ఆప్ అంటే అరవింద్ అడ్వర్టై జ్‌మెంట్ పార్టీ!!
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ అంటే అందరికీ తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షిప్తనామం ఆప్. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆప్‌కు సరికొత్త భాష్యం చెప్పింది. ఆప్ అంటే అరవింద్ అడ్వర్టై జ్‌మెంట్ పార్టీ అంటూ విమర్శనాస్త్రాలు సంధించింది. గత మూడు నెలల్లో దినపత్రికల్లో ప్రకటనల కోసం కేజ్రీవాల్ ప్రభుత్వం రూ. 14.5 కోట్లు ఖర్చు చేసిందని తాజాగా ఆర్టీఐ ద్వారా వెల్లడి కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈమేరకు విమర్శలు చేసింది.
దినపత్రికల్లో ప్రకటనల కోసం రోజుకు రూ. 16 లక్షల చొప్పున కేజ్రీవాల్ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని, దీనిని బట్టి ఆప్ అంటే అరవింద్ అడ్వర్టై జ్‌మెంట్ పార్టీ అని స్పష్టమవుతున్నదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శోభా ఓజా మండిపడ్డారు. టీవీ, రేడియో, హోర్డింగ్లలో ప్రకటనల కోసం చేసిన ఖర్చును ఢిల్లీ ప్రభుత్వం ఆర్టీఐ ద్వారా వెల్లడించలేదని, ఈ మొత్తం ఖర్చు కలుపుకొంటే కేవలం ప్రకటనల కోసమే కేజ్రీవాల్ సర్కార్ రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసి ఉంటుందని ఆమె అన్నారు.