
వేతన సవరణలో గోప్యతా?
వేతన సంబంధ సమాచారాన్ని కేంద్రప్రభుత్వ సంస్థలు తమంత తామే వెల్ల డించాలి.
విశ్లేషణ
వేతన సంబంధ సమాచారాన్ని కేంద్రప్రభుత్వ సంస్థలు తమంత తామే వెల్ల డించాలి. అడిగినా ఇవ్వకపోవడం అన్యాయం. వేతన సవరణ గురించి అడిగితే అది భద్రత, నిఘాలకు సంబంధించినదని ఎలా వాదిస్తారు?
వేతన స్కేల్ సవరించాలని రెండేళ్ల కిందట జారీ చేసిన ఉత్తర్వుల అమలు ఎంతవరకు వచ్చిందని ఒక ఉద్యోగి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (NTRO)ను అడిగాడు. కొన్ని సంస్థలు ఆర్టీఐ కిందకు రావని నోటిఫై చేసే అధికారాన్ని ఆర్టీఐ చట్టం సెక్షన్ 24 ప్రభుత్వాలకు ఇచ్చింది. ఎన్‌టీఆర్‌ఓ ఆ విధంగా మినహాయింపు పొందిన సంస్థ కనుక సమాచారం ఇవ్వాల్సిన పని లేదన్నారు. తనకు 2009 ఉత్తర్వు ప్రకారం వేతన బకాయిలు సవరించినప్పటికీ 41 వేల రూపాయలు బాకీ ఉన్నారని ఉద్యోగి ప్రశ్నించాడు.
సెక్షన్ 24 కింద పూర్తిగా నోటిఫైడ్ సంస్థ కనుక ఏ సమాచారమూ ఇవ్వనవసరం లేదనే వాదం చట్ట విరుద్ధమని కమిషన్ తిరస్కరించింది. సెక్షన్ 24 పరిధిలోని సంస్థలు కూడా ప్రజాసమాచార అధికారిని నియమించి, సెక్షన్ 4(1)(బి) కింద ఇవ్వవలసిన సమాచారమంతా స్వయంగా వెబ్‌సైట్‌లో వెల్లడి చేయాలని కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. సెక్షన్ 4(1)(బి) పదో క్లాజ్ ప్రకారం నెలకు అధికారులకు ఉద్యోగులకు ఇచ్చే జీతాల వివరాలను, రెగ్యులేషన్‌లో భాగంగా నష్ట పరిహారం చెల్లింపు వ్యవస్థను కూడా సాధికారికంగా వివరించాల్సి ఉంటుంది. వేతన సంబంధ సమాచారాన్ని తమంత తామే ఈ సంస్థలు వెల్లడించాలి. వేతన సవరణ గురించి అడిగితే అది భద్రత, నిఘాలకు సంబంధించినదని ఎలా వాదిస్తారు? ఈ సమాచారం ఇవ్వకుండా ఆపడానికి సెక్షన్ 24 ఉపయోగపడదు.
భద్రత, గూఢచర్యానికి సంబంధించిన సమాచారం చెప్పనవసరం లేదని చట్టం నిర్దేశిస్తే వాటితో సంబంధం లేని మామూలు వ్యవహార సమాచారాన్ని కూడా ఆ క్లాజ్ కిందనే చెప్పబోమని అనడం చట్టవిరుద్ధమని అనేక హైకోర్టులు వివరించాయి. వేతన అసమానతల అన్యాయాన్ని ఎదిరించాలంటే అందుకు కావలసిన సమాచారం ఇవ్వాల్సిందే. అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించిన ఏ సమాచారమైనా సెక్షన్ 24(1) కింద నిరోధించడానికి వీల్లేదని 24(2) స్పష్టంగా వివరిస్తున్నది.
సెక్షన్ 24 పై కీలక తీర్పులు
ఫస్ట్ అప్పిలేట్ అథారిటీ, అడిషనల్ డీజీపీ, సీఐడీ, హరియాణా వర్సెస్ సీఐసీ కేసులో పంజాబ్ హరి యాణా హైకోర్టు 2011లో నిఘా, భద్రతలతో సంబంధం లేని సమాచారాన్ని ఆర్టీఐ కింద ఇచ్చి తీరాలని తీర్పు చెప్పింది. భద్రతకు అవసరమైన మేరకు సమాచారాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మాత్రమే కొన్నిసంస్థలను ఆర్టీఐనుంచి మినహాయించడానికి పార్లమెంటు సెక్షన్ 24ను చేర్చింది. కానీ దాని అర్థం రహస్యంగా పాలన జరపాలని కాదని ఆబిద్ హుస్సేన్ వర్సెస్ మణిపూర్ రాష్ట్రం కేసులో మణిపూర్ హైకోర్టు 2015లో తీర్పు చెప్పింది. మినహాయింపు పొందే సంస్థల జాబితాలో సీబీఐని చేర్చినప్పటికీ దానికి సంబంధించిన ప్రతిసమాచారమూ రహస్యంగా కాపాడాలని అర్థం చేసుకోరాదని వివరించింది. కీలకమైన నిఘా భద్రతల వ్యవహారాల సమాచారాన్ని తప్పిస్తే, మామూలు పాలనా సమాచారం ఆర్టీఐ కింద ఇవ్వవలసిందేనని కోర్టు నిర్ధారించింది.
ఫైరెంబాన్ సుధేశ్ సింగ్ వర్సెస్ మణిపూర్ కేసులో సెక్షన్ 24 పరిధిని మణిపూర్ హైకోర్టు మరోసారి వివరించింది. ఆ కేసులో అభ్యర్థి తన సర్వీసు ఫైలుకు సంబంధించిన వివరాలు కోరుతూ, నియామక పత్రాలు, సస్పెన్షన్ ఫైలు, డిపార్ట్ మెంటల్ చర్యలు తీసుకున్న ఫైలు, తొలగింపు ఉత్తర్వు పత్రం మొదలైనవి ఇవ్వాలని ఆర్టీఐ కింద అడిగాడు. ఆర్టీఐ చట్టంలో ఒక్క సెక్షన్ 24 మాత్రమే చదివి ఒక తీర్మానానికి రాకూడదు. మొత్తం చట్టాన్ని పీఠికను ఉద్దేశ పత్రాన్ని కూడా సమగ్రంగా పరిశీలించి సమన్వయించి, అడిగిన సమాచారం ఎటువంటిదో పరీక్షించి భద్రతా, నిఘా వ్యవహారాలకు సంబంధించనిదైతే తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుం దని హైకోర్టు వివరించింది.
ఆర్టీఐ చట్టం సెక్షన్ 24లో మినహాయింపు రూపంలో చాలా స్పష్టంగా ఆర్టీఐ వర్తించని సంస్థలు కూడా అవినీతి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని చట్టం నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నిఘా భద్రతా వ్యవహారాలను నెరపే సంస్థలను ఆర్టీఐ పరిధినుంచి పూర్తిగా మినహాయిస్తూ నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ రెండు అంశాలు కాకుండా ఇతర సమాచారం ఇవ్వకుండా నిషేధం విధించలేదనీ, అవినీతి, మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకుండా దాచే అధికారాన్ని ఈ చట్టం రాష్ట్రాలకు గానీ కేంద్ర ప్రభుత్వానికి గానీ ఇవ్వలేదని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ డైరెక్టరేట్, సెంట్రల్ రేంజ్, ఎస్పి వర్సెస్ ఆర్ కార్తికేయన్ కేసు (ఏఐ ఆర్ 2012 మద్రాస్ 84)లో మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వర్సెస్ ఎం కన్నప్పన్ కేసులో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ డి హరిపరంధామన్ (2013 (292) ఇఎల్‌టి 24 (మద్రాస్) కేసులో పై తీర్పును ఉటంకిస్తూ నేరవిచారణకు అనుమతించిన ఫైల్ నోట్స్ తదితర వివరాలను కోరితే ఇవ్వాల్సిందేనని, సెక్షన్ 24 సంస్థలు కూడా సెక్షన్ 4(1)(బి)5 కింద సమాచారం ఇవ్వవలసి ఉంటుందని నిర్ధారిం చింది. కనుక ఎన్‌టిఆర్‌ఓ అడిగిన సమాచారం ఇవ్వవలసిందేనని కమిషన్ ఆదేశించింది. (గెహ్లాట్ వర్సెస్ ఎన్ టీఆర్‌ఓ CIC/ LS/ A-/2012/001368 కేసులో 25 జూలై 2017 ఇచ్చిన తీర్పు ఆధారంగా).
మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com