సర్కార్‌లకు నచ్చని ఒక తెలుగు మాట సమాచార హక్కు!
♦ తెలంగాణ, ఏపీలో అమలుకాని సమాచార చట్టం
♦ క్షేత్రస్థాయిలో తగిన సమాచారమివ్వని అధికారులు
♦ ఉన్నత స్థాయిలో కమిషన్ మొత్తం ఖాళీ
♦ కమిషన్ ఆఫీస్‌కు తాళం.. కనీస సిబ్బందీ లేని వైనం
♦ రెండున్నర లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగ్
తెలుగు రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం అమలు కావడంలేదు. ఎంతో మంది పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నా.. తగిన సమాచారం అందడం లేదు. కొన్నిచోట్ల అధికారులు ఏదో ఒక కొర్రీ పెడుతూ సమాచారమే ఇవ్వడం లేదు. మరి ఉన్నత స్థాయిలో అప్పీలు చేసుకుందామనుకున్నా.. రాష్ట్ర సమాచార కమిషనే దిక్కులేదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం అమలు దుస్థితి ఇది. ప్రజాప్రయోజనకర సమాచారం కోసం ఎంతో మంది ఆర్టీఐ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నా.. తగిన సమాచారం అందడం లేదు. కొన్నిచోట్ల అయితే అధికారులు ఏదో ఒక కొర్రీ పెడుతూ మొత్తంగా సమాచారమే ఇవ్వడం లేదు. ఉన్నత స్థాయిలో అప్పీలు చేసుకుందామనుకున్నా.. రాష్ట్ర సమాచార కమిషనే దిక్కులేదు. ఉన్న ఒకరిద్దరు సమాచార కమిషనర్లూ పదవీ విరమణ పొందడం, కనీస సమాచారం ఇచ్చేందుకు సిబ్బందీ లేకపోవడంతో కమిషన్ కార్యాలయానికే తాళం పడిన పరిస్థితి. అవినీతి, అక్రమాలు, ఇబ్బందికర సమాచారం బయటికి రాకుండా ప్రభుత్వాలే సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నాయని, అందులో భాగంగానే కమిషనర్లను నియమించడం లేదని ఆర్టీఐ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి గ్రామానికి 14వ ఆర్థిక సంఘం ద్వారా కేటాయించిన నిధుల వివరాలకోసం ఆ గ్రామానికి చెందిన రామారావు దరఖాస్తు చేశారు. తగిన సమాచారం రాకపోవడంతో పంచాయతీరాజ్ కమిషనరేట్ వరకూ వెళ్లారు. 6నెలలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం రాలేదు.
తమ మండలంలో చెరువుల మరమ్మతులకు గత ఐదేళ్లలో ఇచ్చిన నిధుల వివరాల కోసం భూపాలపల్లి జిల్లాకు చెందిన చంద్రారెడ్డి ఏడాదిన్నరగా వరంగల్‌లోని సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికీ సమాచారం ఇవ్వడం లేదు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సామాజిక కార్యకర్త మట్టయ్య ఉపాధి హామీ కింద చేపట్టిన పనుల వివరాలు కావాలంటూ ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమాచార అధికారికి దరఖాస్తు చేశారు. ఆ అధికారి సమాచారం ఇవ్వకుండా అనేక సందేహాలు లేవనెత్తడంతో.. ఈ ఏడాది మార్చి 25న ఆర్టీఐ కమిషనర్‌కు అప్పీలు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ అప్పీలు అలాగే ఉండిపోయింది.
పౌరులకు ఉపయోగపడే ఏ సమాచారాన్నైనా పొంద డానికి వీలుగా 2005లో పార్లమెంట్ చట్టం ద్వారా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సమాచార కమిషన్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్ర స్థాయిలో ఓ చీఫ్‌కమిషనర్‌తో పాటు గరిష్టంగా పది మంది కమిషనర్లను నియమిం చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉం టుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో 2005లో తొలుత ఒక చీఫ్ కమిషనర్, ముగ్గురు కమిషనర్లతో రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటై.. ఐదేళ్లు కొనసా గింది. తర్వాత నుంచి సమాచార చట్టం అమల్లో అన్నీ అవరోధాలే.
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2012లో నియమించిన కమిషనర్ల పదవీ కాలం ఇటీవలే ముగిసినా.. కొత్తగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఆర్టీఐ చట్టం సెక్షన్ 15(1) ప్రకారం కమిషన్ నిర్విరామంగా పని చేయాలి. పదవీ విరమణ చేసిన కమిషనర్, చీఫ్ కమిషనర్‌ల స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవారిని నియమించాలి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీఐ చట్టాన్ని అమలు చేసేం దుకు ప్రయత్నించకపోవడం గమనార్హం. సమాచార కమిషన్‌ను నియమించకుండా ప్రభుత్వాలు చట్టాన్ని అపహాస్యం పాలు చేస్తున్నాయంటూ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టును ఆశ్రయించింది కూడా.
