న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితా లోని టాప్ 50 సంస్థలు కట్టాల్సిన రూ. 68,607 కోట్ల మేర రుణాల బాకీలను బ్యాంకులు సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ లిస్టులో విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ వంటి వ్యాపారవేత్తలకు చెందిన సంస్థలు కూడా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఆర్‌బీఐ ఈ మేరకు సమాధానం ఇచ్చింది. గతేడాది సెప్టెంబర్ 30 నాటి వరకు గణాంకాల ప్రకారం.. టాప్ 50 లిస్టులో.. గీతాంజలి జెమ్స్ (పరారీలో ఉన్న చోక్సీకి చెందిన సంస్థ) అత్యధికంగా రూ. 5,492 కోట్ల బాకీలు చెల్లించాల్సి ఉంది.
ఆర్‌ఈఐ ఆగ్రో రూ. 4,314 కోట్లు, విన్‌సమ్ డైమండ్స్ రూ. 4,076 కోట్లు కట్టాల్సి ఉంది. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ. 1,943 కోట్ల బాకీలతో 9వ స్థానంలో ఉంది. ఇక డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ. 1,962 కోట్లు, ట్రాన్స్‌ట్రాయ్ రూ. 1,790 కోట్లు బాకీ పడ్డాయి. ఆర్‌టీఐ కార్యకర్త సాకేత్ గోఖలే ఫిబ్రవరి 16న ఎగవేతదారుల వివరాల కోసం ఆర్‌బీఐకి దరఖాస్తు చేశారు. అయితే అప్పట్లో ఆ వివరాలు అందుబాటులో లేవని పేర్కొన్న రిజర్వ్ బ్యాంక్.. ఏప్రిల్ 24న రాతపూర్వక సమాధానం ఇచ్చింది.
మరోవైపు, డిఫాల్టర్ల జాబితాలో చాలా మంది అధికార బీజేపీ మిత్రులు ఉన్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. అందుకే, దీనిపై తాను పార్లమెంటులోనే ప్రశ్నించినా ప్రభుత్వం దాటవేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ 2019 సెప్టెంబర్ దాకా బీజేపీ ప్రభుత్వం రూ. 6.66 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment