Madabushi Sreedhar
-
కోహినూర్ వజ్రం మనకు దక్కేనా?
మన చరిత్ర, సంస్కృతి కాపాడుకోవడంలో మన ఘనత ఏమిటి? మన తాతలు తాగిన నేతుల కథలు చెప్పి మూతుల వాసన చూడమంటున్నామే గాని, ఆ ఘనత చాటే సాక్ష్యాలను దోచుకుపోతుంటే ఏమీ చేయలేకపోతున్నామా? అని ఓ పౌరుడు ఆర్టీఐలో ప్రశ్నించాడు. కోహినూర్ వజ్రం, సుల్తాన్‌గంజ్ బుద్ధుడు, నాసాక్ వజ్రం, టిప్పు సుల్తాన్ ఖడ్గం, ఉంగరం, మహారాజా రంజీత్ సింగ్ బంగారు సింహాసనం, షాజహాన్ మద్యపాత్ర, అమరావతి నిర్మాణ వస్తువులు, వాగ్దేవి చలువరాతి బొమ్మ, టిప్పు సుల్తాన్ దాచుకున్న యాంత్రిక పులి బొమ్మ వంటి విలువైన వస్తువులను విదేశీ పాలకులు మన దేశం నుంచి తరలించుకుపోయారని, వాటిని రప్పించే ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలు ఇచ్చాయో తెలపాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరుతూ రాజమండ్రికి చెందిన బీకే ఎస్ఆర్ అయ్యంగార్ ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేశారు. ప్రధాని కార్యాలయం ఆ పత్రాన్ని వెంటనే పురావస్తు శాఖకు బదిలీ చేసింది. కళాఖండాల ఖజానా చట్టం ప్రకారం 1972 తరువాత దేశం నుంచి తస్కరించిన పురాతన వస్తువులను తెప్పించేందుకు చర్యలు తీసుకోవలసి ఉంటుంది గాని అంతకుముందు స్మగ్లింగ్ అయిన వస్తువులు, వాటి తరలింపుపై తాము ఏ చర్యలూ తీసుకోలేమని ఏఎస్ఐసీపీఐఓ తెలిపారు. దేశం నుంచి తరలించుకుపోయిన 25 ప్రాచీన వస్తు వులను తిరిగి రప్పించగలిగామని, దరఖాస్తుదా రుడు అడిగిన కోహినూర్ వంటి అత్యంత విలువైన వస్తువుల గురించి తామే చర్యలు తీసుకోలేమని జవాబు ఇచ్చారు. తనకు కావలసిన సమాచారం ఇవ్వలేదని కమిషన్ ముందు రెండో అప్పీలు దాఖలు చేశారు. స్వాతంత్య్రానికి ముందే తరలి పోయిన కోహి నూర్ వజ్రం, టిప్పు ఖడ్గం వంటి చారిత్రక వార సత్వ చిహ్నా లను స్వదేశం రప్పించే అధికారం, వన రులు ఏఎస్ఐ శాఖలకు లేవని తనకు తెలుసనీ, అందుకే ప్రధాని కార్యాల యాన్ని సమాచారం అడిగానని, దానికి సమాధానం చెప్పకుండా, అధికారాలు లేని పురావస్తు శాఖకు బదిలీ చేయడం అన్యాయమని అయ్యంగార్ విమర్శించారు. కోహి నూర్ వజ్రం తిరిగి తెప్పించాలని కోరుతూ అఖిల భారత మానవ హక్కులు, సాంఘిక న్యాయం ఫ్రంట్ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. తమకు ప్రజల భావాలు తెలుసనీ, కనుక కోహినూర్ వజ్రాన్ని సాధించడానికి భారత విదేశాంగ శాఖ ప్రయత్నిస్తోందని, బ్రిటన్ ప్రభు త్వంతో సంప్రదింపులను కొనసాగిస్తుందని సుప్రీం కోర్టుకు సర్కారు