ఆ ఎమ్మెల్యేలకు పదవులు గడ్డిపోచలా? | Madabhushi Sridhar Article On Congress Crisis In Karnataka | Sakshi
Sakshi News home page

ఆ ఎమ్మెల్యేలకు పదవులు గడ్డిపోచలా?

Published Fri, Jul 12 2019 12:51 AM | Last Updated on Fri, Jul 12 2019 12:52 AM

Madabhushi Sridhar Article On Congress Crisis In Karnataka - Sakshi

కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఉన్న ఎమ్మెల్యేల బలం సరిపోదు. తమ బలం ఫిరాయింపులతో పెరగాలి లేదా ప్రభుత్వ పక్షాన్ని రాజీనామాలతో తగ్గించాలని పథకం వేశారు. ఫిరాయిస్తే కోట్లిస్తాం, మంత్రి పదవిస్తాం అంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్, జనతాదళ్‌ ఎమ్మెల్యేలతో మాట్లాడిన టెలిఫోన్‌ రికార్డులు బయటపడినా భయపడకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, జనతాదళ్‌ ఎమ్మెల్యేలు ‘వారంతట వారే’ పదవులను గడ్డిపోచల వలె వదిలించుకునేందుకు పథకం వేశారు. ప్రత్యేక విమానం, లగ్జరీ బస్సుల్లో ‘సొంత’ ఖర్చుతో ముంబై వెళ్లిపోయారు.  పాపం శివకుమార్‌ పరుగెత్తి విమానాశ్రయం చేరుకునేటప్పటికే ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో ఎగిరిపోయారు.

బీజేపీ వారి సర్కార్‌లో మంత్రిపదవి అయితే రెండుమూడు సౌకర్యాలు ఉంటాయి. రాష్ట్రంలో కేంద్రంలో ఒకే సర్కారు ఉంటుంది కనుక చాలా హాయి. మంత్రి పదవి ఉంటే సహజంగానే నాలుగురాళ్లు వెనకేసుకోవాలి కదా. అప్పుడు ఆదాయ పన్నువారు, ఎన్ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్లు íసీవీసీ వారు దాడులు చేయకుండా ఊరుకుంటారా? బీజేపీ మంత్రి పదవితో పోల్చితే సంకీర్ణ మంత్రిపదవిలో ప్రమాదాలు ఎక్కువ. పరువు, పదవీ పోయి జైలు దక్కవచ్చు. మరి ఈ శివకుమార్‌ మాట్లాడేదేముం టుంది? శివకుమార్, కుమార స్వామి, సిద్దరామయ్యకు ఎటూపాలు పోవడం లేదు.  

రాజీనామా వ్యూహం అద్భుతమైంది. అందులో వచ్చే సౌకర్యమేమంటే ఎవరూ అన్యాయం.. రాజ్యాంగ వ్యతిరేకం అని అరిచే అవకాశాలు లేవు. ఎవరి అభ్యంతరం లేకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. సభలో ఉండి ఓటువేసే వారిలో సగానికి ఒకరెక్కువ ఉంటే చాలు అని మన సంవిధానం చెబుతున్నది కదా. కనుక రాజీనామాలు చేయించేస్తే మళ్లీ ఉపఎన్నికలు జరిగేదాకా మన రాజ్యానికి తిరుగులేదనే వ్యూహంతో యడ్యూరప్ప, వారి అనుయాయులు, ఆపైన ఢిల్లీ నాయకులు కర్ణాటక సింహాసనం మీద కూర్చోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.  

ఉపఎన్నికలు జరిగే దాకా ఈ అంకెమారదు, అయితే మనవాళ్లను గెలిపించుకోవడం ఎంత సేపు? జనం కమలం మీద ఓట్లు గుద్దడానికి ఉవ్విళ్లూరుతున్నారు కదా. జనతాదళ్, కాంగ్రెస్‌ కలిసి పోటీచేసినా సీనియర్‌ నేత మాజీ ప్రధాని దేవెగౌడనే గెలిపించుకోలేని వారు ఉప ఎన్నికల్లో గెలువగలుగుతారా? ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలో పాపం జనతాదళ్‌కు, కాంగ్రెస్‌కు తెలియడం లేదు. శాసనసభలో అసలు బలం 224 అయినా 16 మంది రాజీనామాలు ఆమోదిస్తే అది 208కి పడిపోయి 105 మంది ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని బీజేపీ ఆశ. కాంగ్రెస్, జనతాదళ్‌ సంకీర్ణ బలం వందకు తగ్గిపోతుంది. తిరుగుబాటు ఎమ్మె ల్యేలను కలుసుకోవడానికి శివకుమార్‌ ముంబైకి వెళ్లినా ప్రయోజనం లేకపొయింది. 1995లో తెలుగుదేశం వారి ఫిరాయింపు ఇంజినీర్లు చెలరేగిన కాలంలో వైస్రాయ్‌ హోటల్‌కు తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్‌నే రానీయనట్టు, శివకుమార్‌ను అరెస్టు చేసి పంపించారు. ఆ విధంగా న్యాయం, ధర్మం, రాజ్యాంగం, పోలీసులు, పొరుగు ప్రభుత్వాలు కూడా ఎమ్మెల్యేల రాజీనామా స్వేచ్ఛను కాపాడడానికి కృషి చేస్తున్నారు.  

కర్ణాటక శాసన సభాపతి ‘వీరు స్వచ్ఛందంగా రాజీనామా చేశారా? ఇవి నిజమైన రాజీనామా లేనా?’ అని అనుమానిస్తున్నారు. ఆ విధంగా అనుమానించడం స్పీకర్‌ రాజ్యాంగ బాధ్యత. రాజీనామా ఎందుకు చేస్తున్నారో స్పీకర్‌కు చెప్పాల్సిన పని లేదు. కానీ అది నిజమైన స్వచ్ఛందమైన రాజీనామా అని స్పీకర్‌కు విశ్వాసం కలగాలి. అందుకు ఆయన తనకు తోచిన విధంగా ఎంక్వయిరీ చేసుకోవచ్చు అని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది.   

స్పీకర్‌ కు కాకపోయినా ఓటర్లకు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకోవాలి. ఈ ప్రభుత్వం ఎందుకు బాగోలేదు, వారి తప్పులను ఇదివరకు ఎప్పుడైనా ఎత్తి చూపారా? రాజీనామా చేస్తే తప్ప కర్ణాటక ప్రభుత్వం బాగుపడదని ఎప్పుడు తెలిసింది. ఈ జ్ఞానోదయం ముంబై హోటల్‌కు వెళ్లడానికి ముందు కలగకపోవడం కూడా ఆశ్చర్యమే కదా, అయినా పదిమందికలిసి ఒకే బస్సులో వెళ్తున్నా అది ఒక్కొక్కరు వ్యక్తిగతంగా సొంతంగా ఆలోచించి ఏ కుట్రా లేకుండా ఏదురుద్దేశమూ లేకుండా నిర్ణయించుకు న్నారని ఏ విధంగా అనుకుంటారని స్పీకర్‌ అనుమానిస్తున్నారు.అయిదేళ్లకోసం ఎన్నుకున్న  ప్రజలకు, పార్టీకి ద్రోహం చేస్తూ మధ్యంతరంగా వదిలేయడం ఊరికే జరగదు. బలీయమైన అసలు కారణాలను దాచే  శారు. సభ్యత్వాలను గడ్డిపోచగా భావించి వదులు కుంటూంటే ఆపుతారా అని స్పీకర్‌ను కోప్పడాలని ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును అడుగుతున్నారు.
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

మాడభూషి శ్రీధర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement