
పరిహారంలో వివక్షపై తల్లి పోరు
అసాంఘిక శక్తులతో పోరాడవలసిన సైనికుడు లేదా పోలీసు వలెనే అసాధారణ రోగాలతో పోరాడే డాక్టరు కూడా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవచ్చు. చనిపోవ డానికి కారణం ఏదైనా వారి కుటుంబానికి జరిగే నష్టంలో తేడా ఉండదు.
విశ్లేషణ
అసాంఘిక శక్తులతో పోరాడవలసిన సైనికుడు లేదా పోలీసు వలెనే అసాధారణ రోగాలతో పోరాడే డాక్టరు కూడా హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవచ్చు. చనిపోవ డానికి కారణం ఏదైనా వారి కుటుంబానికి జరిగే నష్టంలో తేడా ఉండదు.
కుమారుడిని అర్దాంతరంగా కోల్పోయిన తల్లిదండ్రుల మనోవేదనకు ప్రతిబింబం ఒక తల్లి ఆర్టీఐ దరఖాస్తు. ఢిల్లీ చాచా నెహ్రూ బాల చికిత్సాలయంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిగ్రస్తులైన పిల్లలకు చికిత్స చేస్తూ ఆ వ్యాధికే గురై డాక్టర్ దినేశ్ కుమార్ సింగ్ (సీనియర్ రెసిడెంట్ అనస్తీషియా) మార్చి 3, 2015న మరణించారు. మీరు ఎలాంటి పరిహారం ఎప్పుడిస్తార న్నది ఆ డాక్టర్ తల్లి ప్రశ్న. సహజంగానే సర్కారు బాబులు తలా తోకా లేని సమాధానం ఇచ్చారు. ప్రభు వుల వారి డొల్లతనం బయటపడేయటమే ఆర్టీఐ మహిమ. పరిహారం ఇవ్వనే లేదు. ఫిర్యాదుల విభాగం (పీజీఎంఎస్) మూడు సార్లు వీరి పిటిషన్‌ను తిరస్కరిం చింది. కారణాలు ఇవ్వలేదు. ఆ తల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆర్టీఐ దరఖాస్తు పంపితే వారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ, ఆర్థిక, రెవెన్యూ డివిజన్‌ల కమిషనర్ కార్యాలయాలకు బదిలీ చేశారు.
కార్మిక నష్టపరిహార చట్టం 1923 ప్రకారం పని చేస్తూ గాయపడిన, మరణించిన వారికి పరిహారం చెల్లించే బాధ్యత యాజమాన్యానిదే. ప్రమాదవశాత్తూ గాయపడడం అనే మాటలో జబ్బుపడడం, మరణిం చడం అర్థాలను కూడా అన్వయించాలి. యాజమాన్యం కోసం పనిచేస్తూ గాయపడినా, ప్రాణాలు కోల్పోయినా, అది వారికోసం చేసిన త్యాగమే. గాయపడినా జబ్బు పడినా, ఆ కార్మికుడికి లేదా ఉద్యోగికి నష్టపూర్తి చేయాలి. ఒక వేళ మరణిస్తే ఆ కుటుంబానికి అతని మరణం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలి.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు, భద్రతాదళాల సభ్యులకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఢిల్లీ ప్రభుత్వం ఇస్తున్నది. ఏప్రిల్ 2016లో కొందరి దారుణ దాడిలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ అధికారి మహ్మద్ తాజిల్ అహ్మద్, బిహార్‌లో ఫిబ్రవరి 2016లో మావోయిస్టుల దాడిలో సీఆర్‌పీఎఫ్ జవాన్ నరోత్తం దాస్, డిసెంబర్ 2013లో కానిస్టేబుల్ వినోద్ కుమార్ మరణిస్తే వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఇచ్చారు. ఎన్‌డీఎంసీ ఎస్టేట్ అధికారి ఎంఎం ఖాన్ దుండగుల దాడిలో చనిపోయారు. కేంద్రం 25 లక్షలు, ఢిల్లీ కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. 2016, ఏప్రిల్ 1న ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన నూతన విధానం ప్రకారం ఢిల్లీకి చెందిన పోలీసులు, అర్ధసైనిక, సాయుధ దళాలు లేదా హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ తదితర దళాలకు చెందిన వారెవరైనా ఎక్కడైనా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం చెల్లిస్తారు.
ఎన్నికల కమిషన్ 2014 నియమాల మేరకు ఎన్నికల విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు కనీసం రూ. 10 లక్షలు చెల్లించాలి. తీవ్ర వాదులు, అసాంఘిక శక్తుల మందుపాతర్లకు, బాంబు దాడులకు బలైతే 20 లక్షలు పరిహారం చెల్లిస్తారు. అంగవైకల్యం వచ్చినా, కన్ను లేదా కాలు కోల్పోయినా కనీస ఎక్స్‌గ్రేషియా రూ. 5 లక్షలు, అదే తీవ్రవాదులు, అసాంఘిక శక్తుల దాడిలో జరిగితే రెట్టింపు సొమ్ము చెల్లించాలి. విధి నిర్వహణలో మరణించిన డాక్టర్ల కుటుంబాలకు కూడా ఈ పాలసీ వర్తిస్తుందో లేదో తెలియదు. ఎందుకు వర్తించదో చెప్పరు. అసాంఘిక శక్తులతో పోరాడవలసిన సైనికుడు లేదా పోలీసు వలెనే, అసాధారణ రోగాలతో పోరాడే డాక్టరు కూడా హఠా త్తుగా ప్రాణాలు కోల్పోవచ్చు.
చనిపోవడానికి కారణం ఏదైనా, వారి కుటుంబానికి జరిగే నష్టంలో తేడా ఉండదు. అయినప్పుడు పరిహారంలో తేడాలు ఎందుకు ఉండాలో వివరించాల్సి ఉంటుంది. టైస్టులు, గూండాలతో పోలీసులు పోరాడడం ఎంత ప్రమాద కరమో స్వైన్‌ఫ్లూ వంటి కొత్త రకం అంటువ్యాధులతో డాక్టర్ల పోరాటం కూడా అంతే ప్రాణాంతకం. ఎదురు కాల్పుల్లో చనిపోతే ఎక్కువ నష్టం, రోగులకు చికిత్స చేస్తూ చనిపోతే తక్కువ నష్టం ఉంటుందా? పోలీసు, డాక్టరు కాకుండా ఎస్టేట్ ఆఫీసర్ వంటి ఉద్యోగికి కూడా ప్రమాదమూ, నష్టమూ అంతే సమానంగానే ఉంటుంది.
ప్రభుత్వ బంగళాలలో గడువుతీరిన తర్వాత కూడా కొనసాగే ప్రముఖులచేత ఎస్టేట్ ఆఫీసర్ ఇళ్లు ఖాళీ చేయించడం కూడా రౌడీలతో కొట్లాడడం, రోగాలతో వేగడం వంటిదే. ఖాళీ చేయించకపోతే అవినీతిపరుడని నేరారోపణలు, ఖాళీ చేయిస్తే వీఐిపీల ప్రతీకార దాడులు విపరీతంగా ఉంటాయి. అందరి ప్రాణాలూ సమానమే అనీ, పోతే నష్టం కూడా సమానమే అనే సైరైన విధానం ఉండాలి. ఉంటే ఆ విధానం వివరాలు తమంత తామే ఇవ్వాలి. అసలు విధానమే లేకపోతే ఆర్టీఐ చట్టం సెక్షన్ 4(1)(సి) కింద కారణాలు చెప్పాలి. 4(1)(డి) కింద పాలనా నిర్ణయాలకు, అర్ధన్యాయ నిర్ణయాలకు కార ణాలు తమంత తామే చెప్పే బాధ్యత ప్రభుత్వ అధికార సంస్థలపైన ఉంటుంది. చెప్పకపోతే ఆర్టీఐ సెక్షన్ 3, 6 కింద అడిగే హక్కు ఉంది. సమస్యల పరిష్కార వేదిక వారిపైనఅనితా సింగ్ ఫిర్యాదును ఎందుకు తిరస్క రించారో వివరించవలసిన బాధ్యత ఉంది.
డాక్టర్ దినేశ్‌కుమార్ సింగ్‌కు సంబంధించిన మొత్తం ఫైల్‌ను ఈ సమాచార దరఖాస్తును, ఈ తీర్పు ప్రతిని తదితర అన్ని దస్తావేజులను ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం ముందుకు తేవాలని.. సమాచారం ఇవ్వనందుకు పరిహారం ఇవ్వాలని ఎందుకు ఆదేశించకూడదో తెలియ జేయాలని, జరిమానా ఎందుకు విధించకూడదో కూడా తెలపాలని కమిషన్ ఆదేశించింది.
(అనితా సింగ్ వర్సెస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం ఇఐఇ/అ/ అ/2016/000353 కేసులో మే 31 నాటి తీర్పు ఆధారంగా)
మాడభూషి శ్రీదర్,
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com