చెలామణీలో ఉన్న అన్నిరకాల కరెన్సీ నోట్ల విలువ ( రూ. కోట్లలో; మార్చి నాటికి)
న్యూఢిల్లీ: ఏటీఎంలలో రూ.2 వేల నోట్లు ఈ మధ్య కాలంలో అంతగా రాకపోవడాన్ని గమనించారా...? గతంలో పెద్దమొత్తంలో నగదు తీస్తే కచ్చితంగా ఎక్కువ సంఖ్యలోనే రూ.2 వేల నోట్లు వచ్చేవి. ఇప్పుడు మాత్రం ఈ సంఖ్య బాగా తగ్గింది. దీనికి కారణం లేకపోలేదు...! గతంలో పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన మరింత పెద్ద నోటు రూ. 2,000 ముద్రణ ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోవడమే! భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు.
సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు సమాధానమిచ్చింది. పక్కా అసలు నోట్లుగా అనిపించే నకిలీ కరెన్సీ నోట్లు మళ్లీ చెలామణీలోకి వస్తున్నాయంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హెచ్చరించిన నేపథ్యంలో ఆర్‌బీఐ సమాధానం ప్రాధాన్యం సంతరించుకుంది. నల్లధనం, నకిలీ కరెన్సీలకు చెక్ పెట్టే ప్రయత్నాల్లో భాగంగానే 2016 నవంబర్‌లో రూ. 1,000, రూ. 500 నోట్లను రద్దు చేసిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.. ఆ తర్వాత రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
సంఖ్యాపరంగా 2016–17లో 354.2 కోట్ల రూ. 2,000 నోట్ల ముద్రణ జరగ్గా ఆ మరుసటి ఏడాది గణనీయంగా తగ్గి 111.5 కోట్లకు పరిమితమైంది. 2018–19లో ఆర్‌బీఐ 4.66 కోట్ల నోట్లు ప్రింట్ అయ్యాయి. 2018 మార్చి నాటికి 336.3 కోట్ల మేర రూ. 2,000 నోట్లు చలామణీలో ఉండగా 2019 నాటికి 329.1 కోట్లకు తగ్గాయి. నల్లధనం కూడబెట్టుకునేందుకు పెద్ద నోట్లను దాచిపెట్టుకోవడాన్ని నిరోధించే ఉద్దేశంతోనే రూ. 2,000 నోట్ల ముద్రణను ఆర్‌బీఐ తగ్గిస్తుండవచ్చని నిపుణులు తెలిపారు. 2019 జనవరిలో ఆంధ్ర– తమిళనాడు సరిహద్దుల్లో రూ.6 కోట్ల విలువ చేసే రూ. 2,000 నోట్లు పట్టుబడటం (లెక్కల్లో చూపని) ఈ అభిప్రాయాలకు ఊతమిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ. 2,000 కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2016–17లో 678 నకిలీ నోట్లు దొరకగా, 2017–18లో 17,929 నోట్లు బైటపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment