మాన్యం.. దైన్యం..! | save the temple lands | Sakshi
Sakshi News home page

మాన్యం.. దైన్యం..!

Published Tue, May 3 2016 2:44 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

మాన్యం.. దైన్యం..!

మాన్యం.. దైన్యం..!

ఆలయ భూములను పరిరక్షించాలి
ప్రజావాణిలో విజ్ఞప్తి చేసిన సామాజిక కార్యకర్త

 సంగారెడ్డి జోన్: ఆలయ భూములను కొందరు కబ్జాదారులు, అధికారుతో మిలాఖతై కాజేశారని, సమాచార హక్కు చట్టం ద్వారా సాధించుకున్న తీర్పును అమలు చేయకపోవడమే కాకుండా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఓ సామాజిక కార్యకర్త జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజావిజ్ఞాప్తుల దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఏజేసీ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ వర్షిణి, డీఆర్వో దయానంద్ వివిధ శాఖల అధికారులు ప్రజాల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా హత్నుర మండలం చిక్‌మద్దూర్ అభయాంజనేయ స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని , అట్టి భూములను పరిరక్షించాలని సామాజిక కార్యకర్త ప్రవీణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

 బాధ్యులను శిక్షించాలి..
బాల్య వివాహాన్ని అడ్డుకుందనే అనుమానంతో దాయాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన జహీరాబాద్ మండలం ఖాసీంపూర్‌కు చెందిన  వడ్ల నర్సమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఆమె హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత,  జిల్లా కార్యదర్శి మల్లేశ్వరి ఏజేసీకి వాసం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు.

 పట్టాపాస్‌పుస్తకాలు ఇప్పించండి..
మాజీ మిలిటెంట్ అయిన తన భర్త సుందరయ్య 2004లో తూప్రాన్ డీఎస్పీ ఎదుట లొంగిపోయారని, పునరావాసం కింద సర్వే నం. 283లో అయిదెకరాల భూమి సాగుచేసుకుంటున్న తనకు పట్టా పాస్‌బుక్‌లను మంజూరు చేయాలని వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామానికి చెందిన భూదమ్మ విజ్ఞప్తి చేశారు.

 నష్ట పరిహారం ఇప్పించండి..
నిమ్జ్ ఏర్పాటుతో భూములు కోల్పోతున్న తమకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన నర్సమ్మ, యాదమ్మ, గోపమ్మలు వేర్వేరుగా విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని సర్వే నం. 125లోని భూములను ప్రభుత్వం సేకరిస్తున్నందున తమకు నష్టపరిహారం ఇప్పించాలన్నారు.  తన పట్టాభూమిలో ఉన్న సర్వే నెంబర్ 39,40లోగల రోడ్డుకు ఇరువైపులా ఉన్న వేప, మామిడి, రేగు చెట్లను నరికివేయటం వలన సుమారు రూ.2లక్షలు నష్టపోయానని తనకు న్యాయం చేయాలని జహీరాబాద్ మండలం మొగుడంపల్లికి చెందిన బక్కారెడ్డి విజ్ఞప్తి చేశారు.

 శిక్షణ ఇప్పించండి..

 జీఆర్‌ఈ టోఫెల్‌లో శిక్షణ పొందిందేకు తనకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందజేయాలని   చిన్నకోడూరు మండలం మాచపూర్‌కు చెందిన గాజుల రాజేందర్  విజ్ఞప్తి చేశారు.

  సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న అర్జీలను బుట్టదాఖలు చేయడమే కాకుండా అనేక అక్రమాలకు పాల్పడుతున్న  సంగారెడ్డి మున్సిపల్‌లోని ఆర్‌ఐ వెంకట్రావ్, టీపీఎస్ రాజేంద్రప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని సంగారెడ్డిలోని సాయి మాణిక్యనగర్ కాలనీ చెందిన శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.

  హన్ములవాసికుంట అభివృద్ధి పనులను ఆయకట్టు రైతులకు అప్పగించాలని శివ్వంపేట మండలం పిల్లుట్లగ్రామానికి చెందిన రైతులు బాలయ్య, లక్ష్మయ్య, లచ్చయ్య కోరారు. ఎన్‌ఆర్‌ఇజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ అనేక అక్రమాలకు పాల్పడుతూ పని చేసిన కూలీలకు కాకుండా పని చేయని వారికి హాజరు వేస్తూ బీదర్ నుంచి కార్యకలాపాలు చేపడుతున్నారని ఆయనపై చర్యలు తీసుకోవాలని న్యాల్‌కల్ మండలం వాల్గి  గ్రామస్తులు ఆశోక్, నర్సింహా పిర్యాదు చేశారు.

 మైనార్టీ వెల్ఫేర్ కార్యాలయంలో ఆరు సంవత్సరాలుగా డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న ఎండీ షకీర్ అలీని బదిలీ చేయాలని సామాజిక కార్యకర్త మహ్మద్ నిజామొద్దీన్ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement