ప్రియుడి రోగంపై ప్రియురాలి ఆర్టీఐ | Madabhushi Sridhar Article On RTI | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 15 2018 2:42 AM | Last Updated on Fri, Jun 15 2018 2:43 AM

Madabhushi Sridhar Article On RTI - Sakshi

అస్సాంలో ఒక పెద్ద మనిషికి ఎయిడ్స్‌ ఉందేమోననే అనుమానం. అక్కడ 1990ల్లో రోగ నిర్ధారణ సౌక ర్యాలు లేక ఆయనను చెన్నైకి పంపారు. రోగితో పాటు ఒక యువ డాక్టర్‌ కూడా జతగా వెళ్లారు. ఇద్దరి నుంచీ రక్తం నమూనా తీసుకున్నారు. పెద్దాయన ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. విచిత్రమేమంటే ఈ యువ వైద్యుడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని పరీక్షలో బయట పడింది. విషయం అస్సాం దాకా పాకింది. అప్పటికే ఈ యువ వైద్యుడు తన సహాధ్యాయి అయిన అమ్మాయితో ప్రేమలో పడటం, నిశ్చితార్థం జరిగిపోయాయి. చివరికి ఆ అమ్మాయికి కూడా తన ప్రియుడి రోగ సమాచారం తెలిసిపోయింది. వాస్త వం తెలుసుకోవడానికి ఆమె చెన్నై డాక్టర్‌కు ఫోన్‌ చేసి నిజమేనా అని అడిగింది. ఆ డాక్టర్‌ చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు.

హిపోక్రటిక్‌ ప్రతిజ్ఞ ప్రకా రం తాను పరీక్షించిన  రోగుల వ్యాధి రహస్యాలు అందరికీ వెల్లడించకూడదు. వధువుకు విషయం వెల్ల డించకపోతే లేదా అబద్ధం చెబితే ఆమె జీవితం ఏం కావాలి? ఏమైతే అదైందని ధైర్యంచేసి ఆ డాక్టరు, ‘అవునమ్మా, చికిత్స అవసరం. మందులు కూడా చెప్పాం,’ అని వివరించాడు. ఆమె నిశ్చితార్థాన్ని రద్దుచేసుకుంది. వరుడికి పెద్ద డాక్టర్‌ మీద కోపం వచ్చింది. ఆయన వల్లే తన పెళ్లి రద్దయిందని, తనకు వివాహ హక్కు లేకుండా పోయిందని బాధ పడ్డాడు. కేసు పెట్టాడు. సుప్రీంకోర్టు దాకా తగాదా వెళ్లింది. ఈ యువకుడికి పెళ్లి హక్కు ఉందా? ఒప్పుకున్న నేరానికి ఎయిడ్స్‌ రోగితో కూడా పెళ్లిచేసుకోవలసిన బాధ్యత వధువుపై ఉందా? ఈ సమాచారం రహ స్యంగా కాపాడవలసిన బాధ్యత పెద్ద డాక్టర్‌పై ఉందా? ఇది గోప్యంగా దాచ వలసిన వ్యక్తిగత సమాచారమా లేక మరొకరి జీవితానికి సంబంధించి వెల్ల డించవలసిన కీలకమైన అంశమా? సుప్రీంకోర్టులో దీనిపై పెద్ద లాయర్లు వాదించారు.

మిస్టర్‌ ఎక్స్‌ వర్సెస్‌ హాస్పి టల్‌ జెడ్‌ అనే పేరుతో 1998లో తీర్పు వచ్చింది. ఈ సమాచారం చెప్పవలసిందే నని, ప్రియురాలికి ప్రియుడి ఆరోగ్య వివరాలు తెలుసుకునే హక్కు ఉందని, ప్రియుని వివాహ హక్కు కన్నా ప్రియురాలి జీవన హక్కు కీలకమైందని జడ్జీలు సాఘిర్‌ అహ్మద్, బీఎన్‌ కృపాల్‌ వివరించారు. మొదట ఎయిడ్స్‌ రోగులకు పెళ్లిచేసుకునే హక్కు లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కాని మానవ హక్కుల సంఘాలు ఇది అన్యాయం అంటూ మళ్లీ అభ్యర్థిస్తే, ఎయిడ్స్‌ రోగికి కూడా పెళ్లి హక్కు ఉంది కాని, జబ్బు వివరాలు మొత్తం కాబోయే జీవిత భాగస్వామికి చెప్పాక, స్వచ్ఛందంగా అంగీకరిస్తేనేనని వివరించింది.
కొన్ని ఉద్యోగాలు చేయాలంటే ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. చూపు సరిగా లేకపోతే రాని ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. జీవితబీమా చేయాలంటే ఏజెంటు ముందుగా అన్ని ఆరోగ్య పరీక్షలు చేయిస్తాడు. మన అలవాట్లు, రోగాల ఆధారంగా మన బీమా ధర నిర్ణ యిస్తారు. మనకు కూడా తెలియని మన రోగాలు బీమా కంపెనీలకు అధికారికంగా తెలుస్తాయి.

వారి బీమా దస్తావేజుల్లో మన రోగాల వివరాలు భద్రంగా ఉంటాయి. విచిత్రమేమంటే బీమాకు, ఉద్యోగానికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు, రోగ నిర్ధా రణలను పెళ్లి, ప్రేమ విషయంలో పట్టిం చుకోం. ఎన్నో ప్రేమలు, పెళ్లిళ్లు రోగాల గురించి ముందే చెప్పకపోవడం వల్ల విఫ లమవుతున్నాయి. నపుంసకత్వం కూడా ఒక రోగం. దాని గురించి చెప్పరు. తెలి సినా మాట్లాడరు. రుజువు చేయడం కష్టం. 60 శాతం నపుంసకులను పట్టుకోవడం ఇంకా కష్టం. వధువు అడగడానికి వెనుకా డుతుంది.

అడిగితే భర్త అనేక నిందలు వేస్తాడు. భార్య అల్లరి చేస్తే తప్ప ఈ విషయం తేలదు. నేరా నికి లింగభేదం ఉండదు. లింగవివక్ష లేనివేవంటే –నేరం, అవినీతి, దుర్మార్గం, దొంగతనం. డిటెక్టివ్‌ల సేవలను కొనుక్కున్నా వరుడి రోగాలు, వధువు జబ్బులు ఒకరికొకరికి తెలిసే అవకాశం లేదు. కాంట్రాక్టు చట్టం ప్రకారం ఏదైనా ఒప్పందం ఖరారు కావడానికి ముందు ఇరు పక్షాల మధ్య పూర్తి సమా చార మార్పిడి జరగాలి. లేకపోతే కాంట్రాక్టు చెల్లదు. పెళ్లి కూడా ఒప్పందమే. పారదర్శకత లేని పెళ్లి లాయర్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. వధూవ రుల రోగాల గురించి కోర్టులు తెలుసుకోవడానికి ఏళ్లు పడుతుంది. రహస్యాలతో నిర్మించుకునే అబ ద్ధాల గోడల వల్ల కాపురాలు కూలిపోతాయి. మన దేశంలో అనేక కుటుంబాలకు, సంస్థలకు పట్టిన పెద్ద వ్యాధి దాపరికం. ఆరోగ్యం విషయంలో దాపరికం అందరికీ కీడే చేస్తుంది.

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement