్నారని చింతపల్లి నుంచి ఒక ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. అనంతగిరిలో హరిత రిసార్ట్స్‌లో బార్ పెడుతున్నట్లు తెలిసిందని, ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఒకరు ఫోన్లో చెప్పగా పర్యాటక శాఖకు ఈ విషయం తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, డుమా పీడీ శ్రీరాములునాయుడు, డీఈఓ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
చక్కెరలో చేదు గుళికలు
విశాఖ రూరల్ : చక్కెర కర్మాగారాల లాభాలకు అధికారులే గండికొడుతున్నారు. ఆదాయమార్గాలను అన్వేషించాల్సిన వారు పరిశ్రమలు నిర్వీర్యమయ్యే నిర్ణయాలు చేస్తున్నారు. ఫ్యాక్టరీల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. మొలాసిస్ అమ్మకాలే ఇందుకు నిదర్శనం. జిల్లాలో నాలుగు చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. తాండవ, అనకాపల్లి, ఏటికొప్పాక, చోడవరం సహకార చక్కెర కర్మాగారాల్లో మొలాసిస్ అమ్మకాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బహిరంగ మార్కెట్లో అత్యధిక ధర ఉన్నప్పటికీ 50 శాతం కంటే తక్కువకు విక్రయిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్‌కు ఫిర్యాదు అందింది. 50 శాతం తక్కువకు మొలాసిస్ అధికారుల విచక్షణాధికారాలతో తక్కువ ధరకే వేల మెట్రిక్ టన్నుల మొలాసిస్‌ను రాష్ట్ర సగటు ధర కంటే 50 శాతం తక్కువకు విక్రయిన్నారు. అసలే అంతంత మాత్రం ఆదాయాలతో నెట్టుకొస్తున్న కర్మాగారాల ఆర్థిక పరిపుష్టికి చర్యలు తీసుకోవాల్సింది పోయి వచ్చే ఆదాయాన్ని కూడా తగ్గించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అందుకు 2012-13లో ఈ పరిశ్రమల్లో మొలాసిస్ అమ్మకాలే నిదర్శనం. మద్యం అమ్మకాల్లో వినియోగించే మొలాసిస్‌కు ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉంది. దీన్ని ఒడిశా, ఇతర పక్క రాష్ట్రాల వారికే విక్రయిస్తున్నారు. అదే ఇతర జిల్లాల్లో ఉన్న కర్మాగారాలు మొలాసిస్‌కు ఇంతకు రెట్టింపు ధరను నిర్ణయిస్తున్నారు. తాండవలో.. తాండవ కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్‌లో గత ఏడాది మూడు దశల్లో మొలాసిస్ అమ్మకాలు చేపట్టారు. మూడుసార్లు మూడు ధరల్లో అమ్మకాలు చేపట్టారు. 8,500 మెట్రిక్ టన్నులను ఒక్కో ఎం.టి. రూ.2,103 కింద విక్రయించారు. అలాగే ఎం.టి. రూ.3,055 చొప్పున 1500 మెట్రిక్ టన్నులు, రూ.6 వేలు చొప్పున రూ.992 మెట్రిక్ టన్నులు అమ్మారు. దీని ప్రకారం సగటు మెట్రిక్ టన్ను ధర రూ.2,584గా మాత్రమే ఉంది. అదే రాష్ట్ర సగటు ధర రూ.5 వేలు నుంచి రూ.5,500 వరకు ఉంది. దీని ప్రకారం పరిశ్రమకు రూ.2.84 కోట్లు నష్టం వాటిల్లునట్టు తెలుస్తోంది. అనకాపల్లిలో.. అనకాపల్లి కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్‌లో గత ఏడాది 1,816 మెట్రిక్ టన్నుల మోలాసిస్ అమ్మకాలు జరిపారు. రాష్ట్ర సగటు ధర రూ.5 వేలు నుంచి రూ.5,500 ఉంటే ఇక్కడ కేవలం రూ.3,055కు మాత్రమే విక్రయించారు. ఫలితంగా రూ.55.47 లక్షలు ఆదాయం కోల్పోయినట్లు తెలుస్తోంది. ఏటికొప్పాకలో.. ఏటికొప్పాక కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్‌లో 1920 మెట్రిక్ టన్నుల మొలాసిస్‌ను ఎం.టి. రూ.2,075 చొప్పున కట్టబెట్టారు. అలాగే ఎం.టి.రూ.3,055 చొప్పున 6200 మెట్రిక్ టన్నులు, రూ.6100 చొప్పున 350 మెట్రిన్ టన్నులు విక్రయించారు. దీంతో రూ.2 కోట్లు మేర ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. చోడవరంలో.. చోడవరం కో-ఆపరేటివ్ షుగర్స్ లిమిటెడ్‌లో ఎం.టి. రూ.2100 చొప్పున 10,700 మెట్రిక్ టన్నులు, ఎం.టి.రూ.3,055 చొప్పున 10 వేలు మెట్రిక్ టన్నులు, ఎం.టి. రూ.6100 చొప్పున 600 మెట్రిక్ టన్నులు విక్రయించారు. ఫలితంగా రూ.6.45 కోట్లు ఆదాయం రాకుండా పోయింది. విజిలెన్స్ విచారణ ఈ అమ్మకాల తీరుపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ చెరకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు డి.రాంబాబు కలెక్టర్ యువరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. విజిలెన్స్ విచారణ కూడా నిర్వహించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ట్రెండ్ సెట్ చేస్తా
రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కలెక్టర్ సిద్ధం ప్రతీ సోమవారం సెట్ కాన్ఫరెన్స్ సిబ్బంది వ్యవహారాలపై సీరియస్ తహశీల్దార్లకు బాధ్యతల నిర్దేశం విశాఖ రూరల్ : రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సిద్ధమయ్యారు. సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శాఖలో సమూల మార్పులు చేయాలని భావిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వారంలో చేయాల్సిన విధులను స్వయంగా పురమాయించనున్నారు. భూక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్ల విషయంలో సిబ్బంది పాత్రపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు వీఆర్వో, ఆర్ఐ చేతుల్లో ఉన్న అడంగళ్లు, 1బి రిజిస్టర్లను వెంటనే తహశీల్దార్లకు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూవివాదాల వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో తహశీల్దార్లు ఉండాలి తహశీల్దార్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది తప్పనిసరిగా మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు కలెక్టర్ మండల తహశీల్దార్లతో సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు మండల కార్యాలయాల్లో సదుపాయాల్లేకపోవడంతో సెట్ కాన్ఫరెన్స్‌లో తహశీల్దార్లకు సూచనలు, ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నారు. ప్రధానంగా ఆ వారంలో రెవె న్యూ సిబ్బంది చేపట్టాల్సిన బాధ్యతలను కలెక్టరే నిర్ధేశించనున్నారు. వాటిని వారంలోగా పూర్తి చేసి తరువాత సోమవారం జరిగే సెట్ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌కు వివరించాల్సి ఉంటుంది. ఈ సోమవారం కూడా కలెక్టర్ కొందరు తహశీల్దార్లతో సెట్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. విశాఖ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆనందపురంలో సెట్ సక్రమంగా పని చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో కూడా సాంకేతికపరంగా కొన్ని ఇబ్బందులున్నట్లు గుర్తించారు. దీంతో వచ్చే వారంలోగా అన్ని సెట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. రికార్డుల బాధ్యత తహశీల్దార్లదే జిల్లాలోని కొన్ని మండలాల్లో అడంగళ్లు, 1బి రిజిస్టర్లు వీఆర్వో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల చేతిలో ఉన్నాయి. రికార్డుల ట్యాంపరింగ్ విపరీతంగా జరిగినట్లు ఇటీవల నిర్వహించిన భూముల సర్వేలో వెల్లడైంది. పాత అడంగళ్లన్నింటినీ సంబంధిత తహశీల్దార్‌కు వెంటనే అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే వెబ్‌ల్యాండ్‌లో కొత్తవి ప్రింట్ తీసుకోవాలని సూచన లిచ్చారు. అసైన్ భూముల వ్యవహారంలో అనేక అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించడంతో 1బి రిజిస్టర్లు కూడా తహశీల్దార్ల వద్దే ఉండాలని సెట్ కాన్ఫరెన్స్‌లో అధికారులకు స్పష్టం చేశారు. రికార్డుల ట్యాంపరింగ్, ఇప్పటికీ అడంగళ్లు, అసెన్మైంట్ రిజిస్టర్లు వీఆర్వో, ఆర్ఐల వద్ద ఉంటే అందుకు తహశీల్దార్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కోర్టుల్లో 629 భూ వివాదాలు జిల్లాలో ప్రభుత్వ భూముల వివాదాలకు సంబంధించి న్యాయస్థానాల్లో 629 కేసులున్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో ప్రధానమైన కేసులను వేగంగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోడానికి వీలుగా అన్ని కేసుల వివరాలను కంపూటర్లో పొందుపరచాలని కలెక్టర్ నిర్ణయించారు. తద్వారా ఏ కేసు ఏ స్థాయిలో ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం స్పష్టంగా తెలుస్తుందని ఆయన భావిస్తున్నారు. -
13 లేదా 15న కొత్త కలెక్టర్ బాధ్యతలు!
విశాఖ రూరల్: జిల్లా కలెక్టర్‌గా నియమితులైన డాక్టర్ ఎన్.యువరాజ్ ఈ నెల 13న లేదా 15న బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. వుడా వైస్‌చైర్మన్‌గా విధులు నిర్వర్తిస్తున్న యువరాజ్ ప్రస్తుతం సెలవుపై తమిళనాడులో ఉన్నారు. ఆయన ఈ నెల 12న జిల్లాకు రానున్నారు. వీలైనంత వరకు ఈ నెల 13వ తేదీన కలెక్టర్‌గా చార్జ్ తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఆరోజు కాని పక్షంలో 15వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిసింది. ప్రస్తుత కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ కూడా 13నే రిలీవ్ కానున్నట్టు సమాచారం.