కమిషన్ కార్యాలయానికి తాళం
ఉన్న ఒక్క సమాచార కమిషనర్ విజయ్‌బాబు ఇటీవల పదవీ విమరమణ చేయడంతో.. కమిషన్ కార్యాలయానికి తాళం పడింది. నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో కాపలాకు భద్రతా సిబ్బంది మాత్రమే ఉన్నారు. కమిషన్ కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న 92 మంది సిబ్బందిని తమ సొంత శాఖలకు వెళ్లిపోవాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకుముందే ఆదేశాలు జారీ చేశాయి. ఇక కమిషన్ ఏర్పాటైన నాటి నుంచి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 30 మంది సిబ్బందిని కూడా తొలగించారు. 12 ఏళ్లుగా పనిచేస్తున్నవారిని అకస్మాత్తుగా తొలగించడంతో వారు రోడ్డున పడ్డారు.
అప్పీలు కోసం రోజు వందలాది మంది..
ఎవరైనా అప్పీలు కోసం కమిషన్ కార్యాలయానికి వస్తే దరఖాస్తులు తీసుకోవడానికి కూడా ఎవరు లేని దుస్థితి. ఈ సంగతి తెలియక రోజూ ఇరు రాష్ట్రాల నుంచి వంద మంది దాకా కార్యాలయానికి వచ్చి వెనుదిరుగుతున్నారు. జిల్లాస్థాయిలో అధికారులు తగిన సమాచారం ఇవ్వకపోతే.. దరఖాస్తుదారులు రాష్ట్ర కమిషన్‌కు అప్పీలు చేసుకోవచ్చు. ఈ రకంగా నెలకు సగటున 900 అప్పీళ్ల వరకు వస్తున్నాయి. ఈ ఏడాది జూన్ చివరి నాటికి పరిష్కారం కావాల్సిన కేసులు 14,250 దాకా పేరుకుపోయాయి. ఇటీవలి వరకు రెండు రాష్ట్రాలకు కలిపి ఇద్దరే సమాచార కమిషనర్లు ఉండటంతో.. వారిపై పనిభారం పెరిగిపోయి పరిమిత సంఖ్యలో మాత్రమే దరఖాస్తులను పరిష్కరించగలిగారు.
ఏదో ఒక సాకుతో..
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండానే నిధులు కాజేయడం, చెరువులకు మరమ్మతులు చేపట్టకుండా బిల్లులు తీసుకోవడం వంటి అక్రమాలు బయటకొస్తాయనే ఉద్దేశంతో కింది స్థాయిలో సమాచార అధికారులు ఏదో సాకుతో సమాచారమివ్వడం లేదు. దీంతో తెలంగాణ, ఏపీల్లో వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. సుమారు రెండున్నర లక్షల దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
కమిషనర్ల కోసం ఏపీకి గదులు కరువా?
కమిషనర్లను నియమిస్తే వారు పనిచేయడానికి అవసరమైన గదులు, ఇతర మౌలిక సదుపాయాలు లేవంటూ ఏపీ చేస్తున్న వాదన హాస్యాస్పదమంటూ ఆర్టీఐ ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఏపీ తీరు ఆర్టీఐ చట్టానికి తూట్లు పొవడడమేనని పేర్కొంటున్నారు. అసలు సమాచార హక్కు కమిషన్ కోసం హైదరాబాద్‌లోని నాంపల్లిలో పెద్ద భవనాన్ని కేటాయించారు. అందులో ఇరు రాష్ట్రాల సమాచార కమిషనర్లు పని చేసేందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలూ ఉన్నాయి. అయినా ఏదో సాకు చెబుతూ అసలు కమిషన్‌నే నియమించకుండా ఏపీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందనే విమర్శలు వస్తున్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వానిదీ అదే తీరు కావడం దారుణం. త్వరలో సమాచార కమిషన్‌ను నియమిస్తామని చెబుతూనే మూడేళ్లు గడిచిపోవడం గమనార్హం.
గవర్నర్ దృష్టికి తెచ్చినా ఫలితం లేదు
‘‘సమాచార హక్కు చట్టం అమలుకు తెలంగాణ, ఏపీలు రాష్ట్ర స్థాయిలో వెంటనే కమిషనర్లను నియ మించాలని గవర్నర్‌ను కోరాం. కమిషనర్లను నియ మించకపోవడం వల్ల జరుగుతున్న అనర్థాలను ఆయన దృష్టికి తెచ్చాం. ఇరు రాష్ట్రాల సీఎంలు పట్టించుకోవడం లేదని గవర్నర్‌కు వివరించాం. గవర్నర్ కూడా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాం..’’
– పద్మనాభరెడ్డి,
ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్
ప్రభుత్వాలకు పట్టింపు లేకపోవడమే సమస్య
‘‘చట్టాన్ని కచ్చితంగా అమ లు చేయడం ద్వారా అధికార యంత్రాంగంలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ఆస్కా రం ఉంది. కానీ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ విధంగా వ్యవహరిస్తే చట్టం నిర్వీర్యమయ్యే ప్రమాదముంది..’’
– బి.రామకృష్ణం రాజు, ఆర్టీఐ ఉద్యమకారుడు