వినతులపై తక్షణ చర్యలు
- సీఎంకు అందిన విజ్ఞాపనలను పరిష్కరించండి
- గ్రీవెన్స్ వినతులపై జాప్యం తగదు
- అధికారులకు కలెక్టర్ యువరాజ్ ఆదేశం
విశాఖ రూరల్ : జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిన విజ్ఞాపనలపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అధికారులతో వివిధ అంశాలపై చర్చిం చారు. ఈ నెల 8, 9 తేదీల్లో సీఎం పర్యటనలో 351 విజ్ఞాపనలు అందాయని, వాటన్నింటిపై చర్యలు చేపట్టి యాక్షన్ టేకెన్ రిపోర్టును వెంటనే తమకు నివేదించాలని ఆదేశించారు.
ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాల్లో గత ఏడా ది కాలంలో సుమారు 5,572 పిటిషన్లు అందాయని, వాటిపై సంబంధిత శాఖాధికారులు ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని పేర్కొన్నారు. అతి తక్కువ శాతం మాత్రమే పరిష్కరించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలన్నారు. మండల స్థాయిలో నిర్వహించే గ్రీవె న్స్ డేలో అందే పిటిషన్లను కూడా వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసేలా ఆర్డీఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఆధార్‌కార్డులతో అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.
రేషన్‌కార్డులు, పింఛన్లు, ఉపకార వేతనాలు, గృహాలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ జాబ్‌కార్డులు, గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ సంఖ్యను అనుసంధానం చేసే ప్రక్రియను ఆయా శాఖాధికారులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శ్రీనివాసన్, డూమా పీడీ శ్రీరాములు నాయుడు, గృహ నిర్మాణ సంస్థ పీడీ ప్రసాద్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్యామల పాల్గొన్నారు.