విన్నవించింది. సుప్రీంకోర్టులో హామీ ఇచ్చి రెండు రోజులు దాటకముందే ప్రభు త్వం మాట మార్చింది. బ్రిటిష్ రాణికి బహుమతిగా ఇచ్చిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని అడ గడం సాధ్యం కాదని తెలిపింది. గత ప్రభుత్వాల వాదన ప్రకారం కోహినూర్ విదేశీ పాలకులు దొంగి లించిన వస్తువు కాదని 1956లో ప్రధాని నెహ్రూ వజ్రాన్ని తిరిగి ఇమ్మని కోరడానికి ఏ ఆధారాలూ లేవని, అయినా డిమాండ్ చేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారని ప్రభుత్వ పక్షాన లాయర్లు వాదించారు. వాటిని వెనక్కి రప్పిం చడానికి ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని దాఖ లైన ఆర్టీఐ దరఖాస్తును పురావస్తు శాఖకు బదిలీ చేయడానికి బదులు ప్రధాన మంత్రి కార్యాలయమే జవాబు ఇవ్వాలని కేంద్ర సమాచార కమి షనర్ కోరారు. దేశం నుంచి తరలిపోయిన పదో శతాబ్దపు దుర్గా మాత విగ్రహాన్ని జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ సంపాదించి 2015లో ప్రధాని నరేంద్రమో దీకి బహూ కరించారు. 900 ఏళ్ల పురాతన కీరవాణి సాలభంజిక సంపాదించి 2015 ఏప్రి ల్లో కెనడా ప్రధాని ఇచ్చారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ ఆబట్ 2014లో భారత పర్యటనకు వచ్చినపుడు తమ దేశపు ఆర్ట్ గ్యాలరీల్లో ఉన్న హిందూ దేవతామూర్తులను మన ప్రధానికి అంద జేశారు. టవర్ ఆఫ్ లండన్‌లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని రప్పించడానికి తీసుకోవలసిన చర్యల గురించి ప్రధానమంత్రి 2016లో ఉన్నతాధికారు లతో సమావేశం నిర్వహించారని వార్తలువచ్చాయి. ఈ సమాచారం ప్రధాని కార్యాలయంలో ఉంటుంది కానీ పురావస్తు సర్వే సంస్థ దగ్గర ఉండదు. ముందుగా ప్రధాని కార్యాల యాన్ని ఈ సమాచారం కోరితే, వాటిని రప్పించే అధికారం లేదని తెలిసి కూడా వారు ఈ దరఖాస్తును పురావస్తుశాఖకు బదిలీ చేయడం సమంజసం కాదు. హోం మంత్రిత్వ శాఖ లేదా విదేశాంగశాఖ ఈ విషయమై తీసుకున్న చర్యలు, వాటి ఫలితాల గురించి ప్రధాని కార్యాల యమే తెలపాలని కమిషన్ భావించింది. ఈ విధంగా దరఖాస్తులు బదిలీ చేసే ముందు కాస్త ఆలోచించాలి. (బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ వర్సెస్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కేసులో 2018 ఆగస్టు 20న సీసీఐ ఇచ్చిన ఆదేశం ఆధారంగా). మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
ప్రియుడి రోగంపై ప్రియురాలి ఆర్టీఐ
అస్సాంలో ఒక పెద్ద మనిషికి ఎయిడ్స్ ఉందేమోననే అనుమానం. అక్కడ 1990ల్లో రోగ నిర్ధారణ సౌక ర్యాలు లేక ఆయనను చెన్నైకి పంపారు. రోగితో పాటు ఒక యువ డాక్టర్ కూడా జతగా వెళ్లారు. ఇద్దరి నుంచీ రక్తం నమూనా తీసుకున్నారు. పెద్దాయన ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. విచిత్రమేమంటే ఈ యువ వైద్యుడికి హెచ్ఐవీ పాజిటివ్ అని పరీక్షలో బయట పడింది. విషయం అస్సాం దాకా పాకింది. అప్పటికే ఈ యువ వైద్యుడు తన సహాధ్యాయి అయిన అమ్మాయితో ప్రేమలో పడటం, నిశ్చితార్థం జరిగిపోయాయి. చివరికి ఆ అమ్మాయికి కూడా తన ప్రియుడి రోగ సమాచారం తెలిసిపోయింది. వాస్త వం తెలుసుకోవడానికి ఆమె చెన్నై డాక్టర్‌కు ఫోన్ చేసి నిజమేనా అని అడిగింది. ఆ డాక్టర్ చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డాడు. హిపోక్రటిక్ ప్రతిజ్ఞ ప్రకా రం తాను పరీక్షించిన రోగుల వ్యాధి రహస్యాలు అందరికీ వెల్లడించకూడదు. వధువుకు విషయం వెల్ల డించకపోతే లేదా అబద్ధం చెబితే ఆమె జీవితం ఏం కావాలి? ఏమైతే అదైందని ధైర్యంచేసి ఆ డాక్టరు, ‘అవునమ్మా, చికిత్స అవసరం. మందులు కూడా చెప్పాం,’ అని వివరించాడు. ఆమె నిశ్చితార్థాన్ని రద్దుచేసుకుంది. వరుడికి పెద్ద డాక్టర్ మీద కోపం వచ్చింది. ఆయన వల్లే తన పెళ్లి రద్దయిందని, తనకు వివాహ హక్కు లేకుండా పోయిందని బాధ పడ్డాడు. కేసు పెట్టాడు. సుప్రీంకోర్టు దాకా తగాదా వెళ్లింది. ఈ యువకుడికి పెళ్లి హక్కు ఉందా? ఒప్పుకున్న నేరానికి ఎయిడ్స్ రోగితో కూడా పెళ్లిచేసుకోవలసిన బాధ్యత వధువుపై ఉందా? ఈ సమాచారం రహ స్యంగా కాపాడవలసిన బాధ్యత పెద్ద డాక్టర్‌పై ఉందా? ఇది గోప్యంగా దాచ వలసిన వ్యక్తిగత సమాచారమా లేక మరొకరి జీవితానికి సంబంధించి వెల్ల డించవలసిన కీలకమైన అంశమా? సుప్రీంకోర్టులో దీనిపై పెద్ద లాయర్లు వాదించారు. మిస్టర్ ఎక్స్ వర్సెస్ హాస్పి టల్ జెడ్ అనే పేరుతో 1998లో తీర్పు వచ్చింది. ఈ సమాచారం చెప్పవలసిందే నని, ప్రియురాలికి ప్రియుడి ఆరోగ్య వివరాలు తెలుసుకునే హక్కు ఉందని, ప్రియుని వివాహ హక్కు కన్నా ప్రియురాలి జీవన హక్కు కీలకమైందని జడ్జీలు సాఘిర్ అహ్మద్, బీఎన్ కృపాల్ వివరించారు. మొదట ఎయిడ్స్ రోగులకు పెళ్లిచేసుకునే హక్కు లేదని సుప్రీంకోర్టు చెప్పింది. కాని మానవ హక్కుల సంఘాలు ఇది అన్యాయం అంటూ మళ్లీ అభ్యర్థిస్తే, ఎయిడ్స్ రోగికి కూడా పెళ్లి హక్కు ఉంది కాని, జబ్బు వివరాలు మొత్తం కాబోయే జీవిత భాగస్వామికి చెప్పాక, స్వచ్ఛందంగా అంగీకరిస్తేనేనని వివరించింది. కొన్ని ఉద్యోగాలు చేయాలంటే ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. చూపు సరిగా లేకపోతే రాని ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. జీవితబీమా చేయాలంటే ఏజెంటు ముందుగా అన్ని ఆరోగ్య పరీక్షలు చేయిస్తాడు. మన అలవాట్లు, రోగాల ఆధారంగా మన బీమా ధర నిర్ణ యిస్తారు. మనకు కూడా తెలియని మన రోగాలు బీమా కంపెనీలకు అధికారికంగా తెలుస్తాయి. వారి బీమా దస్తావేజుల్లో మన రోగాల వివరాలు భద్రంగా ఉంటాయి. విచిత్రమేమంటే బీమాకు, ఉద్యోగానికి అవసరమైన ఆరోగ్య పరీక్షలు, రోగ నిర్ధా రణలను పెళ్లి, ప్రేమ విషయంలో పట్టిం చుకోం. ఎన్నో ప్రేమలు, పెళ్లిళ్లు రోగాల గురించి ముందే చెప్పకపోవడం వల్ల విఫ లమవుతున్నాయి. నపుంసకత్వం కూడా ఒక రోగం. దాని గురించి చెప్పరు. తెలి సినా మాట్లాడరు. రుజువు చేయడం కష్టం. 60 శాతం నపుంసకులను పట్టుకోవడం ఇంకా కష్టం. వధువు అడగడానికి వెనుకా డుతుంది. అడిగితే భర్త అనేక నిందలు వేస్తాడు. భార్య అల్లరి చేస్తే తప్ప ఈ విషయం తేలదు. నేరా నికి లింగభేదం ఉండదు. లింగవివక్ష లేనివేవంటే –నేరం, అవినీతి, దుర్మార్గం, దొంగతనం. డిటెక్టివ్‌ల సేవలను కొనుక్కున్నా వరుడి రోగాలు, వధువు జబ్బులు ఒకరికొకరికి తెలిసే అవకాశం లేదు. కాంట్రాక్టు చట్టం ప్రకారం ఏదైనా ఒప్పందం ఖరారు కావడానికి ముందు ఇరు పక్షాల మధ్య పూర్తి సమా చార మార్పిడి జరగాలి. లేకపోతే కాంట్రాక్టు చెల్లదు. పెళ్లి కూడా ఒప్పందమే. పారదర్శకత లేని పెళ్లి లాయర్లకు మాత్రమే ఉపయోగపడుతుంది. వధూవ రుల రోగాల గురించి కోర్టులు తెలుసుకోవడానికి ఏళ్లు పడుతుంది. రహస్యాలతో నిర్మించుకునే అబ ద్ధాల గోడల వల్ల కాపురాలు కూలిపోతాయి. మన దేశంలో అనేక కుటుంబాలకు, సంస్థలకు పట్టిన పెద్ద వ్యాధి దాపరికం. ఆరోగ్యం విషయంలో దాపరికం అందరికీ కీడే చేస్తుంది. మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
గాడ్సే వాంగ్మూలంపైనా గోప్యతా?
విశ్లేషణ గాడ్సేలకు గాంధీని విమర్శించే హక్కు ఉంది, వారు ఆయనను ఎందుకు హత్య చేసారో చెబితే వినే అధికారం కూడా కోర్టులకు ఉంది. కానీ దానర్థం తమ సిద్ధాం తాన్ని వ్యతిరేకించే వారిని చంపేసే అధికారం, హక్కు వారికి ఉందని కాదు. జాతిపిత మహాత్మాగాంధీ హత్య వివరాలు ఆర్టీఐ కింద బన్సాల్ కోరారు. హత్యవెనుక ఉన్న సంస్థ వివరాలు, ఆరో పణ పత్రం కాపీ, నాథూరాం గాడ్సే కోర్టు ప్రకటన కాపీలు కావాలన్నారు. ఢిల్లీ పోలీసు పీఐఓ ఈ దరఖాస్తును నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఏ ఐ)కి బదిలీ చేశారు. ఉన్న దస్తావేజులన్నీ వచ్చి చూసుకో వచ్చని అధికారులు సూచించారు. పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ 1993 నియమాల ప్రకారం తాము అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, 3 రూపాయలకు పేజీ చొప్పున కాపీలు ఇస్తామన్నారు. ఆర్టీఐ కింద తనకు ప్రతులు ఇవ్వాలని కోరుతూ బన్సాల్ రెండో అప్పీలు చేసుకున్నారు. గాంధీ హత్య నేర నిర్ధారణ సమయంలో నాథూరాం గాడ్సే చేసిన వాంగ్మూలం పుస్తకాలుగా వచ్చాయి, వెబ్సైట్ లలో కూడా ఉంది. ఎన్ఐఏ (ఆర్కైవ్)లో ఉన్న 11 వేలకు పైగా పేజీలలో ఆరోపణ పత్రం, నాథూరాం గాడ్సే వాంగ్మూలం కూడా ఉన్నాయని అధికారులు వివరిం చారు. ఆ దస్తావేజులు చూపడం, అందులో కొన్ని పేజీల ప్రతులు ఇవ్వడం మినహా తాము ఏ విధమైన వ్యాఖ్యా నాలు, విమర్శలు చేయలేమని ఆర్కైవ్స్ అధికారులు చెప్పారు. అదీ గాకుండా సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి జీవన్‌లాల్ కపూర్ అధ్యక్షతన ఒక న్యాయ విచా రణా సంఘం గాంధీ హత్యలో కుట్రకు సంబంధించిన కోణాన్ని వివరంగా దర్యాప్తుచేసి ఒక సమగ్రమైన నివే దిక ఇచ్చింది. ఈ నివేదిక కూడా ఇండియన్ లా ఇన్ స్టిట్యూట్ గ్రంథాలయంలో ఉంది. వారు ఈ నివేదికను స్కాన్ చేసి తమ వెబ్సైట్లో ఉంచారు కూడా. 20 ఏళ్ల కిందటి సంఘటనలకు చెందిన సమాచారా నికి సెక్షన్ 8 (3) కింద కేవలం ఏ, íసీ, ఐ కింద దేశ భద్రత, శాంతిసామరస్యాలు, పార్లమెంట్ ప్రివిలేజ్, కేబినెట్ పేపర్లకు చెందిన మినహాయింపులను పరిశీ లించాలి. ఈ అప్పీలులో పార్లమెంట్ ప్రివిలేజ్, కేబినెట్ పేపర్ల ప్రస్తావనగానీ లేదు. గాడ్సే వాంగ్మూలం ప్రతులు తయారుచేసి ఇవ్వడానికి ఆర్టీఐ చట్టం సెక్షన్ 8 కింద అవకాశం ఉందా అనీ దీన్ని వెల్లడించడం వల్ల హిందూ ముస్లిం ఐక్యతకు భంగం వాటిల్లుతుందా అని పరిశీలిం చవలసిన అవసరం ఉంది. గాంధీ రాజకీయాల మీద తీవ్రమైన విమర్శలు, విధానాలలో లోపాలమీద చర్చ, దేశ విభజనకు దారి తీసిన పరిణామాలలో గాంధీ పాత్ర పైన తీవ్రనిందలు, హిందువులకు హానికరంగా ముస్లింలను అనవసరంగా లాలించే విపరీత చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు అధికంగా ఉండటం వల్ల ఈ గాడ్సే వాంగ్మూలం వెల్ల డించాలా వద్దా అనే సందేహం రావడం సహజం. కోర్టులో సాక్ష్య విచారణ ముగిసిన తరువాత నిందితుడికి స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని సెక్షన్ 313 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వివరిస్తున్నది. దీన్ని వినియో గించుకుని నాథురాం వాంగ్మూలాన్ని ఇచ్చాడు. దాన్ని భారత ప్రభుత్వం నిషేధించింది. దాని ఆధారంగా పుస్త కాలు, నాటకాలు, రచనలు అనేకం వచ్చాయి. మరాఠీ నాటకాలు విపరీతంగా ప్రదర్శితమైనాయి. నాథూరాం గాడ్సే సోదరుడు సహనిందితుడు అయిన గోపాల్ గాడ్సే జైలుశిక్ష అనుభవించి విడుదలైన తరువాత ‘గాంధీ హత్యా నేనూ’ పేరుతో ఒక పుస్తకం మరాఠీలో రచించి విడుదల చేశారు. ఈ పుస్తకాలు విస్తరిస్తే హిందూ ముస్లింల మధ్య శత్రుత్వాలు పెరుగుతాయని, కనుక ఈ పుస్తకం ప్రతులన్నీ స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం సీఆర్పీసీ సెక్షన్ 99 ఎ కింద డిసెంబర్ 6, 1967న ఒక ఉత్తర్వును జారీ చేసింది. ఈ ఉత్తర్వు రాజ్యాంగబద్ధతను గోపాల్ గాడ్సే బాంబే హైకోర్టులో సవాలు చేశాడు. న్యాయమూర్తులు మోదీ, వి దేశాయ్, చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. పుస్తకాన్ని మరాఠీ నుంచి ఆంగ్లంలోకి అనువదింపచేసి, గాడ్సే వాక్స్వాతంత్య్రానికి భంగక రంగా వ్యవహరించకూడదని పుస్తకం స్వాధీన ఉత్తర్వు లను రద్దుచేస్తూ తీర్పుచెప్పింది. పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛలను గుర్తించిన ఆర్టికల్ 19(1)(ఎ)లో సమాచార హక్కు ఉందని, ఆర్టికల్ 19 (2)లో పేర్కొన్న సమంజస పరిమితులతో సమన్వయంగా సమాచార స్వేచ్ఛపైన కూడా పరిమితులు ఉంటాయని కోర్టులు తీర్పులు ఇచ్చాయి. నాథూరాం గాడ్సే వాంగ్మూలాన్ని చేర్చి, గోపాల్ గాడ్సే రాసిన పుస్తకం ఇంకా తీవ్రమైన విమ ర్శలు ఉన్నా ఆ పుస్తకాన్ని స్వాధీనం చేసుకునే ఉత్తర్వులు చెల్లవని ప్రకటించినప్పుడు గాడ్సే ప్రకటన ప్రతిని ఇవ్వ డానికి అభ్యంతరాలు ఉండాల్సిన అవసరం లేదు. గాడ్సే ప్రకటన వెల్లడి చేసినంత మాత్రాన లేదా నిషేధాన్ని వ్యతిరేకించినంత మాత్రాన ఆ అభిప్రాయాలతో ఏకీభ వించినట్టు కాదని బొంబాయ్ హైకోర్టు వివరించింది. గాడ్సేలకు గాంధీని విమర్శించే హక్కు ఉంది, వారు ఎందుకు హత్యచేశారో చెప్పదలిస్తే వినే అధికారం కూడా కోర్టులకు, ప్రజలకు ఉంది. కానీ దానర్థం తమ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని చంపేసే అధికారం, హక్కు ఉందని కాదు. కనుక గాడ్సే ప్రకటన ప్రతులను పేజీకి రెండు రూపాయల కన్నా ఎక్కువ కాకుండా ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. (ఎ బన్సాల్ వర్సెస్ ఎన్ఏఐ ఇఐఇ/Sఏ /అ/2015/900266–అ కేసులో 16.2.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com ) -
అధికార దుర్వినియోగ వర్సిటీలు..!
విశ్లేషణ అకడమిక్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదించని విధానాన్ని ఒక అధికారి ఏవిధంగా అమలు చేస్తారు? పార్లమెంటు రూపొందించిన చట్టానికి వ్యతిరేకంగా ఒక అంతర్గత విధానాన్ని తయారు చేస్తే ఎలా చెల్లుతుంది అని కూడా పరీక్షించలేదు. ఒక పది రూపాయలకోసం లక్షల రూపాయల ప్రజల డబ్బు ఖర్చు చేయడానికి ఏమాత్రం వెనుకాడకపోవడం ప్రభుత్వ కార్యాలయాలకు అలవాటైంది. యూనివర్సిటీలు కూడా అదే రకంగా వ్యవహరించడం మరీ విచారకరం. ఢిల్లీ యూనివర్సిటీ సమాచార వ్యతిరేక వ్యవహారాన్ని చాటుకుంది. శ్రేయస్కర్ అనే వ్యక్తి 2013లో ఎంబీఏ పార్ట్ టైం కోర్సులో భాగంగా సమర్పించిన సిద్ధాంత గ్రంథం గురించి వివరాలను జైన్ సమాచార దరఖాస్తులో కోరారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం సీపీఐఓ ఈ దరఖాస్తును అన్యా యంగా తిరస్కరించారు. జైన్ పదిరూపాయల పోస్టల్ ఆర్డర్ ఇచ్చినా దాన్ని రిజిస్ట్రార్ పేరుతో కాకుండా సీపీఐఓ పేరుతో ఇచ్చాడనే కుంటిసాకుతో సమాచారం ఇవ్వలేదు. పేరు మార్చమని కోరితే సరిపోయేది. కాని పేరు సరిగా లేదని మొత్తం దరఖాస్తునే తిరస్కరించడం ఆర్టీఐ చట్ట వ్యతిరేకమైన పని. మేం తిరస్కరించలేదని కేవలం వెనక్కి పంపామని సీపీఐఓ జయ్‌చంద్ వాదించారు. పోస్టల్ ఆర్డర్‌తోపాటు దరఖాస్తును కూడా వెనక్కి పంపడం వల్ల సమాచారం పొందే మార్గమేదీ మిగల్లేదని కనుక వెనక్కి పంపడం తిరస్కారమే అవుతుందని జైన్ వాదించారు. పోస్టల్ ఆర్డర్ తీసుకున్న క్షణమే పదిరూపాయల సమాచార ఫీజును భారత ప్రభుత్వానికి చెల్లించినట్టే. ఆ పది రూపాయలు తమ ఖాతాలోకి మార్చుకోవడం కోసం యూనివర్సిటీ వారు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం రిజిస్ట్రార్ పేరుతోనే ఎందుకు అకౌంట్ ఉండాలి? సీపీఐఓ పేరుతో మరొక ఖాతా తెరిచి ఆ పేరుతో వచ్చే పోస్టల్ ఆర్డర్లను ఎందుకు తీసుకోకూడదు? సమాచార హక్కు కోరుకునే వారు చట్టం నిర్దేశించిన సిపిఐఓ పేరునే వాడతారు. దానికి వీలు కల్పించాల్సిన బాధ్యత అధికారు లదే. ఈ మార్పులు చేసుకోవాలని కమిషన్ ఎన్ని సార్లు సూచించినా వినకుండా ఢిల్లీ యూనివర్సిటీ దరఖాస్తులను తిరస్కరిస్తూనే ఉంది. సమాచారాన్ని ఇవ్వకుండా ఉండేం దుకు ఈ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టమవుతున్నది. పది రూపాయల పోస్టర్ ఆర్డర్ సరిగా లేకపోతే సమా చారం ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లను కూడా రంగంలోకి దింపింది ఢిల్లీ విశ్వ విద్యాలయం. దాదాపు రెండేళ్ల పాటు సమాచార కమిషన్ ముందు రెండో అప్పీలును ఒక లిటిగేషన్ రూపంలో నడప డానికి నానా ప్రయత్నాలు చేసింది. రకరకాల సాగదీత దర ఖాస్తులు, పిటిషన్లు తయారు చేసి వాదనలు చేయడానికి సమయం కావాలని కోరింది, పనికిరాని సాకులతో ఏడాది పైగా వాయిదాలు కోరింది. లేదంటే తమకు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదని గగ్గోలు చేయడానికి సీనియర్ లాయ ర్లకు వేల రూపాయలు సమర్పించింది. ఒక చిన్న సమా చారం ఇవ్వడానికి ఇష్టం లేక ఇంత ప్రజాధనం వ్యయం చేసి ఆలస్యంచేసి కమిషన్ సమయాన్ని వృథా చేసే దుర్మా ర్గానికి ఒక విశ్వవిద్యాలయం పాల్పడడం విచారకరం. విశ్వవిద్యాలయం అంతర్గతంగా రూపొందించిన విధాన ప్రక్రియ ప్రకారమే తాను పోస్టల్ ఆర్డర్‌ను తిరస్క రించానని మరో వాదాన్ని లేవదీశారు జయ్‌చంద్. స్వీక రించడానికి వీల్లేని ఆర్థిక పత్రాలు అనే ఒక సాకును వీరు సృష్టించారు. ఈ అంతర్గత విధానాన్ని ఎవరు రూపొందిం చారో చెప్పలేదు. దానికి ఎవరి అనుమతి ఉందో వివరిం చలేదు. దానికి ఆధారం ఏమిటో తెలియదు. దీనికి రిజి స్ట్రార్ మరికొందరు అధికారులు లా లెక్చరర్లు మద్దతు పల కడంతో ప్రజాసమాచార అధికారులు సమాచార వ్యతిరేక అధికారులుగా మారారు. అకడమిక్ కౌన్సిల్ గాని ఎగ్జి క్యూటివ్ కౌన్సిల్ కాని ఆమోదించని విధానాన్ని ఒక అధి కారి అంతర్గత అధికారిగా ఏవిధంగా అమలు చేస్తారు? పార్లమెంటు రూపొందించిన చట్టానికి వ్యతిరేకంగా ఒక అంతర్గత విధానాన్ని తయారు చేస్తే ఎలా చెల్లుతుంది అని పరీక్షించలేదు. విశ్వవిద్యాలయంలో ఉన్నలా విభాగాన్ని, ప్రొఫెసర్లను సంప్రదించకుండా ఈ చట్ట వ్యతిరేక విధా నాన్ని రూపొందించడం హక్కుల మూకుమ్మడి ఉల్లంఘన కాదా? అదీగాక ప్రభుత్వ సంస్థలలో సమాచార చట్టానికి వ్యతిరేకంగా రూపొందించిన ఏ విధానం కూడా చెల్లదని, ఇదివరకే ఆ విధానాలు ఉన్నా కొత్తగా రూపొందించినా, చట్టానికి వ్యతిరేకంగా ఉంటే అవి చెల్లకుండా సమాచార హక్కు చట్టం మాత్రమే వర్తిస్తుందని చాలా స్పష్టంగా సెక్షన్ 22 చెబుతున్నదని కమిషనర్ గుర్తుచేయవలసి వచ్చింది. విచారకరమైన విషయం ఏమంటే ఈ సమాచార వ్యతిరేక వ్యవహారాలకు ఒక లా టీచర్ కూడా అండగా ఉండడం. న్యాయశాస్త్ర విభాగం ఇందులో చట్టవ్యతిరేక పాత్ర పోషించడం మరీ విచారకరం. సమాచారహక్కు చట్టం ఎక్కడా నిర్దేశించనిరీతిలో ఒక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అంత ర్గత ప్రక్రియను రూపొందించినా చెల్లదని కమిషన్ ప్రకటిం చింది. చట్టంలో ఉన్న అంశాలను దానికింద చేసిన నియ మాలను పేర్కొంటూ విశ్వవిద్యాలయ విధానాలు ఎంతగా చట్ట వ్యతిరేకమో వివరించింది. కేవలం సెక్షన్ 8 లేదా 9 కింద పేర్కొన్న మినహాయింపు నియమాల కింద మాత్రమే సమాచార అభ్యర్థనను తిరస్కరించవలసి ఉంటుంది. మరో కారణంపైన తిరస్కరిస్తే అది చట్ట వ్యతిరేకమే. అయినా భారత ప్రభుత్వానికి పది రూపా యలు చెల్లించిన తరువాత దరఖాస్తును తిరస్కరించే అధికారం పీఐఓకు లేదు. పది రూపాయల కోసం లక్షల రూపాయలు వెచ్చించి మామూలు లిటిగెంట్ వలె ఒక యూనివర్సిటీ కోర్టులకెక్కి కక్షిదారు కావడం ప్రజాధనాన్ని దుర్విని యోగం చేయడమే అవుతుందని సీపీఐఓ పైన 25 వేల రూపాయల జరిమానా విధించింది. (వ్యాసకర్త : మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ )